Home Telugu Articles విద్యాబోధనలో నూతన మార్పుకు శ్రీకారం చుట్టిన వందేమాతరం  ఫౌండషన్

విద్యాబోధనలో నూతన మార్పుకు శ్రీకారం చుట్టిన వందేమాతరం  ఫౌండషన్

0
SHARE

ఒక ఎకరం భూమి…
అదీ.. ప్రధాన రహదారి పక్కనే ఉండి మంచి ధరను పలుకుతుంటే ఏం చేస్తారు…
మా లెక్క ప్రకారమైతే ఓ వెంచర్‌ వేసి అమ్మేస్తాం…
అని చాలా మంది చెబుతారు కదా…
కానీ ఆయన లెక్కలు వేరు. అవన్నీ ఓ సమున్నత లక్ష్యంతో ముడిపడినవి.
విద్యా బోధనలో నూతన ఒరవడి తీసుకురావాలన్న సంకల్పంతో ఆయన కోట్ల విలువైన స్థలాన్ని ధారాదత్తం చేశారు.
తన నెలవారీ సంపాదనలో కూడా వాటాను ఇచ్చేశారు…

25 ఏళ్ల వయసు….
నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన యడ్మ మాధవరెడ్డి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. వారసత్వంగా తన వాటాగా వచ్చిన 25 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూనే మిత్రులతో కలిసి వ్యాపారం ప్రారంభించారు. దేనికీ లోటులేని హాయైన జీవితం. చాలామంది ఇంతటితో ఆగిపోతారు. కానీ మాధవరెడ్డి మనసులో మాత్రం నాటుకున్న ఆలోచనలు కలుక్కుమంటూనే ఉన్నాయి.
పిల్లలు బడికెళ్లడానికి ఎందుకు ఇష్టపడరు? ఆటలవైపే ఎందుకు మొగ్గుచూపుతారు?
తాను కూడా చిన్నప్పుడు చాలా మంది పిల్లల్లాగే గణితం అంటే వణికిపోయేవాడు. లెక్కల గోల ఉండకూడదనే ఎల్‌ఎల్‌బీ చేశారు. కానీ ఇంత ముఖ్యమైన సబ్జెక్టుపై పట్టుసాధించలేకపోవడానికి కారణం ఏంటి? క్లిష్టమైన సబ్జెక్టులను తేలిగ్గా, మనసుకు హత్తుకునేలా బోధన ఎలా జరగాలి? అన్న ప్రశ్నలు  అతన్నెప్పుడూ వేధిస్తూనే ఉండేవి. విద్యార్థులు తరగతి గదికి హుషారుగా రావాలి.. గణితం వంటి సబ్జెక్టులపై  భయం పోవాలి.. ఎలా..? ఎలా..? ఎన్నో సమావేశాల్లో పాల్గొన్నారు. విశ్లేషణలకు హాజరయ్యారు. ఈ క్రమంలో.. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో రవీందర్‌ అనే వ్యక్తి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని తెలిసింది. అక్కడికి వెళ్లారు.. బోధన తీరుపై అక్కడి నిర్వాహకులతో చర్చించారు.. విద్యార్థులతో మాట్లాడారు. ఓ అవగాహనకు వచ్చారు.. కల్వకుర్తికి వచ్చి తన పదో తరగతి పూర్వ విద్యార్థులతో 2006, సెప్టెంబరు 5వ తేదీన సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు తరగతి గది, గణితం అంటే భయాన్ని తొలగిస్తూ వారి ఉజ్వల భవితకు బాట వేయడానికి చేపట్టదలచిన కార్యాచరణను రూపొందించారు. వందేమాతరం ఫౌండేషన్‌ స్థాపించారు.  సాధారణంగా ఒక సగటు ఉపాధ్యాయుడు తన వృత్తి జీవితంలో 10,000 మంది విద్యార్థులను తీర్చిదిద్దగలుగుతాడు. అదే… ఆ ఉపాధ్యాయులకే మరింతగా శిక్షణ ఇచ్చేందుకు వనరులు కల్పిస్తే.. ఆ బృహత్కార్యానికి అండదండగా నిలిస్తే.. విద్యార్థులను మరింత మెరికలుగా మార్చొచ్చు. విద్యార్థులను అన్ని అంశాల్లో రాటుదేలేలా చేయొచ్చు. దీనికోసం ప్రత్యేక ప్రణాళికలు, ప్రభావవంతమైన బోధనాశైలి అవసరం. ఈ లక్ష్యాలనే వందేమాతరం ఫౌండేషన్‌ నెరవేరుస్తుంది. ఇందులో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా శిక్షణనిస్తారు.

35 ఏళ్ల వయసు….

