Home Telugu Articles ఓట్ల కోసమే మైనారిటీలకు తాయిలాలు!

ఓట్ల కోసమే మైనారిటీలకు తాయిలాలు!

0
SHARE

సోనియా కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతో మైనారిటీల సంక్షేమం పేరిట జాతి విచ్ఛిన్నకర పథకాలను చేపడుతున్నాయి. తెలంగాణలో తెరాస, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఓవైసీల మజ్లిస్‌తో పోటీ పడి- ‘600 ఏళ్లు హిందువులను పీడించి, వారి భాషలకు, ఆర్థిక స్థోమతకు ఘోరమైన నష్టం కలిగించిన’ ముస్లింలకు ప్రభుత్వోద్యోగాలలో, విద్యాసంస్థలలో 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించడం సరికాదు. ఇటువంటి మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం చెల్లవని సుప్రీం కోర్టు తీర్పు చెప్పినా, తిరిగి తిరిగి ఏదో ఒకవిధంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఆ మతస్థులను వెనుకబడిన వారిగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నాయి.

క్రైస్తవుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్’ను సృష్టించారు. అంతవరకూ ఉన్న ఎపి స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ముస్లింలకై ప్రత్యేకించారు. వైఎస్ పాలనా సమయంలో క్రైస్తవుల తీర్థయాత్రలకు ఒక్కొక్కరికి పాతికవేల రూపాయలు ఇవ్వడం, ప్రభుత్వ సొమ్మును క్రిస్టియన్లకై ఉద్దేశించిన కార్పొరేషన్ ద్వారా చర్చిలు కట్టడానికి ఉపయోగించడం ప్రారంభించారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా మసీదులు, చర్చిల మరమ్మతులకు, నవీకరణకు ప్రభుత్వ సొమ్మును వినియోగించింది. ముస్లింలకై ఉర్దూ ఘర్‌లు, షాదీఖానాలు, హజ్ హౌస్‌లు కట్టారు. వీటన్నింటికీ కావలసిన సొమ్మును ప్రభుత్వ ఖజానా నుంచి ధారాళంగా వెచ్చించారు. కానీ, హిందువుల కోసం ఇటువంటి చర్యలు చేపట్టలేదు. దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు హిందూ భక్తులు దేవాలయాలకు ఇచ్చిన కానుకల రూపంలోని సొమ్ముతోనే కొన్ని కల్యాణ మండపాలు నిర్మించారు. కానీ- పన్నులతో సేకరించిన ప్రభుత్వ ఖజనా సొమ్ముతో కాదు. ఈ విధంగా ముస్లింలకు, క్రైస్తవులకు మాత్రమే వారి మతపరమైన ప్రయోజనాలకు ప్రభుత్వ ధనాన్ని వినియోగించడం రాజ్యాంగ విరుద్ధం. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఫలితంగా- ఇటువంటి పనులు చేయకూడదని హైకోర్టు తీర్పు ఇచ్చినా, సుప్రీం కోర్టు నుంచి ‘స్టే’ తెప్పించుకుని రాజ్యాంగ వ్యతిరేక, హిందూ వ్యతిరేక ఖర్చును మైనారిటీల ఓట్ల కోసం ఎటువంటి పని చేయడానికైనా కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు పోటీపడడం చాలాకాలంగా జరుగుతోంది. హిందువులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలను సహించడం ఆత్మహనన సదృశమే. హిందువులు వౌనం వీడనందునే దేశంలో మత మార్పిడులు, వంచనా కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

గత ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవుల వేడుకల్లో పాల్గొని, వారి మన్ననలను, ఓట్లను సంపాదించే ప్రక్రియగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పలు తాయిలాలు ప్రకటించారు. జెరూసెలం తీర్థయాత్రకు వెళ్లే ప్రతి క్రైస్తవుడికి దానం చేస్తున్న మొత్తాన్ని రెండింతలుగా 40,000 వేల రూపాయలను, చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న సొమ్మును మూడు రెట్లకు పెంచుతున్నామని, క్రైస్తవుల సంక్షేమానికి 13 కోట్ల రూపాయలను, 344 కోట్ల ఖర్చుతో ‘చంద్రన్న కానుక’లను క్రైస్తవులకు ఇచ్చామని ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది.

