Home Telugu Articles షోయీబ్ కుటుంబానికి కాంగ్రెస్ ఆర్థిక సహాయం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-25)

షోయీబ్ కుటుంబానికి కాంగ్రెస్ ఆర్థిక సహాయం (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-25)

0
SHARE

ఆ తర్వాత షోయీబ్ కుటుంబానికి కాంగ్రెస్ సంస్థ శ్రీ పన్నాలాల్ పిత్తిలాంటి వ్యక్తులు ఆర్థిక సహాయం చేశారు. కొంత నిధిని సమకూర్చి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతియేటా “షోయీబ్ పత్రికా రచన”కు స్మారక చిహ్నంగా విద్యార్థులకు అవార్డులు ఇస్తున్నారు. ప్రభుత్వం షోయీబ్ కుటుంబానికి పెన్షన్ కూడా  ఏర్పాటు  చేసింది.

షోయీబ్ తన జీవితకాలంలో ఎన్నో బెదిరింపులను ఎదుర్కొన్నాడు. పత్రికా నిర్వహణలో రోజూ చంపివేస్తామనే బెదిరింపు ఉత్తరాలు వస్తూ ఉండేవి. కాని వాటిని లెక్కచేయలేదు. “షోయీబ్ హత్య జరిగిన తరువాత షోయీబ్ తల్లి నిశ్చేష్టురాలయి కన్నీరుకూడా కార్చలేకపోయింది. తన కొడుకు స్వతంత్ర పత్రికా రచన నిర్వహణలో అమరుడైనాడని ఆవిడ గ్రహించింది. షోయీబ్ మరణం అసాధారణమైన సంఘటన

“నిండుగుండెతో జీవించడమే జీవితానికి వెలుగు.
లేకపోతే రోజూ ఎంతమంది పుడుతున్నారు, చస్తున్నారు!”

“గోర్ట”లో హత్యాకాండ
ఈనాడు కర్ణాటకలో ఉన్న బీదర్ జిల్లాలో హోసల్లి అనే గ్రామం ఉంది. బాల్కీ రైలు మార్గంలో ఉన్న ఈ గ్రామం ఆనాటి ఖుర్షీద్‌జాహి జాగీర్‌లోని ఒక భాగం. 1947 తర్వాత కూడా నిజాం సంస్థానంలో రజాకార్లు, కొందరు హరిజన నాయకులు నిజాం అధికారాన్ని సమర్థించారు. గోర్ట గ్రామంలో ఈనాటికీ సజీవంగా ఉన్న 80 సంవత్సరాల వృద్ధుడు శ్రీ ఇరశెట్టిప్ప వంకే మాటల్లో చెప్పాలంటే ఆనాడు నిజాం గ్రామాలను పీల్చి పిప్పిచేశాడు.

1928 నుండి 1948 వరకు అంటే 20 సంవత్సరాలు హిందువులను బానిసలుగా చేసి వారి కష్టార్జితాన్ని దోచుకున్నాడు. ఎదురుతిరిగిన వాళ్ళను భూస్థాపితం చేశాడు. గోర్టలో జరిగిన మొదటి పోరాటంలో శ్రీ వంకే జుల్మానాతోపాటు సంవత్సరం జైలుశిక్ష అనుభవించాడు.

నిజాం సర్వస్వతంత్రుడుగా ప్రకటించుకోగానే ప్రతి ముస్లిం తానే పాలకుడైనట్లు వ్యవహరించడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళు గ్రామాల్లో నిరంకుశాధికారాన్ని వెలిగించారు. అనేక గ్రామాలతో పాటు హుయనాబాద్, కళ్యాణ్, బాల్కీ, రాజేశ్వర్, ఘోడవాడి, సాయిగావ్, మెహేకర్ మొదలైన గ్రామాల్లో ముస్లిం గ్రామాధికారులు ఇష్టానుసారం హిందువులను పీడించటం మొదలు పెట్టారు. హిందువులు ప్రతిఘటించడానికి దళాలుగా ఏర్పడ్డారు. ప్రతీకారవాంఛ సర్వత్రా చెలరేగింది.

