Home Uncategorized నోట్ల నిర్ణయంతో మేలు ఎంత? – దువ్వూరి సుబ్బారావు, రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌

నోట్ల నిర్ణయంతో మేలు ఎంత? – దువ్వూరి సుబ్బారావు, రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌

0
SHARE

చట్టవిరుద్ధమైపోయిన 500, 1000 రూపాయల నోట్లు ఎంతమేరకు నశించిపోతాయో (అంటే బ్యాంకింగ్‌ వ్యవస్థకు తిరిగిరాని పరిమాణం) ఆ మేరకు రిజర్వ్‌బ్యాంక్‌ పరిష్కారాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం రూ.3లక్షల 50వేల కోట్లు ఉంటుందని అంచనా. ‘విలువకు సమానమైన మొత్తాన్ని చెల్లిస్తా’ననే తన హామీ ఇంకా కొనసాగుతున్నదిగానే రిజర్వుబ్యాంక్‌ భావించి, నశించిపోయిన ఆ సంపదకు సమానమైన మొత్తాన్ని ప్రభుత్వానికి ఏ హక్కూ లేని ‘స్పెషల్‌ రిజర్వ్‌’కు బదలాయిస్తుందా? లేదా, ప్రభుత్వానికి బదలాయించే ‘లాభం’గా ఆ మొత్తాన్ని లెక్కవేస్తుందా? చట్ట ప్రకారం రిజర్వ్‌ బ్యాంక్‌ లాభాన్ని ప్రభుత్వానికి బదిలీచేయాలి.

పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల (రూ.500, 1000)ను భారత ప్రభుత్వం ఇటీవల చట్టవిరుద్ధం (డిలీగలైజ్‌) చేసింది. (సాధారణంగా అందరూ ఉపయోగిస్తున్న డిమానెటైజేషన్‌ అనే పదానికి బదులు నేను ఈ వ్యాసంలో ఉద్దేశపూర్వకంగానే డీలీగలైజ్‌ అనే పదాన్ని వాడుతున్నాను. కారణాన్ని ఇదే వ్యాసంలో మరోచోట విశదీకరిస్తాను). ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వాన్ని ప్రేరేపించిన కారణాలు: ‘మన ప్రధాన ఆర్థిక వ్యవస్థపై సమాంతర ఆర్థిక వ్యవస్థ నీడలను పరుస్తున్న’ నల్లధనాన్ని నశింపజేయడం; ఉగ్రవాద కార్యకలాపాలకు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ఆర్థిక వనరులు సమకూరుస్తున్న నకిలీ కరెన్సీని అరికట్టడం. ఇప్పుడు, చట్టవిరుద్ధం చేసిన కరెన్సీనోట్ల స్థానంలో పరిమాణం, ఆకృతి, రంగు, చూపులో పూర్తి భిన్నంగా, విలక్షణంగా ఉండే రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.black-money-7

లావాదేవీలు అత్యధికభాగం నగదు రూపేణా జరిగే ఒక పేద ఆర్థికవ్యవస్థలో కరెన్సీ నోట్ల రద్దులాంటి చర్య స్వతహాగానే భయం, ఆందోళన కలిగిస్తుంది. ప్రజలు తమ ఆర్థిక భద్రత దృష్ట్యా కొత్తగా జారీ చేసిన నోట్లను పోగుపెట్టడం వల్ల నోట్ల ఎద్దడి ఏర్పడుతుంది. ఈ పరిణామాలను ముందుగానే ఊహించిన ప్రభుత్వం ప్రజల కెదురయ్యే యాతనలు, సమస్యలను తగ్గించేందుకై పలు చర్యలను ప్రకటించింది. ఇక, ప్రభుత్వాన్ని ఈ నిర్ణయానికి పురిగొల్పిన ప్రకటిత, అప్రకటిత లక్ష్యాలపై చాలా విశ్లేషణ, అంతే స్థాయిలో ఊహాగానాలు జరుగుతున్నాయి. నల్ల ఆర్థిక వ్యవస్థ పరిమాణం, ఈ నోట్లరద్దు చర్య వాస్తవంగా దానిని ఏమేరకు దెబ్బ కొట్టింది, స్వల్పకాలికంగా, మధ్యకాలికంగా స్థూల ఆర్థికరంగంపై ప్రభుత్వ నిర్ణయ ప్రభావం ఇత్యాది అంశాలపై పలువురు లోతుగా విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషణల గుణ దోషాలను పరిశీలించడానికే ఈ వ్యాసాన్ని ఉద్దేశించాను.

