Home Telugu Articles 2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?

2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?

0
SHARE

— ప్రశాంత్ పోల్

17, యార్క్ రోడ్ లో ఉన్న ఇల్లు ఢిల్లీ ప్రజలకు మాత్రమే కాకుండా దేశం మొత్తానికి కేంద్రంగా మారిపోయింది. గత కొన్నేళ్లుగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆ నివాసంలో ఉంటున్నారు. ఇపుడు అదిభారత ప్రధానమంత్రి అధికార నివాసం కోసం కేటాయించబడింది. జవహర్‌లాల్ నెహ్రూ ఆగస్టు 15 నుండి స్వతంత్ర భారతదేశ ప్రధానిగా పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తారు, కాబట్టి `నియమించబడ్డ’ అనే పదం పోవడానికి 13 రోజులు మాత్రమే ఉంది.

17, యార్క్ రోడ్ వద్ద అధికారుల, పౌరుల సందర్శనలు మరింత ఎక్కువయ్యాయి. వాస్తవానికి, యార్క్ రోడ్ ఒక ముఖ్యమైన రహదారి. 1911 లో బెంగాల్‌లో అశాంతి కారణంగా బ్రిటిష్ వారు కలకత్తా నుండి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు, వారు ఢిల్లీ నగర రూపకల్పన పనిని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియెన్స్ కు అప్పగించారు. అపుడు ఈ యార్క్ రోడ్ నుండే లుటియెన్స్ తన పనిని ప్రారంభించాడు. ఇపుడు నెహ్రూ ఉంటున్నయార్క్ రోడ్‌లోని 17 వద్ద ఉన్న బంగ్లాను 1912 లో నిర్మించారు.

ఆ బంగ్లాలో నెహ్రూగారు ఆగస్టు 2 ఉదయం ఒక కుదుపుతో లేచారు. ఆ బంగ్లా బ్రిటిష్ వారి నుండి భారత్ కు బదిలీ కావడానికి పదమూడు రోజులు మాత్రమే ఉంది. ఎజెండాలో ఆ కార్యక్రమానికి సన్నాహాలు ఊపందుకున్నాయి. ఇవే కాక అనేక ఇతర సమస్యలు ఒక ఉప్పెనలా నెహ్రూ మీద పడ్డాయి. జాతీయ గీతం నుండి క్యాబినెట్ ఎంపికల వరకు భారీ పనుల జాబితా ఉంది. వీటన్నిటి మధ్య, ఆగస్టు 15 న ఏ వస్త్రాలు ధరించాలనే సమస్య కూడా నెహ్రూకు ఉంది.

కొంతమంది కాంగ్రెస్ నాయకులు, సీనియర్ ఉన్నతాధికారులు 17, యార్క్ రోడ్ బంగ్లాకు చేరుకున్నారు. వారితో వివిధ అంశాలపై చర్చించాల్సి ఉంది. అందువల్ల, నెహ్రూ తన అల్పాహారాన్ని తొందరగా ముగించి, ఆ రోజు తలమునకలుగా ఉన్న పనికి సిద్ధమయ్యారు.

——– ——— ———-

భారతదేశంలో ఇంకా మిగిలి ఉన్న స్వతంత్ర రాష్ట్రాలను విలీనం చేసే పని ఊపందుకుంది. సర్దార్  వల్లభాయ్ పటేల్ స్వయంగా అన్ని రాష్ట్రాలపై నిఘా ఉంచారు. ఈ పని కోసం ఆయన తన విభాగంలో పదునైన పరిపాలనాధికారి అయిన వి. కె. మీనన్‌ను చేర్చుకున్నారు.

సర్దార్ పటేల్ సూచనల మేరకు వి.కె.మీనన్ ఆగస్టు 2 ఉదయం బ్రిటన్ లోని భారత వ్యవహారాల డిప్యూటీ సెక్రటరీ పాట్రిక్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన `పరిమాణంలోనూ, ఆర్ధిక వ్యవస్థ పరంగాను పెద్దవైన మైసూర్, బరోడా, గ్వాలియర్, బికానెర్, జోధ్పూర్,జైపూర్ రాజ్యాలు భారత్ లో విలీనం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే హైదరాబాద్, భోపాల్, ఇండోర్ వంటి రాష్ట్రాల నిర్ణయం ఇంకా తెలియరాలేదు’ అని వ్రాశారు.

