Home News ‘వైదేహి ఆశ్రమం’ 26 వ వార్షికోత్సవం

‘వైదేహి ఆశ్రమం’ 26 వ వార్షికోత్సవం

0
SHARE

భాగ్యనగర్: సేవా భారతి ప్రకల్పం ఆధ్వర్యంలో సైదాబాద్ లో  నడుస్తున్న ‘వైదేహి ఆశ్రమం’ 26 వ వార్షికోత్సవం 28-ఏప్రిల్ ఆశ్రమ ప్రాంగణంలో అట్టహాసంగా జరిగింది.

సాయంత్రం 6 గం||లకు ప్రారంభమైన కార్యక్రమాన్ని తిలకించడానికి భాగ్యనగర్ నలుమూలల నుండి అనేక మంది పురప్రముఖులు వచ్చారు.

వైదేహి ఆశ్రమము ప్రారంభమయ్యి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా  కార్యక్రమంగా జరిగిన ఈ కార్యక్రమములో మహిళలు విశేషంగా పాల్గొన్నారు. వేదికనలంకరించిన విశిష్ట అతిథులు అందరూ మహిళలు కావడం ఒక విశేషం.

కార్యక్రమంలో శ్రీమతి. M. బాలాలత గారు IAS (డిప్యూటి డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, హానరరీ డైరెక్టర్ సి.యస్.బి. అకాడమి) , శ్రీమతి. భగవతి మహేష్ బల్ దేవా గారు (ఇండిపెండెంట్ డైరెక్టర్ యన్.యమ్.డి.సి. లిమిటెడ్.), కుమారి నైనా జైస్వాల్ గారు(ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మరియు టెన్నిస్ ప్లేయర్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్), యోగాగురు డా|| అరుణాదేవి గారు (అరుణ యోగ – యోగ ట్రైనింగ్ మరియు రీసర్చ్ ఇన్స్టిట్యూట్), డా|| బి. పారిజాత రెడ్డి గారు (ఫౌండర్ డైరెక్టర్ మహాద్యుతి నృత్యాలయం) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.


రాష్ట్ర సేవికా సమితి ప్రముఖ సంచాలిక వి. శాంతా కుమారి గారు ప్రేరణాత్మకమైన సందేశాన్ని అందించారు.

శ్రీమతి భగవతి గారు మాట్లాడుతూ, రామాయణం యొక్క గొప్పతనం గురించి చెప్పి ఆశ్రమ విద్యార్థినులకు సీతా దేవిని ఆదర్శంగా తీసుకొని జీవించాలని చెప్పారు.

ఆశ్రమ బాలికల ద్వారా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించబడ్డాయి. నృత్య రూపకం, జిజియా బాయి ఏకపాత్రాభినయం, దేశభక్తి ఉట్టిపడే గీతాలు, కోలాటం ప్రదర్శనలు ప్రేక్షకులను కట్టిపడేసాయి. బాలికల ద్వారా కరాటే ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.

కుమారి నైనా జైస్వాల్ తన ప్రసంగం ద్వారా ఆశ్రమ బాలికలలో ఎంతో స్ఫూర్తిని నింపారు.

రాష్ట్ర సేవికా సమితి ప్రధాన సంచాలిక శాంతా కుమారి గారు తమ సందేశంలో వైదేహి సేవా సమితి నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. వైదేహి ఆశ్రమ ప్రకల్పము 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవాలు జరుపుకుంటున్నందుకు అభినందనలు తెలిపారు. “ఎందరో కార్యకర్తలు మరియు వైదేహి సేవా సమితి సభ్యుల సమర్పణ కారణంగానే ఈ ఆశ్రమము నిరంతరముగా, సఫలంగా నడపబడుతున్నది మరియు బాలికలకు సరైన సంస్కారాలు అందుతున్నాయి. బాలికల ద్వారా చేయబడిన ప్రదర్శనలు వారి సర్వాంగీణ ఉన్నతికి జరుగుతున్న ప్రయత్నాన్ని సూచిస్తున్నాయి” అన్నారు.


వారు సీతాదేవి గొప్పతనాన్ని వివరిస్తూ, “సీతకు మరొక పేరు వైదేహి. సీతా మాత జీవితం మొత్తం తన కర్తవ్యం నిర్వర్తించడానికి పాటుపడ్డారు. పతివ్రతా ధర్మాన్ని కాపాడటం కోసం ఎన్నో కష్టాలను అనుభవించారు. అలాగే ఆత్మవిశ్వాసం ఉన్న కారణంగా వారు తమ శక్తితో స్వయం రక్షణ చేసుకున్నారు. ఆత్మా స్థైర్యాన్ని కోల్పోలేదు. సమాజం కోసం అగ్ని పరీక్షను కూడా ఎదుర్కొనాల్సి వచ్చింది. ఆశ్రమ బాలికలు సీతాదేవిని ఆదర్శంగా తీసుకొని జీవించాలి” అని సూచించారు.

అదేవిధంగా “స్వామీ వివేకానంద చెప్పినట్టుగా అందరూ తమ జీవితంలో ఒక సంకల్పం తీసుకొని దాన్ని పూర్తి చేయడానికి 5-D (Direction, Dedication, Determination, Discipline and Deadline) ఆవశ్యకం. ఈ ఐదు ‘డి’ లు ఉంటే ఏదైనా సాధించవచ్చు” అని సంకల్ప సిద్ధి కి సూత్రాన్ని చెప్పారు.

మన దేశ వెయిట్ లిఫ్టర్ మీరా బాయి చాను గురించి ప్రేరణా దాయకమైన ఉదాహరణ ఒకటి చెప్పారు.

“మీరా బాయి చాను ఏ దేశానికి వెళ్ళినా స్వదేశం నుండి తీసుకెళ్ళిన బియ్యంతో చేసిన అన్నాన్నే తింటుంది. ఎందుకు అని అడిగితే ‘మనం తినే ఆహారం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది అని మా గురువులు, పెద్దలు చెప్తారు. కాబట్టి నేను నా దేశ ఆహారం తినడం వల్ల నాకు ఎల్లప్పుడూ నా దేశం గురించే ఆలోచన కలుగుతుంది.’ అని సమాధానం చెబుతుంది. అలాగే ఎక్కడికి వెళ్ళినా తన మాతృభూమి మట్టిని ఒక సంచిలో తీసుకొని వెళ్తుంది.”

ఆశ్రమ బాలికలు కూడా తమ జీవితంలో ఎంతో గొప్పవాళ్ళు కావాలని, సమాజం మరియు దేశం పట్ల తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఆశిస్తూ తమ అమూల్య సందేశాన్ని ముగించారు.

తర్వాత ఆశ్రమ బాలికల ద్వారా మరికొన్ని సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి.

కార్యక్రమం ఫోటోలు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here