Home Telugu Articles సుప్రీం కోర్ట్ ‘సంచలన’ తీర్పులు ఎవరి సంక్షేమానికి..?

సుప్రీం కోర్ట్ ‘సంచలన’ తీర్పులు ఎవరి సంక్షేమానికి..?

0
SHARE

దేశంలోనే సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఇటీవల అనేక సంచలనాత్మక తీర్పులను వెలువరిస్తోంది. మొన్నటికి మొన్న స్వలింగ సంపర్కంలో ఎలాంటి తప్పులేదని, నిన్నటికి నిన్న వివాహేతర సం బంధం నేరం కాదని, తాజాగా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోరాదని.. ఇలా చెప్పుకుంటూపోతే అనేక తీర్పులను వరసగా ఇస్తోంది. భారతదేశం వేదాలకు పుట్టినిల్లు. రాముడు, కృష్ణుడు వంటి పురాణ పురుషులు నడయాడిన రాజ్యం. మానవుడు ఎలా జీవించాలో, తనకు కష్టాలు వస్తే ఎలా ఎదుర్కొనాలో.. మాటకు కట్టుబడి నీతి నిజాయితీతో మెలగాలని చెబుతూ శ్రీరామునిగా ఆ మహావిష్ణువు అవతారం ఎత్తాడన్నది భారతీయుల ప్రగాఢ విశ్వాసం.

నేడు సుప్రీం కోర్టు తీర్పులను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మహోన్నతమైన నైతిక విలువలకు, మత విశ్వాసాలకు ఇక కాలం చెల్లిందన్న ఆందోళన కలుగుతోంది. గతంలోని చట్టాలు తుప్పుపట్టి పోయాయని, వాటిని నేటి ఆధునిక మానవ జీవితాలకు అనుగుణంగా మార్చుకోవాలని కోర్టులు సూచించడం చూస్తున్నాం. సుప్రీం కోర్టులో ధర్మాసనం పేరిట ఉన్న ఓ అయిదుగురి నిర్ణయం- కొన్ని కోట్ల మందిపై ఎంతో ప్రభావం చూపెడుతుంది. మనిషి తనకుతాను చేసుకునేవి చట్టాలు. చట్టాలు పౌరుషేయాలు అనగా మానవమాత్రులు తయారుచేసికొన్నవి మా త్రమే. ఇవి కాలానుగుణంగా అవసరాల మేరకు అనేక సవరణలకు లోనవుతాయి. ఇలాంటి చట్టాలకు లోబడి వస్తున్న కోర్టు తీర్పులు ఎలా ఉంటాయంటే- నిన్నటి తప్పు నేడు ఒప్పుకావచ్చు. స్వలింగ సంప ర్కం, మహిళల వివాహేతర సంబంధం, అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశం వంటి అంశాలు తీసుకుంటే గతంలో యావత్ దేశం వీటన్నింటిని నేరంగానే భావించింది. ఇప్పుడు అదే న్యాయస్థానం ఇవన్నీ నేరం కాదని అంటోంది.

మన చట్టాలన్నింటినీ గతంలో మేధావులు, న్యాయ నిపుణులు ముందు జాగ్రత్తగానే కొన్ని కట్టుబాట్లు, క్రమశిక్షణ వంటివి ఉండాలని తయారుచేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చూసి గతంలోనే అనేక దేశాలు స్ఫూర్తిని పొంది, మన విలువలను మార్గదర్శకంగా తీసుకున్నారు. కాని నేడు భారతదేశాన్ని తప్పుదోవ పట్టిస్తూ పాశ్చాత్య పోకడలకు తలొగ్గినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులు అనేక తీర్పులు ఇస్తున్నారు. వివాహేతర సంబంధంలో ఎలాంటి తప్పు లేదంటే మన దేశంలో అనాదిగా ఉన్న కుటుంబ వ్యవస్థ ఏవౌతుంది? ఇప్పటికే తల్లిదండ్రులు పిల్లల్ని కనిపెంచినా, రెక్కలొచ్చాక పిల్లలు వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ, తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చుతున్నారు. ఇక ఇప్పుడు వివాహేతర సంబంధం నేరం కాదని అంటే- దంపతుల మధ్య పవిత్రమైన మాంగల్య బంధం మంట గలుస్తుంది. అక్రమ సంబంధాల కారణంగా ఇప్పటికే ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. తరచూ హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి.

