Home Uncategorized నిఘా కొరవడి ఉగ్ర ఉరవడి!

నిఘా కొరవడి ఉగ్ర ఉరవడి!

0
SHARE

ముస్లిముల సాంఘిక-మత సమన్వయ సంస్థ జమాతే ఇస్లామీ హింద్‌ తన సభ్యులను ఒకే ఛత్రం కిందకు తీసుకురావడానికి 1977లో సిమిని స్థాపించింది. అమెరికాలోని వెస్ట్రన్‌ ఇలినాయ్‌ విశ్వవిద్యాలయంలో మీడియా వ్యవహారాల ఆచార్యుడైన మహమ్మద్‌ అహ్మదులా సిద్ధిఖీ ఈ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడు. ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి కార్యకలాపాలు ప్రారంభించిన సిమి 1986లో తీవ్రవాద పంథాకు మరలి ఇస్లాం ద్వారా భారత్‌కు విమోచన కలిగించడమే తన ధ్యేయమని ప్రకటించింది. 1999 ఔరంగాబాద్‌ సిమి సదస్సులో ‘మా దేశం ఇస్లామే తప్ప భారత్‌ కాదు’ అనే నినాదాలు మార్మోగాయి.

చాప కింద నీరులా ‘సిమి’ విస్తరణ

భారత ప్రభుత్వం పదిహేనేళ్ల క్రితమే స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి)ని నిషేధించినా అది ఇప్పటికీ రకరకాల ముసుగుల్లో కార్యకలాపాలు సాగిస్తూనే ఉంది. నిషేధం వల్ల నిధుల కోసం కాని, మానవ బలగం కోసం కాని సిమి కటకటలాడిన దాఖలా లేదు. పాకిస్థానీ ఉగ్రవాదులతో సంబంధాలున్న ఈ సంస్థను 9/11 అమెరికాపై దాడి అనంతరం నిషేధించినా, అది నిరాటంకంగా దేశమంతటా అనేక దాడులకు పాల్పడింది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ కేంద్ర కారాగారం నుంచి ఎనిమిది మంది సిమి కార్యకర్తలు పరారయ్యారు. అంతకుముందు వీరిలో ముగ్గురు భోపాల్‌కు 280 కిలోమీటర్ల దూరంలోని ఖాండ్వా జైలు నుంచి ఇదే ఫక్కీలో తప్పించుకున్నారు. అప్పట్లో వారిని వెంటనే అరెస్టు చేసి భోపాల్‌ కారాగారానికి తరలించారు. దీపావళి రాత్రి వూరంతా పటాసు పేలుళ్ల ధ్వనులు, పొగలు కమ్ముకుని ఉంటాయి కాబట్టి సిమి కార్యకర్తలు జైలు నుంచి తప్పించుకోవడానికి ఆ ముహూర్తాన్నే ఎంచుకున్నారు. ఈ దుస్సాహసానికి కుట్ర పన్నిన వ్యక్తి అబూ ఫజల్‌ అని తెలిసింది. భోపాల్‌ జైలులో ఫజల్‌తోపాటు మొత్తం 21 మంది సిమి ఉగ్రవాదులు వూచలు లెక్కపెడుతున్నారు. వీరిపై దేశద్రోహం, ఉగ్రవాద దాడులు, దోపిడిలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. నేడు సిమికి దేశవ్యాప్తంగా 400 మందికి పైగా పూర్తికాల కార్యకర్తలు, 20 వేలమంది సాధారణ సభ్యులు ఉన్నట్లు అంచనా.

