Home Telugu Articles 32 ఏళ్ల క్రితం నేటి రాత్రి… వారికి కాళరాత్రి

32 ఏళ్ల క్రితం నేటి రాత్రి… వారికి కాళరాత్రి

0
SHARE
  • కశ్మీరీ పండిట్లు వలసపోయి 32 ఏళ్లు
  • ఊళ్లు విడిచిపోయిన 5 లక్షల మంది
  • రాష్ట్ర విభజనతో.. తిరిగి స్వస్థలాలకు
  • రప్పించేందుకు కేంద్రం యత్నాలు
  • హమ్‌ వాపస్‌ ఆయేంగే అంటూ ట్విటర్‌లో పండిట్ల పోస్ట్‌

న్యూఢిల్లీ/శ్రీనగర్‌/జమ్మూ, జనవరి 18: కశ్మీరీ పండిట్లు వలసపోయి నేటికి 32 ఏళ్లు. ఉగ్రవాదుల హెచ్చరికలు, దాడులకు భీతిల్లి, ప్రాణాలు అరచేత పెట్టుకొని 1990 జనవరి 19న రాత్రివేళ వేలమంది పండిట్లు (హిందువులు) కశ్మీర్‌ లోయలోని ఇళ్లను, ఆస్తులనూ, ఊళ్లనూ వదిలి చెట్టుకో పుట్టగా వలసపోయారు. స్వాతంత్ర్యానంతర భారత చరిత్రలో ఇదో చీకటి అధ్యాయం. కశ్మీర్‌ లోయ రక్తసిక్తమైన రోజు.

ఉగ్రవాదుల అరాచకాలు పెచ్చరిల్లిన రోజు. ఇపుడు పరిస్థితులు కాస్త మారాయి. తిరిగి సొంతూళ్లకు వస్తామంటున్న వారి సంఖ్య పెరుగుతోందని కశ్మీర్‌ పాలకులు చెబుతున్నారు. హమ్‌ వాపస్‌ ఆయేంగే హాష్‌ట్యాగ్‌తో కశ్మీరీ పండిట్లు పెట్టిన వీడియోపోస్ట్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. పండిట్ల జీవనంపై విధు వినోద్‌ చోప్రా తీసిన, వచ్చే నెల్లో విడుదల కానున్నషికారా చిత్రంలోని హమ్‌ ఆయేంగే వతన్‌ డైలాగ్‌ ఇపుడు జమ్మూలో మార్మోగుతోంది.

1990 జనవరి ప్రారంభం నుంచే లోయలో రాడికల్స్‌ పెరిగారు. హిందువులతో కలిసి మెలిసి జీవించే సాధారణ ముస్లింలను రెచ్చగొట్టారు. ఇక 1990 జనవరి 18 రాత్రి నిజంగా వేల మందికి కాళరాత్రి ఉంటే ఇస్లాంలోకి మారి ఇక్కడుండండి.. లేదా కశ్మీర్‌ను విడిచిపోండి… లేదా చావు తప్పదు..అని హెచ్చరిస్తూ వందలమంది మిలిటెంట్లు ఏకే-47లు, తుపాకులు, కత్తులు చేతబూని వీధుల్లో స్వైరవిహారం చేశారు. అడ్డం వచ్చిన హిందువులను నరికేశారు. మహిళలపై అత్యాచారాలూ జరిగాయి. హిందువుల దుకాణాలు, ఇతర ఆస్తిపాస్తులు ధ్వంసం చేశారు. కొన్ని ఆలయాలనూ నేలమట్టం చేశారు. స్కూళ్లు, ఆఫీసులు.. ఒకటేమిటి… హిందువుల ముద్ర ఉన్న ప్రతీ ఒక్కటీ తుడిచేశారు. రాత్రి గడిచి సూర్యుణ్ణి చూస్తామా… లేదా… అని వేల మంది పండిట్లు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అతి భయానకమైన ఆ రోజును తలుచుకొని నేటికీ వణికిపోతారు.

ఆ తరువాత పెద్ద ఎత్తున పండిట్లు జమ్మూ వైపు, ఢిల్లీ శివార్లలోని ప్రస్తుత ఎన్‌.సీ.ఆర్‌ వైపు మరలిపోయారు. ఇదమిత్థంగా ఎంతమంది.. అన్నది తేలకపోయినా కనీసం 5 లక్షల మంది వలసపోయుంటారని అంచనా. తరువాత ఉగ్రవాదం పెరిగిందే తప్ప తగ్గలేదు.

1990-2010 మధ్య దాదాపు 1341 మంది పండిట్లను ఊచకోత కోశారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం లోయలో 890 పండిట్ల కుటుంబాలకు చెందిన 3945 మందే జీవిస్తున్నారని పనూన్‌ కశ్మీర్‌ సంస్థ వెల్లడించింది. ఆ తరువాత అనేక ప్రభుత్వాలు పండిట్లను వెనక్కి రప్పించడానికి ప్రయత్నాలు చేసినా
పాక్‌-ప్రేరిత ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉండడం వల్ల ఎవరూ సుముఖత చూపలేదు.

ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. ఆర్టికల్‌ 35-ఏను రద్దు చేసి ఆర్టికల్‌ 370ని నిర్వీర్యం చేసింది. లోయలో జనాభాపరమైన మార్పులు తెస్తోంది. అన్ని వర్గాల ప్రజలనూ చేర్చే ప్రయత్నం సాగిస్తోంది. ఇజ్రాయెల్‌ తరహాలో పండిట్లకు ప్రత్యేక కాలనీల ఏర్పాటు యోచనలోనూ ఉంది.

ఇందిర జమానా నుంచే అశాంతి

కశ్మీర్లో అశాంతి ఇందిరాగాంధీ జమానా నుంచే మొదలైనప్పటికీ తదనంతరం రాజీవ్‌, వీపీ సింగ్‌, పీవీ హయాంలలో తీవ్రస్థాయికి చేరింది. 1988లో జమ్మూ కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జేకేఎల్‌ఎఫ్‌) అనే వేర్పాటువాద సంస్థ పురుడుపోసుకుంది. భారత్‌ నుంచి రాష్ట్రాన్ని వేరుపర్చడమే దాని ఏకైక లక్ష్యం. తొలిసారిగా 1989 సెప్టెంబరు 14న పండిట్‌ టికాలాల్‌ టప్లూ అనే కశ్మీరీ హిందూ నేతను హత్యచేసింది. ఆ తరువాత మక్బూల్‌ భట్‌కు మరణశిక్ష విధించిన జడ్జి నీలకంఠ్‌ గంజూను కూడా కాల్చిచంపింది. ఈక్రమంలోనే నాటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ముఫ్తి మొహమ్మద్‌ సయీద్‌ కుమార్తె రుబయ్యా సయీద్‌ను కూడా జేకేఎల్‌ఎఫ్‌ కిడ్నాప్‌ చేసింది.

ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో

First Published On 19.01.2020