Home Rashtriya Swayamsevak Sangh స్వరాజ్య సంస్థాపకుడు శివాజీ

స్వరాజ్య సంస్థాపకుడు శివాజీ

0
SHARE

ఫాల్గుణ మాస కృష్ణపక్ష తదియ, శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా

భారతావని పుణ్యభూమి. కర్మభూమి. దుష్టశిక్షణ, శిష్ట రక్షణకై సాక్షాత్తూ భగవంతుడు అవతరించి, పునీతమొనర్చిన దివ్యభూమి ఇది. భరతమాత పొత్తిళ్ళలో అనేకానేక దేశభక్తులు పెరిగి పెద్దవారై, తమ జీవితమే ధర్మంగా, ధర్మప్రతిష్ఠాపనే లక్ష్యంగా, కర్తవ్య పరాయణత్వమే ధ్యేయంగా జీవించి ధన్యులైనారు. వారిలో నిత్యస్మరణీయుడు శివాజీ. ‘‘శివాజీ స్వరూపాన్నే  ధ్యానించండి, శివాజీ ప్రతాపాన్నే అనుష్ఠించండి’’ అని సమర్థ రామదాసుచే ప్రబోదింపబడిన శివాజీ ఆత్మ విస్మృతిలో అలమటించే నేటి హిందూ జాతికి ఆదర్శమూర్తిగా నిలుస్తాడు. నేలకొరిగిన హిందూ ధ్వజాన్ని మళ్ళీ ఉత్తుంగ శిఖరాలలో ఎగురవేసి, మృతప్రాయమై ఉన్న హిందూత్వంలో అమృతాన్ని నింపి ప్రాణప్రతిష్ఠ చేసిన మహనీయుడు.

అతి సామాన్య బాల్యం, సాహసోపేత యవ్వనం, ప్రదర్శిత ధైర్యం, రాజనీతిజ్ఞత, చతురత, హిందువులలో మేల్కొలిపిన స్వాభిమాన పూర్ణ దేశభక్తి అజరామరాలు. మహారాష్ట్ర ప్రాంతంలో యాదవులు స్థాపించిన హిందూ సామ్రాజ్యం 1307 మార్చి 24తో ఢిల్లీ సుల్తాను ఖిల్జీ ద్వారా నాశనము చేయబడగా, 350 ఏళ్ళ వరకు మరొక హిందూ సామ్రాజ్యమే లేదు. ఔరంగాబాద్ సమీపాన వేరూడ్ గ్రామానికి చెందిన మాలోజీరావు అహ్మద్‌నగర్ సుల్తాన్ నిజాంషాహి కొలువులో ఉద్యోగియై, శక్తియుక్తులతో పూనా జాగీరును సంపాదించాడు. మొగలులతో యుద్ధం చేస్తూ, 1605లో మరణించాడు. అప్పటికి మాలోజీరావుకు ఐదు ఏళ్ళ శహాజీ, మూడేళ్ళ అరీఫ్‌జీ కుమారులుండిరి. మాలోజీ తమ్ముడగు విఠోజీ వద్ద పెరగగా, నాటి నిజాంషాహి కొలువులోని సర్దారు లఖూజీరావు కూతురు జిజియాబాయితో శహాజీ వివాహం జరిగింది. చిన్నతనాననే అత్తవారింటికి వచ్చిన జిజియాకు దేశ పరిస్థితిపై పూర్తి అవగాహన కలిగింది. గోవధలు, దేవాలయాలు, విగ్రహాల ధ్వంసాలు, ఆస్తుల దోపిడీలు ఇళ్ళ దహనాలు చూశాక, ఆమెలో జుగుప్స రేగింది. బాల్యముననే రామాయణ, భారతాది గ్రంథాల పఠనం మూలంగా విదేశీపాలన నుండి విముక్తి కలిగి రామరాజ్య స్థాపన కావాలనే కోరిక ప్రబలమై నిలిచింది. జిజియాబాయి తండ్రి లఖూజీరావుకు ముగ్గురు కుమారులు కాగా, వారి పలుకుబడులు నిజాంషాహికి కోపం తెప్పించేవి. తన రాజధానియగు దౌలతాబాద్‌కు లఖూజీరావు, ఆయన కుమారులను పథకం ప్రకారం పిలిపించి, నలుగురిని 1629 జూలై 25 ఆషాఢ పౌర్ణమి నాడు హత్య చేయించాడు.

