Home News నిరాదరణకు గురైన చిన్నారుల సంరక్షణ, విద్య, అభివృద్ధి, హక్కుల పరిరక్షణ లో నిమగ్నమైన గోపీనాథ్‌

నిరాదరణకు గురైన చిన్నారుల సంరక్షణ, విద్య, అభివృద్ధి, హక్కుల పరిరక్షణ లో నిమగ్నమైన గోపీనాథ్‌

0
SHARE
  •  అనాదరణకు గురైన చిన్నారులకు తోడ్పాటునందిస్తోన్న గోపీనాథ్‌
  • ఈ ఏడాది ప్రొఫెసర్‌ యశ్వంతరావ్‌ కేల్‌కర్‌ యువ పురస్కారానికి ఎంపిక
  • అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి విభాగంగా నిలుస్తోంది.

ఏబీవీపీ పునాది స్థాయి నుంచి బలపడేందుకు తన వంతు కషి చేసిన ప్రొఫెసర్‌ యశ్వంతరావ్‌ కేల్‌కర్‌ జ్ఞాపకార్థం 1991వ సంవత్సరం నుంచి ఏబీవీపీ, విద్యార్థి నిధి ట్రస్టులు సంయుక్తంగా ‘యువ పురస్కార్‌’ అవార్డులను అందజేస్తున్నాయి. ఇరు సంస్థలు నాటి నుంచి నేటి వరకు విద్యార్థుల ఉన్నతికి కట్టుబడి పనిచేస్తున్నాయి.

ఈ సంవత్సరం బెంగళూరుకు చెందిన ఆర్‌. గోపీనాథ్‌కి ‘ప్రొఫెసర్‌ యశ్వంతరావ్‌ కేల్‌కర్‌ యువ పురస్కారం’ లభించింది.

బెంగళూరులో చిన్నారుల పరిరక్షణ, వారి బాగోగులు చూసుకోవడం, వారి అభివద్ధికి కషి చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఫ్రొఫెసర్‌ యశ్వంతరావ్‌ కేల్‌కర్‌ యువ పురస్కార్‌ కమిటీ గోపీనాథ్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. డిసెంబర్‌ 2వ తేదీన రాంచీలో జరిగిన అఖిల భారత విద్యార్థి పరిషత్‌ 63వ జాతీయ సమావేశాల్లో గోపీనాథ్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహించే యువ సమాజ సేవకులను గుర్తించి వారి కషిని ప్రోత్సహించడమే ఈ పురస్కారం ప్రధాన ఉద్దేశం. యశ్వంతరావ్‌ కేల్‌కర్‌ కమిటీ యువ సమాజ సేవకుల ప్రయత్నాలను గుర్తించి, వెలుగులోకి తీసుకొచ్చి, వారి సేవలకు కతజ్ఞతలు తెలుపతుంది. అంతేకాకుండా ఈ అవార్డు అందుకున్న వారి నుంచి యువత స్ఫూర్తి పొంది సమాజసేవకు ముందడుగు వేసేలా చేయడమే లక్ష్యంగా ప్రొఫెసర్‌ యశ్వంతరావ్‌ కేల్‌కర్‌ యువ పురస్కారాలను ప్రతియేటా అందిస్తారు.

గోపీనాథ్‌ ‘స్పర్శ’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా వేలాది మంది చిన్నారులను పాఠశాల విద్యకు చేరువ చేస్తున్నాడు. స్పర్శ ట్రస్ట్‌ ద్వారా గత ఏడేళ్లలో 2500 మంది చిన్నారులను బడిలో చేర్చాడు. అంతేకాకుండా వారిని వారి కుటుంబాల వద్దకు చేర్చాడు.

‘ప్రతీ చిన్నారికి సురక్షితమైన, సంతోషకరమైన బాల్యాన్ని ఆస్వాదించే హక్కు’ ఉంటుందనే సూత్రం మీద గోపీనాథ్‌ తన సేవలు ప్రారంభించాడు. సమాజంలో వెనకబడిన, సరైన ఎదుగుదల లేని చిన్నారుల సంపూర్ణ అభివద్ధికి ఆయన నడుం బిగించాడు.

