Home News శ్రీరామ రామ రామేతి…

శ్రీరామ రామ రామేతి…

0
SHARE

కాలపరీక్షకు నిలిచిన కమనీయ కావ్యం వాల్మీకి రామాయణం. ప్రశంసించేవారికి, ప్రశ్నించేవారికి కూడా ప్రాచుర్యాన్ని కలిగించిన ప్రాచేతసుడి రచన లోకానికి లోకోత్తర మర్యాదాపురుషోత్తముణ్ని పరిచయం చేసింది. కొడుకుగా, సోదరుడిగా, భర్తగా, ప్రభువుగానే కాదు- మామూలు మనిషిగా తోటి జీవుల పట్ల చూపవలసిన మానవీయతను, ఉన్నత సంస్కారాన్ని రాముడి ద్వారా ఉపదేశించింది. మనిషి మనుగడకు వ్యాకరణాన్ని నిర్దేశించింది. ‘జగతినిట్టి గుణోజ్వలుడైన నాయకుడుంట ఘటిల్లునే’ అంటూ మురారిభట్టు వంటి తదనంతర కవులు విస్తుపోయేంత గొప్పగా రామ పాత్రను మహర్షి తీర్చిదిద్దాడు. ఆ భావధారను అందిపుచ్చుకొన్న కంచర్ల గోపన్న ‘ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలిగొంటివి వింతగాదె! నీ మంతనము(ఆలోచన) ఎట్టిదో ఉడుత మైని(దేహంపై) కరాగ్ర నఖాంకురంబులన్‌ సంతసమంద చేసితివి’ అంటూ ఒక రాజకుమారుడు సామాన్య జీవుల పట్ల చూపిన ఉదాత్త వైఖరికి అంజలి ఘటించాడు. రాక్షసుల పట్ల సైతం రాముడి తీరు అలాంటిదే అన్నారు విశ్వనాథ. జనస్థానంలో తనపై విరుచుకుపడ్డ శత్రుమూకను చావుదెబ్బ తీసిన రాముడు సంబరాలు చేసుకోలేదు సరికదా, తీవ్ర సంతాపానికి గురయ్యాడట. ‘ఏ దనుజున్‌ వధించినను ఇట్టి విషాదము వొందు ఆత్మమర్యాదుడు స్వామి’ అన్నారాయన. తాటక వధ కారణంగా తల్లి తనను అభినందిస్తుంటే ‘అమ్మా! దేహమనన్‌ విచిత్రమగు దుఃఖారామము’ అనిపిస్తోందమ్మా అంటూ విలపించాడట. ఆ దుఃఖం రాముడిది కాదు, లోకానిది. మానవ జీవితంలోని మహావిషాద సర్వస్వాన్నీ తన గుండెల్లోకి తీసుకొన్న విశ్వమానవుడు రాముడు. ‘బాధను విన్నవింప పెనుభారము తగ్గెనదేమి చిత్రమో’ అని మనిషి తేలికపడ్డానికి, ఆరాధించడానికి ఆయన అవతారపురుషుడే కానక్కరలేదు- విశ్వనరుడైతే చాలు!

