Home News 24 డిసెంబరును నిజమైన శౌర్యదినంగా నిర్వహించాలి

24 డిసెంబరును నిజమైన శౌర్యదినంగా నిర్వహించాలి

0
SHARE

రెండువందల సంవత్సరాలక్రితం పూనాకు 40కి||మీ|| ల దూరంలో భీమానది ఒడ్డున ఆంగ్లేయుల సైన్యానికి, పీష్వా సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. 1818సం||లో కోరేగావ్‌ఁ వద్ద జరిగిన యుద్ధంవల్ల మరాఠా సామ్రాజ్యం పూర్తిగా పరాజితం అయింది. ఆనాటి ఆంగ్లసైన్యంలో ‘మహార్లు’ గణనీయంగా ఉన్నారు. ఆ యుద్ధంలో చనిపోయిన మహర్‌ సైనికులను స్మరిస్తూ అంబేడ్కర్‌ అనుయాయులు గత అనేక సంవత్సరాలుగా శౌర్యదినంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. యుద్ధంలో మరణించిన సైనికులకు వీరగతి ప్రాప్తిస్తుంది. వారి వీరత్వం ఎంత ప్రముఖమైనదో వారు ఎవరి తరఫున యుద్ధం చేశారన్నది కూడా ఇంకా ప్రముఖమైనది. ఈ శౌర్యదినాన్ని నిర్వహించడానికి వేలాదిమంది అంబేడ్కర్‌ అనుయాయులు కోరేగావ్‌ఁ వద్దగల స్మారకం వద్ద కలుస్తుంటారు. ఈ ఉత్సవాలను ఇంతకాలం మిగిలిన సమాజం పెద్దగా పట్టించుకోలేదు. జనవరి 2వ తేదీన నిర్వహింపబడ్డ ప్రదర్శనపై రాళ్ళురువ్వబడటం, 3వ తారీఖున నిర్వహించబడ్డ బంద్‌ వల్ల జరిగిన దుర్ఘటనలవల్ల కోరేగావ్‌ చరిత్ర మహారాష్ట్రలోని ఇంటింటికి తెలిసింది.

మహార్‌ తెగ ప్రజలు యుద్ధవీరులు. శివాజీ మహారాజ్‌ సైన్యంలో వీరి పరాక్రమం దేదీప్యమానంగా వెలిగింది. 1947లో పాకిస్థాన్‌ కాశ్మీర్‌పై దండయాత్రచేసినపుడు డా||బాబా సాహేబ్‌ అంబేడ్కర్‌ సలహామేరకు పాకిస్థాన్‌ దురాక్రమణను ఎదుర్కొనడానికి మహార్‌ బెటాలియన్‌ పంపబడింది. కాశ్మీర్‌ను రక్షించడంకోసం మహార్‌ సైనికులు చేసిన వీరోచిత యుద్ధం యుద్ధచరిత్రలో బంగారు అక్షరాలతో రాయగలిగిన చరిత్ర. దేశభక్తిని ప్రజ్వరిల్లింపజేసే ప్రేరణాదాయక చరిత్ర అది. ఆనాటి యుద్ధచరిత్రను గుర్తిస్తూ భారత సర్వోచ్ఛ సేనాపతి, తదితర ఉన్నత అధికారులు, ”హిందూ సైన్యంలో మహర్‌ సైనికులు అత్యంత శ్రేష్ఠవీరులు,” అని బహిరంగంగా అనేకసార్లు కొనియాడారు. (ఖైర్‌మోడే గ్రంథము -1, పుట 263) 24 డిసెంబర్‌ 1947లో ఝాంగర్‌ వద్ద భీషణ సంగ్రామం జరిగింది. మహార్‌ సైనికులవద్దగల తుపాకులలో గుండ్లు అయిపోయాయి. అయినా మహార్‌ సైనికులు ముష్ఠి యుద్ధంతోనే పాకిస్థాన్‌ సైన్యపు ఆక్రమణను విజయవంతంగా ఎదుర్కొన్నారు. ఈ పరాక్రమ యుద్ధం సందర్భంగా మహార్‌ సైనికులలో ఒకరికి ‘మహావీరచక్ర,’ మరొక 5మందికి ‘వీరచక్ర’లతో సన్మానించబడ్డారు. నిజానికి 24 డిసెంబరును మహార్లు, మొత్తం భారత సమాజం నిజమైన శౌర్యదినోత్సవంగా జరుపుకోవాలి.

