Home News సమాజంలో మార్పు సాధ్యమేనని నిరూపిస్తున్న సేవా కార్యక్రమాలు

సమాజంలో మార్పు సాధ్యమేనని నిరూపిస్తున్న సేవా కార్యక్రమాలు

0
SHARE

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి ప్రతి దేశ పౌరుడి బాధ్యత. ఇది కొద్దిమంది కుల సంఘాల నాయకుల పని మాత్రమే కాదు. అందరి బాధ్యత. ఇది ఆచరణలో కనబడాలి. ఫలితాలు లభించాలి. మార్పు కనబడాలి. కుల విద్వేషం పెంచేవారు ఈ పని చేయలేరు. దేశభక్తి, సమాజంపై ప్రేమ ఉన్న పౌరులే అభివృద్ధి ఫలాలను చివరి వ్యక్తి వరకు తీసుకెళ్లగలరు.

ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో సమాజ అభ్యున్నతి కోసం జరిగిన ప్రయత్నాలు, లభించిన ఫలితాలపై సరైన సమీక్ష జరగాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ అంశంపై మేధావులలో, సామాజిక మాధ్యమాలలో, రాజకీయ పార్టీలలో, పరిపాలన వ్యవస్థల నిర్వాహకులలో, సామాజిక నాయకత్వంలో చర్చ జరుగుతోంది. డా||బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, రాజ్యాంగ సభ సభ్యులైన ఇతర నాయకులు ఆశించిన సత్ఫలితాలు వచ్చాయా ? రాజ్యాంగ ఫలాలు అత్యంత వెనుకబడిన వర్గాల వరకు చేరాయా? అనే అంశంపై చర్చ కొనసాగాలి.

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న సమాజమే ఈ చర్చకు కేంద్ర బిందువు. గత 72 సంవత్సరాలలో ఏర్పడిన చట్టాలు, వ్యవస్థలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలైన వేలాది పథకాలు, ఖర్చు చేసిన లక్షల కోట్ల రూపాయల డబ్బు ఎంత వరకు అసమానతలు తొలగించాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రయత్నాల దిశ ఎలా ఉన్నదనేది ఆలోచించాల్సిన అంశం.

సామాజిక నాయకులు, సామాజిక మాధ్యమాలు, మేధావులు తమ బాధ్యతను గుర్తించాలి. సమాజంలో పొడచూపుతున్న వైషమ్యాలను తమ వ్యక్తిగత లాభం, రాజకీయ స్వార్థం, లాభర్జన కొరకు వాడుకోవటం హేయమైన విషయం. సమాజాన్ని ప్రేమించే హృదయం కావాలి. ‘మానవ సేవే మాధవ సేవ’ అనే తత్త్వచింతన కావాలి.

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి ప్రతి దేశ పౌరుడి బాధ్యత. ఇది కొద్దిమంది కుల సంఘాల నాయకుల పని మాత్రమే కాదు. అందరి బాధ్యత. ఇది ఆచరణలో కనబడాలి. ఫలితాలు లభించాలి. మార్పు కనబడాలి. కుల విద్వేషం పెంచేవారు ఈ పని చేయలేరు. దేశభక్తి, సమాజంపై ప్రేమ ఉన్న పౌరులే అభివృద్ధి ఫలాలను చివరి వ్యక్తి వరకు తీసుకెళ్లగలరు.

సంకుచిత, విద్వేష పూరిత మనస్తత్వం ల మేధావులు, సామాజిక కార్యకర్తలు తమ భావాలతో నిర్మిస్తున్న సామాజిక అసమాన వాతావరణం బీద వర్గాలలో విభేదాలు సృష్టిస్తోంది. ఎస్‌.సి.లలోని 49 కులాలకు న్యాయం జరగాలనే ఆలోచన కన్న తన ఉపకులానికే అన్ని లాభాలు చేకూరాలని ఆలోచించటమే సంకుచితత్త్వం. అందరికి న్యాయం జరగాలంటే అందరూ ఆలోచించాలి.

ఇలాంటి న్యాయం అందించేలా సామాజిక సేవా కార్యక్రమాలు జరగాలి. ఈ దిశలో ఎన్నో కార్యక్ర మాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ సహకారం లేకుండా ఇలాంటి కార్యక్రమాలు లక్షలాది మంది ప్రజలకు ఉపయోగపడటం ఆశ్చర్యం కల్గిస్తోంది.

