Home News ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణకు భారత మార్గ దర్శనం అవసరం

ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణకు భారత మార్గ దర్శనం అవసరం

0
SHARE
  • ముంబైలో జరిగిన అంతర్జాతీయ సాంస్కృతిక అధ్యయన కేంద్రం 6వ మహాసభలు
  • సభలలో ఆత్మీయతతో పాల్గొన్న విశ్వ సంస్కృతులకు చెందిన ప్రతినిధులు

‘మార్గదర్శనం కోసం మేము భారతదేశం వైపే చూస్తాం. భారత్‌ సాయంతో ఆధునిక సంస్కృతి యొక్క తెంపరి తనానికి కళ్లెంవేసి మా సంస్కృతులను కాపాడు కోగలమని ఆశిస్తున్నాం’. ముంబైకి దగ్గరలో ఉత్థాన్‌ లోని రాంభావు మహల్గీ ప్రబోధన్‌లో ఫిబ్రవరి 1 నుండి 4 వరకు జరిగిన అంతర్జాతీయ సాంస్కృతిక అధ్యయన కేంద్రం 6వ మహాసభలలో పాల్గొన్న 30 దేశాలకు చెందిన 300 మందికి పైగా ప్రతినిధులలో దాదాపుగా అందరూ వెలిబుచ్చిన అభిప్రాయమిది.

పాశ్చాత్య దేశాల నుంచి పదేపదే సాంస్కృతిక దాడులు జరుగుతున్నా స్వీయ సంస్కృతులను పరిరక్షించుకోవటం ఎంతో ముఖ్యమనేది ప్రతినిధులు గ్రహించటం విస్పష్టంగా కనిపించింది. ప్రపంచ మంతటా ఆయా స్థానిక సంస్కృతుల్లో సర్వసాధారణం గా కనిపించిన అంశమేమంటే మనమంతా – ఆ మాటకు వస్తే అసలు ఈ విశ్వమే – మనం ఆరాధించే ఐదు మౌలికమైన శక్తుల నుంచే ఆవిర్భవించిందని వారంతా నమ్ముతున్నారు. భారతీయ సంస్కృతి విశ్వసించే పంచభూతాలు సరిగ్గా ఇవే-ఆకాశం, నీరు, గాలి, అగ్ని, భూమి. భూమాతను, మనందరిలో ఉన్న ఒక మహోన్నత దివ్యశక్తిని కూడా వారు నమ్ముతు న్నారు. మన మనుగడకు అత్యవసరమైన దివ్యత్వం ద్వివిధమైనదన్న భావనను వారు విశ్వసిస్తున్నారు. అది ప్రకృతి, పురుషుడు. మతపరమైన స్వేచ్ఛ గురించి ఎన్నడూ గొంతు చించుకొనే అనేక క్రైస్తవ, ముస్లిం దేశాలలో దేశీయమైన సంస్కృతులు, ఆచారాలు, కర్మకాండలు, భాషలలో చాలా వాటిమీద ‘చట్టపర మైన నిషేధం’ కొనసాగుతోంది.

యెజ్దీ మానవ హక్కుల అంతర్జాతీయ సంస్థ అధ్యక్షుడు మీర్జా ఇస్మాయిల్‌, యెజ్దీ సహ ప్రతినిధులైన నిహద్‌, హనీఫాలు ‘ఆర్గనైజర్‌’తో మాట్లాడుతూ తమ సంస్కృతి చాలా వరకు భారతీయ సంస్కృతి వంటిదేనని చెప్పారు. వారి దేవుడు భారతీయుల కార్తికేయుడు / అయ్యప్ప / మురుగన్‌ / షణ్ముగంల వంటివాడే. పాదరక్షలు ధరించకుండా ఆరాధించే సంప్రదాయం యెజ్దీలలోనూ ఉంది. వారు బలమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థను నమ్ముతారు. వారి భాషలో చాలా హిందీ, సంస్కృత పదాలున్నాయి. వారి సంఖ్యా మానం హిందీ, సంస్కృతంలోనే ఏక్‌, దో, తీన్‌, చార్‌.. దస్‌గా ఉంది. పుట్టినరోజు తదితర శుభ సందర్భాలలో వారు ‘హజార్‌ సాల్‌ హుషీ’ (ఖుషీ) అనే అచ్చమైన హిందీ పలుకుతో వేయేండ్లు ఆనందంగా ఉండాలంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