గోపీనాథ్‌ కర్ణాటకలోని కోలార్‌కు చెందిన వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. గోపీనాథ్‌ తల్లిదండ్రులకు నలుగురు సోదరులు. అందరికంటే ఈయనే చిన్నవాడు. గోపీనాథ్‌ పుట్టుతోనే విద్యావంతుల కుటుంబంలో జన్మించినప్పటికీ తన తండ్రి మద్యానికి బానిస కావడంతో వారి కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండేవి. పూరి గుడిసెలో నివసిస్తున్న గోపీనాథ్‌, అతని సోదరులు చదువులకు దూరమయ్యారు. బ్రతుకుదెరువుకోసం తల్లితో కలిసి పనులకు వెళ్లేవారు. పశువుల కొట్టాలను శుభ్రపరచడం, వ్యవసాయం చేయడం ద్వారా తమ పొట్ట నింపుకునేవారు.

గోపీనాథ్‌ ‘గోపి’ గా సుపరిచితుడు. బెంగళూరు యూనివర్సిటీ సామాజిక సేవా విభాగం నుంచి గోపి తన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ పట్టాను పొందాడు. గ్రామీణ నేపథ్యంలో జీవించడం, చిన్నతనంలో నిర్బంధ కార్మికుడిగా పనిచేయడం గోపికి జీవితంలో ఎన్నో అనుభవాలను నేర్పాయి. గోపి ఎదుగుదలకు తన సవతి తల్లి కూడా ఎంతగానో సాయపడింది. సమాజంలో కష్టాలను ఎదుర్కొంటున్న చిన్నారుల అభివద్ధికి తోడ్పాటునందించాలని గోపి ఎప్పటి నుంచో కలలు కనేవాడు.

ప్రస్తుతం గోపీనాథ్‌ బెంగళూరులోని ఎనిమిది స్పర్శ ట్రస్ట్‌ కేంద్రాలలో 400 మంది చిన్నారుల పరిరక్షణను చేపడుతున్నాడు. ఇప్పటి వరకు ఈ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2500 మంది చిన్నారుల సంరక్షణకు గోపి చర్యలు తీసుకున్నాడు. ఆ చిన్నారుల మంచి, చెడ్డలను చూడడానికి దాదాపు 40 మంది సామాజిక కార్యకర్తలు గోపీతో చేతులు కలిపారు.

చిన్నారులకు విశేష సేవలందిస్తున్న గోపీనాథ్‌ ‘ఫ్రొఫెసర్‌ యశ్వంత్‌రావ్‌ కేల్‌కర్‌’ యువ పురస్కారాన్ని అందుకున్నందుకు ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ నగేశ్‌ ఠాకూర్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి వినయ్‌ బింద్రేలు గోపీనాథ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలను సాధించాలని వారు కోరారు.

తన యజమాని పిల్లల లాగే గోపి కూడా పాఠశాలకు వెళ్లాలని కలలు కనేవాడు. కాని అతని తండ్రి ఆ కలలను కల్లలు చేశాడు. గోపిని, అతడి సోదరులను బెంగళూరుకు తీసుకొచ్చాడు. అక్కడ వారిని భవన నిర్మాణ కార్మికులుగా మార్చేశాడు. చదువు పట్ల గోపి ఆసక్తిని గుర్తించిన అతని సవతి తల్లి స్థానిక పాఠశాలలో గోపి పేరు నమోదు చేయించింది. అక్కడి నుంచి అతని జీవితం ఎన్నో మలుపులు తిరిగింది.

