Home RSS సవాళ్లను ఎదుర్కోవాలి – మాధవ సదాశివ గోళ్వల్కర్

సవాళ్లను ఎదుర్కోవాలి – మాధవ సదాశివ గోళ్వల్కర్

0
SHARE

ఏ విధంగా చూచినా, ప్రస్తుత పరిస్థితి మనకొక సవాలు. సదవకాశం కూడా. జాతీయజీవనంలోని అన్ని రంగాల్లోనూ, స్వయంసమృద్ధిని సాధించు కోవటమే మనం ఎదుర్కోవలసిన ముఖ్యమైన సవాలు.

స్వావలంబనమే స్వాతంత్య్రానికి వెన్నెముక
సమృద్ధి, స్వాతంత్య్రాలు కావాలంటే జాతికి స్వావలంబనమే వెన్నెముక అనే మహత్తర సత్యం మనకు నేడు స్పష్టమైనంతగా ఏనాడూ కాలేదు. మనం ఆత్మనిర్భరతను సాధించుకోవలసిన ప్రప్రథమ రంగం రక్షణ. మన యుద్ధశక్తిని మనమే నిర్మించు కోవాలి; విదేశీ సహాయంపై ఆధారపడడం మానేయాలి. పారిశ్రామికవేత్తలు, శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులు- అందరికీ ప్రభుత్వం పిలుపు నిచ్చి, వారందరి సహకారంతో అతి త్వరలో శత్రువుల ఆయుధాల కన్న మిన్న అయిన వాటిని తయారుచేసుకోవాలి. సామ్యవాద చైనా వద్ద అణ్వాయుధం ఉన్నందున, మనం కూడా వాటిని తప్పనిసరిగా తయారుచేసుకోవలసిన అవసరం ఉంది. అణ్వాయుధం ఒక్కటే ప్రజల్లోను, సైన్యంలోను ‘అంతిమ విజయం మనదే’ అనే ఆశను వెలిగించ గలదు. సిద్ధాంత రాద్ధాంతాలు దీనికి ప్రతిబంధకం కారాదు.

ప్రతి కార్మికుడు, శాస్త్రజ్ఞుడు
అంతేకాదు, మనమంతా (రైతులు, కార్మికులు, పారిశ్రామికులు, ఇతర రంగాల్లో పనిచేసే వారందరూ) అత్యవసర వస్తువులన్నిటి ఉత్పత్తిని అధికం చేసేందుకు దృఢసంకల్పంతో కృషిచెయ్యాలి. తిండికి కూడా ఇతర దేశాలపై ఆధారపడే నేటి దుస్థితి నుంచి బయటపడాలి. ప్రతి పరిశ్రమ, ప్రతి వ్యవసాయ క్షేత్రం అత్యధిక ఉత్పత్తిని సాధించాలి. అత్యవసర వస్తువుల విషయంలో కొరత ఏ మాత్రం ఉండకూడదు.

ముఖ్యంగా శాస్త్రజ్ఞులకు యుద్ధం ఒక పెద్ద సవాలు. శాస్త్రజ్ఞులు సృష్టించిన నూతన సాధనాల్లో గొప్పవి చాలావరకు యుద్ధ కాలాల్లో కనిపెట్టినవే. ‘నవ సృజనకు నవసరంబు నాంది పలుకు’ అంటారు. బ్రిటన్‌ రాడార్‌ కనుగొన్నదీ, అణు విశ్లేషణ జరిపినదీ రెండవ ప్రపంచ యుద్ధకాలంలోనే. మేధాశక్తిలో గాని, సృజనాత్మక శక్తిలోగాని మన శాస్త్రజ్ఞులు ప్రపంచంలో ఎవ్వరికీ తీసిపోరు. పరిస్థితుల సవాలును వారు స్వీకరించి, అటువంటి పరిశోధనలు చేసి, కొత్త విశేషాలను కనిపెట్టాలి. ఈ వార్త విన్నంతనే శత్రువుల గుండెలు దిగజారి పోవాలి. శాంతి సమయంలో వాటినే జాతీయాభి వృద్ధికి మలచుకోవచ్చును.