స్వాతంత్య్ర దినోత్సవంనాడు సంస్థానంలో హల్‌గోర్టా, హోసలీ గ్రామాల్లో హిందువులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ముస్లిం అధికారులు నిజాంను వ్యతిరేకించిన హిందువులను శిక్షించాలనే కక్షతో ఆ గ్రామాలకు పోలీసుల్ని పంపించారు. హల్‌గోర్టాలోని మాధవరావును అరెస్టు చేసి జెండా నేరం మోపారు. ఆ తర్వాత హోసల్లికి ఇద్దరు పోలీసులు వెళ్ళి దర్యాప్తు సాగించారు. జెండా ఎగురవేసిన నేరంపై భావురావుపటేల్‌ను అరెస్టు చేస్తామని ఆ ఇద్దరు పోలీసులు బెదిరించారు. పటేల్ ఈ గ్రామానికి ఒక విధంగా నాయకుడు. అతను ఆ ఇద్దరు పోలీసులను బంధించి గదిలో పెట్టాడు. జమేదార్ అధిక ప్రసంగం చేశాడని లాగి చెంపదెబ్బ వేశాడు.

అసలు గ్రామస్థులు వాళ్ళిద్దరినీ తుపాకీతో కాల్చివేయాలని సలహా ఇచ్చారు. భావురావు పటేల్ విషమించిన పరిస్థితుల దృష్ట్యా మరుసటిరోజు వారిద్దరిని వదిలిపెట్టాడు. హోసలి నుండి గోర్ట రెండు మైళ్ళ దూరంలోనే ఉంది. గోర్టలో రజాకార్ల నాయకుడు హిసామొద్దీన్ ఉండేవాడు. హోసలిలో పోలీసులపై భావురావు పటేల్ చేయి చేసుకున్నాడని ఒకరోజు బంధించి పెట్టాడనే వార్త చుట్టుప్రక్కల దావానంలా వ్యాపించిపోయింది. హిసామొద్దీన్ తాను ఆ  ప్రాంతంలో ఉండగా ఇలా జరగడం పెద్ద అవమానంగా భావించి ప్రతీకారానికి వేచి ఉన్నాడు.

హోసలీలో దోపిడీ
పోలీసులను నిర్భంధించి వదలిన  తరువాత రాబోయే పరిణామాలను భావురావు పటేల్ ఊహించాడు. తన సహాయం కోసం చుట్టుప్రక్కల గ్రామాలనుండి మిత్రుల్ని పిలిపించుకున్నాడు. పాతికమంది పోలీసులు తనను అరెస్టు చేయడానికి గోర్ట వచ్చారని, వాళ్ళకి అన్నివిధాలా సహాయం చేయడానికి రెండు మూడు వందల రజాకార్లు సిద్ధంగా ఉన్నారనే సమాచారం భావురావు పటేల్‌కు అందింది. అయితే పటేల్ బలగం ఎంత ఉందో అంచనా దొరకక పోలీసులు అక్కడే ఉండి పోయారు. భావురావుకు సహాయంగా వచ్చిన వారిలో కళ్యాణ్ గ్రామవాసి శ్రీ గోపాల్ దేవ్ ఒకరు.

తుపాకులు, ఇతర ఆయుధాలు ఉన్న పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టితే ప్రయోజనం లేదని అనవసరంగా ప్రాణాలు వదలడమే అవుతుందని, ఆయుధాలు సేకరించటం అవసరమని గోపాల్‌దేవ్ సలహా ఇచ్చారు. అందరూ ఆ సలహాను ఆమోదించారు. ఆ రోజంతా రజాకార్లు వస్తారేమోనని ఎదురుచూసిన పటేల్ తదితరులు మరుసటిరోజు జానాపూర్, సాయెగావ్ గ్రామాలకు వెళ్ళిపోయారు.  హోసల్లి నుండి పటేల్ తదితరులు వెళ్ళిపోయారనే వార్త తెలుసుకుని హిసామొద్దీన్ తన రజాకార్ల ముఠాతో దాడి చేశారు. హోసలి గ్రామాన్ని ఇష్టానుసారం దోపిడీ చేశాడు. భావురావు పటేల్ ఇంటిని దోచుకుని నిప్పు పెట్టారు. నిరాయుధులైన గ్రామస్థులు ప్రతిఘటించలేకపోయారు.

Source: Vijaya Kranthi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here