ప్రాథమిక విద్య ముగిసిన అనంతరం గోపి మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వెల్ఫేర్‌ కోర్సులో చేరాడు. తనలాంటి ఆలోచనా విధానం ఉన్న స్నేహితుల మద్దతుతో గోపీనాథ్‌ 2002లో ‘సోషల్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ పీపుల్‌’ అనే సేవా సంఘాన్ని స్థాపించాడు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి చదువులో వెనుకబడిన, బడి మానేసిన చిన్నారులను గుర్తించాడు. వారి సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహించాడు. ఉచిత వైద్య శిబిరాలు, విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరిగేలా పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు నిర్వహించాడు.

గోపీనాథ్‌ 2004 సం||లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కార్యాచరణను మొదలుపెట్టాడు. విద్యకు సంబంధించి రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన కూటమికి సమన్వయ కర్తగా పనిచేశాడు. అందులో భాగంగా కర్ణాటక రాష్ట్రమంతటా మూడు సంవత్సరాల పాటు పర్యటించాడు. రాష్ట్రంలో విద్యకు సంబంధించిన సమస్యలు, చదువులో విద్యార్థుల వెనకబాటు తనానికి గల కారణాలు గుర్తించాడు. ప్రతి చిన్నారి పాఠశాలకు వెళ్లేలా చేయాలని, దేశ వ్యాప్తంగా ఒకే రకమైన నాణ్యమైన విద్యావిధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వాలు కషి చేయాలని తన గొంతు వినిపించాడు. అతని నిర్విరామ ప్రయత్నాలు మెల్లగా ఫలితాలను ఇవ్వడం ప్రారంభిం చాయి. బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌లో స్థానికులు వీధి బాలలను పాఠశాల్లో చేర్చారు. అంతేకాకుండా వివిధ కారణాలతో చదువును అర్దాంతరంగా మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలకు చేర్చడంలో గోపీనాథ్‌ విజయం సాధించాడు.

స్పర్శ ట్రస్ట్‌

వ్యక్తిగతంగా ఎక్కువ మంది ఆదరణకు నోచుకుని చిన్నారులను చేరడం కష్టతరమని గోపి భావించి, మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వెల్ఫేర్‌ వాలంటీర్ల సహకారంతో స్పర్శ అనే ట్రస్టును 2005లో రిజిస్టర్‌ చేయించాడు. తమ నినాదానికి అనుగుణంగానే ఈ సంస్థ పనితీరు కనబరిచేలా చర్యలు తీసుకున్నాడు.

ఈ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గోపీనాథ్‌, వాలీంటర్లు నిరాదరణకు గురైన చిన్నారుల సంరక్షణ, విద్య, అభివద్ధిపై దష్టి సారించి పనిచేస్తూ బాలల హక్కుల పరిరక్షణకు పాటుపడుతున్నారు. 6 నుంచి 18 సంవత్సరాల లోపు వయసున్న, నిరాదరణకు గురైన చిన్నారులను గుర్తించి వారికి పునరావాసం కల్పించారు. అంతేకాకుండా వైవిధ్యభరితమైన కార్యక్రమాలను చేపడుతూ చిన్నారులను తమకాళ్ళపై తాము నిలబడేటట్లు చేసి, ఆదరణను అందించేందుకు ఎంతగానో కషిచేస్తున్నారు.

నిసర్గ గ్రామం

స్పర్శ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గోపీనాథ్‌ ‘నిసర్గ గ్రామం’ అనే పునరావాస కేంద్రాన్ని చిన్నారుల కోసం ప్రారంభించాడు. అందులో నిరాదరణకు గురైన చిన్నారులకు జీవన నైపుణ్యాలను, ప్రతికూల పరిస్థితుల్లో నిలదొక్కుకోవడం, పర్యావరణ పరిరక్షణను నేర్పుతున్నారు. అంతేకాకుండా బాలబాలికలకు స్నేహపూర్వకమైన వాతావరణాన్ని సష్టిస్తున్నారు. వైవిధ్య భరితమైన మానసిక స్థితి ఉన్న చిన్నారుల అభివద్ధికి నిసర్గ గ్రామం ఒక వేదికగా తోడ్పాటునందిస్తోంది.

– విజేత

(జాగృతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here