Home Telugu Articles బయట పడ్డ బ్రిటిష్ డొల్లతనం

బయట పడ్డ బ్రిటిష్ డొల్లతనం

0
SHARE

దైవ దూషణ అనే విచిత్రమైన నేరారోపణ నుంచి ఇటీవలే నిర్దోషిగా బయటపడిన పాకిస్తానీ క్రైస్తవ మహిళ ఆసియా బీబీ అనే ఒక్క మహిళ ఈ రోజు పాకిస్తాన్ ఇంకా పాతరాతియుగంలోనే ఉందని నిరూపించడమే కాదు. యూరప్, ముఖ్యంగా బ్రిటన్ కూడా కొత్తరాతి యుగంలో ఉన్నాయని చెబుతోంది. ఆసియా బీబీ పాకిస్తాన్ లోని పరమ కిరాతకమైన దైవ దూషణ చట్టాలకు బలై తొమ్మిదేళ్లు  చీకటి కొట్టంలో ఒంటరి జీవితం గడిపింది.

ఆమె పొరుగువారితో ఏదో విషయంపై వాదిస్తూ ఇస్లాంను దూషించిందని, కాబట్టి దైవదూషణ చట్టం ప్రకారం ఆమెకు మరణ శిక్ష విధించాలని మతమౌఢ్య వర్గాలు కేసు పెట్టాయి. ఈ కేసులో ఆమెను పాక్ కోర్టులు నిర్దోషిగా తీర్పునిచ్చాయి. ఆసియా బీబీ ప్రస్తుతం పాకిస్తాన్ లో బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. పాక్ మతోన్మాద ముఠాలు ఇస్లామ్ ఖత్రేమే హై నినాదంతో ఆమెను నడి రోడ్డున రాళ్లతో కొట్టి చంపేందుకు సిద్ధంమౌతున్నారు.

ఆమె ఎక్కడ ఉందో తెలిస్తే అల్లరి మూకలు ఆమెను కొట్టి చంపేస్తాయి. అందుకే ఆమె తన దేశం వదిలి మరో దేశానికి పారిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. సహజంగానే ఆమెను బ్రిటన్ పంపించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ ఆసియా బీబీకి ఆశ్రయం ఇచ్చేందుకు బ్రిటన్ నిరాకరించింది. ఆమె భద్రతకు తాము హామీ ఇవ్వలేమని, తమ దేశంలో ఉన్న ముస్లింలు ఆమెపై దాడి చేసే ప్రమాదం ఉందని, ఆమె తమ దేశంలో ఉంటే శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని బ్రిటన్ చెబుతోంది.

బ్రిటన్ ఇలా నిరాకరించడం రెండో ప్రపంచానంతరం ప్రపంచ దేశాలు రూపొందించిన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్  స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. ఈ డిక్లరేషన్ రూపకల్పనలో అతి ప్రముఖ పాత్ర పోషించిన బ్రిటన్ నేడు ఆసియా బీబీకి ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించడం మరీ విషాదం. గతంలో ఇదే బ్రిటన్ సాతానిక్ వర్సెస్ వంటి పుస్తకం వ్రాసిన భారతీయ ముస్లిం సల్మాన్ రష్దీకి, సుప్రసిద్ధ ముస్లిం మహిళా హక్కుల పోరాట యోధురాలు ఆయాన్ హిర్సి అలీకి, సుప్రసిద్ధ రచయిత విద్యా ఎస్ నయీపాల్ వంటి వారికి రక్షణను, ఆశ్రయాన్ని కల్పించింది.

వారు తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పే అవకాశాన్ని కల్పించింది. నేడు అదే బ్రిటన్ ఆసియా బీబీని తమ దేశంలోకి తీసుకోవడానికి, ఆశ్రయం ఇవ్వడానికి భయపడుతోంది. దాని కన్నా బ్రిటన్‌లోకి వలస వచ్చిన ఆసియా దేశాల ముస్లిం జనాభాను బ్రిటన్ జీవన విధానం, బ్రిటిష్ విలువలతో పూర్తిగా మమేకం చేసుకోవడంలో బ్రిటన్ పూర్తిగా విఫలమైందని ఋజువు అవుతోంది. బ్రిటిష్ ప్రజాస్వామ్యం, ఉదాత్త జీవన విలువలను ఏ మాత్రం సారోగతం చేసుకోకుండా, మధ్యయుగాల మత మౌఢ్యం చీకట్లోనే వలసదారు ముస్లిం జనాభా నివసిస్తోందంటే, పాకిస్తాన్ లో అల్లరి మూకలతో పోటీపడేంత అనాగరికమైన అసహనాన్ని ప్రదర్శిస్తోందంటే బ్రిటన్ పాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైనట్టే.