ఈ రాజ్యాలు వాస్తవానికి ఒక నిర్ణయానికి వచ్చేశాయి. భోపాల్, హైదరాబాద్, జునాఘడ్ భారతదేశంతో కలవడానికి ఏ విధంగానూ ఇష్టపడటంలేదు. జిన్నా, భోపాల్ నవాబ్ హమీదుల్లా ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. దీనికి సంబంధించి భోపాల్ నవాబు ఆగస్టు 2 న తన స్నేహితుడైన జిన్నాకు ఒక లేఖ వ్రాస్తూ –

`భోపాల్ రాజ్యం హిందూ భారతదేశం మధ్యలో 80% హిందువుల మెజారిటీతో ఒంటరిగా ఉంటుంది, నా వ్యక్తిగత శత్రువులతో పాటు ఇస్లాం శత్రువులు కూడా చుట్టూ ఉన్నారు. పాకిస్తాన్ మాకు సహాయం చేయడానికి మార్గమే లేదు. నిన్న రాత్రి మీరు ఈ విషయాన్ని నాకు సరిగ్గా చెప్పారు ”.


క్వీన్ విక్టోరియా రోడ్ నం 1 లో నివసిస్తున్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా బిజీగా ఉన్నారు. రాష్ట్రపతి కావడానికి ఆయనకు చాలా కాలం ఉంది. అయినా, అందరూ ఆయన్ని ఒక కుటుంబ పెద్దలా (ఫాదర్ ఫిగర్) చూస్తున్నారు. సహజంగానే, ఇటువంటి క్లిష్టమైన సమయంలో ఆయన దగ్గరకు సంప్రదింపుల కోసం, నిర్దిష్ట విషయాలపై సమాచారాన్ని ఇవ్వడం కోసం వస్తున్నారు.

డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్వతహాగా బీహార్ కు చెందినవారు. అందువల్ల, బీహార్ నుండి చాలా మంది వివిధ సమస్యలతో, వివిధ బాధలతో ఆయన వద్దకు వచ్చారు. ఆయన ఆగస్టు 2 మధ్యాహ్నం రక్షణ మంత్రి సర్దార్  బల్దేవ్ సింగ్‌కు ఒక ఉత్తరం రాశారు.

ఆగస్టు 15 న జరిగే వేడుక గురించి ఆ ఉత్తరంలో సూచన చేస్తూ – `పాట్నా నగరంలో పౌరులు, అధికారులతో పాటు మిలిటరీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, అపుడు వేడుకకు గౌరవం పెరుగుతుంది’ అని వ్రాశారు.

సర్దార్ బల్దేవ్ సింగ్ అకాలీదళ్ నుండి మంత్రివర్గంలో చేరిన మంత్రి. ఆయన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌ను గౌరవిస్తారు. అందువల్ల, రాజేంద్ర ప్రసాద్ లేఖపై ఆయన తగిన చర్యలు తీసుకోవచ్చు.


ఆగస్టు 2 ఉదయం నుండి యునైటెడ్ ప్రావిన్స్ (నేటి ఉత్తర ప్రదేశ్)లో వేరే పరిణామాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం గత రాత్రి స్థానిక హిందూ మహాసభ నాయకులను అరెస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష చర్యలకు దిగారన్నది వారిపై అభియోగం. భారత రాజకీయాల్లో `డైరెక్ట్ యాక్షన్’ అనే పదం బాగా దుర్వినియోగానికి గురైంది. ఈ పేరుచెప్పి ఏడాది క్రితం ముస్లిం లీగ్ గూండాలు బెంగాల్‌లో ఐదు వేల మంది హిందువులను ఊ చకోత కోశారు. వేలాది మంది మహిళలపై అత్యాచారం చేశారు. ఈ `ప్రత్యక్ష చర్య’ పరిణామాల వల్లనే చివరికి కాంగ్రెస్ విభజనను అంగీకరించింది.ప్రత్యక్ష చర్య ముస్లిం లీగ్‌తో ముడిపడి ఉంది కనుక ప్రత్యక్ష చర్య పేరిట హిందూ నాయకులను అరెస్ట్ చేయడం, జైలులో పెట్టడం కొంచెం వింతగా ఉంది.

సింగపూర్ నుండి ప్రచురించబడే ఇండియన్ డైలీ మెయిల్ అనే దినపత్రిక కూడా ఆగస్టు 2 నాటి సంచిక మొదటి పేజీలో ఈ వార్తనే కాకుండా, హిందూ మహాసభ పది డిమాండ్లను కూడా ప్రచురించింది. ఈ వార్త హిందూ మహాసభ మద్దతుదారులకు ఇబ్బంది కలిగించింది.


