Home Telugu Articles రాజకీయాలకేదీ ‘తలాక్‌’?

రాజకీయాలకేదీ ‘తలాక్‌’?

0
SHARE

తలాక్‌ రద్దు ప్రతిపాదనను ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బోర్డు సభ్యుల్లో కనీసం ఒక్క మహిళ కూడా లేరు. మహిళల అభిప్రాయాలను తెలుసుకోకుండానే బోర్డు ఎడాపెడా ఆదేశాలు జారీ చేస్తూ ఉంటుంది. తలాక్‌ పద్ధతిని ముస్లిముల్లో ప్రగతిశీల వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇతర వర్గాలవారూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ సమస్యపై విస్తృత స్థాయి చర్చ అవసరం. అల్లా దృష్టిలో స్త్రీ పురుషులు సమానులని మహమ్మద్‌ ప్రవక్త స్పష్టంచేసినా, ముస్లిం పర్సనల్‌ లా బోర్డు పురుషాధిక్యతకు పట్టం కడుతోంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లతో సహా ప్రపంచంలో పలు ముస్లిం దేశాలు తలాక్‌ త్రయాన్ని నిషేధించాయి. కానీ, భారతదేశంలో ఈ సమస్యపై కనీసం చర్చించడానికీ ముస్లిం పెద్దలు సమ్మతించడం లేదు.

‘అద్దాల మేడలో నివసించేవారు ఎదుటివారి మీద రాళ్లు వేయకూడదు. మొదట తమ ఇల్లు చక్కదిద్దుకోవాలి’- ఇస్లామిక్‌ వారపత్రిక ‘రేడియన్స్‌’ ఇచ్చిన సలహా ఇది. ‘ప్రతి రోజూ సొంత వర్గానికి చెందిన వేలాది మహిళలు సజీవ దహనమవుతున్నా, విషప్రయోగంతో మరణిస్తున్నా, వారిని పీక నులిమి చంపుతున్నా పట్టించుకోనివారు ముస్లిం మహిళల స్థితిగతుల మీద మాత్రం మొసలి కన్నీరు కారుస్తూ తలాక్‌ త్రయాన్ని నిషేధించాలని గావుకేకలు పెడుతున్నారు’ అని ఆ పత్రిక విమర్శించింది. అది హిందూ వర్గాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందని స్పష్టంగానే తెలుస్తోంది. మహిళా హక్కుల సమస్యను ఆ పత్రిక హిందూ-ముస్లిం సమస్యగా చిత్రించడం అనుచితం. నిజానికి స్వాతంత్య్రానికి ముందునాటి వరకు హిందువులు, సిక్కులలో సైతం విడాకులకు అవకాశం ఉండేది కాదు. మూడుముళ్ల బంధం జీవితాంతం కొనసాగాలన్న భావనను అంతా శిరసావహించేవారు. స్వాతంత్య్రానంతరం భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ హయాములో హిందూ వైయక్తిక చట్టాన్ని సవరించి విడాకులకు చట్టబద్ధత కల్పించారు. రాజ్యాంగ నిర్మాణ సభ అధ్యక్షుడు డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ ఈ విడాకుల ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించారు. దేశమంతటా గౌరవాదరాలున్న నాయకుడాయన. చివరకు ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టుఉన్న నెహ్రూ, ఈ విషయంలో తన మాట నెగ్గించుకోగలిగారు.

talaq-3

ముస్లిం స్త్రీలు ఇప్పటికీ విడాకుల విషయంలో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. భార్యకు వెంటవెంటనే మూడుసార్లు తలాక్‌ చెప్పి వివాహ బంధాన్ని తెంచుకోవడాన్ని ఖురాన్‌ ఆమోదించకపోయినా, ఈ దురాచారం చాలాకాలంగా అమలులో ఉంది. దీనికి వ్యతిరేకంగా కొందరు ముస్లిం మహిళలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. వివాహంతో సహా అన్ని అంశాల్లో స్త్రీ పురుష సమానత్వం ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం ఉద్ఘాటించింది కూడా. తలాక్‌ త్రయంపై ముస్లిం స్త్రీ పురుషుల అభిప్రాయాలు కోరుతూ ప్రశ్నావళిని పంపాలని ప్రభుత్వం మొదట్లో భావించినా, తరవాత వెనకడుగు వేసింది. తలాక్‌ రద్దు ప్రతిపాదనను ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బోర్డు సభ్యుల్లో కనీసం ఒక్క మహిళ కూడా లేరు. మహిళల అభిప్రాయాలను తెలుసుకోకుండానే బోర్డు ఎడాపెడా ఆదేశాలు జారీ చేస్తూ ఉంటుంది. తలాక్‌ పద్ధతిని ముస్లిముల్లో ప్రగతిశీల వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇతర వర్గాలవారూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ సమస్యపై విస్తృత స్థాయి చర్చ అవసరం. అల్లా దృష్టిలో స్త్రీ పురుషులు సమానులని మహమ్మద్‌ ప్రవక్త స్పష్టంచేసినా, ముస్లిం పర్సనల్‌ లా బోర్డు పురుషాధిక్యతకు పట్టం కడుతోంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లతో సహా ప్రపంచంలో పలు ముస్లిం దేశాలు తలాక్‌ త్రయాన్ని నిషేధించాయి. కానీ, భారతదేశంలో ఈ సమస్యపై కనీసం చర్చించడానికీ ముస్లిం పెద్దలు సమ్మతించడం లేదు. రేడియన్స్‌ పత్రిక వ్యాసం తలాక్‌ పూర్వాపరాలను కనీసం పరిశీలించలేదు. కాలంతో పాటు మారాల్సిన ఆవశ్యకతను గుర్తించలేదు. పైగా సమస్యకు హిందూ-ముస్లిం అంతరాల రంగు పులిమింది. ఇది నిజంగా దురదృష్టకరం. దేశ ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతిని వర్తింపజేయాలని రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు పిలుపు ఇచ్చాయి. ఇది నిర్బంధంగా కాకుండా స్వచ్ఛందంగా అమలులోకి రావాలని ఆశించాయి.