ప్రకాశ్‌ అంబేడ్కర్‌, వామపక్ష భావజాల మేధావులకు 24 డిసెంబరును శౌర్యదినంగా నిర్వహించటం ఇష్టం వుండదు. కారణం ఈ తేదీ సంఘటనలకు బ్రాహ్మణ ద్వేషంకు సంబంధంలేదు. పీష్వాలు జన్మతః బ్రాహ్మణులు. ఆంగ్లేయుల విజయాన్ని మన చరిత్రకారులు బ్రాహ్మణ పరాజయంగా పేర్కొంటున్నారు. ఒకరకంగా చూస్తే అది సత్యమే. పీష్వాలు స్వయంగా రాజులు కాదు, శివాజీ అనుయాయులకు ప్రతినిధులుగా వారు యుద్ధం జేశారు. పీష్వాల పరాజయమంటే మరాఠా మహాసామ్రాజ్యపు పతనమే. ఇంత సరళమైన విషయాన్ని ‘బ్రాహ్మణ పరాజయం’గా పేర్కొనడం వామపక్ష చరిత్రకారుల ప్రత్యేకత.

2 జనవరిన కోరేగావ్‌ ప్రదర్శనపై రాళ్ళురువ్విన సంఘటనలు, దాడులు అత్యంత ఖండనీయం. ఈ దాడుల వెనక గల వ్యక్తులను, శక్తులను గుర్తించాల్సిందే, శిక్షించాల్సిందే. ఈ సందర్భంగా ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు, ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు చేయడం ద్వారా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడం అవసరం. అయితే ఈ సంఘటనలను ఆసరా చేసుకుని ప్రకాశ్‌ అంబేడ్కర్‌ మహారాష్ట్ర 3రోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ ప్రారంభమైన పదిగంటలకే ప్రకాశ్‌ అంబేడ్కర్‌ బంద్‌ను ఉపసంహరించుకోవలసి వచ్చింది. ప్రభుత్వ బస్సులపై, ప్రైవేటు వాహనాలపై నీలం జెండాలతో ఉద్యమకారులు రాళ్ళురువ్వారు, దాడులు చేశారు. అనేకమంది అమాయక ప్రజలు అనేక ఇబ్బందులకు గురిఅయ్యారు. సామాన్య ప్రజలకు చెందిన సమస్యలపై ధరల పెంపుదల, పెట్రోలు, డీజిల్‌ ధరలపెంపు, ఇలాంటి సమస్యలపై బంద్‌కు పిలుపు ఇచ్చినపుడు ఈ సమస్యలు తమవి కాబట్టి ప్రజలందరు బంద్‌కు సహకరించారు, భరించారు. జనవరి 2వ తేదీన జరిగిన దుర్ఘటనలకు సామాన్య ప్రజలకు ఏమి సంబంధం? అదుపు తప్పిన ఉద్యమ కారుల వ్యవహారశైలి కారణంగా సామాన్య మహారాష్ట్ర ప్రజానీకంలో ఒక అసంతృప్తి ఏర్పడింది. రష్యావిప్లవం సందర్భంగా జాన్‌ రీడ్‌ వ్రాసిన ”ప్రపంచాన్ని కుదిపేసిన పదిరోజులు” ( Ten Days that Shook the World) అనే పుస్తకంవలే ”పది గంటలలో మహారాష్ట్ర సమాజాన్ని చీల్చిన వైనం” అనే శీర్షికతో పదిగంటల బంద్‌లో ఉద్యమ కారులు చేసిన నిర్వాకాన్ని ఒక పుస్తకంగా వ్రాయవచ్చును.