                  నల్ల ఆర్థికరంగం ఎంత పెద్దది? అధికారిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాల పరిధిలోకి రాకుండా తప్పించుకున్న మార్కెట్‌ ఆధారిత (చట్టబద్ధ, చట్టవిరుద్ధ) సరుకుల, సేవల ఉత్పత్తి అక్రమ వాణిజ్యం కిందకు వస్తుంది. ఈ అక్రమ ఆర్థిక కార్యకలాపాల వల్ల ప్రభుత్వం కోల్పోతున్న పన్ను నల్లధనంగా మారుతూంటుంది. దేశ ఆర్థికవ్యవస్థలో ఈ నల్ల ఆర్థికరంగం ఎంత ఉంటుందనే విషయమై విశ్వసనీయ అంచనాలు లేవు. ఈ అంచనాలకు ప్రభుత్వంతో సహా పలువురు విశ్లేషకులు ప్రపంచబ్యాంకు అంచనాపైనే ఆధారపడడం గమనార్హం. 2007లో ఈ అక్రమ ఆర్థికరంగం మన జీడీపీలో 23.2 శాతంగా ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఎంత తక్కువగా చూసినా అది ఈ ఎనిమిదేళ్ళలో మన జీడీపీలో నాలుగో వంతుకు అంటే 25 శాతానికి పెరిగివుంటుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే మన జీడీపీ 2,00,000 కోట్ల అమెరికన్‌ డాలర్లు అయితే, అందులో నలుపు 50,000 కోట్ల అమెరికన్‌ డాలర్ల మేరకు ఉంటుంది. అధికారిక ఆర్థిక వ్యవస్థలో సగటు పన్ను 16 శాతం లెక్క ప్రకారం దీనిపై వసూలు చేసివుండివుంటే 8000 కోట్ల డాలర్లు ఆదాయం వచ్చివుండేది. అంటే, దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈమేరకు నష్టపోయిందన్నమాట. పెద్ద విలువ కలిగిన కరెన్సీనోట్లను చట్టవిరుద్ధం చేసిన నేపథ్యంలో ఈ నల్లధనంలో ఏ మేరకు బయటకు వస్తుందనేది కేవలం ఊహించాల్సిందే! నల్లధనంలో అత్యధిక భాగం భూములు, స్థిరాస్తులు, స్టాక్స్‌, బంగారం లేదా విదేశీ కరెన్సీ రూపేణా ఉంటాయి.

                  ఇప్పుడు పెద్ద నోట్లు చట్ట విరుద్ధమైన దృష్ట్యా, దాని ప్రభావం ఇతర అంశాలతో పాటు నగదు రూపంలో ఉన్న నల్లధనం నిష్పత్తిపై కూడా ఆధారపడివుంటుంది. సంఖ్యల పరంగా చూస్తే ఈ విషయం మనకు బాగా విశదమవుతుంది. భారత రిజర్వ్‌ బ్యాంక్‌ భోగట్టా ప్రకారం చెలామణీలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ రూ.16.5 లక్షల కోట్లు. ఇందులో 500, 1000 రూపాయల నోట్ల నిష్పత్తి 85 శాతం (వీటి విలువ 14 లక్షల కోట్లు). ఈ 85 శాతం పెద్ద నోట్లలో 75 శాతం బ్యాంకింగ్‌ వ్యవస్థకు తిరిగి (నగదు మార్పిడి లేదా ఖాతాలలో జమ) వచ్చిందని అనుకుందాం. ఆ లెక్కన పదిన్నర లక్షల కోట్లు తిరిగివస్తుంది, మిగతా మూడున్నర లక్షల కోట్లు అంటే జీడీపీలో 2.5 శాతం నశించిపోతుంది.