ధన వ్యామోహాన్ని ఛేదించండి
ఉదాహరణకు సారవంతమైన లక్షలాది ఎకరాల్లో వాణిజ్యపంటలు పండిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ల సంగతి చూడండి. గోధుమ వరి పండించ వలసిన మంచి భూముల్లో చెరకు పండిస్తున్నారు. ఫలితంగా ఒకప్పుడు గోధుమను విరివిగా ఎగుమతి చేసే ఉత్తరప్రదేశ్‌ నేడు పంజాబ్‌ మొదలైన ప్రాంతాల నుంచి గోధుమ దిగుమతి చేసుకోవలసి వస్తోంది. మహారాష్ట్రలో ద్రాక్షతోటలు పెంచటంలో (ముఖ్యంగా సారా తయారీ కోసం) పోటీ ఏర్పడింది. ఆంధ్రలో పొగాకు పంటను ప్రోత్సహించేందుకు పొగాకు అభివృద్ధి శాఖ ఒకటి ఏర్పాటయింది. వేరుసెనగ కూడా ఇట్లాంటిదే. ఈ ధోరణిని అరికట్టి ఆయా భూములను ఆహారధాన్యం ఉత్పత్తికి మళ్లీ వినియోగించాలి. మనం దిగుమతే చేసుకోవలసి వస్తే, గోధుమకు బదులు పంచదారనే దిగుమతి చేసుకుందాం. ఈనాటివలె అత్యయిక పరిస్థితి ఏర్పడినప్పుడు పంచదార దిగుమతి ఆగిపోయినా పర్వాలేదు. పంచదార లేకపోతే చచ్చిపోం. బియ్యం, గోధుమల కొఱత ఏర్పడితే మాత్రం బ్రతకలేం. పి.యల్‌.480 కింద అమెరికా నుండి గోధుమల దిగుమతి కొరకు మన నాయకులు ఎట్లా పరుగులు పెడుతున్నారో మనకు తెలుసు. ఈ అప్పు చేయందే మనం బ్రతకలేమని వారి నమ్మకం.

అయితే వాణిజ్య పంటలను ఎందుకు పండిస్తారు? దైనందిన జీవితంలో డబ్బుకు అవసరమైన ప్రాధాన్యం ఇచ్చాం కనుకనే. డబ్బు కేవలం ఒక వినిమయ మాధ్యమం. ఒక సాధనం. దురదృష్టవశాత్తు అట్టి సాధనానికి ఊడిగం చేస్తున్నాం. ధన ప్రాధాన్యం గల దృష్టి మన జీవితంపై పెత్తనం చెలాయిస్తూ ఉంటే తమను, నగరవాసులను కూడా పోషించడానికి కావలసిన ఆహారధాన్యాలు గ్రామీ ణులు ఉత్పత్తి చేయాలని మనం ఎట్లా ఆశించగలం? ఆహారధాన్యాలు లేకపోతే బ్రతికేదెట్లా? డబ్బు తిని బ్రతకగలమా?

ఆహారధాన్యాల స్వయం సమృద్ధి జాతీయ రక్షణకు ‘తప్పనిసరి’ అనే భావన దేశ వ్యాప్తంగా మన రైతులందరి హృదయాల్లో హత్తుకుపోయేట్లు చేయాలి. ప్రజలందరినీ పోషించజాలినంతగా ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయటం, తమ పవిత్ర జాతీయ కర్తవ్యం అని వారు భావించేట్లు చేయాలి. తర్వాతే, కావాలనుకొంటే వాణిజ్యపంటలు పండించు కోవచ్చు. అత్యంత ప్రధానమైన ఈ రంగంలో స్వావలంబన సాధించగలిగే పద్ధతులను ప్రభుత్వమూ, ప్రజలూ రూపొందించుకోవాలి.