వివాహేతర సంబంధం తప్పు కాదంటే- ఇక పెళ్ళెందుకు? పిల్లలెందుకు? ఇలాంటి తీర్పులతో కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది. దారి తప్పిన దంపతులకు సంబంధించి- వారి పిల్లలు కూడా అలానే ప్రవర్తిస్తారు. ఒక్కోసారి ఆలోచిస్తే భారతదేశం ఎటుపోతోంది అనిపిస్తోంది. రాముని రాజ్యమా? రావణ రాజ్యమవుతోందా? స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధం.. ఈ రెండూ భౌతిక సుఖానికి సంబంధించినవి. పురుషుడైనా, స్ర్తి అయినా- ఎవరి జీవితంలోనైనా నైతికత తోడులేకుంటే వ్యక్తిగత, కుటుంబపరమైన, ఆరోగ్యపరమైన, సామాజికపరమైన అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ధర్మం, సత్యం అనేవి సృష్టిలోని శాశ్వత నియమాలు. ఏ యుగంలోనూ ఇవి నాశనం లేనివి. నిత్య నూతనమైనవి. ఇవి మానవ మాత్రులు చెప్పినవి కావు. సమస్త మానవాళి నిత్యం సుఖశాంతులతో శాంతిమయ జీవనం గడిపేందుకు అవసరమైన జ్ఞానాన్ని సృష్టిలో ఋషుల అంతఃకరణాల ద్వారా చతుర్విద పురుషార్థాలలో ధర్మార్ధ కామ మోక్షాలలో ధర్మమే మొదటిది. ధర్మంగా ధనం సంపాదించాలి. ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవాలి. సంతానం పొందడానికి మాత్రమే అనే స్పృహతో లైంగిక క్రియ జరపడం ధార్మిక శృంగారం. సంతానం కనడం దైవకార్యం. దంపతుల మధ్య ఆకర్షణ సంతతి కోసమే కాని సంతతి ఆకర్షణ ఫలితం కాదు. వివాహం, దాంపత్యం, సంతానం.. ఇవి ఎలా జరగాలో అలానే జరగాలి. కాని స్ర్తి, పురుషుల మధ్య ఆకర్షణ పెరిగి శృంగారంలో పాల్గొంటే ఇక ఇవన్నీ ఎందుకు? పురుషుడు పెళ్ళి తర్వాత తన భార్య రుతు సమయాన్ని గ్రహించి మాత్రమే ఆమెతో శారీరక సుఖం పొందేవాడు.

నేడు జరుగుతున్నదేమిటి? నేటి సమాజంలో అన్ని అపసవ్యాలు, ధర్మవిరుద్ధంగా జరుగుతున్నవి. పెళ్ళికిముందే ప్రేమ, అనైతిక శృంగారం, పరస్ర్తి, పర పురుష వ్యామోహం, స్ర్తిని అబలగా, అశ్లీలంగా వ్యాపార వస్తువుగా చూపించడం, వ్యసనాలు, నైతిక విలువల పతనం, ధర్మానికి విరుద్ధం ప్రవర్తించడం.. ఇలాంటివన్నీ మనల్ని అన్ని విధాలా పతనానికి నెట్టేస్తాయి. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ఇష్టపూర్వక శృంగారం లేదా వివాహేతర సంబంధం ఇక ఎంత మాత్రం నేరం కాదనటం సరికాదు. ఒకరి భార్యతో మరో పురుషుడు వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 497 కింద నేరంగా పరిగణించేవారు. పెళ్ళి చేసుకున్నప్పుడు స్ర్తి, పురుషులు ఇష్టపూర్వకంగానే అంగీకరిస్తారు. అటు తర్వాత వారి మనసులలో అనేక కోరికలు కలుగవచ్చు. ఇతరులలో వివాహేతర సంబంధాలు ఏర్పరచుకోవచ్చు. ఇలా కోరిక కలిగినప్పుడల్లా ఎవరితోపడితే వారితో శృంగారంలో పాల్గొంటే భారత సనాతన ధర్మం ఏం కావాలి? ఇలా దారి తప్పితే ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పటికే ఎంతోమంది పెళ్ళిళ్ళు కాక అనేక తంటాలు పడుతున్నారు. ఒకవైపు సుప్రీం తీర్పుపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. సామాజిక కార్యకర్తలు కొందరు దీన్ని స్వాగతించినా- పలు ముస్లిం సంస్థలు ఆక్షేపణ తెలిపాయి. ‘ట్రిపుల్ తలాక్’ సంగతేంటని నిలదీశాయి. ఎంతోమంది ఈ విష సంస్కృతి ఎక్కడికి దారితీస్తోందన్న ఆందోళన వ్యక్తం చేశారు.