ఈశాన్యంలో ఉన్న కొహిమా నుండి భారత సమాఖ్య రాజ్యానికి ఆగస్టు 2, శనివారం రోజు మంచిది కాదని ఒక నివేదిక వచ్చింది. కోహిమా ఇండిపెండెంట్ లీగ్ ఆగస్టు 15న భారత సమాఖ్యలో చేరబోమని ప్రకటించింది. వారు, నాగా గిరిజనులు నివసించే మొత్తం ప్రాంతాన్ని కవర్ చేస్తూ స్వతంత్ర నాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.ఆగస్టు 15 న రూపొందుతున్న భారత సమాఖ్య రాజ్యానికి అన్నీ పర్వతాల వంటి సవాళ్ళు ఎదురవుతున్నాయి.


ఈ ఉద్రిక్తతలు ఇలా ఉన్నప్పటికీ, భారతీయ సినిమాలు దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రజలను అలరింస్తున్నాయి. అశోక్ కుమార్, వీర నటించిన `ఆఠ్ దిన్’ అనే చిత్రం సింగపూర్‌లోని డైమండ్ థియేటర్‌లో జనాన్నిచాలా ఆకర్షిస్తోంది. ప్రముఖ ఉర్దూ రచయిత సాదత్ హసన్ మాంటో ఈ సినిమా కథను రాయగా, సంగీత దర్శకుడు ఎస్. డి. బర్మన్ ఈ సినిమా ద్వారా సినీ ప్రపంచంలోకి ప్రవేశించారు.


ఢిల్లీలోని సర్దార్ పటేల్ నివాసం (నేటి ఔరంగజేబ్ రోడ్ నం 1 ) కూడా వివిధ కార్యక్రమాలతో సందడిగా ఉంది. సింధ్, బలూచిస్తాన్,బెంగాల్ వంటి స్వతంత్ర రాజ్యాల విలీన సమస్యలు, అక్కడి అల్లర్లతో హోం మంత్రిత్వ శాఖకు పరీక్ష కాలంగా ఉంది.

ఈలోగా, పండిట్ నెహ్రూ రాసిన ఒక ఉత్తరం మధ్యాహ్నం సర్దార్‌ పటేల్ కు చేరింది.ఆ ఉత్తరంలో క్లుప్తంగా ఇలా ఉంది -`మిమ్మల్ని మా మంత్రివర్గంలో చేరమని ఆహ్వానం పలుకుతున్నాను. వాస్తవానికి, ఈ ఉత్తరానికి అర్థం లేదు ఎందుకంటే మీరు ఇప్పటికే మన మంత్రివర్గానికి మూల స్తంభం లాంటి వారు, ఇది కొన్ని లాంఛనాలను పూర్తి చేయడానికి మాత్రమే.’

పటేల్ ఉత్తరాన్ని తీసుకుని, కొద్దిసేపు దాని వైపు చూస్తూ తేలికగా నవ్వారు. ఆ తరవాత భారతదేశం – పాకిస్తాన్ సరిహద్దులో అల్లర్ల గురించి ఆయన తన కార్యదర్శితో మాట్లాడారు.


ఈ మొత్తం వాతావరణానికి దూరంగా, మహారాష్ట్రలోని దేవాచి అలాండి వద్ద కాంగ్రెస్‌లోని వామపక్ష బృందం సమావేశమైంది. వీరు ఈ సమావేశాన్ని నిర్వహించాలని రెండు నెలల క్రితం నిర్ణయించారు. శంకరరావు మోర్, భాసాహెబ్ రౌత్ విజ్ఞప్తి మేరకు వారంతా ఇక్కడ సమావేశమయ్యారు. భారతదేశం స్వాతంత్ర్యం పొందుతోంది, అధికారం కాంగ్రెస్ పరం అవుతుంది. కానీ వారిని వేధిస్తున్న ప్రశ్న ఏమిటంటే – వామపక్ష, కమ్యూనిస్ట్ భావజాలం ఏమవుతుంది …? ఈ విషయమై ఆలోచించడానికే వాళ్ళు కలిశారు. వారిలో తులాషిదాస్ జాదవ్, కృష్ణారావు ధులుపా, ద్యానోబా జాదవ్, జి. డి. లగూ, దత్తా దేశ్ ముఖ్, ఆర్. కె. ఖండిల్కర్, కేశవరావు జెధే వంటి ప్రముఖులు ఉన్నారు.

