Home Telugu Articles కేస్లాపూర్‌ వైభవంగా నాగోబా జాతర

కేస్లాపూర్‌ వైభవంగా నాగోబా జాతర

0
SHARE

ఆదిలాబాద్‌ జిల్లాల కేస్లాపూర్‌ గ్రామంలో వందల ఏళ్ళుగా ఆదివాసుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న దేవత నాగోబా. ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా కూడా గుర్తించింది. ప్రతి ఏటా పుష్యమాస అమావాస్య రోజున ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ నాగోబా ఆలయంలో ప్రత్యేకపూజలతో జాతర సందడి మొదలవుతుంది. ఈ పూజలన్నీ ఒకే వంశస్తుల చేతుల మీదుగా జరగడం అనాదిగా వస్తున్న ఆచారం. వారం రోజుల పాటు నిర్వహించే జాతరకు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా తదితర రాష్ట్రాలనుండి కూడా భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు.

నేపద్యం:
నాగోబా తరతరాలుగా వనవాసుల కొంగు బంగారంగా  విరాజిల్లుతుంది. వనవాసీతెగల్లో ఒకటైన ప్రధాన్‌ సమాజానికి చెందిన మెశ్రంవంశంలోని బోయిగొట్టె అనే విభాగానికి చెందినవారు జాతరలో దేవతకు పూజలుచేస్తారు. అక్కడ ప్రచారంలోఉన్న ఇతిహాసం ప్రకారం సుమారు 550 ఏళ్ళక్రితం ఆ వంశంవారిలో ఒకరికి మహమ్మారి సోకింది. ఆవ్యక్తితప్ప మిగతా ఆరుగురు సోదరులు చనిపోయారు. తరువాత దేవత ప్రత్యక్షమై గంగాజలంతో ఏటా పుష్యఅమావాస్యరోజున అభిషేకం చేయమని ఆదేశిస్తుంది. ఏడురకాల నైవేద్యాలను సమర్పించాలని చెప్పి అదృశ్యమౌతుంది. అప్పటినుండి ఏటా ఆలయాన్ని గంగాజలంతో శుద్ధిచేసి జాతర జరుపుతున్నారు.

మరోకథనం ప్రకారం:- ఆ వంశానికి చెందిన ఏడుగురు అన్నదమ్ములు ఊరువిడిచి ఓగొల్లవారింటికి చేరి పశువుల పాకలో మకాంపెట్టారు. అక్కడే 12ఏళ్లపాటు పనిచేసి కొంతడబ్బు సంపాదించాక స్వగ్రామం కేస్లాపూర్‌కు తిరిగివెళ్లాలని నిర్ణయించుకున్నారు. దారిలో మేనమామ ఇంటికి వెళ్లారు. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయలేదనే అక్కసుతో అతన్ని చంపడానికి అన్నదమ్ములు వచ్చారని మేనమామ కూతురు ఇంద్రాదేవి అనుకున్నది. అందుకే ఆమెపెద్దపులిగామారి ఆరుగురు అన్నదమ్ములను చంపేస్తుంది. ఆఖరువాడు మాత్రం నాగదేవుణ్ణి వేడుకోవడంతో ప్రాణాలతో బయటపడి కేస్లాపూర్‌ చేరుకుంటాడు. తనను కాపాడిన నాగదేవతను గ్రామంలో కొలువుదీరాలని వేడుకుంటాడు. నాగోబా అంగీకరించి అక్కడే స్థిరపడుతుంది. మెశ్రం వంశంలోని బోయగొట్టె తెగవారు తనతోపాటు16మంది ఆడ (సతి), 18మంది మగ (కామ) దేవతలను ప్రతిష్ఠించి పూజలుచేయాలని ఆదేశిస్తుంది.