మైనారిటీ వర్గాల కోసం ఇంతగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం- మూతపడిన, శిథిలమవుతున్న హిందూ ఆలయాలను మాత్రం పట్టించుకోదు. ముస్లింల మక్కా తీర్థయాత్రకు, హజ్‌హౌస్‌లకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 1,400 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. క్రైస్తవుల చర్చిలకు, తీర్థయాత్రలకు, వారి ప్రత్యేక సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రజాధనాన్ని ఖర్చు చేయడం పరిపాటైంది. పన్నుల ద్వారా సమకూరే నిధులు 98 శాతం వరకూ హిందువుల నుంచే వస్తున్నా, హిందూ దేవాలయాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. వారు తమ ఆలయాలకు కానుకల రూపంలో ఇచ్చే సొమ్మును కూడా ఏలినవారి శోభ కోసం ఆలయాలను పడగొట్టయినా ఖర్చు చేస్తున్నారు. మైనారిటీల తీర్థయాత్రలకు, హజ్‌హౌస్‌లకు నిధులు వెచ్చిస్తున్నారు కానీ, హిందువుల అమర్‌నాథ్, మానసరోవర్, కాశీయాత్రలకు ఎలాంటి సహాయం చేయడం లేదు. ఆర్థిక లోటుతో బాధ పడుతున్నామని చెబుతూనే, కేంద్రం సహాయం చేయడం లేదని ఎత్తిపొడుస్తూనే- ఉర్దూ యూనివర్సిటీలను స్థాపిస్తున్నారు. మసీదులు, చర్చిల నిర్మాణాలకు కోట్లకొద్దీ నిధులను కుమ్మరిస్తున్నారు. ఇలా ఖర్చు పెడుతున్నామని నేతలు బాహాటంగా చెబుతున్నా- హిందువులు వౌనంగా ఉండడం వారి పతనానికి, మతాంతీకరణకు దారి తీస్తున్నాయి. హిందువులు కులాలుగా విభజించబడి పరస్పర ద్వేషంతో బలహీనపరచబడుతున్నారు. కులాల వారీగా సంక్షేమ కార్పొరేషన్లను ఏర్పరచడం ద్వారా హిందువులమనే స్పృహ కాక, కులస్థులమనే భావన పెరుగుతోంది. హిందువులు కులాల వారీగా విభజించబడడంతో, మైనారిటీ ఓట్ల సమీకరణతో హిందూ వ్యతిరేకుల పాలన సాగడానికి దారి సుగమం అవుతోంది.

కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల పాలకులు ప్రభుత్వ సొమ్మును వినియోగించి మైనారిటీలను బుజ్జగించడాన్ని ‘భారతీయ ధర్మరక్షణ సమాఖ్య’ తీవ్రంగా నిరసిస్తోంది. మైనారిటీలను బుజ్జగించేందుకు ప్రభుత్వాలు ప్రజాధనాన్ని ఖర్చు చేయడాన్ని ఖండించాలని, హిందువులు చెల్లించే పన్నులను ఇతర మతస్థుల ప్రాబల్యం పెంచేందుకు వినియోగించడాన్ని ముక్తకంఠంతో నిరసించాలని హిందూ ధార్మిక సంస్థలకు, మేధావులకు, హిందూ ప్రజానీకానికి ‘భారతీయ ధర్మరక్షణ సమాఖ్య’ విజ్ఞప్తి చేస్తోంది. హిందువులంతా ఇకనైనా మేల్కొని, తమ సొమ్మును ఇలా మైనారిటీల వైభోగానికి ధారపోయరాదని ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి.

త్రిపురనేని హనుమాన్ చౌదరి

(ఆంధ్రభూమి సౌజన్యం తో)