Home News భారత్‌-చైనా సరిహద్దు ప్రాంతాలను పటిష్ట పరుస్తున్న భారత్, ఈశాన్యంపై ప్రత్యేక దృష్టి

భారత్‌-చైనా సరిహద్దు ప్రాంతాలను పటిష్ట పరుస్తున్న భారత్, ఈశాన్యంపై ప్రత్యేక దృష్టి

0
SHARE

నమ్మక ద్రోహానికి పాల్పడటం చైనా నైజం. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా దెబ్బతీయడం డ్రాగన్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఉద్దేశపూర్వకంగా వివాదాలను సృష్టించి, తెరపైకి తీసుకురావడంలో బీజింగ్‌ బహు నేర్పరి. 60వ దశకంలో నాటి చైనా ప్రధాని చౌ ఎన్‌లై ‘పంచశీల’ సిద్ధాంతాన్ని అదే పనిగా ప్రచారం చేసి, భారత్‌లో భరోసా కలిగించారు. ఆపై అనూహ్యంగా దండెత్తారు. ఆయన వారసులు ఇప్పుడు దాదాపు అదే బాటలో నడుస్తున్నారు. భారత్‌లో అంతర్భాగమైన సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ తమవేనంటూ చేస్తున్న యాగీ, తాజాగా డోక్లాం ఉదంతం ఇందుకు నిలువెత్తు నిదర్శనాలు!

సన్నాహక చర్యలు

డోక్లాం అనుభవం తరవాత సరిహద్దుల్లో మౌలిక సౌకర్యాల కల్పనపై భారత్‌ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. 1962నాటి చైనా యుద్ధంలో చేదు అనుభవానికి సరిహద్దుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం ఒక కారణం. అనంతరం పలు దిద్దుబాటు చర్యలు చేపట్టినా, వాటిని ఇప్పుడు ముమ్మరం చేసింది. రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ సరిహద్దుల్లో ఇటీవల పర్యటించారు. సైనిక కమాండర్లు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచంలోని అతి పెద్ద సరిహద్దుల్లో భారత్‌-చైనా సరిహద్దు ఒకటి. బ్రిటిష్‌ ఉన్నతాధికారి మెక్‌మహన్‌ అప్పట్లో ఈ సరిహద్దులను నిర్ణయించారు. భారత్‌లోని అయిదు రాష్ట్రాలు అరుణాచల్‌ప్రదేశ్‌ (1,126 కిలోమీటర్లు) సిక్కిం(220) జమ్ము కశ్మీర్‌ (1,597) ఉత్తరాఖండ్‌(345) హిమాచల్‌ప్రదేశ్‌ (200 కి.మీ.) చైనాతో సరిహద్దులు కలిగి ఉన్నాయి. అరుణాచల్‌పై కన్నేసిన చైనా ఆ ప్రాంతం తనదేనని మొండిగా వాదిస్తోంది. అందువల్లే అక్కడ సౌకర్యాల కల్పనపై భారత్‌ దృష్టి పెట్టింది. హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ సరిహద్దులపై చైనాకు తొలినుంచీ పెద్దగా అభ్యంతరాలు లేవు. ఇప్పుడీ ప్రాంతంలోనూ డ్రాగన్‌ కదలికలు చురుకందుకున్నాయి.

మొదటి నుంచీ ఈశాన్య సరిహద్దునే కీలకంగా భావిస్తున్న భారత్‌, ఆ ప్రాంతంలోనే మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టింది. తాజాగా హిమాచల్‌, ఉత్తరాఖండ్‌, కశ్మీర్‌లతో గల సరిహద్దుల్లోనూ అదే తరహా చర్యలు చేపట్టాలన్న అభిప్రాయానికి వచ్చింది. తొలుత 58 స్థావరాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సరిహద్దుల్లో ఇటీవల రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటన, తాజాగా సైన్యాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఆధ్వర్యంలో జరిగిన సైనిక కమాండర్ల సమావేశంలో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు. రహదారుల విస్తరణ, కొత్త రహదారుల నిర్మాణం, రైలు మార్గాలు, విమాన స్థావరాల ఏర్పాటు ఇందులో ముఖ్యమైనవి. కొండలు, రాళ్లూరప్పలు, నదీ ప్రవాహాలు, దట్టమైన అటవీ ప్రాంతంతో సరిహద్దులు గందరగోళంగా ఉంటాయి. ఆ ప్రాంతాలకు చేరుకోవడం క్లిష్టతరం. ఇప్పుడు రోడ్డు, రైలు, వాయు మార్గాల ఏర్పాటు కోసం పాలనపరమైన అడ్డంకులు తొలగించారు. సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌ఓ- బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌)కు మరిన్ని అధికారాలు దఖలు పరచారు. దేశ, విదేశాల నుంచి నిర్మాణ సామగ్రి కొనుగోలు కోసం బీఆర్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌కు వంద కోట్ల రూపాయల మంజూరు వరకు ఆర్థిక అధికారాలు అప్ప గించారు. ‘టర్న్‌కీ’ పద్ధతిలో రోడ్డు ప్రాజెక్టుల్లో భారీ నిర్మాణ సంస్థల సేవలను బీఆర్‌ఓ పొందడానికి వీలుగా విధానపరమైన మార్గదర్శకాలకూ రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ‘సాఫ్ట్‌వేర్‌’నూ అభివృద్ధి చేస్తున్నారు. సుమారు 3,409 కిలోమీటర్ల నిడివి గల 61 రహదారుల పనులకు సంబంధించి ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