ఏకల్‌ విద్యాలయ ఉద్యమం (Single teacher School) :

20 సంవత్సరాల క్రితం ఒక నలుగురు ఉన్నత చదువులు పూర్తి చేసుకొని విదేశాలలో ఉద్యోగాలు చేసి భారతదేశానికి తమ సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో బిహార్‌కు తిరిగివచ్చి, అక్కడి గిరిజన క్షేత్రంలో సుదూర ప్రాంతాల్లో నివసించే ప్రజల అభివృద్ధి కోసం ప్రారంభం చేసిన కార్యక్రమం ఏకల్‌ విద్యాలయ ఉద్యమం. ‘ఒక ఉపాధ్యాయుడు – ఒక పాఠశాల’ అనే భావన ఆధారంగా కుగ్రామాలలో ప్రాథమిక విద్యను అందించారు. ఈ పాఠశాల ద్వారా ఆరోగ్యం, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఒక పాఠశాలతో ప్రారంభమయిన ఈ ఉద్యమం 57 వేల పాఠశాలలకు చేరటం ఆశ్చర్యం కల్గించే అంశం. 15 లక్షల మంది అత్యంత బలహీన వర్గాల విద్యార్థులు చదవటం విశేషం. ఈ కార్యక్రమం నిర్వహణలో పాల్గొంటున్న వారిలో వ్యాపార వర్గాలు, పట్టణాలలో విద్యావంతులు, విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న వేలాదిమంది భారత సంతతికి చెందినవారు ఉన్నారు.

ఆదర్శ మహిళ సింధూథాయి :

గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు గ్రహీత సింధూథాయి ఒక గొప్ప ఆదర్శంగా మన ముందు నిలబడ్డారు. భర్త తాగుబోతు. అతని అత్యాచారాలు భరించలేక ఆత్మహత్యా ప్రయత్నం చేయబోయి, చివరికి తన పాప కోసం బ్రతకాలనే కోరికతో రైల్వే ష్టేషన్లో యాచకవృత్తి చేపట్టింది. మొదట తన కోసమే అడుక్కునే ఈ మహిళ తోటి సమాజంలో అనాథలను చూసి వారి కోసం కూడా యాచించటం ప్రారంభిం చింది. అలా 1300 మంది అనాథలను పోషించింది, రక్షించింది. 365 మంది అనాథల వివాహం జరిపించింది. మనిషి లోపల ఉన్న దైవగుణ శక్తి ఇంత గొప్పది. ఇటువంటి తపన అందరిలోనూ మేల్కొల్పడం ఇప్పటి అవసరం.

సామాజిక అభ్యున్నతికి పునాది విద్య. విద్య అందరి ప్రాథమిక హక్కు. విద్య కూడా లభించని అనేక స్థలాలు, ప్రజ సమూహాలు ఇంకా కొనసాగటం వలన ఏర్పడుతున్న అసమానతలు సమాజాన్ని కల్లోలం చేస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారంలో ప్రభుత్వంతో పాటు అనేక సంస్థలూ పనిచేస్తున్నాయి.

శ్రీ కేశవ విద్యాలయం :

పాలమూర్‌ జిల్లాలో నారాయణపేట దారిలో ఉన్న కుగ్రామం కొల్లంపల్లి. ఆ గ్రామంలో ఉన్న 10 వేల జనాభాలో 80% నిరక్షరాస్యులే. కొల్లంపల్లిలో ప్రారంభమైన ప్రాథమిక పాఠశాల 25 సంవత్సరాలుగా నిరంతరం విద్యను అందిస్తూ, వయోజన విద్యను కూడా పెంచే ప్రయత్నం చేసిన కారణంగా 80% అక్షరాస్యులున్న గ్రామంగా నిలబడింది. చుట్టూ ఉన్న లంబాడీ తండాల పిల్లలు కూడా ఈ పాఠశాల ద్వారా విద్యను పొంది ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. వందలాది మంది యువకులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించిన ఈ పాఠశాల నిర్వహణ గ్రామస్థులు చేసిన ప్రయత్నమే.