శహాజీ మొగలుల వద్ద పనిచేస్తున్న సమయాన 1630 ఫిబ్రవరి 19వ తేదీన భావి హైందవ సామ్రాజ్య నిర్మాతయైన శివాజీ జన్మించాడు. శహాజీ తన జాగీరు పాలనా నిర్వహణకై పండితుడు, పాలనాదక్షుడగు దాదాజీ కొండదేవ్ అనే బ్రాహ్మణుని నియమించుకోగా, జిజియాబాయి, కుమారునితో సహా ఆయన పర్యవేక్షణలో ఉండిరి. దాదాజీ కొండదేవ్, శివాజీకి వయసుకు తగ్గ విద్యలు, చక్కని శిక్షణనిచ్చి, పదవ ఏట వివాహం కూడా చేశాడు. వివాహానికి రాలేని తండ్రిని కలవడానికి బెంగుళూరు వెళ్ళిన శివాజీకి, తండ్రి బీజాపూరును చూపించగా, తురుష్కుల వల్ల ఉజ్జ్వలమైన విజయనగర సామ్రాజ్యం విధ్వంసం, ఫలితంగా కొల్లగొట్టబడిన ధనముతో వారు ఆనందంతో తులతూగే సంఘటనలు హృదయంలో ప్రతిష్ఠితాలైనాయి. శివాజీ స్వాతంత్య్ర భావాలను గ్రహించిన శహాజీ, తన కుమారుని పూనాకు పంపుతూ, శాంరావు రాంఘేకర్ అనే అనుభజ్ఞుని పీష్వాగా నియమించాడు.

దేశభక్తి ఉగ్గుపాలతోనే రంగరించుకున్న శివాజీ, తల్లి శిక్షణలోనే రామరాజ్యం వంటి హైందవ సామ్రాజ్యం నిర్మాణం చేయాలనే కోరిక స్థిరపడింది. శివాజీ జాగీరులో రాంఝా గ్రామపు పటేలు ఒక స్ర్తిని బలత్కారం చేయగా, శివాజీ 1645 జనవరి 28న పటేలును బంధించి, కాళ్ళు చేతులు నరికించి శిక్షించాడు. అలా క్రమంగా ప్రజల అభిమాన పాతృడైనాడు. కాశ్మీరం నుండి కావేరీ వరకు మధ్యనున్న చాందా, గోండువనం వదిలి మిగిలిన దేశమంతా తురుష్కుల ఆధీనంలో ఉండేది. దేవగిరి, విజయనగరం రాజ్యాలు అస్తమించాక, రెండుసార్లు శహాజీ చేసిన స్వరాజ్య ప్రయత్నాలు విఫలం కాగా, శివాజీ మిత్రులందరితో భవిష్యత్ సామ్రాజ్య నిర్మాణం కోసం పాడుపడిన దేవాలయం, కొండగుహ, కీకారణ్యం, ఇసుకతినె్న లాంటి ప్రదేశాలలో చర్చోపచర్చలు జరిపేవాడు. మొదట బీజాపూర్ సుల్తాన్‌చే నిర్లక్ష్యం కాబడిన ‘కాన’ లోయలోని ‘తోరణ’ దుర్గాన్ని జయించి, హిందూ సామ్రాజ్య నిర్మాణానికి తోరణం కట్టాడు. అందు లభించిన నిధితో తోరణ దుర్గానికి ఎదురుగా ఉన్న ‘మురుంబదేవ’ గిరిపై కొత్త కోటను నిర్మించి, ‘‘రాజ్‌ఘడ్’’ అని పేరు పెడ్డాడు. తర్వాత ‘కువారి’ కోటను వశం చేసుకున్నాడు. ఇవన్నీ పదహారేళ్ళ ముక్కుపచ్చలారని ప్రాయంలో శివాజీ చేసిన గొప్ప పనులు. తర్వాత కొండణాకోటను తన స్వరాజ్యంలో కలుపుకున్నాడు. శివరళ, సుభానుమంగళి దుర్గాలను వశపరుకున్నాడు. ఇంతలో 1648 జూలై 25న శహాజీ, వజీరు ముస్త్ఫా, బాజీ ఘోర్పడేలు సైన్యంతో శహాజీని బంధించాడు. బీజాపూర్ సుల్తాన్‌ను శరణు వేడడమా? తండ్రి ప్రాణమా? స్వరాజ్యమా? అనే ప్రశ్నలకు తల్లి జిజియాబాయి తన మాంగల్యంకన్నా దేశభక్తినే ప్రోత్సహించి, సమాధానం లభింప చేసింది.