‘రేపటినుంచి నీవే రాజువి’ అన్నప్పుడు రాముడు ఆనందంతో ఎగిరి గంతులు వేయలేదు. ‘రాజ్యం నీది కాదు, అరణ్యానికి బయలుదేరు’ అన్నప్పుడు దుఃఖంతో కూలబడనూ లేదు. బతుకును కోతులతో పంచుకోవలసి వస్తే ఆత్మన్యూనతతో కుంగిపోలేదు. అయోధ్యలో భరతుడితో, కిష్కింధలో సుగ్రీవుడితో, లంకలో విభీషణుడితో ఆయన ఒకే తరహా సుఖ ఆవరణ(కంఫర్ట్‌ జోన్‌)లో ఉండగలిగాడు. రాముడి కారణంగా ‘చట్రాతికి కల్గె పావనము’- బండరాయిలా ఉన్న అహల్యకు పవిత్రత చేకూరింది. ‘అరాతికి రాజ్య సుఖంబు కల్గె’- శత్రువర్గంలోని విభీషణుడికి రాజయోగం పట్టింది. తిర్యక్కులు అంటే పశుపక్ష్యాదులు. ‘తిర్యగ్జాతికి పుణ్యమబ్బె’- జటాయువుకు పుణ్యలోకాలు దక్కాయి. ‘కపిజాతి మహత్వమునొందె’- మొత్తం వానరజాతికే గౌరవం దక్కింది. తనవల్ల పదిమందికి మేలు జరగడంకన్నా మనిషి జన్మకు ధన్యత మరొకటి ఉండదు. వ్యక్తిత్వ వికాసానికైనా, ఉంటున్న స్థితినుంచి ఉండవలసిన స్థితికి ఎదగాలన్నా- మనిషికి అందుకే రాముడితో పరిచయం ఏర్పడాలి. మనిషి సుఖంగా జీవించడానికి ఏడు ఆధారాలు అవసరం అంది శాస్త్రం. వాటినే ఏడుగడ అంటారు. ‘గురువును తల్లియు తండ్రియు పురుషుడు విద్యయును దైవమును దాతయును’- ఈ ఏడుగురివల్ల మనిషికి సంపూర్ణ రక్షణ కలుగుతుంది. ఈ కోణంలో రాముణ్ని ‘సర్వ జగద్రక్షకుడు’గా కవులు గుర్తించారు. ‘బంటురీతి కొలువు ఈయవయ్య రామా’ అని ప్రాధేయపడ్డారు త్యాగరాజస్వామి. ‘దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణపుంగవం’ అని కీర్తించాడు అన్నమయ్య. ‘రామశబ్ద జ్యోతిని నోటి చివర వెలిగిస్తే ఆ జీవితం దేహళీదత్త దీపం అవుతుంది’ అన్నాడు తులసీదాసు. ఇంటా బయటా వెలుగులు పంచే వీధి దీపంలా జీవితం వికసనం చెందాలంటే మనిషికి రాముడంటే ఎవరో తెలియాలి. అంతటి గొప్ప పాత్రను చిత్రించాడు కాబట్టే ‘యావత్‌ స్థాస్యంతి గిరయః…’- ‘ఈ భూమ్మీద పర్వతాలు నదులు ఎంతకాలం ఉంటాయో- అంతకాలం నా కావ్యం నిలిచి ఉంటుంది’ అని స్థిరంగా ప్రకటించాడు వాల్మీకి.

ఈ రోజుల్లో నదులు ఎండిపోతున్నాయి, పర్వతాలను మనమే దొలిచేస్తున్నాం కనుక వాల్మీకి శ్లోకం ప్రకారం రామాయణం నశిస్తుందని కాదు అర్థం. ఈ లోకంలో రామాయణం పదిలంగా ఉన్నంత కాలం పర్వతాలు నదులు నిండుగా ఉంటాయని గ్రహించాలి. రామచైతన్యాన్ని సంరక్షించుకోవాలి. ఇంట గెలిచి రచ్చకెక్కమని సామెత. నట్టింట సుఖశాంతులకూ సీతారాముల దాంపత్యమే మనకు దిక్సూచి. ‘సీత శ్రీరామచంద్రుని చిత్తపదము, రామచంద్రుడు జానకీ ప్రాణప్రదము’ అన్నారు విశ్వనాథ. ఆ జంట అన్యోన్యతకు పతాక శీర్షికలాంటిది ఆ వాక్యం. ‘ఆకృతి రామచంద్ర విరహాకృతి…’ సీతారాముల రూప భావసారూప్యం హనుమను విస్మయపరచింది. వీరు ఇద్దరా ఒకరా అని హనుమ ఆశ్చర్యపోయాడట. ‘సీత నెరుంగకుండ రఘుశేఖరుడు అర్థము కాడు పూర్తిగా’ అని తేల్చి చెప్పారు విశ్వనాథ. ఇప్పటికీ జనం పెండ్లిపత్రికలపై ‘జానక్యాః’ శ్లోకాన్ని అచ్చువేస్తూ ఆ దంపతులకు ఈ జాతి గుండెల్లో పటం కట్టించి పెట్టారు. ‘స్థిరమైన నడవడి నరులకు అందరకును వలయు’ అంటూ పానుగంటి ఉదాత్త జీవనానికి నమూనాలు చెప్పారు.     ‘రాము వంటి కొడుకు, భరత సౌమిత్రుల వంటి తమ్ములున్‌, సీతవంటి భార్యయు వసుధయందు, లేరు లేరటంచు ముందు యుగంబుల జనులు తలలూపవలదె’ అని మనసారా ఆకాంక్షించారు.      ‘పది కొంపలును లేని పల్లెలోనైనను’ రామమందిరం ఒకటి ఉండి తీరాలని ఈ జాతి ఆరాటపడింది. ‘శ్రీరామ’ అని రాయకుండా రచనే కాదు, ఉత్తరమ్ముక్క కూడా మొదలుపెట్టరాదని ఆశించింది. రామాయణాన్ని జాతీయ గ్రంథంగాను ‘సర్వమంగళ గుణ సంపూర్ణుడగు నిన్ను నరుడు దేవునిగాగ…’ రాముణ్ని భగవంతుడిగా ఆరాధిస్తూ వస్తోంది. జన మనోభిరాముడి జన్మదిన వేడుకలకు తెలుగునేల రంగవల్లులు దిద్దుతున్న వేళ ఇది!

(ఈనాడు సౌజన్యం తో)