గ్వాటెమాలా దేశంలోని జాతీయ మయన్‌ వరిష్ఠ జన సమితి (National Mayan Council of Elders) సభ్యురాలైన ఎలిజబెత్‌ అరావుజో కూడా ఇలాగే చెప్పింది. తమ సంస్కృతి అసలైన పేరు మయన్‌ సంస్కృతి అని, మనం మహాభారతంలో చెప్పుకునే యముడి పేరే ఇదని ఆమె చెబుతుంది. వీరు దక్షిణ అమెరికా నుంచి ఈజిప్టు వెళ్ళి అక్కడ ‘కర్మయ’ అనే సంస్కృతిని నెలకొల్పారని, తరువాత వారే కంబోడియా వెళ్ళి ‘స్వర్మయ లేక ‘సర్మయ’గా పేరు తెచ్చుకున్నారని ఆమె చెప్పింది. పంచభూతాల భావన మయ సంస్కృతిలోనూ అదే విధంగా ఉంది. మహాదివ్యశక్తి ఒకటి తమను కనిపెట్టుకుని అనుక్షణం కాపాడుతూ ఉంటుందనే విశ్వాసం తమకున్నదని ఎలిజబెత్‌ చెప్పింది. పంచభూతాలను ఉద్దేశించిన ప్రార్థనలను, నాటి సమయాలను ఆమె ఉదాహరణగా చెప్పింది. వారు ఆరాధించే దేవతలు చాలావరకు భారతీయ దేవతలను పోలినవారే. హిందూ సంస్కృతిలో మాదిరిగానే సహస్రాబ్దాల పాటు కొనసాగుతూ పునరావర్తన చెందుతుండే యుగ ప్రవర్తన భావన వారిలో కూడా ఉంది. మయ కాలమానినిలో దాదాపు ఐదువేల సంవత్సరా లుంటాయి. ఒక యుగం పూర్తికాగానే ఇంకో యుగం మొదలవుతుంది. అంతటి సరళమైన కాలవ్యవస్థ అది. తాము దక్షిణ అమెరికాలోని స్థానిక దేశీయుల మైనప్పటికీ తమ మత విశ్వాసాన్ని పాటించనీయటం లేదని, తమ స్మారక స్థలాలను సందర్శించనీయకుండా అడ్డుపెతున్నారని ఆమె ఆవేదన వెలిబుచ్చింది. మయ, తదితర స్థానిక జనులను తమతమ ఆచారాలు, కర్మకాండలు జరుపుకోకుండా నిషేధిస్తూ ప్రభుత్వాలు చట్టాలు చేశాయన్నది. మయ దేవాలయాలకు వెళ్ళి తమ మతపరమైన కర్మకాండలు జరుపుకునే వీలు లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

నమాగుగ్వీ ఎన్‌గోబీస్‌ దక్షిణాఫ్రికాలోని జులు సంస్కృతికి చెందిన మహిళ. వృత్తిరీత్యా అధ్యాపకు రాలు. భారతదేశాన్ని మొదటి సారిగా సందర్శించిన ఆమె ఇక్కడి సంస్కృతికి ఎంతగానో ముగ్ధురాలైంది. ప్రపంచంలోని ఆయా దేశాల స్థానిక సంస్కృతికి, భారతీయ సంస్కృతికి మధ్యనున్న పోలికలు చూస్తే సంభ్రమాశ్చర్యాలు కలుగుతున్నాయంది. ఆధునిక పాఠశాల విద్యావిధానం తమ జులు సాంస్కృతిక విలువలకు ఎలా ఎసరు పెడుతున్నదో ఆమె సుదీర్ఘంగా వివరించింది. ‘మా సంస్కృతిలో బలోపేత మైన కుటుంబ అనుబంధాల మీద నమ్మమున్నది. సాంప్రదాయికంగా పెద్ద ఉమ్మడి కుటుంబాలతో జీవిస్తూ వచ్చాం. ఆధునిక సంస్కృతి మా ఆత్మీయ కుటంబ బంధనాలను విచ్ఛిన్నం చేస్తున్నది’ అని చెప్పింది. పాశ్చాత్య సంస్కృతి (క్రైస్తవ సంస్కృతి) పాఠశాల విద్యావిధానాన్ని ఎలా తయారు చేసిందంటే దానివల్ల దానికి మాత్రమే లబ్ది కలిగి ఇతర సంస్కృతులన్నీ దానికి బానిసలుగా తయారవాల్సిందే. ఆఫ్రికాలోని జులూలు, ఇతర స్వదేశీ సంస్కృతుల వారంతా తమ ఆచార వ్యవహారాలను అనుసరిస్తూ తద్వారా తమ గుర్తింపును నిలుపుకొనేందుకు పోరాటం చేస్తున్నారు. ‘మా సంస్కృతిలో వేలుపెట్టే ప్రభుత్వాల సాయంతో మతాంతరీకరణ చేయడానికి క్రైస్తవులు ప్రయత్నిస్తున్నారు’ అని, దేశీయ సంస్కృతికి చెందిన ఎవరికీ పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని కూడా ఆమె చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశీయ జనులు నేల తల్లికి హాని కలిగించకుండా, పురుగు మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయానికి సాంప్రదాయికంగా మద్దతు తెలుపుతున్నారని, ఆధునిక వ్యవసాయ ఉత్పత్తులు హానికరమైనవి అయినందున జులూలు తమ సాంప్రదాయిక సాగు విధానాలకు మరలి వెళ్ళటానికి పోరాడుతున్నారని నమాగుగ్వీ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఆయా స్థానిక సంస్కృతులలో సామాన్యంగా ఉన్న సమస్య ఏమిటని ప్రశ్నిస్తే ‘దేశీయులైన వారెవరూ ఎక్కడా స్వేచ్ఛగా లేరు’ అని ఆమె బదులిచ్చింది.

