Home Hyderabad Mukti Sangram ఉమ్రీ మార్కెట్ ప్రాంతం నుండి కాల్పులు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-8)

ఉమ్రీ మార్కెట్ ప్రాంతం నుండి కాల్పులు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-8)

0
SHARE

అప్పుడే ఉమ్రీ మార్కెట్ ప్రాంతం నుండి కాల్పులు మొదలయ్యాయి. దిక్కులు మార్మ్రోగుతున్నాయి.   రైల్వే స్టేషన్‌లో కూడా ఈ జట్టు కాసేపు గాలిలో కాల్పులు జరిపింది. ప్రయాణీకులు భయపడి ఎక్కడికక్కడే కదలకుండా ఆగి పోయారు.

ఈ జట్టు కూడా ఆ తర్వాత బ్యాంక్‌వైపునకు దారితీసింది

చలికాలపు సాయంత్రం 5.30 గంటలకు మొదటి జట్టు బ్యాంక్‌పై దాడి చేసింది. దాడిచేసిన యువకులలో అనంతభాలేరావ్, ఆబాసాహెబ్, సాహెబ్‌రావ్, దిగంబర్ ఉత్తర్‌వార్, బన్సీలాల్‌జీ తోషణీవాల్, కిశోర్ సహానే, శంకర్‌లాల్ శర్మ, ధన్‌జీ పురోహిత్, రఘునాథ్ పండిట్ తదితరులు ఉన్నారు. తుపాకులతో కాల్పులు జరుపుతూ వీరంతా బ్యాంకులోకి చొచ్చుకొనిపోయారు. ఈ లోగా బ్యాంక్ వాచ్‌మన్లు పై నుండి కాల్పులు ప్రారంభించారు. కానీ ఆ వాచ్‌మన్ల కాల్పులకు ఎవరూ అందలేదు. దత్తాత్రేయను చంపిన అరబ్బీ వాచ్‌మన్‌ను మొదలే బ్యాంక్ కాంపౌండ్‌లో ఈ జట్టు కాల్చి చంపింది. అందువల్ల మేడపై ఉన్న మిగతా వాచ్‌మన్‌లు ప్రాణభయంతో పైనే దాక్కున్నారు.

లోపలికి వెళ్ళిన జట్టు సరాసరి క్యాషియర్ దగ్గరికి వెళ్ళింది. క్యాషియర్‌ను తాళం చెవులు అడిగారు. అతను నిరాకరించగానే వెంటనే ఫైరింగ్ జరిగింది. పాపం  దేవిదాస్ గిర్‌గావ్‌కర్ అనే క్యాషియర్ ప్రాణాలు కోల్పోక తప్పలేదు. క్రమంగా డబ్బు భోషాణాలు తెరుచుకున్నాయి. దగ్గరలో ఉన్న సంచుల్లో డబ్బు నింపారు. అరబ్బీ వాళ్ళ లుంగీలు దొరికితే వాటిలో డబ్బు మూటగట్టారు. ఈ లోగా మిగతా సహచరులు మార్కెట్ నుండి బలమైన ఎద్దులు ఉన్న 20 బండ్లను తీసుకొని బ్యాంకు ఎదురుగా సిద్ధంచేసి పెట్టారు. బండివాడు ఒక్కడు కూడా నోరు మెదపలేదు. కాల్పులు గాలిలో కొనసాగుతూనే ఉన్నాయి. భయానకమైన వాతావరణం నెలకొన్నది.

పట్టణవాసులు భయంతో కాలు కదపలేదు. దాదాపు రెండువేలదాక గుండ్లు పేల్చబడ్డాయి. ఇరవై బండ్లలో డబ్బు సంచులను అమర్చారు. కేవలం 45 నిముషాల్లో ఎంతో నాటకీయంగా ఈ తతంగం జరిగిపోయింది. దాడిలో పాల్గొన్న యువకుల్లో దేవ్‌రావ్ ఖడకీకర్ ఒక్కడే గాయపడ్డాడు. గాయపడిన మిత్రున్ని తీసుకున్న 20 బండ్లతో సహా ఈ జట్టు తిరుగు ప్రయాణం సాగించింది. దారిలో మిగతా జట్ల యువకులు వచ్చి కలుసుకున్నారు. ఉమ్రీ వదలి నిజాం సంస్థానపు సరిహద్దులు దాటాలని రాత్రంతా వేగంగా ప్రయాణం కొనసాగించి, ఉదయం ఆరు గంటలు కాగానే బరార్ (విదర్భ) సరిహద్దుల్లోకి ఈ బృందం ప్రవేశించింది. సరిహద్దు గుండా ప్రవహించే పెన్ గంగానదిలో యువకులు ఉదయ భాస్కరుణ్ణి దర్శించుకున్నారు.

ఇక్కడ ఉమ్రీ పట్టణం మొత్తం భయంతో హడలిపోయింది. అసలు ఎవరు, ఎంత మంది దాడి చేశారు? కాల్పులు ఇంకా ఎంతసేపు కొనసాగుతాయి? అనే అనుమానాలతో ఉమ్రీ ప్రజలు సతమతమయ్యారు. ఈ దాడి వార్త చేరగానే రిజర్వుపోలీసులతో ఒక స్పెషల్ ట్రైన్ నిజామాబాద్ నుండి బయలుదేరింది. అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో రిజర్వు పోలీసు ట్రైన్ ఉమ్రీ స్టేషన్ చేరింది. కానీ చీకట్లో పొంచి ఉండి కాల్పులు జరుపుతారో అనే భయంతో పోలీసులు రైలు పెట్టెలలో ఉండిపోయారు.