తలాక్‌ త్రయంపై ముస్లిం సమాజ అభిప్రాయాలను కోరుతూ ప్రశ్నావళిని పంపాలన్న ప్రతిపాదనను ముస్లిం పర్సనల్‌ లా బోర్డు కరాఖండీగా వ్యతిరేకిస్తోంది. ఈ సమస్యపై తమను కూడా సంప్రదించాలని దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముస్లిం మహిళలు కోరుతున్నారు. ఈ విషయంలో తటపటాయింపు ఎంతో కాలం కొనసాగకూడదు. తలాక్‌పై మొదట పార్లమెంటు ఉభయ సభలు లోతుగా చర్చించాలి. ముస్లిం సమాజం నుంచి, ముఖ్యంగా మహిళల నుంచి అభిప్రాయాలను కోరాలి. వచ్చే ఏడాది ఉత్తర్‌ ప్రదేశ్‌తో సహా మొత్తం అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా రాజకీయ పార్టీలు తలాక్‌ అంశంపై మౌనం పాటిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో గెలుపునకు ముస్లింల ఓట్లు చాలా కీలకం. ఉత్తర్‌ ప్రదేశ్‌లోనైతే అనేక నియోజక వర్గాల్లో ముస్లిములే నిర్ణాయక శక్తిగా ఉన్నారు. ఆ రాష్ట్రంలో ముస్లిములు మొదట కాంగ్రెస్‌ పార్టీ వైపు ఉన్నా, తరవాత వివిధ కారణాల వల్ల దూరమై ములాయం సింగ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ వెనుక మోహరించారు. ములాయం కుమారుడు అఖిలేశ్‌ ముస్లిముల ఆదరాభిమానాలు చూరగొన్నప్పటికీ, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉన్నందున రేపటి ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండబోతోందో వూహించలేకున్నాం. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ముస్లిములను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నా, అది ఫలించడం లేదు. తమ భవిష్యత్తు రాహుల్‌తోనే ముడివడి ఉందని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ కి ఇప్పుడేం చేయాలో దిక్కుతోచడం లేదు. ఆయన తండ్రి రాజీవ్‌ గాంధీ ముస్లిం మహిళలకు మనోవర్తి ఇప్పించడానికి చట్టం తీసుకురావడం అయోధ్య-బాబ్రీ మసీదు వివాదానికి బీజం వేసింది. తరవాత ఆ కట్టడాన్ని కూల్చడం చరిత్ర గతిని కొత్త మలుపు తిప్పింది. ఇప్పుడు తలాక్‌ విషయంలో నీళ్లునమిలే ధోరణి రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చెప్పలేం.

రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఉమ్మడి పౌర స్మృతిని అభిలషించినా, ఇంతవరకు అన్ని రాజకీయ పార్టీలూ తప్పించుకునే ధోరణిని కనబరిచాయి. దీనిపై నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. తలాక్‌ సమస్యపై నాన్చుడు ధోరణి తగదు. ముస్లిం పర్సనల్‌ లా బోర్డు అభిప్రాయాలు ఎలా ఉన్నా, తలాక్‌పై సాధారణ ముస్లిం స్త్రీ పురుషుల వైఖరిని తెలుసుకోవడానికి తప్పకుండా ప్రశ్నావళిని విడుదల చేయాలి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తలాక్‌ అంశం చర్చకు రావచ్చు. రావాలి కూడా. చర్చనీయాంశాల జాబితాలో తలాక్‌ సమస్య లేకపోతే తప్పనిసరిగా చేర్చాలి. మధ్యయుగాలనాటి ఆచారం ఆధునిక కాలంలోనూ కొనసాగడం ఏమాత్రం సమర్థనీయం కాదు. అయినా ఈ అనాచారాన్ని భారత్‌ వంటి లౌకిక ప్రజాస్వామ్య దేశం ఇప్పటికీ కొనసాగించడం శోచనీయం.

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇకనైనా తటపటాయింపు ధోరణిని కట్టిపెట్టి, పరిస్థితి తీవ్రతను గుర్తించి, తక్షణం పరిష్కార చర్యలు తీసుకోవాలి. తలాక్‌ అనేది హిందూ-ముస్లిం సమస్య కాదు. రాజ్యాంగ స్ఫూర్తి పరిరక్షణకు సంబంధించిన అంశం!

-కులదీప్ నయ్యర్

రచయిత – ప్రముఖ పాత్రికేయులు

(ఈనాడు సౌజన్యం తో)