                  పెద్దనోట్లను చట్టవిరుద్ధం చేయడం వెనుక ప్రధాని మోదీ ఉద్దేశం స్పష్టమే. నల్ల ధనాన్ని బయటకు తీసుకురావడానికి ఆయన అగ్ర ప్రాధాన్యమిస్తున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నల్లధనానికి వ్యతిరేకంగా పలు చర్యలు చేపట్టింది. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటైంది. ప్రభుత్వానికి వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తుల నిర్వహణకు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ద్వంద్వపన్నులను నివారించేందుకు మారిషస్‌, సైప్ర్‌సలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. స్విస్‌ బ్యాంకులలో భారతీయుల రహస్య ఖాతాల వివరాలను రాబట్టేందుకు స్విట్లర్లాండ్‌ ప్రభుత్వంతో ఒక అవగాహనకు వచ్చారు. నగదేతర, డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నారు. బినామీ లావాదేవీల చట్టాన్ని సవరించారు. స్వచ్ఛందంగా ఆదాయప్రకటన పథకాన్ని అమలు పరిచారు. ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, ఆయా చట్టాలు, పథకాలను ప్రభుత్వం ఎంత పకడ్బందీగా అమలుపరుస్తున్నప్పటికీ నల్ల కుబేరులు పూర్తిగా దిగిరావడంలేదనే భావన ప్రభుత్వంలోనూ, ప్రజల్లోనూ ఉన్నది.

                  మరో విశేషమేమిటంటే, చలామణీలో ఉన్న నగదు పరిమాణం అంతకంతకూ పెరుగుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ఆ నగదు వార్షికంగా 15 శాతం చొప్పున పెరుగుతోంది. అంతకు ముందు మూడేళ్లలో ఈ పెరుగుదల రేటు 10.7 శాతం మాత్రమే. 2015-16 రిజర్వ్‌ బ్యాంక్‌ వార్షిక నివేదిక చలామణీలో ఉన్న నగదు పెరుగుదలకు కొన్ని కారణాలను పేర్కొంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, పండుగల డిమాండు, బంగారు నగల వర్తకుల సమ్మె మొదలైన వాటిని రిజర్వ్‌ బ్యాంక్‌ చెప్పింది. అయితే, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ నగదు పెరుగుదల, గతంలో వలే కాకుండా, ఈ కీలక సంఘటనల అనంతరం మళ్ళీ తన పాత పెరుగుదల రేట్ల స్థాయికి తగ్గడం లేదు. ఎలకా్ట్రనిక్‌ లావాదేవీలు హెచ్చుతున్నా, ఈ కరెన్సీ డిమాండ్‌ పెరుగుతూనే ఉన్నది. అందువల్ల, మరేవో క్రియాశీల కారణాలు ఈ ఆర్థిక పరిణామంలో ఉన్నాయన్నది నిజం. చెలామణీలో ఉన్న కరెన్సీ నోట్లు అంతకంతకూ పెరుగుతుండడానికి ప్రతిస్పందనగానే ప్రభుత్వం ఈ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకొంది. బలమైన ఆర్థికాంశాలే పనిచేసినా, కొన్ని రాజకీయార్థిక కారణాలనూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని ఉండవచ్చు. లెక్కలోకి రాని నగదు, ముఖ్యంగా పెద్ద విలువ కలిగిన నోట్లు, ఎన్నికలలో ముఖ్య పాత్ర నిర్వహిస్తాయనేది అందరికీ తెలిసిందే. 2017లో వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నల్లడబ్బు అందుబాటులో లేకుండా చేసేందుకే మోదీ ప్రభుత్వం ఈ నోట్ల రద్దు నిర్ణయం తీసుకొనివుంటుంది.