పురంధర కోటలో ఉన్న శివాజీ కొద్ది సైన్యానికి ఫతేఖాను సైన్యానికి భీకర యుద్దం జరగగా, శివాజీకే విజయం చేకూరి, చివరకు 1648 ఆగస్టు 8న ఫతేఖాను ఓడింప బడ్డాడు. పురంధర దుర్గంలో ఫతేఖాను, బెంగుళూరులో ఫరాదఖాన్ ఓటముల పాలు కాగా, బీజాపూర్‌లో శహాజీ కూడా 1649 మే 16న జ్యేష్ట లేక వట పౌర్ణమి నాడు బంధ విముక్తుడైనాడు. 1654 మే 23న బీజాపూర్ సుల్తాన్ మహరాజ్‌పంత్ మరణించగా, ఆయన నలుగురు కుమారుల తగవుల కారణంగా, శివాజీ వారిని బంధించి, ఉచిత పదవులు కట్టబెట్టి, నేతాజీ పాల్కర్ అనే సర్దార్‌ను అధికారిగా నియమించాడు. కృష్ణానదీ సమీప టావళి అధిపతి దౌలత్‌రావు మృతి చెందగా, ఆయనకు సంతానం లేదని, ఆయన భార్య దత్తపుత్రునిగా యశ్వంతరావుకు పదవినిచ్చాడు. ఆయన శివాజీ అధికారానికి ఇష్టపడని కారణాన 1656లో యుద్దంలో ఓడించి, స్వరాజ్యంలో కలుపుకున్నాడు. దీనిలో అంతర్భాగ కొండ ప్రాంతమైన ‘రాయరి’ కోటనే కొనే్నళ్ళకు శివాజీ రాజధానిగా రాయగడ దుర్గంగా ఏర్పడింది. 1956 నవంబర్ 2న బీజాపూర్ సుల్తాన్ ఆదిల్‌షా చనిపోగా, మొగలు సామ్రాజ్య దక్షిణ సుబేదారైన ఔరంగజేబు అనుమతిని పొంది, 1957 ఏప్రిల్ 23న స్వరాజ్యంలో కలుపుకున్నాడు. బీజాపూర్ ప్రాంతం నుండి కోండ్వానా కొంకణ, దండరాజపురి, భీవండి, కళ్యాణి, మాహు తదితర కోటలను పోర్చుగీసు వారి నుండి చోళ ప్రాంతాన్ని జయించాడు. కటావ్, మయణి, అష్టి, ఖరాహడ్, సుపే, కొల్హాపూర్, పనాళిగఢ్, యెగావ్ తదితర కోటలను జయించాడు. ఔరంగజేబు సలహాదారులైన కారతలబ్‌ఖాన్, నామదర్‌ఖాన్, ఇనాయత్‌ఖాన్, షహిస్తఖాన్, భావసింహ, జస్వంతసింహ తదితరులను ఓడించాడు.

అహ్మద్‌నగర్, సూరత్, జున్నర్ నగరాలను లూటీ చేశాడు. అలా సాగిన శివాజీ జైత్రయాత్ర ఫలితంగా శాలివాహన శక 1596 ఆనందనామ సంవత్సర జ్యేష్ట శుక్ల త్రయోదశి శనివారం సూర్యోదయాత్పూర్వం మూడు గడియల సుముహూర్తాన 1674 జూన్ 6న సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాజ్యాభిషేకానంతరం రాజ్యారోహణం జరిగింది. ఆంగ్లేయుల రాయబారి హెన్రీ ఆక్సెండర్ మహారాజుకు ప్రణమిల్లి 1600 రూప్యములను కానుకగా సమర్పించాడు. తన రాజ్యానికి అష్ట ప్రధానుల పారసీక నామాలను మార్చి సంస్కృత పేర్లు పెట్టాడు. ప్రభుత్వ యంత్రాంగం సంస్కృతంలోనే సాగాలని రాజ్య వ్యవహార కోశమును తయారు చేయించాడు. ముప్పై సంవత్సరాలు శివాజీ, ఆయన అనుచరులు చూపిన పరాక్రమాలు, కర్తృత్వ శక్తి, త్యాగశీలత, ధ్యేయ నిష్ఠ, హిందువులలో నూతనోత్తేజం నింపి, సార్వభౌమాధికార యుక్త స్వరాజ్యం స్థాపించ బడినది. యాభై ఏళ్ళ సామ్రాజ్య నిర్మాణ కృషి ఫలితంగా దేహం పూర్తిగా అలసిపోగా, ఆరోగ్యం క్షీణించి, 1680 ఏప్రిల్ 3న చైత్ర శుక్ల పాడ్యమి నాడు శివాజీ తుది శ్వాస వదిలాడు.

This article was first published in 2019