మచ్చు పహాడ్‌ పాఠశాల :

జనగాం – హన్మకొండ దారిలోని రఘునాథ పల్లి నుండి 13 కి.మీ.ల లోపల ఉన్న మచ్చుపహాడ్‌ పాఠశాల అత్యంత కఠినమైన పరిస్థితులలో ప్రారంభ మయ్యింది. పోలీసులు, నక్సలైట్ల మధ్య సంఘర్షణలో సతమతమవుతున్న పరిస్థితులలో చుట్టూ ఉన్న 17 లంబాడీ తండాల బీదపిల్లల, మచ్చుపహాడ్‌ గ్రామం లోని అత్యంత బీదప్రజల వద్దకు ఈ విద్యాలయం విద్యాసుగంధాన్ని తీసుకెళ్ళి 25 సంవత్సరాలుగా గ్రామస్థులు చేస్తున్న ప్రయత్నాల కారణంగా నేటికీ నిలబడి ఉంది.

శ్రీ కేశవ విద్యాలయం, కందకుర్తి, నిజామా బాద్‌ :

డాక్టర్‌ హెడ్గేవార్‌ పూర్వీకుల గ్రామం కందకుర్తి. ఈ గ్రామంలో నడుస్తున్న విద్యాలయం కూడా 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలలోని ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తోంది. ఇప్పుడీ గ్రామంలో ఎలాంటి కులవివక్ష కనబడటం లేదు.

ఇలాంటి ప్రయత్నాలు ప్రతి చోట స్థానిక ప్రజల సహకారంతో జరిగినప్పుడే విద్యా వ్యాప్తి జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్న చోట సేవాభారతి నిర్వహిస్తున్న ఉచిత అభ్యాసిక కేంద్రాలు (ఫ్రీ ట్యూషన్‌ సెంటర్స్‌) చాలా ఉపయోగ పడుతున్నాయి.

బాల కార్మికులకు విద్యాబోధన :

పాలమూర్‌ జిల్లాలో అనేక సామాజిక సమస్యలు నిర్మణ మయ్యాయి. అందులో పెద్ద సమస్య పిల్లలు బడులకు వెళ్ళకుండ కార్మికులుగా మారిపోవటం. వేలాది చిన్న పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్న సమయంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

సేవాభారతి ఈ కార్యంలో ముందు నిలబడింది. పాలమూర్‌ జిల్లాలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తోంది. మొదటి 10 సంవత్సరాలు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి బ్రిడ్జి స్కూల్స్‌ నిర్వహించింది. ఇటువంటి 13 బ్రిడ్జి స్కూళ్ళలో 7 సంవత్సరాలలో 8 వేల మంది బాలకార్మికులు 8 నెలల పాటు ప్రాథమిక విద్యను అభ్యసించారు. మరో 8 వేల మంది ప్రభుత్వ పాఠశాలలో చేరారు. సేవా భారతి పాఠశాలలు నాణ్యత కల్గిన విద్యను అందించిన కారణంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ భారత ప్రతినిధి (Iకూూ) జోసెఫ్‌, ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి మన్మోహన్‌సింగ్‌ వంటి అనుభవమున్న ఐ.ఎ.ఎస్‌. అధికారుల మన్ననలు లభించాయి. జిల్లాలో పనిచేసిన అందరు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారుల సహకారం చక్కగా లభించింది.

కనీస వసతులు మాత్రమే ఉన్న వసతి గృహాలు; తేళ్ళు, పాముల మధ్య, పొలాల మధ్య నిర్వహిస్తున్న వసతి గృహాలలో 8 వేల మంది పిల్లలు సురక్షితంగా ఉండటమే కాదు విద్యావంతులు కావటం విశేషం. 11 సంవత్సరాల వయస్సులో విద్యను ఆరంభించ టానికి పిల్లలను ఆత్మీయతతో ప్రోత్సహించిన ఉపాధ్యాయ బృందం, వసతులు కల్గించిన కార్యకర్తల బృందం అనేక రకాల సహకరించిన హితైశుల కృషి ప్రశంసనీయం.