ఈ సమావేశం రైతులు, కార్మికులకు సంబంధించిన పెద్ద వామపక్ష పార్టీకి నాంది పలుకుతుందని ఎవ్వరూ అనుకోలేదు …

అయితే, ఆగస్టు 2 న జరిగిన ఈ సమావేశంలో కలసిన ఈ ప్రముఖ వ్యక్తులు ఎవ్వరూ భారతదేశ విభజన గురించి గాని, జరుగుతున్నఅమానవీయ అల్లర్ల గురించికానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.


మద్రాసులోని ఎగ్మోర్ ప్రాంతంలో ఇంకోచోట సాయంత్రం జరిగిన సమావేశంలో, మద్రాస్ ప్రెసిడెన్సీ ఆహార, ఔషధ, ఆరోగ్య మంత్రి టి. ఎస్. ఎస్. రాజన్ ఆంగ్లో-ఇండియన్ ప్రజానీకంతో సంభాషిస్తున్నారు. బ్రిటీష్ వారు భారతదేశం విడిచిపెట్టిన తరువాత తమ గతి ఏమవుతుందనే ప్రశ్న వారిలో చాలా మందికి ఉంది. ఈ ప్రశ్నకు స్పందిస్తూ, మీ ఈ చిన్న సమూహం సమాజంలో బాగా కలిసిపోయింది, స్వాతంత్ర్యం తరువాత కూడా మీ సమూహం బాధ్యతాయుతమైన పాత్రను పోషించాలి అని అన్నారు.


వీర్ సావర్కర్ గౌరవార్థం పూణే లోని ఎస్. పి. కాలేజీలో బహిరంగ సభ జరిగింది. తత్యారావు (సావర్కర్) స్వయంగా దేశంలోని ప్రస్తుత పరిస్థితిపై, దేశ స్వాతంత్ర్యం, దేశ విభజనపై మాట్లాడవలసి ఉంది.

సమావేశంలో జనం భారీగా ఉన్నారు, వాస్తవంగా ఇది చాలా పెద్ద ర్యాలీ. జనం భారీగా తరలివచ్చిన ఈ సమావేశంలో తీవ్రమైన తన ప్రసంగంలో వీర్ సావర్కర్ “మనమంతా హిందువులం. మనల్ని మనం ‘హిందువు’ అని గుర్తించడానికి ఎందుకు సిగ్గుపడాలి? నేటి ఈ పరిస్థితికి కాంగ్రెస్ ప్రధాన అపరాధి అయినప్పటికీ, అదే స్థాయిలో ప్రజలు కూడా అంతే బాధ్యత వహించాలి. ఇది ప్రజలంతా ఎప్పటికప్పుడు కాంగ్రెస్‌కు ఇచ్చిన మద్దతు ఫలితం. ఈ దేశాన్ని పదేపదే విభజించడంలో సహకరించడం వల్ల ఒక వర్గం విజయవంతమైంది. ” అని అన్నారు.


మరో వైపు శ్రీనగర్ లో, గాంధీజీ రెండవ రోజు కాశ్మీర్ లోని మొదటి పర్యటన ఖరారు కానుంది. ఈ రోజు ప్రత్యేకమైన, ముఖ్యమైన సంఘటనలు లేవు. బేగం అక్బర్ జహాన్ తన కుమార్తెతో కలిసి ఉదయం ప్రార్థన తర్వాత గాంధీజీ బస చేసిన కిసోరి లాల్ సేథి ఇంటికి వచ్చారు. ఈ సమావేశంలో కూడా ఆమె తన భర్త (షేక్ అబ్దుల్లా) ను జైలు నుండి విడుదల చేయటం ఎంత ముఖ్యమో గాంధీజీకి చెప్పారు. ఈ రోజు కూడా, గాంధీజీని నేషనల్ కాన్ఫరెన్స్ ముస్లిం నాయకులు చుట్టుముట్టారు. అయితే, గాంధీజీ చాలా మంది హిందూ నాయకులతో పాటు చాలా మందిని కలిశారు.

రామ్‌చంద్ర కాక్ ఇచ్చిన ఆహ్వానం మేరకు గాంధీజీ మర్నాడు అంటే ఆగస్టు 3 న మహారాజా హరి సింగ్‌ను కలవడానికి వెళ్లనున్నారు.


లాహోర్, రావల్పిండి, పెషావర్, చిట్‌గావ్, ఢాకా, అమృతసర్ మొదలైన చోట్ల రోజంతా హిందూ-ముస్లింల మధ్య గొడవలు సాగాయి. చీకట్లు ముసురుకున్న వేళ దూరంగా మంటల వెలుగు కనిపించింది.

ఆగస్టు 2 రాత్రి కూడా అల్లర్లు తప్పెలా లేవు …!

మొద‌టి భాగం : 1 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?

This article was first published in 2019