Home Telugu Articles భారతీయ చేనేత – మన అమూల్య సాంస్కృతిక వారసత్వం

భారతీయ చేనేత – మన అమూల్య సాంస్కృతిక వారసత్వం

0
SHARE

-ప్రదక్షిణ

ఆగ‌స్టు 7 – జాతీయ చేనేత దినోత్స‌వం

భారతీయత అంటే మనకు గుర్తుకువచ్చే సాoస్కృతిక కళలలో చేనేత ముఖ్యమైనది. కంటికిoపైన రంగురంగుల వస్త్రాలు, చీరలు, వాటిని నేసే నైపుణ్యo మన వారసత్వం, దేశానికి గర్వకారణం. చేనేత నిత్య సుందరం. నిత్య నూతనం. సంప్రదాయమే కాక, మారుతున్న అభిరుచులకి, జాతీయ అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకి అనుగుణంగా తమ కళను, నైపుణ్యాన్ని మార్చుకుంటూ వస్తున్నారు చేనేత కళాకారులు.

కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం వచ్చాక చేనేత పరిశ్రమకి ప్రభుత్వ చేయూతనందిస్తూ 7 ఆగస్ట్ 2015 తేదిని `జాతీయ చేనేత దినోత్సవం’ గా ప్రకటించింది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం దీనిని మనం జరుపుకుంటున్నాము. 7 ఆగస్ట్ చారిత్రాత్మకమైన రోజు, 1905లో ఆ రోజు కలకత్తాలో స్వదేశీ ఉద్యమo ప్రారంభమైంది, విదేశీ వస్తు బహిష్కరణ చేస్తూ, చేనేత మొదలైన దేశీయ ఉత్పత్తులను తిరిగి పునరుద్ధరించి, ప్రజలు భారతీయ జాతీయతను పెంపొందించుకోవాలని స్వదేశీ ఉద్యమ ముఖ్య ఉద్దేశం. అప్పటి జాతీయ నాయకులు లోకమాన్య శ్రీ బాలగంగాధర్ తిలక్, శ్రీ లాలా లాజపత్ రాయ్, శ్రీ అరవిందో ఘోష్ ( తర్వాతిక కాలంలో మహర్షి అరవిoదులవారు), శ్రీ బిపిన్చంద్ర పాల్ స్వదేశి ఉద్యమసారధులు. ఈ చారిత్రక నేపధ్యాన్ని గుర్తు చేసుకుని అదే సంకల్పంతో చేనేత దినోత్సవాన్ని ప్రజలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అంతర్జాతీయంగా `ఇండియా హ్యాండ్లూమ్’ చేనేత బ్రాండ్ ఆవిష్కరించడమేకాక, `సంత్ కబీర్’ పేరుమీద చేనేత కళాకారులకి అవార్డులు ప్రదా నం చేస్తున్నది.

చేనేత చరిత్ర
భారతీయ చేనేతకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది, ప్రపంచoలో అతి కొద్ది దేశాలకు మాత్రమే ఈ ఘనత ఉంది. పురాతన కాలంనుంచి భారతీయ చేనేత వస్త్రాలు ప్రపంచమంతా ఎగుమతులు చేయబడేవి. రెండువేల సంవత్సరాల క్రితం `హంస’ డిజైన్లతో ఉన్న భారతీయ వస్త్రాలు ఈజిప్టు కైరో నగరంలో లభ్యమయాయి. అగ్గిపెట్టెలో పట్టే మస్లిన్ చీరలను నేసిన ఘనచరిత్ర ఉన్న దేశం మనది. తరతరాలుగా చేనేత కుటుంబాలలో వారసత్వ కళగా ఇది కొనసాగుతోంది. కుటుంబ సభ్యులంతా కలిసి మగ్గాల మీద బట్ట నేస్తుండడం మనకు కనిపిస్తుంది. ప్రముఖ చేనేత కేంద్రాలలోని గ్రామాలలో, మొత్తం గ్రామప్రజలంతా నేతపనిలో నిమగ్నమై ఉంటారు.