అమెరికా ప్రతినిధి ఎల్‌డాడ్‌ మహ్లోన్‌ కిండ్సెత్‌ అమెరికాలో పుట్టి ఒడిశాలో పెరిగాడు. క్రైస్తవ, ముస్లిం సాంస్కృతిక దాడుల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా దేశీయ సంస్కృతుల తీరు తెన్నులపై ఆయన అధ్యయనం చేస్తున్నాడు. క్రైస్తవ మిషనరీలు తమ పాఠశాలల ద్వారా ప్రపంచవ్యాప్తగా దేశీయ సంస్కృతులను నాశనం చేస్తున్నారని, స్థానిక తెగలకు చెందిన వారిని బలవంతంగా మత మార్పిళ్లు చేస్తున్నారని ఆయన అంటాడు. దేశీయ సంస్కృతులను, భాషలను, జ్ఞానాన్ని డాక్యుమెంట్లుగా రూపొందిం చడం ద్వారా మాత్రమేగాక వాటికి జీవించే హక్కు నివ్వటం ద్వారా పరిరక్షించాలంటాడు. ఫిన్లాండుకు చెందిన తన పూర్వీకులు బలవంతంగా మత మార్పిడికి గురయ్యారని, రాజకీయకరణం చేయబడిన మతం ఒక ప్రపంచ సమస్య అయికూర్చుందని అంటాడు.

మహాసభలు విజయవంతం కావాలంటూ పెద్దలు చేసిన ఆశీర్వచనాలతో ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 7.30 గంటలకు ఈ సభలు ప్రారంభ మయ్యాయి. తరువాత 9.30 గంటలకు ప్రతినిధులు తమ తమ సాంప్రదాయిక వస్త్రధారణతో వర్ణ రంజితమైన శోభాయాత్రలో పాల్గొని కనువిందు చేశారు. స్థానిక ప్రజానీకం కూడా తమ సాంప్రదా యిక నృత్య, సంగీతాలతో వారితో పాలు పంచుకు న్నారు. తదుపరి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సహ సర్‌కార్యవాహ దత్తాత్రేయ ¬సబలె, పద్మవిభూషణ్‌ డా.సోనాల్‌ మాన్‌సింగ్‌, పద్మభూషణ్‌ ఆచార్య వేద నందాలు ప్రారంభోపన్యాసం చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాచీన సంప్రదాయాల లోని స్త్రీ దేవతారాధన పై ఈ మహాసభలలో ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

సమావేశాల్లో వివిధ వక్తల ప్రసంగాలు

హిందూ జీవన విధానంలో పలువురు దేవీ మూర్తుల ప్రాముఖ్యం గురించి, వారి పాత్ర గురించి డా||సోనాల్‌ మాన్‌సింగ్‌ విశ్లేషించారు. వివిధ రూపాలలో దైవాన్ని ఆరాధిస్తూ సమతుల్యతను చూడటమనేదంతా అర్ధనారీశ్వర భావన నుంచే ఉదయించిందని సోనాల్‌ అన్నారు.

భారత్‌లోను, ప్రపంచంలోని వివిధ సంప్ర దాయాలలోనూ ప్రకృతిని స్త్రీ-పురుషులుగా భావించి నప్పటికీ ఈ మహత్తర సమావేశాల్లో విశ్లేషించి దేవీ తత్వానికి ప్రాచుర్యం కల్పించారు. తమతమ ఆచారాల ద్వారా, తమ జానపద సాహిత్యం లోని బలమైన నమ్మకాల ద్వారా సంతులనాన్నీ, సామరస్యాన్నీ సృష్టించే విశిష్టత గురించి నాయకులు వివరించారు. ఆపైన మరెందరో ఉపన్యాసకులు కూడా స్త్రీ దేవతా తత్వంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