                  పెద్ద నోట్లను చట్ట విరుద్ధం చేసిన చర్య సత్వరమే ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు అవరోధమవుతుంది. నగదు లభ్యతలో ఎద్దడి వల్ల వినియోగం తగ్గుతుంది. పెద్ద నోట్లను చట్ట విరుద్ధం చేయడమనేది నిస్సందేహంగా ద్రవ్యోల్బణ నిర్మూలనాచర్యే. వినియోగ వస్తువుల ధరల సూచీ (కన్జూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌-సిపిఐ) పరిగణనలోకి తీసుకొనే వినియోగ వస్తువుల విచక్షణారహిత వినియోగాన్ని అది తగ్గిస్తుంది. ప్రభుత్వమూ, రిజర్వ్‌బ్యాంకూ ఎంతత్వరగా, ఎంతసమర్థంగా ఈ పరివర్తనను పూర్తిస్థాయిలో నిర్వహించగలవో నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం అంత తక్కువగా వుంటుంది. స్థూల ఆర్థిక వ్యవస్థపై కొన్ని మధ్యకాలిక, దీర్ఘకాలిక సానుకూల ప్రభావాలూ ఉంటాయన్నది స్పష్టం. చట్ట విరుద్ధమైన నగదు బ్యాంకుల్లో జమకావడం, కొత్త కరెన్సీ నోట్లు చెలామణీలోకి రావడంతో కొన్ని సానుకూల మార్పులు జరుగుతాయి.

                  అధికార ఆర్థిక వ్యవస్థతోపాటే కొనసాగుతున్న చట్ట విరుద్ధ ఆర్థిక వ్యవస్థ (షాడో ఎకానమీ) నియత ఆర్థికవ్యవస్థలో కలిసిపోతుంది. తద్వారా నీతివంతమైన, చట్టబద్ధమైన ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు ఇది ఎంతో తోడ్పడుతుంది. బ్యాంకు ఖాతాలలో జమ అయ్యే సొమ్ము ఆకస్మికంగా పెరుగుతుంది. ఈ పెరుగుదల జీడీపీలో 7.5 శాతంగా ఉండగలదు. ఈ పరిణామం కూడా చట్టబద్ధ ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు విశేషంగా తోడ్పడుతుంది. వడ్డీరేట్లు తగ్గించి, దేశ ఆర్థిక వ్యవస్థకు మరింతగా రుణ సదుపాయం కల్గించే అవకాశం బ్యాంకులకు కలుగుతుంది. ఇంతకంటే ముఖ్యమైన విషయం, నల్లధనానికి స్వర్గంగా ఉన్న రియల్‌ఎస్టేట్‌ రంగం నగదుకొరతతో తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. స్థిరాస్తుల విలువలు వినియోగ వస్తువుల ధరల సూచీలోకి రానప్పటికీ, ఈ ప్రభావం వల్ల అద్దెరేట్లు తగ్గిపోతాయి. సాధారణ ధరల స్థాయి మరింతగా తగ్గడానికి ఇది దోహదం చేస్తుంది. లెక్కలోకి రానిదిగా పరిగణించి వెల్లడయిన సంపదపై ప్రభుత్వం పన్నులు వసూలుచేయడం వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. ట్యాక్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు డేగ కళ్ళతో బ్యాంకు ఖాతాలను పరీక్షించి, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాయనడంలో సందేహం లేదు. ప్రభుత్వం హీనపక్షం జీడీపీలో 0.5 శాతం (రూ.65,000 కోట్లు) మేరకు అదనపు పన్ను రాబడిని సమకూర్చుకోగలదని అంచనా. ఇది ద్రవ్య ఏకీకరణకు, మౌలిక సదుపాయాల రంగంలో మదుపులకు, ప్రైవేట్‌ మదుపులను విశేష స్థాయిలో ఆకర్షించడానికి ఎంతైనా తోడ్పడుతుంది.

                  నల్లధనం లేనివిధంగా ఆర్థిక వ్యవస్థను శుద్ధి చేయడమనేది పొదుపు, మదుపు రెండిటికీ సానుకూలంగా తోడ్పడుతుంది. అది వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది. మదుపర్లలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని ఇతోధికం చేస్తుంది. సంప్రదాయంగా తాము ఆదా చేసుకున్న సొమ్మును బంగారం, గృహలు మొదలైన భౌతిక ఆస్తుల కొనుగోలు చేసుకునే కుటుంబాలు ఇప్పుడు నగదు రూపేణా పొదుపునకు సుముఖమవుతాయి. ఇది ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. నగదు కొరత ప్రజలను ఎలక్ర్టానిక్‌ లావాదేవీలవైపు మొగ్గేట్టు ప్రోత్సహిస్తుంది. సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత కూడా ఇది కొనసాగుతుంది. ఎందుకంటే ఎలక్ట్రా‌నిక్‌ లావాదేవీల రక్షణ, సదుపాయం, సమర్థత ప్రజల అనుభవంలోకి వచ్చినందున ఇకపై వాటికే మొగ్గు చూపడం ఖాయం. ఇది అవినీతిని అరికట్టి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది.