అసోమ్‌లోని మిస్సమారి నుంచి అరుణాచల్‌లోని తవాంగ్‌ వరకు 378 కిలోమీటర్లు; అలాగే పాసిఘాట్‌ (అరుణాచల్‌) నుంచి రూపై(అసోం)కు మధ్య 227 కిలోమీటర్లు; అసోమ్‌లోనే ఉత్తర లక్ష్మీపూర్‌ నుంచి సిలాపథర్‌ వరకు 249 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాల నిర్మాణానికి సర్వే పనులు తుది దశకు చేరుకున్నాయి. వీటికోసం రూ.345 కోట్లు విడుదలయ్యాయి. హిమాచల్‌లోని బిలాస్‌పూర్‌ నుంచి మనాలీ మీదుగా జమ్ము కశ్మీర్‌లోని లేహ్‌ వరకు 498 కిలోమీటర్ల రైలుమార్గంపై కేంద్రం నిశిత పరిశీలన జరుపుతోంది. అక్కడ రోడ్డు మార్గం ఉన్నా, ప్రతికూల వాతావరణంలో రాకపోకలకు రైలు మార్గమే అనువుగా ఉంటుంది.ఈ మార్గంలో కొన్ని ప్రాంతాలు సముద్రమట్టానికి 17వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. శీతకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ 30 డిగ్రీల సెల్సియస్‌లో ఉంటుంది. వేసవిలో ఎండలూఅంతే తీవ్రంగా ఉంటాయి. వానకాలంలో కొండచరియలు విరిగి పడుతుంటాయి. భూకంపాల అవకాశమూ ఎక్కువే. పలుచోట్ల వంతెనలు, సొరంగాలు నిర్మించాల్సి ఉంటుంది. ఈ రైలుమార్గానికి పెద్దమొత్తంలో నిధులు అవసరమవుతాయి. అయితే దేశరక్షణ విషయంలో నిధులకు వెనకాడరాదని రక్షణ మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌తో గల చైనా సరిహద్దుల్లో కొత్తగా సైనిక కమాండ్‌ ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. దీనివల్ల ఈ ప్రాంతంలో మరిన్ని బలగాలు మోహరించడానికి అవకాశం కలుగుతుంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో సరిహద్దు రక్షణ చర్యలు ప్రభావవంతంగా లేవని అంతర్గత సర్వేల్లో తేలింది. దీన్ని అవకాశంగా తీసుకుని చైనా దుందుడుకు చర్యలకు పాల్పడే అవకాశాన్ని తోసిపుచ్చలేం. ఇక్కడ బరాహోటి, పులాం సుమ్దా ప్రాంతాల వద్ద చైనా సైనికులు సరిహద్దులను అతిక్రమించిన సందర్భాలూ ఉన్నాయి. ఈ ప్రాంతంలోని కొండలు, పర్వత ప్రాంతాలను రహదారులతో అనుసంధానించే అవకాశాలపైనా పరిశీలన జరుగుతోంది. కొత్త కమాండ్‌ ఏర్పాటు, రహదారుల అనుసంధానం వల్ల బలగాలు, ఆయుధాలను సత్వరమే తరలించడానికి వీలు చిక్కుతుంది. సరిహద్దుల్లో సైనికుల తాత్కాలిక బసకు అవసరమైన గుడారాల ఏర్పాటూ సమస్యాత్మకమవుతోంది. విపరీతమైన చలి, వేడిమి నుంచి రక్షణ కల్పించే ఏర్పాట్లు అరకొరగానే ఉన్నాయి. సైనికులకు అవసరమైన సదుపాయాల కల్పనా మౌలిక సౌకర్యాల్లో భాగమే. ఈ దిశగా కూడా కేంద్రం చర్యలు చేపడుతోంది.

చైనా దూకుడు ప్రదర్శిస్తే…

సరిహద్దులకు ఆవలివైపు చైనా సైతం దాదాపు ఇదే తరహా ఏర్పాట్లతో సమాయత్తమవుతోంది. టిబెట్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ సమీప ప్రాంతాల వరకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. సరిహద్దు రక్షణలో స్థానికుల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. భారత్‌ సరిహద్దులోఉన్న టిబెటన్లకు రాయితీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పదహారేళ్లు పైబడిన 1.60లక్షల యువతకు ఈ రాయితీలు అందజేస్తున్నట్లు అంచనా. ప్రథమశ్రేణి పట్టణాల్లో రాయితీని వెయ్యి యువాన్ల నుంచి 2,700 యువాన్లకు, దిగువస్థాయిలో 800 నుంచి 2,500 యువాన్లకు చైనా పెంచింది. టిబెట్‌ చైనాలో అంతర్భాగం అని భారత్‌ అధికారికంగా గుర్తించింది. కానీ, టిబెటన్లు అనేకమంది తమ దేశాన్ని చైనా ఆక్రమించుకుందని భావిస్తుంటారు. తమది పూర్తిగా బీజింగ్‌కు భిన్నమైన సంస్కృతి అని విశ్వసిస్తారు. ఆ భావనల నుంచి దూరం చేసి, వారిలో జాతీయ భావాలు నాటుకునేందుకే బీజింగ్‌ వ్యూహాత్మకంగా రాయితీ తాయిలాలు ప్రకటించిందన్న అభిప్రాయం దౌత్యవర్గాల్లో ఉంది. భారత్‌ శాంతికాముక దేశం. అయినా చైనాను పూర్తిస్థాయిలో విశ్వసించలేం. భవిష్యత్తులో చైనా దూకుడు ప్రదర్శిస్తే దీటుగా స్పందించడానికి భారత్‌ సర్వసన్నద్ధంగా ఉండాలనడంలో మరోమాటకు తావులేదు!

– గోపరాజు మల్లపరాజు

(ఈనాడు సౌజన్యం తో)