‘వ్యక్తిగతంగా నా సగటు జీవితకాలం 70 సంవత్సరాలైతే.. అందులో సగం గడిచిపోయింది. నేను, నా కుటుంబం జీవించడానికి సంపాదించింది చాలు’ అనుకున్నారు మాధవరెడ్డి.  ఇక సమాజానికి తనవంతుగా వెచ్చించాలనుకున్నారు. వ్యాపారం, వ్యవసాయంలో వచ్చే ఆదాయంలో సగ భాగాన్ని సమాజం కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. తల్లి, భార్య, కూతురును కూర్చోబెట్టి తన ఆలోచనను చెప్పారు. వారూ సంతోషంగా సమ్మతించారు. ఆయనకు వారసత్వంగా కల్వకుర్తి- కోదాడ ప్రధాన రహదారిపక్కన 25 ఎకరాల భూమి వచ్చింది. అందులో సగం 12.20 ఎకరాల భూమిని కూతురు ‘మేధ’ పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. మిగిలిన సగం ఎకరాల భూమిని 2015లో అక్షరవనం పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆ సమయంలో అక్కడ ఎకరం భూమి ధర రూ. 50 లక్షల నుంచి రూ. 60 లక్షలు. ఇప్పుడైతే అక్కడ ఎకరం  కోటి రూపాయల పైమాటే. ‘కోట్లాది రూపాయల ధర పలుకుతున్న విలువైన భూమిని ఇలాగేనా వాడేది’… బంధుమిత్రులు చెప్పడానికి ప్రయత్నించారు. కానీ మాధవ్‌ సంకల్పంలో మాత్రం ఎలాంటి మార్పులేదు. ‘వందేమాతరం’ విస్తరణలో భాగంగా ఆ భూమిలో అక్షర వనానికి శ్రీకారం చుట్టారు. ప్రతి వ్యక్తి వికాసానికి ‘అక్షరం’, పర్యావరణ పరిరక్షణకు ‘వనం’  ఎంతో అవసరం. దీన్ని మనసులో ఉంచుకొని.. తన స్థలంలో అక్షరాలు అనే వనాలను పెంచాలన్న ఉద్దేశంతో దానికి ‘అక్షర వనం’ అని నామకరణం చేశారు. అందులో రూ.2 కోట్ల సొంత సొమ్ముతో తరగతి గదులు, ఇతర భవనాల నిర్మాణాలను చేపట్టారు. ఆయనకు మరికొన్ని మంచి మనసులు తోడయ్యాయి. మాధవరెడ్డి ఆశయాన్ని తెలుసుకున్న రేఖారెడ్డి అనే ప్రవాస భారతీయురాలు భవన నిర్మాణానికి రూ. కోటిని విరాళంగా ఇచ్చి ప్రోత్సహించారు. మాధవరెడ్డి మిత్రులు మరో రూ. కోటి, ఆమనగల్లుకు చెందిన లీలాలక్ష్మారెడ్డి గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ. 25 లక్షలను అందజేశారు. ఇలా.. సుమారు రూ. 5 కోట్లతో భవనాలు, విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్లు, ఫర్నిచర్‌, ఇతర వసతులు సమకూరాయి. వ్యవసాయం, వ్యాపారంలో మాధవరెడ్డికి  ప్రతి నెలా రూ. 3 లక్షల ఆదాయం వస్తుంది. అందులోంచి రూ. 1.50 లక్షలను ప్రతి నెలా అక్షర వనం నిర్వహణకు కేటాయిస్తున్నారు. ఆర్థికంగా లోటు లేకపోవడంతో అక్షరవనంలో విద్యాకుసుమాలు విరబూయడం మొదలుపెట్టాయి.

అక్కడే వందేమాతరం…
2016లో వందేమాతరం శిక్షణ కార్యక్రమాలను ‘అక్షర వనం’లోకి మార్చారు. ప్రస్తుతం అక్షరవనంలోనే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, విద్యార్థులకు గణితం, ఇతర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ప్రతి వేసవి సెలవుల్లో రెండున్నర నెలలు, దసరా సెలవుల్లో 10 రోజుల పాటు అక్షరవనంలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు గణితంపై, ప్రత్యేకంగా విద్యార్థులకు కళలు, సాంస్కృతిక అంశాలపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. వసతి, భోజన సదుపాయాన్నీ వందేమాతరం ఫౌండేషన్‌ ఉచితంగా కల్పిస్తుంది. శిక్షణ అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు గణితంలో మెలకువలను నేర్పుతూ బోధిస్తారు.

దేశమంతా… 10 లక్షల మంది!
మాధవ్‌ సంకల్పం దేశవ్యాప్తంగా ఫలిస్తోంది. వందేమాతరం ఫౌండేషన్‌ ప్రత్యేకంగా రూపొందించి అమలుచేస్తున్న బోధనతీరు తెలంగాణ రాష్ట్ర శిక్షణ పరిశోధన విద్యామండలి (ఎస్‌సీఈఆర్‌టీ) పరిశీలించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేయడానికి అనుమతినిచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని 100 గురుకుల విద్యాలయాల్లో వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు, తరగతులు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 10 జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ తరగతులు జరుగుతున్నాయి. గత మార్చి నుంచి మే నెల వరకు మూడు నెలలపాటు జమ్ముకశ్మీర్‌లోని బడ్‌గాం, శ్రీనగర్‌ జిల్లాల్లోగల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన 1200 మంది విద్యార్థులకు ఫౌండేషన్‌ సభ్యులు, కో- ఆర్డినేటర్లు గణితం బోధించి వచ్చారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ ప్రాంతంలో ఉన్న 100 ప్రభుత్వ పాఠశాలల్లో 10,000 మంది నైపుణ్యాలను పెంపొందించారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని మథురలో 50 ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఫౌండేషన్‌ తరఫున 2006 నుంచి వివిధ రాష్ట్రాల్లో సుమారు 10 లక్షల మందికి పైగా విద్యార్థులకు గణితాన్ని కొత్త పద్ధతిలో నేర్పారు. దీనికోసం ఏకంగా 5,000 మంది సైన్యాన్నే తయారు చేశారు. వీరు ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడికంటే అక్కడికి ఉత్సాహంగా వెళ్లి తరగతి గది అంటే విద్యార్థుల్లో గూడుకట్టుకొన్న భయాన్ని తొలగించి వస్తారు.

సౌజన్యం: ఏలేటి ప్రభాకర్‌రెడ్డి, ఈనాడు, మహబూబ్‌నగర్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here