రెండవ నాటి మహాసభ ‘కేంద్రం అగ్ని’ సన్నిధిలో కొలంబియాకు చెందిన వరిష్ఠజనులు పాడిన పవిత్ర జానపదగీతం, ప్రార్థనలతో మొదలైంది. ఈ ‘కేంద్ర అగ్ని’ సమావేశాల పరిసమాప్తి వరకు అఖండంగా ప్రజ్వలిస్తూనే ఉంది. సభాసదులంతా ఈ అగ్ని ప్రజ్వలనను వీక్షించారు. ప్రాచీన సంస్కృతులకు చెందిన వరిష్ఠ జనులు స్త్రీ దేవతా తత్వపు ఆరంభ వికాసాల గురించి తద్వారా దివ్యత్వాన్ని ఎలా అన్వేషించవచ్చునో చెబుతూ దివ్య జననీ తత్వం చుట్టూ అల్లుకొని ఉన్న సంప్రదాయాలు సిద్ధాంతాల గురించి ప్రత్యేకంగా విశ్లేషించారు. ఈ విశ్లేషణా ప్రసంగాలన్నీ అందరినీ చక్కగా ఆకట్టుకున్నాయి. ఎవరికి వారు తమదైన సాంప్రదాయిక కథలను ఒక నవీన దృక్కోణంతో అవగాహన చేసుకునేందుకు తోడ్పడ్డాయి. శక్తి, దుర్గ, కాళీ, కృష్ణుడు, మహేశుడు తదితర దివ్యమూర్తులన్నీ ఒకే స్త్రీ దేవీ తత్వపు భిన్న పార్శ్వాలను వ్యక్తపరిచే సృజనాత్మక అభివ్యక్తిలో భాగాలే.

మూడోరోజున నేపాల్‌, లాట్వియా ప్రతినిధులు తమతమ దేశీయ సంప్రదాయాలలోని ప్రభాత ప్రార్థనలతో ప్రారంభించారు. ప్రబోధినీ భవనమంతా పణవ, ఆనక్‌ వంటి వాద్యధ్వనులతో, గీతాలాపనలతో మారుమోగింది. ప్రతి ఒక్కరూ తమ తమ సంప్రదాయాల పట్ల మరింత పెరిగిన అభిమానంతో పులకించిపోయారు. స్వకీయ మూలాలతో లోతైన అనుబంధాలు నెలకొల్పుకోవలసిన ప్రాధాన్యం అందరికీ అర్థమయ్యేలా చేయడమే ఈ సంప్రదాయాల ప్రధానోద్దేశంగా ఉంది.

భారత్‌ నడుం కట్టాలి : భయ్యాజి

ఈ మహాసభలు ఫిబ్రవరి 4వ తేదీన ‘కేశవ సృష్టి’లో శ్రీ సత్యనారాయణ మహాపూజ సందర్భంగా జరిగిన వేలాది ప్రజానీకపు సమ్మేళనంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌ కార్యవాహ భయ్యాజీ జోషి ప్రసంగిస్తూ ‘భారతదేశం విభిన్న మతాలను సహకారంతో చూడటం మాత్రమే గాక అన్ని రకాల ఆరాధనా విధానాలను ఆమోదిస్తుంది కూడా’ అని వివరించారు. ‘ఏ సంస్కృతుల మీద గాని, మాతల మీద గాని ఎన్నడూ దాడిచేయని దేశం భారతదేశం. చరిత్రే ఇందుకు సాక్ష్యం’ అన్నారు. యుగయుగాల కాలపరీక్ష తట్టుకొని నిలిచిన సంస్కృతి ప్రాతిపదికగా తన చైతన్యశీల నాయకత్వానికి భారత్‌ నడుము కట్టినప్పుడే విశ్వవైవిధ్యత వర్ధిల్లుతుంది’ అంటూ భయ్యాజీ ఈ సమావేశాలలో పాల్గొన్న ప్రాచీన సంస్కృతి ప్రేమికులందరికి ఉత్సాహాన్నిచ్చారు.

మహారాష్ట్ర రాష్ట్ర విద్యా, సాంస్కృతిక మంత్రి వినోద్‌ తావడే ప్రాచీన సంస్కృతులన్నిటినీ ఒక్క తాటిమీదకు తెచ్చినందుకు అంతర్జాతీయ సాంస్కృతిక అధ్యయన కేంద్రాన్ని (ఐసిఎస్‌ఎస్‌) అభినందించారు.

ప్రతినిధులందరూ నూతనోత్సాహంతో తమతమ దేశాలలో తమ దేశీయ సంస్కృతులకు నూతన జవసత్వాలను చేకూర్చే దీక్షతో తరలి వెళ్లారు.

– రాజేశ్‌ ప్రభు సాల్‌గావ్‌కర్‌

(జాగృతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here