తీవ్రవాదం వైపుగా…
ముస్లిముల సాంఘిక-మత సమన్వయ సంస్థ జమాతే ఇస్లామీ హింద్‌ తన సభ్యులను ఒకే ఛత్రం కిందకు తీసుకురావడానికి 1977లో సిమిని స్థాపించింది. అమెరికాలోని వెస్ట్రన్‌ ఇలినాయ్‌ విశ్వవిద్యాలయంలో మీడియా వ్యవహారాల ఆచార్యుడైన మహమ్మద్‌ అహ్మదులా సిద్ధిఖీ ఈ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడు. ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి కార్యకలాపాలు ప్రారంభించిన సిమి 1986లో తీవ్రవాద పంథాకు మరలి ఇస్లాం ద్వారా భారత్‌కు విమోచన కలిగించడమే తన ధ్యేయమని ప్రకటించింది. 1999 ఔరంగాబాద్‌ సిమి సదస్సులో ‘మా దేశం ఇస్లామే తప్ప భారత్‌ కాదు’ అనే నినాదాలు మార్మోగాయి. క్రమంగా జమాత్‌, సిమిలకు తెగతెంపులు అయ్యాయి. 2001లో కేంద్ర ప్రభుత్వం సిమిని నిషేధించింది. దాంతో సిమి జాతీయ అధ్యక్షుడు షాహిద్‌ బదర్‌ ఫలాహి, ప్రధాన కార్యదర్శి సఫ్దర్‌ నాగోరీలతోపాటు పలువురు అగ్రనేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. అనేకమంది యువ కార్యకర్తలు కశ్మీర్‌లోని ఇస్లామిక్‌ ఉగ్రవాదులతో చేరిపోయారు. మరికొందరు సరిహద్దు దాటి పాకిస్థాన్‌ వెళ్లి అక్కడ లష్కరే తొయిబా శిక్షణ శిబిరాల్లో తేలారు. 2001లో ప్రభుత్వ నిషేధం తరవాత ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హల్ద్వానీకి చెందిన నోమన్‌ బదర్‌ అనే వ్యక్తి సిమి నాయకులను మళ్ళీ సంఘటితపరచారు. వారిలో నాగోరీతో పాటు అమీల్‌ పర్వేజ్‌, ఇల్యాస్‌ ఖాన్‌, డాక్టర్‌ అబ్రార్‌, అష్రఫ్‌ జాఫ్రి ఉన్నారు. ‘మేమంతా 2002లో మధ్యప్రదేశ్‌లోని చొరాల్‌లో సమావేశమయ్యాం. రంజాన్‌ మాసంలో విరాళాలు సేకరించాలని నిర్ణయించి, అందరికీ కోటాలు నిర్దేశించాం’ అని 2008లో అరెస్టయిన అమీల్‌ పర్వేజ్‌ పోలీసులకు వివరించాడు. చొరాల్‌ తరవాత గుజరాత్‌లోని వడోదరలో కూడా సిమి నేతలు సమావేశమయ్యారు. ఆపైన దేశమంతటా సిమి విధ్వంస కార్యకలాపాలు చేపట్టింది. సిమి మొదటి నుంచీ లష్కరే తొయిబా, హర్కత్‌ ఉల్‌ జిహాద్‌ అల్‌ ఇస్లామీ బంగ్లాదేశ్‌, ఇస్లామిక్‌ ఛాత్ర శిబిర్‌ వంటి ఉగ్రవాద సంస్థలతో పొత్తు పెట్టుకుంది. ఉపఖండానికి వెలుపల ఈజిప్షియన్‌ బ్రదర్‌ హుడ్‌, హమాస్‌లతోనూ దానికి సంబంధాలున్నాయి.

simi-4

2006లో ముంబయి సబర్బన్‌ రైళ్లలో బాంబు పేలుళ్లు 209 మంది ప్రాణాలు తీశాయి. ఈ దురంతానికి పాక్‌ సైనిక గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ కుట్రపన్నగా, లష్కరే తొయిబా, సిమి కార్యకర్తలు దాన్ని ఆచరణలో పెట్టారని అభియోగం. 2008లో జరిగిన జైపూర్‌ పేలుళ్లలో 80 మంది, అహ్మదాబాద్‌ పేలుళ్లలో 45 మంది, దిల్లీ పేలుళ్లలో 30 మంది, గువాహటి పేలుళ్లలో 83 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ అఘాయిత్యాలకు లష్కరే తొయిబా కాని, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కాని కారణమై ఉండొచ్చని భద్రతా సంస్థలు భావిస్తుండగా, హఠాత్తుగా ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) అనే సంస్థ తెరపైకి వచ్చి, పేలుళ్లకు తానే కారణమని ప్రకటించుకుంది. ముంబయి మినహా ఇతర నగరాల్లో పేలుళ్లకు ఈ సంస్థే కారణమని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. హర్కత్‌ ఉల్‌ జిహాదే ఇస్లామీ (హుజి)తో అఫ్తాబ్‌ అన్సారీ నాయకత్వంలోని ఉగ్రవాదుల ముఠాతో సంబంధాలున్న వ్యక్తులు ఏర్పరచిన సంస్థే ఐఎం. అందులో ప్రధాన భాగస్వామి సిమియే. 2006-07లో సిమిపై భద్రతా సంస్థలు ముమ్మరంగా దాడులు జరిపి, దాని ప్రధాన కార్యదర్శి సఫ్దర్‌ నాగోరితో పాటు అనేకమంది కీలక కార్యకర్తలను అరెస్టు చేసినా, ఐఎం స్థాపనకు సిమి తెగించడం గమనార్హం. సిమిపై ప్రభుత్వ నిషేధం వల్ల అనేకమంది సభ్యులు, కార్యకర్తలు ఐఎంలో చేరిపోయారు. ముంబయికి చెందిన అబ్దుల్‌ సుభాన్‌ ఉస్మాన్‌ ఖురేషీ ఉరఫ్‌ అల్‌ అర్బీ ఐఎంను స్థాపించాడు. అంతకుముందు సిమి అధికార పత్రిక ఇస్లామిక్‌ వాయిస్‌కు సంపాదకత్వం వహించిన నిబద్ధ కార్యకర్త అతడు. 2001లో చిట్టచివరి సిమి బహిరంగ సభను 25 వేలమంది యువ ముస్లిములతో నిర్వహించి జన సమీకరణ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. 2007 నుంచి వందల మంది సిమి-ఐఎం కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి, 2008 దిల్లీ పేలుళ్లకు సూత్రధారిగా నిలిచాడు.

మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, తెలంగాణ, కేరళలతోపాటు అనేక రాష్ట్రాల్లో సిమి అజ్ఞాత కార్యకలాపాలు సాగించింది. మధ్యప్రదేశ్‌లోని 51 జిల్లాలకు 21 జిల్లాల్లో సిమి చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ నగరం నుంచి పలువురు యువకులను ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌)లో చేర్పించింది. గత ఏడాది వరంగల్‌లో పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన అయిదుగురు సిమి కార్యకర్తలను పోలీసులు కాల్చి చంపారు. వీరిని వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. అంతకుముందు నల్గొండ జిల్లాలో జరిగిన మరొక ఎన్‌కౌంటర్‌లో మరి ఇద్దరు సిమి తీవ్రవాదులు హతమయ్యారు. 2013లో మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి పరారైన అయిదుగురు సిమి కార్యకర్తల్లో వీరిద్దరూ ఉన్నారు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకున్న ఇస్లామిక్‌ తీవ్రవాదుల్లో అత్యధికులు హైదరాబాద్‌నే అడ్డాగా మార్చుకున్నారు. వీరిలో 14 మందిని 2002లో పాకిస్థాన్‌ పంపారు. నగరానికి చెందిన బిలాల్‌, రహమాన్‌ ఖాన్‌లు 2007లో లష్కర్‌లో విభాగాలను ఏర్పరచారు. మొత్తం మీద పాక్‌లో శిక్షణ పొందివచ్చిన 14 మందీ దేశంలో పలు ఉగ్రవాద దాడులకు పాల్పడ్డారు. గుజరాత్‌ పూర్వ హోం మంత్రి హరేన్‌ పాండ్యాను హత్య చేసిందీ, 2007 మే నెలలో మక్కా మసీదులో, ఆగస్టులో లుంబినీ పార్క్‌, గోకుల్‌ ఛాట్‌లో పేలుళ్లు జరిపినది ఈ తొలి బృందం టెరర్రిస్టులే. తన అనుచరుల్లో చాలామంది మొదట్లో సిమిలో సభ్యులుగా ఉండేవారని, 2013లో దిల్‌సుఖ్‌నగర్‌ జంటపేలుళ్ల సూత్రధారి యాసిన్‌ భత్కల్‌ పోలీసులకు తెలిపాడు. మొత్తంమీద సిమి, ఐఎంలు భారతీయ ముస్లిం యువతను విదేశీ ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థలో చేరేలా ప్రేరేపించాయి. ఇవి స్వదేశంలో ఉద్ధృతంగా కార్యకలాపాలు సాగిస్తే భారతీయ భద్రతా సంస్థలు విదేశీ ఉగ్రవాదులపై పూర్తి నిఘా పెట్టలేకపోతాయి. ఐఎం వంటి స్వదేశీ తీవ్రవాదులే దాడులు నిర్వహించగలిగేట్లయితే, వాటితో తమకు సంబంధం లేదని లష్కర్‌, జేఎం వంటి పాకిస్థానీ ఉగ్రవాద సంస్థలు బుకాయించగలుగుతాయి. పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడం భారత్‌కు కష్టమవుతుంది. ఈ విధంగా ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థలు ఎప్పటికప్పుడు తమ కార్యాచరణ తీరును మార్చుకొంటున్నా, భారతీయ భద్రతా సంస్థలు పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోతున్నాయి.