పరావలంబన తెచ్చిన పీడ
రోజులు గడుస్తున్న కొద్దీ స్వావలంబన ఎంత త్వరగా సాధించాలో మరింత స్పష్టమవుతోంది. ఒక ఉదాహరణ: మన దేశంలోని పంటలు నీరు లేక ఎండిపోతూ ఉంటే, ఉదారంగా కాలువ నీటిని పాకిస్తానుకు విడుదల చెయ్యాలి అనీ, ప్రతి ఒక పైసను రక్షణ నిమిత్తం పొదుపు చేయవలసిన సమయంలో కోట్లాది రూపాయలు పాకిస్తాన్‌కు చెల్లించాలనీ ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఆర్ధిక సహాయం కోసం మనం ఆధారపడిన ప్రపంచ బ్యాంకే మనపై ఈ ఒత్తిడి తెచ్చింది. ఈ ఒత్తిడికి మనం లొంగిపోయాం. బిచ్చగాళ్ళకు ఎంచుకొనే హక్కులేదు. ఋణగ్రస్తులూ అంతే. ఇది మన విషయంలో అక్షరాలా నిజమైంది. ఇన్నేండ్లుగా మన ఆర్థిక స్థితిని ఆత్మనిర్భరం చేసుకోవటంలో చూపిన అశ్రద్ధకు మనం చెల్లించిన వెల యిది. తిండి, డబ్బు-ఇంకా ప్రతిదీ అడుక్కుతినే అలవాటు పద్దెనిమిది సంవత్సరాలుగా ఏర్పడింది. అది మనలోని స్వయంకృషిని, మగటిమిని పూర్తిగా పిండిచేసి, మనల్ని కేవలం బానిసలుగా మార్చేసింది. బయటి ఒత్తిడులకు తట్టుకుని నిలబడి, ‘పాకిస్తాను దురాక్రమణదాహాన్ని ఇనుమడింపచేసేందుకు ఉపయోగ పడే ఒక్కపైస గాని, ఒక్క నీటి బొట్టుగాని దానికి ఇవ్వం’ అనడానికి మన నాయకులకు ఇది ఒక చక్కని అవకాశం. పాకిస్తాన్‌ మనపై దండయాత్ర చేసిన మరుక్షణమే కాలువ నీటి ఒప్పందం క్రింద మన హామీ అనేది ఏదైనా ఉండి ఉంటే అది తనంతట తానే రద్దయి పోయింది. కావాలని మనమీద దురాక్రమణ జరపటం వల్ల మనకు సంభవించిన నష్టాలన్నిటికీ పూర్తి పరిహారాన్నీ, దేశ విభజన నాటి నుండి గత పద్దెనిమిది సంవత్సరాల్లో జరిగిన వివిధ ఒప్పందాల కింద ఏర్పడిన బకాయిలన్నిటినీ పూర్తిగా చెల్లించమని మన నాయకులు పాకిస్తాన్‌ను అడిగి ఉండవలసింది. అట్టి దృఢ విధానం తొలిదశలో కొన్ని కష్టాలను కల్గించినప్పటికీ, ఆర్థికంగా స్వయంపోషకం కావటానికి జాతికి అవకాశం ఏర్పడేది. జాతీయ స్వాతంత్య్ర గౌరవాలను నిలబెట్టుకొనేందుకు అడ్డుదారులు లేవనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరు కునేందుకుగాను ప్రతి జాతి ఆత్మ నిర్భరత, ఆత్మ సమర్పణల కఠోర మార్గాన పయనించి తీరాలి.

మరువరాని నీతి
ఒక చిన్న నీతికథ ఉంది. ఒక పక్షి ఒక పంటచేలో గూడు కట్టుకుంది. కోతల సమయంలో కొడుకులతో రైతు అక్కడకు వచ్చి, పంటను చూచుకొని, కోత కోయటానికి సహాయం రమ్మని బంధువులకు కబురుపెట్టమని ఒక కొడుకుతో చెప్పాడు. ఈ మాటలు విని బెంబేలు పడిపోయి పక్షిపిల్లలు సాయంత్రం గూటికి చేరిన తల్లితో ‘అమ్మా! అమ్మాౖ! మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి’ అని అన్నాయి. తల్లి మాత్రం ‘అప్పుడే ఏం తొందరలేదు’ అని వాటితో చెప్పింది. రెండు రోజులైనా కోతలకెవ్వరూ రాలేదు. రైతు పొలానికి మళ్లీ వచ్చి, కూలీలకు కబురు పంపమని కొడుకులతో చెప్పాడు. ఈ మాట విన్న పిల్లలు, మళ్ళీ తల్లికి చెపితే, పక్షి ‘మీరేమీ కంగారు పడవద్ద’ంది. కానీ మూడోసారి పొలం అసామి కొడుకులతో, ‘మనతో ఎవరూ కలిసొచ్చేట్టు లేరు. రేపు పొద్దున్నే మనమే కోత మొదలు పెట్టేద్దాం’ అన్నాడు. ఈ మాటలు విన్న పక్షి పిల్లలు, ఆ విషయం తల్లికి చెప్పగానే ‘ఆ! ఇప్పుడు మనం తప్పక వెళ్లిపోవాలి. ఇప్పటిదాకా తన పని గురించి ఇతరులపై ఆధారపడ్డాడీ రైతు. కనుక పని మొదలు కావటమే కష్టం. ఇప్పుడు తానే వచ్చి పని మొదలు పెడతానంటున్నాడు కనుక, పని తప్పక ప్రారంభమవుతుంది’ అన్నది.