ఒక రకంగా చెప్పాలంటే- వివాహేతర సంబంధం నేరం కానపుడు.. ట్రిపుల్ తలాక్ కూడా నేరం కాదు. సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు బహుభార్యాత్వాన్ని అనుమతిస్తుందా? ఈ తీర్పు ఎలా ఉందంటే మగాడు ఒకటి, రెండు, మూడు ఇలా ఎన్ని పెళ్ళిళ్ళయినా చేసుకునేందుకు వీలుకల్పించేదిగా ఉందని, అలా అయితే బాధిత మహిళ ఎవరిపై ఫిర్యాదు చేయాలని, అత్యంత సున్నితమైన ఈ అంశంపై మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉందని, ఈ తీర్పువల్ల మహిళలకు ఏమేరకు న్యాయం జరుగుతుందని.. అనేక ప్రశ్నార్థకాలున్నాయి. అత్యంత సంక్లిష్టమైన ఈ అంశంలో సుప్రీం కోర్టు మరింత వివరణ ఇవ్వాల్సి ఉందని అనేక సామాజిక, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణిస్తారు. ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఇరాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, ఫిలిప్పైన్స్, యుఏఈ, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, అల్జీరియా, కాంగో, ఈజిప్టు, మొరాకో, నైజీరియాలోని కొన్ని ప్రాంతాల్లో వివాహేతర సంబంధాలు నేరంగా పరిగణిస్తారు. కొన్ని దేశాల్లో వివాహేతర సంబంధాలు తప్పు కాదు. ఈ జాబితాలో తాజాగా భారత్ చేరింది. చైనా, జపాన్, బ్రెజిల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్కాట్‌లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, ఐర్లాండ్, బర్సడోన్, బర్ముడా, జమైకా, ట్రినిడాడ్, టొబాగో, సియాచిలిస్, దక్షిణ కొరియా, గ్వాటిమాలా దేశాల్లో వివాహేతర సంబంధాలను నేరాలుగా పరిగణించరు. స్ర్తి, పురుషులు పరస్పరం ఇష్టపడి పెళ్ళిచేసుకుంటున్నారు. ‘పెళ్ళి’ మాధ్యమంగా వారు ఒకరికొకరు ఇష్టపడి ఆజీవనం లైంగిక శృంగార కలాపాలను నిర్వహిస్తున్నారు. ఇలా పెళ్ళికి, కుటుంబ వ్యవస్థకు మూలాధారమైన ‘పరస్పర ఇష్టాన్ని’ సుప్రీం కోర్టు వ్యభిచారానికి కూడా వర్తింపజేశారు. ఇలా వర్తింపచేయటం భారత ‘జాతీయ సంస్కృతిక’ ప్రాతిపదిక అయిన ‘కుటుంబ వ్యవస్థ’కు గొడ్డలిపెట్టు లాంటిది. తప్పనిసరిగా ఈ విచిత్ర న్యాయ నిర్ణయాన్ని వమ్ముచేయడానికి పార్లమెంట్ పూనుకొని రాజ్యాంగ సవరణ చేయాలి. ప్రజలే ప్రజాస్వామ్య దేశంలో సర్వాధికారాలు కల్గినవారు. వ్యభిచారం నేరమన్నది అత్యధిక ప్రజల అభిప్రాయమని ధర్మాన్ని కాపాడే అనేక సంఘాలు అంటున్నాయి. వ్యభిచారం నేరం కాదని చెప్పడం వల్ల మహిళలకు న్యాయం జరుగుతుందా? ఈ విషయం పట్ల సామాన్య ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. ఏది ఏమైనా సుప్రీం ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకొని భారత సత్ సంప్రదాయాన్ని కాపాడాలి.

-గుండు రమణయ్య
94406 42809

ఆంధ్ర భూమి సౌజన్యం తో