జాతర ప్రారంభానికిముందు కేస్లాపూర్‌ ఆలయంలో మెశ్రం గిరిజనులు ప్రత్యేకపూజలు చేస్తారు. ఆ పూజలకు అవసరమయ్యే మట్టికుండలను తరతరాలుగా ఒకే వంశానికి చెందినవారే తయారు చేస్తారు. కుండల తయారి ముగిసేలోగ ”కటోడా” గుడిపూజారి ప్రధాన్‌లు ఎడ్లబండిపై మెస్రంవంశ వనవాసులు నివాసంఉండే గ్రామాలకు వెళ్ళి జాతరతేదీలను తెలియజేస్తారు. ప్రచారం ముగిసాక ఆలయానికి చేరుకొని ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆవంశానికి చెందిన ఏడుగురు వ్యక్తులు కలిసి కాలినడకన పవిత్రజలం తేవడానికి గోదావరినదికి బయలుదేరుతారు. జన్నారం మండలంలోని కలమడుగు గ్రామసమీపంలోని హస్తిన మడుగునుండి జలాన్ని తీసుకొని తిరుగు ప్రయాణం అవుతారు దారిలో ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకుంటారు. అనంతరం కేస్లాపూర్‌ గ్రామశివారులోని మర్రిచెట్లదగ్గర మూడురోజులపాటు బసచేస్తారు. ఆ వంశంవారిలో మృతిచెందిన పితృలకు ప్రత్యేకపూజలు చేస్తారు. వీటిని ”తూం” పూజలు అని అంటారు. ఇలాచేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మకుశాంతి కలిగి దేవతలుగా మారతారని వనవాసుల నమ్మకం. ఆ పూజల అనంతరం సాంప్రదాయ వాయిద్యాలయిన డోలు, కాలికోంలను వాయిస్తూ నాగోబా ఆలయానికి బయలుదేరుతారు. కొత్తదంపతులు ముందుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఏడుగురు పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఆలయం ప్రక్కనే మట్టితో పుట్టలు తయారుచేస్తారు.

భేటింగ్‌:
కటోడా, ప్రధాన్‌లతోపాటు మరోఐదుగురు గంగాజలంతో ఆలయాన్ని శుద్ధిచేస్తారు. రాత్రి10గంటల తరువాత జిల్లా కలెక్టర్‌, ఐ.టి.డి.ఏ. పి.ఓ. జిల్లాలోని ఇతర యంత్రాంగం సమక్షంలో నాగోబాకు నవధాన్యాలతో పూజలు చేస్తారు. మెస్రంవంశంలోని కోడళ్ళందరికి ఒకరికొకరిని పరిచయం చేసేందుకు భేటింగ్‌ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈరోజున తెల్లనివస్త్రాలు ధరించి మొహం కన్పించకుండా ఆలయంలోనికి వెళ్తారు. నాగోబాదేవతకు పూజలుచేసి రాత్రి12గంటల తరువాత భేటింగ్‌ నిర్వహిస్తారు.

మండగాజలీతో ముగింపు:
వనవాసులు నాగోబా ఆలయసమీపంలో మండగాజలీ అనే వేడుకను నిర్వహిస్తారు. మహిళలు ఆటపాటలతో ఆనందంగా నృత్యంచేస్తారు. పురుషులు కర్రసాము చేస్తారు. తరువాత ఆలయంలోనికి వెళ్ళకుండా బయటనుంచే దేవతను మొక్కుకొని ఉట్నూరు మండలంలోని శ్యాంపూర్‌ బుడందేవ్‌ జాతరకు ప్రయాణమవుతారు. అక్కడ పూజలు నిర్వహించి ఇళ్ళకు చేరుకుంటారు.

వనవాసుల సమస్యలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తారు. జిల్లాప్రముఖ్‌ మంత్రితోపాటు ఇతర రాష్ట్రమంత్రులు కూడా దర్బార్‌కువచ్చి వనవాసుల సమస్యలను తెలుసుకొని పరిష్కారం చూపేప్రయత్నంచేస్తారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన ఈ జాతర జరగనున్నది. ఆసక్తి వున్న నగరవాసులు కేశ్లాపూర్‌ వెళ్ళినట్లైతే ఒక చక్కటి అనుభూతిని పొందుతారు.