డా|| బాబాసాహేబ్‌ అంబేడ్కర్‌ బంధుభావనకు (సోదర భావనకు) అత్యంత ప్రముఖస్థానం ఇచ్చారు. ”బంధుభావం అంటే మానవత్వం, ధర్మానికి మరోపేరు” అని వారు పేర్కొన్నారు. బంధుభావం అంటే అర్థం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం యిస్తూ, ”పౌరులందరిలో బంధుభావన అనుభూతిని కలిగించాలి. ”భారతీయులమందరమూ మన మొక్కటే, మనమందరం సమానులం అనే భావన ఆలోచనలో, ఆచరణలో వ్యక్తం కావాలి, ఇది అత్యంత కష్టమైన పనే” అని పేర్కొన్నారు. ఈ అనుభూతిని, సమరసతను నిర్మాణం చేయటంకోసం వివిధ వర్గాల ప్రజలమధ్య సద్భావన కొరకు గత 30సం||లుగా నేను పనిచేస్తున్నాను. ఈ బంద్‌ కారణంగా ప్రకాశ్‌ అంబేడ్కర్‌వంటి కొద్దిమంది అంబేడ్కర్‌ వాదులకు రాజకీయ లబ్ది లభించవచ్చునేమో, సాధారణ అంబేడ్కర్‌ వాదులకు ఈ సంఘటనలు మింగుడు పడని ఘటనలుగా మిగిలిపోయాయి. అంబేడ్కర్‌ అనుయాయులకు మిగిలిన సమాజం మధ్య అగాధాన్ని ఇవి మరింతగా పెంచాయి.

ఒకనాడు మరాఠా విశ్వవిద్యాలయం పేరును డా|| బాబా సాహేబ్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పేరును మార్చే ప్రతిపాదన పెద్ద వివాదం లేవదీసింది. ఈ వివాదం చాలాకాలం కొనసాగింది. సామాజిక సమరసతా మంచ్‌ కార్యకర్తగా మహారాష్ట్ర సమాజంలోని అన్ని కులాల, వర్గాల ప్రజలను కలిసి నచ్చచెప్పి, ”డా|| అంబేడ్కర్‌ జాతీయ నాయకుడు, ఒక కులనాయకుడు కాదు,” మరాఠా విశ్వవిద్యాలయం పేరును డా|| అంబేడ్కర్‌ మరాఠా విశ్వవిద్యాలయంగా ప్రజలందరిచేత ఏకాభిప్రాయంతో మార్పుచేయించడంలో నేను ఒక కార్యకర్తగా పనిచేయటం నా జీవితంలో మర్చిపోలేని ఆనందకరమైన సంఘటన. ప్రకాశ్‌ అంబేడ్కర్‌ వంటి కొద్దిమంది నాయకుల ధోరణివల్ల నేడు మహారాష్ట్ర సమాజం రెండుముక్కలుగా ఏర్పడింది. దీనికి ఎవరు బాధ్యులు ? ఫడ్నవీస్‌, మోడీ, భాగవత్‌లను కొత్త పీష్వాలుగా బ్రాహ్మణ ద్వేషంతో ప్రకాష్‌ అంబేడ్కర్‌ తదితర నాయకులకు దూషించటం ఆనందం కలిగి ఉండవచ్చును. ఈ దుర్ఘటన సందర్భంగా ఏర్పడిన పరిణామాలకు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ తదితర నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి.

–రమేష్‌ పతంగే

రచయిత పరిచయం – శ్రీ రమేష్‌ పతంగే డా|| అంబేడ్కర్‌ సాహిత్యంపై విశేషమైన అధ్యయనం చేశారు. ప్రముఖ సాహితీవేత్త. సామాజిక అంశాలపై 50కి పైగా పుస్తకాలు వ్రాశారు. వివేక్‌ వారపత్రికకు ఎడిటర్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. అత్యయిక పరిస్థితిలో 18నెలలు జైలు శిక్ష అనుభవించారు. నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌, భారత్‌ భవన్‌, రాజారామ్‌మోహన్‌రావు ఫౌండేషన్‌, ఫిలిమ్‌ సెన్సార్‌ బోర్డు సభ్యులుగా కొనసాగుతున్నారు. స్వామి తిలక్‌ సమరసతా పురస్కారం, షహంజలి పురస్కారం , బౌద్ధిక యోద్ధ సన్మానం, డా|| అంబేడ్కర్‌ సాహిత్యపురస్కారం వంటి అనేక సన్మానాలను పొందారు. 30సం||లుగా వివిధ పత్రికలలో వ్యాసాలు వ్రాస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here