సాందీపని ఆవాసం :

ప్రస్తుతం నడుస్తున్న సాందీపని ఆవాసం ఈ పనిలో భాగంగానే కొనసాగు తుంది. ప్రభుత్వ బ్రిడ్జి స్కూల్‌ పథకం ఆగిపోయిన సమయంలో బాల కార్మికులలో ప్రతిభావంతులైన విద్యార్థులకు పరీక్ష నిర్వహించి, ఎంపికైన విద్యార్థుల కోసం ప్రారంభమైనదే సాందీపని ఆవాసం. ఇక్కడి ప్పుడు 80 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తు న్నారు. 40 మంది ఉన్నత చదువులు కొనసాగి స్తున్నారు. కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పిల్లల సమగ్ర వికాస దృశ్యం ఈ ఆవాసంలో చూడవచ్చు. రవి అనే విద్యార్థి లెక్కలలో చుట్టుపక్కల గల నాలుగు జిల్లాల్లో ప్రథమ స్థానం వచ్చినందుకు గౌరవనీయ జిల్లా కలెక్టర్‌ అతనిని సన్మానించారు. చిన్నప్పటి నుండి చదువు లేకున్నా 5వ తరగతి నుండి చదువును ప్రారంభించి ఒకే సంవత్సరంలో అందరితో పోటిపడి ప్రథమ స్థానం సంపాదించటం బాల కార్మికులుగా కొనసాగుతున్న పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను సూచిస్తోంది.

అనాథ బాలలకు ఆశ్రయం :

ఈ మొత్తం కృషిలో నుండి సాధించిన గొప్ప విజయం 250 మంది అనాథలను గుర్తించి శాశ్వత పరిష్కారం దృష్ట్యా వీరందరికి అనేక ఆవాసాలలో ప్రవేశం కల్పించటం. ఇంతమంది పిల్లలకు ఈ సహాయం లభించటం ఇదే మొదటిసారి. వైదేహీ ఆశ్రమం, వాత్సల్యసింధు లాంటి సంస్థలతో పాటు సాందీపని ఆవాసం ఈ కృషిలో భాగమైంది.

ఇన్ని వేల మంది బాలకార్మికుల జీవితాలలో మార్పు ఒక పెద్ద సామాజిక ప్రయత్నం. సమాజం లోని అన్ని వర్గాలు కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యం అయింది.

కాబట్టి సకారాత్మక ప్రయత్నంతో చేసే ప్రయత్నం సమాజంలో శాశ్వత మార్పును తేగలదనేది సుస్పష్టం.

ఈ దిశలోనే అనేక సంస్థలు తెలంగాణ జిల్లాల్లో పని చేస్తున్నాయి.

వందేమాతరం ఫౌండేషన్‌ వందలాది విద్యాల యాల్లో వేలాదిమంది విద్యార్థులలో గణనీయ మార్పు సాధించింది.

జ్ఞాన సరస్వతీ ఫౌండేషన్‌ విద్యతో పాటు నైతిక విద్య పెంపొందించటంలో వంద గ్రామాల్లో సక్రియంగా పనిచేస్తోంది. పల్లె వెలుగు కార్యక్రమం ద్వారా వందలాది విద్యార్థుల ప్రతిభా వికాసంలో కృషి చేస్తోంది.

‘యూత్‌ ఫర్‌ సేవ’ వేలాదిమంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వికాసానికి తోడ్పడుతోంది. 10 వేల మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కూల్‌ బాగ్స్‌ పంపిణీ చేస్తోంది. వందలాది మంది సాప్ట్‌వేర్‌ ఇంజనీర్లు కేవలం మెయిల్‌ సందేశం చూసి, స్పందించి, 15 రోజుల వ్యవధిలో కోటిన్నర నిధిని పంపటం ప్రజలలో దాగి ఉన్న దాతృత్వానికి నిదర్శనం.

ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్షయ విద్య సంస్థ భాగ్యనగరంలోని బీద బస్తీల విద్యార్థులలో విద్య వికాసానికి కృషి చేస్తోంది. ఏకలవ్య ఫౌండేషన్‌ ఉట్నూర్‌ కేంద్రంగా వేలాది మంది గిరిజన విద్యార్థులకు సేవలందిస్తోంది.

– ఎక్కా చంద్రశేఖర్‌, ఆర్‌.ఎస్‌.ఎస్‌.క్షేత్ర సేవా ప్రముఖ్‌

(జాగృతి సౌజన్యం తో)