                  పెద్దనోట్లను చట్టవిరుద్ధం చేయడం రిజర్వ్‌బ్యాంకుకూ, ప్రభుత్వానికీ అనుకోని లాభాన్ని (స్పష్టంగా చెప్పాలంటే ద్రవ్య లాభాన్ని) సమకూరుస్తుందా? నోట్లరద్దుతో వచ్చిన మార్పులను రిజర్వ్‌ బ్యాంక్‌ తన బ్యాలెన్స్‌ షీట్‌లో ఎలా చూపిస్తుంది అనేది విశ్లేషకులను గందరగోళపరుస్తున్నది. ఇది తేలికగా తీసిపారేయగల విషయం కాదు. ఎందుకంటే దాని పర్యవసానాలు అటు ప్రభుత్వ ఆర్థికానికి, ఇటు రిజర్వ్‌బ్యాంక్‌ స్వతంత్ర ప్రతిపత్తికి చాలా కీలకమైనవి. రిజర్వ్‌ బ్యాంక్‌ జారీ చేసే అన్ని కరెన్సీనోట్లపైన నిర్దిష్టనోటు విలువకు సమానమైన మొత్తాన్ని ఆ నోటు కలిగి వున్న వ్యక్తికి చెల్లించడం జరుగుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ హామీ ఇస్తారు. ఇది ఒక చట్టబద్ధమైన బాధ్యత.

                  ఆసక్తికరమైన విషయమేమిటంటే ప్రభుత్వంగానీ, రిజర్వ్‌బ్యాంక్‌ గానీ ఇప్పుడు ‘డిమానెటైజేషన్‌’ అనే పదాన్ని ఉపయోగించలేదు. ప్రభుత్వ ప్రకటన పెద్దవిలువ గల కరెన్సీ నోట్ల చట్టబద్ధ చలామణీని రద్దు చేయడం గురించి మాత్రమే ప్రస్తావించింది. దీనితో ‘డీ లీగలైజేషన్‌’, ‘డీ మానెటైజేషన్‌’ మధ్య స్పష్టమైన తేడా చూపిస్తున్నారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. చట్ట విరుద్ధమైపోయిన 500, 1000 రూపాయల నోట్లు ఎంతమేరకు నశించిపోతాయో (అంటే బ్యాంకింగ్‌ వ్యవస్థకు తిరిగిరాని పరిమాణం) ఆ మేరకు రిజర్వ్‌బ్యాంక్‌ ఏదో పరిష్కారాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం రూ.3లక్షల 50వేల కోట్లు ఉంటుందని అంచనా. ‘విలువకు సమానమైన మొత్తాన్ని చెల్లిస్తా’ననే తన హామీ ఇంకా కొనసాగుతున్నదిగానే రిజర్వుబ్యాంక్‌ భావించి నశించిపోయిన ఆ సంపదకు సమానమైన మొత్తాన్ని ‘స్పెషల్‌ రిజర్వ్‌’కు బదలాయిస్తుందా? లేదా, ఆ హమీ ముగిసిపోయిందని నిర్థారించి ఆ మొత్తాన్ని ‘లాభం’గా లెక్కవేస్తుందా? చట్టం ప్రకారం రిజర్వ్‌బ్యాంక్‌ ‘లాభం’ను ప్రభుత్వానికి బదిలీచేయాలి. ఈ విషయమై కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. అవి: (1) నిర్దిష్టనోటు కలిగివున్న వ్యక్తికి తత్సమానమైన మొత్తాన్ని చెల్లించే బాధ్యతను రిజర్వ్‌ బ్యాంక్‌ ఉపసంహరించుకోగలదా? (2) ఈ దృష్ట్యా ప్రభుత్వం తన ప్రకటనలో చెప్పిన ‘కరెన్సీనోట్ల చట్టబద్ధ చెలామణీ స్వభావాన్ని రద్దుచేయడా’నికీ, డీమానిటైజేషన్‌కూ మధ్య తేడా ఉన్నదా? (3) తన బాధ్యత తీరిపోయిందని రిజర్వ్‌బ్యాంకు నిర్ణయం తీసుకుంటే అది ఏ తేదీనుంచి అమలులోకి వస్తుంది? (4) ఈ మేరకు తగ్గిన ఆ బాధ్యతను రిజర్వుబ్యాంకు ఏ విధంగా పరిగణించబోతున్నది? ప్రభుత్వానికి ఏ విధమైన హక్కూలేని ‘స్పెషల్‌రిజర్వ్‌’గానా, లేక సొమ్మును పూర్తిగా ప్రభుత్వానికి బదిలీచేయాల్సివచ్చే ‘లాభం’ గానా? (5) ఈ విషయమై ప్రస్తుత చట్టంలో అస్పష్టత ఉంటే ప్రభుత్వం దాన్ని సవరించి, ఆ సొమ్ముపై హక్కును సాధించుకుంటుందా? (7) ఒకవేళ ఈ ‘లాభాన్ని’ ప్రభుత్వానికి బదిలీచేస్తే అంత పెద్ద మొత్తం నిర్వహణ ఎలా జరుగుతుంది? ముఖ్యంగా అది ద్రవ్యోల్బణరహితంగా ఉండేట్టు ఎలా చూస్తారు?

