Home Telugu Articles విచారణ లేకుండానే గ్రామస్థులు జైలుకు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-20)

విచారణ లేకుండానే గ్రామస్థులు జైలుకు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-20)

0
SHARE

ముఠా తమతోబాటు డ్బుభైమంది ఖైదీలను హైదరాబాద్ తీసుకెళ్ళిపోయింది. వెంట మరో రెండు ట్రక్కుల్లో పోలీసుల, రజాకార్ల శవాలతోపాటు కొలిపాక, ఆలేరుల గుండా ఈ ముఠా వెళ్ళిపోయిందని గ్రామస్థుల కథనం. విచారణ లేకుండానే ఆ డైబ్భై మంది గ్రామస్థులను చంచలగూడా జైల్లో తోసివేశారు. రెండు నెలల తర్వాత వాళ్ళలో సగంమందిని వదిలిపెట్టినా మిగతా వాళ్ళను మాత్రం పోలీసుచర్య జరిగేవరకు జైల్లో ఉంచారు.

రేణుగుంటపై పోలీసులు, రజాకార్లు దాడి జరిపి రామిరెడ్డిని హత్యచేసిన తర్వాత ఆనాటి హైద్రాబాద్ రేడియో ఈ వార్తను ప్రసారం చేసింది. “రేణుగుంటలో జరిగిన పోరాటంలో ఎనభైమంది కమ్యూనిస్టులు, ఆ దళం నాయకుడు రామిరెడ్డి హతమయ్యాడు. ప్రభుత్వ దళానికి ఏమీ నష్టం వాటిల్లలేదు. కొందరు మాత్రం గాయపడ్డారు”. ఆనాటి వార్తాపత్రిక ఒకటి ప్రభుత్వ దళంలో దాదాపు 118 మంది మరణించారని ప్రకటించింది.

ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు చింతలపూడి రామిరెడ్డిని ఈనాడు కూడా నల్లగొండ జిల్లాలో ప్రజలు తలుచుకుంటూ ఉంటారు. ఆయన అనుచరుడు మొహమ్మద్ యాకూబ్ ఆలీ ఆనాటి పోరాటం వర్ణిస్తూ ఇలా అన్నాడు. “జిల్లా మొత్తంలోనే ఆయన మహా నాయకుడు. చరిత్రలో ఆయన పేరు చెరగని విధంగా ఉండిపోతుంది. అలాంటి వీరుడు మళ్ళీ కనపడడు”.

అమరవీరుడు షోయీబ్
1947లో అక్టోబరు మాసం ముగియవస్తున్నది. వానాకాలాన్ని వెనుకకులాగి చలి తెర తొలగించుకొని వచ్చే ప్రయత్నంలో ఉంది. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో “రయ్యత్‌” పత్రికా కార్యాలయంలో యువకుడైన షోయీబ్ ఉల్లాఖాన్ నిలబడి విలపిస్తున్నాడు. ‘రయ్యత్’ సంపాదకుడైన శ్రీ ముందుముల నర్సింగరావు  ఆ యువకున్ని ఓదార్చుతున్నాడు.  ఏదైనా కౌటుంబికమైన దుర్ఘటన జరిగిందా! అనే అనుమానం సహజంగానే కలుగుతుంది. కానీ అసలు సంఘటన గురించి వింటే ఆశ్చర్యంగానే ఉంటుంది.

నిజాం హయాంలో స్వతంత్ర అభిప్రాయాలతో వెలువడుతూ వచ్చిన “రయ్యత్‌” పత్రిక ఇకముందురాదు. నిజాం ప్రభుత్వం ఆ పత్రికను నిషేధించింది.  ఆ రోజే గూఢచార విభాగం అధికారి ఫజల్ రసూల్‌ఖాన్ పత్రికా కార్యాలయానికి వచ్చి నిషేధాజ్ఞలను అందచేశాడు. తత్ఫలితంగా దినపత్రిక “రయ్యత్‌” మరుసటి రోజు నుండి వచ్చే అవకాశం లేదు. అందువల్ల ఉపసంపాదకుడైన షోయీబ్ ఉల్లాఖాన్ కన్నీరు కారుస్తున్నాడు. ఆ ఉర్దూ పత్రికా కార్యాలయంలో హిందూ, ముస్లిం ఉద్యోగులంతా కంట తడిపెట్టారు. స్వతంత్ర అభిప్రాయాలతో ప్రజల అభిమానాన్ని చూరగొన్న సంపాదకుడు శ్రీ ముందుముల నర్సింగరావు నిరంకుశాధికారుల ఆంక్షలను శిరసావహించవలసి వచ్చింది.

సంవత్సరం క్రితం “రయ్యత్‌”లో చేరిన ఉప సంపాదకుడు షోయీబ్ మాత్రం తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. సంపాదకుడి కంటే ఎక్కువగా బాధపడుతున్నాడు. ఆధ్యాత్మిక దృక్కోణంలో జీవితాన్ని గడిపే సంపాదకుడు “కర్మణ్యేవాధికారస్తే” అనే విశ్వాసానికనుగుణంగా ఆంక్షను ఉపేక్షా వైఖరితో స్వీకరించాడు. కానీ షోయీబ్ మాత్రం తన భావావేశాన్ని ఆపుకోలేక పోయాడు. తన తల్లి లాంటి స్వతంత్ర దినపత్రిక నిషేధానికి గురికాగానే షోయీబ్ విపరీతమైన బాధకు లోనయ్యాడు. ప్రభుత్వం విధించిన అక్రమమైన ఆంక్షలపట్ల కోపం వచ్చింది. స్వతంత్రమైన పత్రికా రచనను హృదయపూర్వకంగా సమర్థించిన షోయీబ్‌కు నచ్చచెప్పాలనే ప్రయత్నంతో రచనను హృదయపూర్వకంగా సమర్థించిన షోయీబ్‌కు నచ్చచెప్పాలనే ప్రయత్నంతో నర్సింగరావు గారు ఇలా అన్నారు.

“నువ్వు కొంచెం నావైపు చూసి ఆలోచించు. సంపాదకుడిగా నీకంటే నేను ఎక్కువగా విలపించాలి. కానీ ఒక విధంగా సంతోషిస్తున్నాను. నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తూ వచ్చాను. బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలని ఈ సంస్థానంలో పౌరహక్కులు పునరుద్ధరించబడాలని నిజాయితితో పత్రిక ద్వారా కృషి చేశాను. ప్రజలు హృదయపూర్వకంగా పాల్గొనకపోతే ఏ రాజకీయమైన సంస్కరణ కూడా సాధ్యం కాదు. హైద్రాబాద్ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనం కావాలని విస్పష్టంగా ఎలుగెత్తి ప్రకటించాను. ప్రజలను మేల్కొల్పి ఈ వాస్తవాన్ని గమనించమన్నాను. ఈనాటికే నిజాం ప్రభుత్వం ప్రజలవల్ల ప్రమాదమున్నదని గ్రహించింది.

Source: Vijaya Kranti

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here