దాడి చేసిన యువకుల బృందం పెన్‌గంగా నది దాటి దేవసరా చేరింది. ఈ దేవసరా గ్రామం బరార్‌లోనిది. దేవసరాలో బృందం విశ్రాంతి తీసుకోసాగింది. కాని గాయపడిన దేవరావును వెంటనే ఉమర్‌ఖేడ్ చేర్చవలసి ఉంది. అందువల్ల దిగంబర రావు అతన్ని ఒక బండిలో వేసుకొని విశ్రాంతి లేకుండానే ఉమర్‌ఖేడ్‌వైపు బయలుదేరాడు. బండిలో పడుకున్న దేవరావ్ తీవ్రమైన జ్వరంతో కలవరించడం మొదలు పెట్టాడు. పెన్‌గంగా నదీతీరం గుండా సాగిన ఆ ప్రయాణం ఎంతో కష్టంగా కొనసాగింది. ఉమర్‌ఖేడ్ పోయిన ప్రత్తి బండ్లు ప్రత్తితో సహా ఎదురు వచ్చాయి. అప్పుడే తెలిసింది. గాంధీజీ హత్య జరిగిందనే సంగతి. చివరికి ఉదయం 10.30 గంటలకు గాయపడి ప్రమాదస్థితిలో ఉన్న దేవరావుతో దిగంబరరావు ఉమర్‌ఖేడ్ చేరుకున్నాడు. భారత ప్రభుత్వపు పోలీసు అధికారి దక్షిణకర్ వేళకు తోడ్పడి గాయపడిన వ్యక్తికి చికిత్సకు ఏర్పాటు చేశాడు.

ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు మిగతా మిత్రులందరూ దేవసరా నుండి ఉమర్‌ఖేడ్ వచ్చేశారు. వీరంతా అక్కడ నుండి జీపులో పుసద్ ప్రాంతం చేరుకున్నారు.  దోపిడీ చేసి తెచ్చిన డబ్బు మొత్తం గోదాజీరావ్ ఇంట్లో కాంగ్రెస్ నాయకుల సమక్షంలో లెక్కపెట్టారు. మొత్తం ఇరవై లక్షల అరవై అయిదువేల హాలీ రూపాయలతో పాటు మూడువేల కల్దార్ రూపాయలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఇరవై బండ్లవాళ్ళకు ఒక్కొక్కరికి అయిదు వందల చొప్పున మొత్తం పదివేల రూపాయలు అదనంగా ఇచ్చి ఉన్నారు. ఈ దోపిడీ తర్వాత ఉమర్‌ఖేడ్ బిడూల్ ఉన్న శిబిరాలను ఎత్తివేశారు. దాడిలో  పాల్గొన్న యువకులందరికీ రెండు వందలు చొప్పున ఇచ్చి దేశంలో పర్యటించి రమ్మని పంపించి వేశారు.

జట్టు జట్టుగా వెళ్ళి దేశాటన ముగించి యువకులు తిరిగి వచ్చారు. ఈ లోగా నిజాం సంస్థానానికి బరారుకు మధ్య ఒప్పందం కుదరనందువల్ల నిజాం పోలీసులు ఉమర్‌ఖేడ్ గాలింపు ప్రారంభించారు. బ్యాంక్‌లో దోపిడీలో పాల్గొన్న యువకులకు ఉమర్‌ఖేడ్ ప్రభుత్వాధికారులు రక్షణ కల్పించారు. గాలింపుల కోసం పోలీసులు వచ్చేముందు ఒక పైలట్ జీప్ అడ్వాన్సుగా వెళ్ళి యువకులను తప్పించింది.  ఆ తర్వాత మూడున్నర మాసాలు గడిచిపోయిన పిదప ఉమర్‌ఖేడ్ బిడూల్ శిబిరాలు తిరిగి ప్రారంభమైనాయి. కొంతకాలం తర్వాత (సెంట్రల్ ప్రావిన్స్) హోంమంత్రి శ్రీ ద్వారకా ప్రసాద్ మిశ్రా ఈ యువకులందరినీ తన ఇంటికి ఒకరోజు తేనీటి విందుకు పిలిచాడు.

తేనీరు త్రాగిన తర్వాత శ్రీ మిశ్రా గంభీరంగా ఇలా అన్నాడు “ఇక మీ అందరినీ నిజాం పోలీసులకు అప్పగించే సమయం ఆసన్నమైంది.” వాతావరణం స్థంభించిపోయింది. అప్పుడు యువకులు ఇలా సమాధానమిచ్చారు. “మీరు మిమ్మల్ని అప్పగించవచ్చును. కాని మా శవాలు మాత్రమే వాళ్ళకి దొరుకుతాయి. మా దగ్గర ఉన్న పోటాషియం సైనైడ్ తీసుకోనివ్వండి.” నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో శ్రీ మిశ్రా నవ్వుతూ ఈ యువకుల సాహసాన్ని ప్రశంసించారు. పోలీసు చర్య సాగింది. నిజాం లొంగిపోయాడు. హైద్రాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై స్వేచ్ఛా వాయువులు పీల్చింది.

(విజయక్రాంతి సౌజన్యం తో)