Home News తొలి ఏకాదశి పండుగ భక్తి శ్రద్ధలతో చేసుకున్న వారికి వైకుంఠప్రాప్తి

తొలి ఏకాదశి పండుగ భక్తి శ్రద్ధలతో చేసుకున్న వారికి వైకుంఠప్రాప్తి

0
SHARE

— పి. విశాలాక్షి

తొలి ఏకాదశి
మన భారత దేశంలో ఉత్తరాయణం కంటే దక్షిణాయనoలోనే పండుగలు, వ్రతాలు ఎక్కువ. సూర్యుడు దక్షిణం వైపు ప్రయాణం సాగించడoతో, వర్షాలు శీతాకాలం అన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం `చాతుర్మాస్య దీక్ష’ వ్రతానికి ప్రారంభ దినం తొలి ఏకాదశి; ఈ రోజు నుంచి ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడు దక్షిణం వైపుకు మరలుతాడు, అపుడే దక్షిణాయన పర్వం ప్రారంభమౌతుంది. దీనినే ఆషాఢ ఏకాదశి, ప్రథమ ఏకాదశి, పద్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ దినంనుండి శ్రీ మహావిష్ణువు నాలుగు నెలలపాటు క్షీరాబ్ధిలో యోగనిద్రా ధ్యానంలో ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి, అందుకే `శయన ఏకాదశి’ అని కూడా అంటారు, నాలుగు నెలల తర్వాత కార్తిక శుద్ధ ఏకాదశి నాడు, అనగా ఉత్థాన ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణాలు చెబుతాయి. తొలి ఏకాదశి మొదలుకుని నాలుగు మాసాలపాటు యతులు, సాధువులు, మతాచార్యులు ఒకే చోట ఉండి, దైవ పూజాదికాలు ఆచరిస్తూ ప్రజలకు పురాణాలు, దైవ కార్యాలు విపులంగా చెబుతూ మానవులకు దైవత్వాన్ని వివరిస్తారు. మహావిష్ణువు విగ్రహాన్ని ఆభరణాలతో అలంకరించి, జాజిపూలతో పూజించి, పవళింపుసేవ మొదలైన సేవలతో పాటు నిత్య సంకీర్తనలతో స్వామిని సేవిస్తారు. మహారాష్ట్రలో వర్కారీల యాత్ర తొలి ఏకాదశి రోజున, చంద్రభాగానదీ తీరాన ఉన్న పండరీపురం పాండురంగని ఆలయం వద్ద ముగుస్తుంది. సమస్త వైష్ణవాలయాలలో, మఠాలలో, భజన కీర్తనలతో గొప్ప ఉత్సవాలు నిర్వహిస్తారు.

పండరీపురం – వర్కరీ యాత్ర

తెలుగు నేలలో, `ఏరు ముందా, ఏకాదశి ముందా?’ అనే సామెత తొలి ఏకాదశి గురించి చెప్పబడుతుంది. నదులకు కొత్త నీరు రావడంవల్ల రైతులు `ఏరువాక’ పనులు ప్రారంభిస్తారు. సంవత్సరమంతా అతివృష్టి, అనావృష్టి, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా, పంటలు బాగా పండాలని ప్రార్థిస్తారు. మాంధాత రాజు కాలంలో ఆయన రాజ్యంలో, మూడు సంవత్సరాలు వర్షాలు లేక ప్రజలు క్షామంతో బాధపడుతుంటే, అంగీరస మహాముని వరుణుడి కటాక్షం కోసం, తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుని పూజించమని చెప్పగా, మహారాజు ఆ విధంగా చేయగానే, వర్షాలు విస్తారంగా కురిసాయి.

పూర్వం మురాసురుడనే రాక్షసుడు మునులను, మానవులందరినీ వేధిస్తుండగా, ఋషులు బ్రహ్మని ఆశ్రయించారు. బ్రాహ్మ ఋషులను తీసుకుని శ్రీ మహావిష్ణువు వద్దకువెళ్ళి మురాసురుడిని వధించి మానవాళిని కాపాడమని అర్ధిస్తాడు. విష్ణువు మురాసురునితో వెయ్యేళ్ళు యుద్ధం చేసి అలసి ఒక గుహలో యోగనిద్రలో పరమేశ్వరిని ధ్యానం చేస్తుండగా, విష్ణువు శరీరం నుంచి ఏకాదశి అనే కన్య ఉద్భవించి, మురాసురుని వధలో విష్ణుమూర్తికి తోడ్పడుతుంది. ఇదంతా ఏకాదశి నాడు జరగడంవల్ల `ఏకాదశి నాడు నీవు అందరిచేత పూజిoపబడతావని’ విష్ణువు వరమిస్తాడు. ప్రతి మాసం, శుక్లపక్షం మరియు కృష్ణపక్షాలలో రెండు సార్లు ఏకాదశి వస్తుంది, కొట్లాదిమoది భక్తులు ఉపవాసముండి ఏకాదశి వ్రతం చేస్తారు.

ఈ కారణంచేత పవిత్రమైన ఆషాఢ శుద్ధ ఏకాదశి పండుగను భక్తులు నియమనిష్టలతో జరుపుకుంటారు; ఉదయమే లేచి, శ్రీమహావిష్ణువుని శ్రీమహాలక్ష్మిని పూజిoచి, విష్ణు సహస్రనామాలు, అష్టోత్తరాలు జపించి, రామాయణ భాగవతాలు పఠించి, గోవిందనామ కీర్తనలు పాడుకుని, ఉపవాసం ఉండి, ఆ రాత్రి జాగరణ చేసి, మర్నాడు దైవదర్శనం చేసుకుని, నైవేద్యo సమర్పించుకుని అప్పుడు భుజిస్తారు. జొన్నపేలాలను బెల్లంతో కలిపి చేసే పేలప్పిండిని నైవేద్యoగా సమర్పించి, ప్రసాదంగా స్వీకరిస్తారు. భక్తులు అన్నదానాలు చేస్తారు. తొలి ఏకాదశి పండుగ భక్తి శ్రద్ధలతో చేసుకున్నవారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని పురాణాలు చేపుతున్నాయి. `ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే పవిత్ర మంత్రంతో భక్తులు శ్రీ మహావిష్ణువును ధ్యానిoచవచ్చు.