ఈ ‘కఠోర’ డీలీగలైజేషన్‌ ఫలితాలు శాశ్వతంగా ఉంటాయా? నిజానికి డీమానెటైజేషన్‌గానీ, డీలీగలైజేషన్‌ గానీ కొత్త భావనేమీ కాదు. గతంలో చాలా దేశాలు చేశాయి. భారత కూడా 1948, 1978లో పెద్ద విలువ గల నోట్లను రద్దు చేసింది. నోట్లరద్దు చర్యను మాత్రమే తీసుకొని, తరువాత ప్రభుత్వాలు ఉదాసీనత వహిస్తే నల్లధనం మళ్ళీ పెరిగిపోతుందనేది ప్రపంచదేశాల అనుభవం.

                  1978 తరువాత కూడా మన దేశంలో ఇదే జరిగింది. అయితే ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు. ఇందుకు చాలా సహేతుక కారణాలు వున్నాయి. 1978లో రద్దయిన నోట్లు చలామణీలో ఉన్న మొత్తం నోట్లలో కేవలం 2 శాతం. ఇప్పుడు రద్దయిన నోట్లు చలామణీలో వున్న నోట్లలో 85 శాతం. ఇక, రెండో కారణం అధునాతన సాంకేతికత. గత నాలుగు దశాబ్దాలలో వచ్చిన సాంకేతికతలవల్ల నగదు చెలామణీ తనిఖీని మరింత సమర్థంగా నిర్వహించడానికి ఎంతైనా ఆస్కారమున్నది. ప్రభుత్వ నిఘా నుంచి తప్పించుకోవడం అవినీతిపరులకు అసాధ్యమవుతుంది. మూడో కారణం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రానున్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ). ఇది నల్లధనం పోగుపడే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుంది. ప్రభుత్వం నిరంతరం జాగరూకతతో ఉండడం ఎంతైనా అవసరం. పెద్ద నోట్ల రద్దు సరైన నిర్ణయమే. అయితే ఈ రద్దు గతంలో కంటే భిన్నంగా ఉండి తీరాలి. భిన్నంగా ఉంచడమనేది మోదీ ప్రభుత్వానికి ఒక సవాలు, ఒక అవకాశం కూడా.

– దువ్వూరి సుబ్బారావు

రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌

(www.isas.nus.edu.sg సౌజన్యం)

(ఆంధ్ర జ్యోతి సౌజన్యం తో)