నిజానికి ఆసియా బీబీని కేవలం మతోన్మాద మూకల దాడుల భయంతో బ్రిటన్ లోకి రానీయకపోవడం వల్ల బ్రిటన్ లోని మూల ఆంగ్ల సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబికి, వర్గ వైషమ్యాలకు దారి తీసే ప్రమాదం కూడా ఉంది. బ్రిటిష్ ప్రజలు ఇప్పటికే వలసల పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బ్రెక్సిట్ ఉద్యమానికి గల అనేక కారణాల్లో అడ్డూ అదుపూ లేని వలసదారుల ఆగడాలు కూడా ఒక కారణమేనన్నది తిరుగులేని వాస్తవం.

దీనితో పోలిస్తే మన దేశంలో మనం పాకిస్తాన్ ను విమర్శించిన సుప్రసిద్ధ గాయకుడు అద్నాన్ సమీకి, ఇస్లామిక్ వ్యవస్థలో మహిళను జంతువులా చూస్తారని విమర్శించి తిరుగుబాటు చేసిన సుప్రసిద్ధ బంగ్లా రచయిత్రి తస్లీమా నస్రీన్‌కు ఆశ్రయం ఇవ్వడం జరిగింది. ఇందులో తస్లీమా నస్రీన్ విషయంలో ఇస్లామిక్ మత మౌఢ్య సంస్థలు దుందుడుకు వాదానికి దిగాయి. హైదరాబాద్ వంటి చోట్ల ఆమెపై మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ దుండగులు ఏకంగా ప్రెస్ క్లబ్ లోనే దాడికి పాల్పడ్డారు.

అయినప్పటికీ మన దేశం ఆమెకు భద్రతను, రక్షణను కల్పించింది. ఆశ్రయాన్ని ఇచ్చింది. ఆమె దేశమంతటా స్వేచ్ఛగా తిరిగే వీలును కల్పించింది. తన అభిప్రాయాన్ని తెలిపే సౌలభ్యాన్ని కూడా కల్పించింది. నిజానికి తస్లీమా కొన్ని సందర్భాల్లో భారత దేశ వ్యవస్థను, ఇక్కడి అత్యధికులు పాటించే హిందూ ధర్మం విషయంలో విపరీత వ్యాఖ్యలు చేసినా ఆమె భావ ప్రకటనా స్వేచ్ఛకు, శరణార్ధి హక్కులకు ఏ మాత్రం భంగం కలగకుండా చూసుకుంది. భారత్‌లోనూ అతివాద మూకలు కొన్ని మతం పేరిట దుందుడుకుగా వ్యవహరిస్తున్నా, ప్రభుత్వం దృఢంగా వ్యవహరించింది. మెజారిటీ ముస్లింలు హింసా దౌర్జన్యాలకు పాల్పడకుండా పరిణితిని ప్రదర్శించారు.

మన దేశం చేయగలిగిన పనిని బ్రిటన్ ఎందుకు చేయలేకపోతోందన్నదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న! ఎక్కడో వలస దారుల సాంస్కృతిక, సామాజిక, రాజకీయ విలీనీకరణను సాధించడంలో బ్రిటన్, యూరప్‌లు విఫలమయ్యాయి. మొత్తం మీద ఆసియా బీబీ ఉదంతం యూరప్ దేశాలలోని డొల్ల తనాన్ని బయటపెట్టిందనే చెప్పాలి. అక్కడి ప్రభుత్వాలు తమ విధానాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించేలా చేసింది ఆసియా బీబీ ఉదంతం!!

(విజయక్రాంతి సౌజన్యం తో )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here