ఈ కథ వ్యక్తులకు గానీ, జాతులకు గానీ ఒక నీతిని బోధిస్తుంది. మిగతా సమయాల్లో కంటే, ఈ క్షణంలో ఈ నీతిని మనం తప్పక గుర్తుంచుకోవాలి.

ఉజ్జ్వల ఉదాహరణ
ఆచరణపూర్వకమైన ఇటువంటి దేశభక్తి భావన గురించి ప్రజలకు శిక్షణ ఇవ్వవలసి ఉంది. దేశ క్షేమం ఆశించినంత మాత్రాన చాలదు, జాతీయ సంక్షేమాన్ని గురించిన ఆకాంక్షలను మన ప్రవర్తనలో ఎంత ఉత్తమంగా వ్యక్తం చేయగలమనేది తెలుసు కోవాలి. జన్మతః ఏర్పడిన దేశభక్తిని ఏ విధంగా ఆచరణలో చూపాలో వివరిస్తుంది ఇంగ్లండులో ఈ ఉజ్జ్వల ఉదాహరణ.

మొదటి ప్రపంచ యుద్ధం చెలరేగగానే భారత్‌ వంటి దేశాల నుండి ఆహారపదార్థాలను దిగుమతి చేసుకోవటం ఇంగ్లండుకు కష్టమైపోయింది. ఆహారపదార్థాలను తీసుకుపోతున్న బ్రిటిష్‌ నౌకలను జర్మనీ ముంచి వేయసాగింది. యుద్ధ యోజన లన్నిటినీ దెబ్బతీసేంతగా పొట్టకూటి సమస్య ఏర్పడింది. అప్పుడు వారు సాగుచేయదగిన ప్రతి చిన్న ముక్కను సాగు కింద తేవటానికి బృహత్పథకం వేసుకొన్నారు. ఏ పంట ఎంత పండించ గలరో అంచనా వేసుకొని, తదనుగుణంగా వారు ఆహార రంగంలో క్రమబద్ధంగా ఒక సంవత్సరం తీవ్ర కృషి చేశారు. తత్ఫలితంగా వారు తమ కనీస అవసరాలు తీర్చుకునేందుకు తగినంత స్వయం సమృద్ధి సాధించుకు న్నారు. యుద్ధంవల్ల ఏర్పడే గడ్డు సమస్యల్లో ఒక ప్రముఖమైన దానికి వారా విధంగా తట్టుకొని నిలబడగలిగారు. తక్కువ శాతమే పంటభూమి కలిగిన ఇంగ్లండు ఈ అద్భుతాన్ని సాధంచ గలిగింది. దానితో పోల్చిచూస్తే మన దేశం ఎంత విశాలమయినది! ఎంత సారవంతమైనది! నిజానికి మన దేశం భూసారానికి పెట్టింది పేరు. ఐనప్పటికీ ప్రముఖమైన ఈ రంగంలో ఆత్మనిర్భరతను సాధించలేకపోతున్నాం. ఈ సవాలు నెదుర్కొనేందుకు జాతీయ సంకల్ప శక్తిని జాగృతం చేసి, నిర్మాణాత్మకమైన మార్గాల్లో అన్వయించు కోవాలి.

జాతి మనోబల నిర్మాణం
జాతి మనోబలాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచగల గటం అత్యంత ప్రముఖ సమస్య. ఎందు చేతనంటే రక్షణ, ఆహారం, పారిశ్రామిక ఉత్పత్తి మొదలైనవాటిలో స్వయంసమృద్ధిని, ఆత్మనిర్భరతను సాధించేందుకు అమలు చేసే పథకాల విజయం- తాత్కాలికాలూ, దీర్ఘకాలికాలూ కూడా – తమ నెత్తుటినీ, చెమటనూ, కన్నీటినీ ఏండ్ల తరబడి సమర్పించటానికి ప్రతి ఒక్కరినీ సంసిద్ధంగా ఉంచటం మీద పూర్తిగా ఆధారపడి ఉంది. తీవ్రమైన జాతీయ చైతన్యం మాత్రమే జాతిని జాగృతం చేయగలదు. కాబట్టి ఈనాడు వ్యక్తమైన మహత్తర జాతీయ మనోబలాన్ని నిలిపి ఉంచటానికి ప్రతి అంశంలోను జాగరూకు లమై ఉండటం అత్యంతావశ్యకం.

పాంచజన్య నుండి.

Source: Jagriti Weekly

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here