ప్రతివ్యూహం ఎలా ఉండాలి?
సిమి, ఐఎం, లష్కర్‌ తదితర ఉగ్రవాద సంస్థలు వరస దారుణాలకు పాల్పడినా, ఆ చేదు అనుభవాల నుంచి భారతీయ భద్రతా సంస్థలు ఏమీ నేర్చుకోవడం లేదు. ఉగ్రవాదుల ఆటకట్టించాలంటే వివిధ నిఘా సంస్థల మధ్య ఓ ప్రత్యేక సంస్థ సమన్వయం నెరపాలని 2008 ముంబయి పేలుళ్ల సమయంలోనే ప్రతిపాదన వచ్చింది. ఆ మేరకు జాతీయ ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు మూడేళ్లు పట్టింది. ఉగ్రవాదంపై పోరుకు జాతీయ సంస్థను ఏర్పరచాలన్న ప్రతిపాదన ఇంకా దస్త్రాల్లోనే మూలుగుతోంది. నిఘా సమాచార సేకరణ, పంపిణీకి అమెరికన్‌ ఎఫ్‌బీఐ తరహాలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ను మాత్రం నెలకొల్పినా, దానికి తగినన్ని నిధులను ప్రభుత్వం సమకూర్చడం లేదు. ఇటీవల జరిగిన పలు టెరర్రిస్టు దాడి కేసులపై దర్యాప్తు ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

ప్రాథమిక స్థాయిలో గూఢచర్యాన్ని పటిష్ఠపరచాల్సింది పోయి, ఆర్భాటంగా వివిధ సంస్థల ఏర్పాటు గురించి ప్రకటనలు చేయడంతోటే ప్రభుత్వం సరిపెట్టుకొంటోంది. పోలీసు యంత్రాంగ ఆధునికీకరణ ఇప్పటికీ పూర్తికాకపోవడం అలసత్వానికి నిదర్శనం. ప్రతి లక్షమంది జనాభాకు 222 మంది పోలీసులు ఉండాలని ఐక్యరాజ్య సమితి నిర్దేశిస్తున్నా, భారత్‌లో 126 మందే ఉన్నారు. దేశానికి 5,60,860 మంది పోలీసు సిబ్బంది కొరత ఉందని ప్రభుత్వం స్వయంగా రాజ్యసభకు తెలిపింది. 125 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో శత్రు గూఢచారులు, ఉగ్రవాదుల ఆటకట్టించడానికి ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) కేవలం 3,500 మంది సిబ్బందిని నియోగించగలిగింది. సిమిని నిషేధించి 15 ఏళ్లయినా, మన భద్రతా సంస్థలు దాని ఆటకట్టించలేకపోయాయంటే కారణాలు ఇవే. ఒక ఉగ్రవాద సంస్థ ఏదైనా దాడి నిర్వహించాలంటే మొదట దానికి నిధులు సమకూర్చేవారు కావాలి. వ్యూహకర్తలు, దాడి నిర్వాహకులు, నాయకులు, ఇన్ఫార్మర్లు- ఇలా విస్తృత యంత్రాంగాన్ని ఏర్పరచుకోవలసి ఉంటుంది. దీనంతటికీ చాలా సమయం పడుతుంది. ప్రభుత్వానికి విస్తృత నిఘా యంత్రాంగం ఉంటే ఉగ్రవాదులు ఆవులించడానికి ముందే పేగులు లెక్కపెట్టి ఎదురుదాడి చేయగలుగుతుంది. కాబట్టి తక్షణం పకడ్బందీ భద్రతా వ్యవస్థను ఏర్పరచుకోవాలి. ఇంకా ఇస్లామిక్‌ మతాచార్యులు, మేధావులతోపాటు సంఘ ప్రముఖులనూ ఉగ్రవాదంపై పోరులో కలుపుకొని పోవాలి.

– నీరజ్‌ కుమార్‌
(ఈనాడు సౌజన్యం తో )