భారత దేశంలో దాదాపు 150 చేనేత కేంద్రాలు ఉన్నాయని అంచనా. ఆంధ్రా, ఒడిస్సాల నుంచి నూలు ఇకత్ మరియు జామ్దని, బనారస్ పట్టు, జరీలు, కంచి /తమిళనాడు పట్టు, గుజరాత్ రాజస్థాన్ టై & డై, సూరత్ టాoచౌ, పంజాబ్ పుల్కారి, బెంగాల్ ఢకై, బాలుచరి సిల్క్, అస్సాం మూగా సిల్క్, మహేశ్వరీ జరీ, పటోల డిజైన్, చందేరి సిల్క్, పైథాని సిల్క్, కోటా పేపర్ సిల్క్, మధ్యప్రదేశ్/ ఆంధ్రప్రదేశ్/ ఉత్తరప్రదేశ్/ ఒడిస్సా/ బెంగాల్ టసర్ సిల్క్, ఖాదీ సిల్క్, మైసూరు సిల్క్, కాశ్మీర్ సిల్క్, ఎరి ముడి సిల్క్, కాశ్మీర్ పష్మినా మరియు శాహ్తూష్ పల్చని ఉన్ని, ఈశాన్య రాష్ట్రాల గిరిజనజాతుల రకరకాల చిహ్నాల రంగుల వస్త్రాలు, బీహార్ మధుబని, మహారాష్ట్ర వర్లి డిజైన్లు, ఇంకా ఎన్నెన్నో వివిధ వర్ణాల సమ్మేళనమే భారతీయ చేనేత.

భారతీయ చేనేత మన అమూల్య వారసత్వ సంపద. ఉపాధి విషయంలో వ్యవసాయం తరువాత చేనేతది రెండవ స్థానం, కుటీర పరిశ్రమల కింద కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్నది చేనేత పరిశ్రమ. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70లక్షల మందికి పైగా ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోంది, వీరు మగ్గాల మీద నేసిన వస్త్రాలు, దేశం మొత్తం వస్త్రాల ఉత్పత్తిలో 20% పైగా ఉంటాయి. ప్రపంచ చేనేత వస్త్రాలలో 90% పైగా భారతదేశంలో నేయబడతాయి. నూలు, కాటన్, సిల్క్, పట్టు, ఇతర సహజంగా ఉపలబ్ధమయ్యే నార, పీచులతో అద్భుతమైన వస్త్రాలు తయారు చేస్తారు మన చేనేత కళాకారులు.

బ్లాక్-ప్రింట్స్ చేనేతలో ఆంధ్రప్రదేశ్ ప్రఖ్యాతి ఘనమైనది. స్థానికంగా ఉండే చెట్లు, పువ్వుల నుంచి రంగుల సారం, బంకమన్ను నదులలోని ఇసుకనుంచి రసాయనాలు తయారు చేస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే 15కి మించి చేనేత కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లోనూ వివిధ రకాలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చేనేత పట్టు/సిల్క్ కేంద్రాలు:

పోచంపల్లి ఇక్కత్ డిజైన్
కలంకారీ చేనేతలో రెండు రకాలు- మచిలీపట్నం, పెడనలలో బ్లాక్ ప్రింట్స్; శ్రీకాళహస్తిలో హ్యాండ్.ప్రింట్స్- చేత్తో గీసే డిజైన్లు (కాళహస్తి పుణ్యక్షేత్రo కారణంగా ఆదినుంచీ ఇక్కడ దేవతా మూర్తులు- శివుడు, పార్వతి, వినాయకుడు, లక్ష్మి మొదలైనవి, అక్కడి స్థల పురాణాలతో వస్త్ర చిత్రీకరణ ఉంటుంది. ఎంతోమంది కాళహస్తి చేనేత కళాకారులు వారి హ్యాండ్.ప్రింట్స్ కళానైపుణ్యతకి జాతీయ అవార్డులు గెలుచుకున్నారు.

 • ఉప్పాడ జామ్దాని జరీ చీరలు ఎంతో ప్రఖ్యాతి పొందాయి
 • వేంకటగిరి జరీ
 • నారాయణపేట
 • గద్వాల- కాటన్, పట్టు
 • మంగళగిరి- కాటన్, రెండు వైపులా అంచులు
 • మాధవరం జరీ
 • ధర్మవరం కాటన్/పట్టు
 • గుంటూరు
 • ఎమ్మిగనూర్
 • పొందూరు ఖద్దర్
 • వేంకటగిరి

చేనేత పరిశ్రమ సమస్యలు
పవర్లూమ్స్/ఫ్యాక్టరీ ఉత్పత్తి మొదలైన తరువాత చేనేత పరిశ్రమ కుంటుపడింది. అనేక లోటుపాట్ల కారణంగా చేనేత కుటుంబాలకి గిట్టుబాటు ధర లభించట్లేదు. ముఖ్యమైన సమస్యలు:

 • ముడి సరుకు అందుబాటులో లేకపోవడం – దారం, నూలు, చెట్ల పూల రంగులు; కొనుగోలు చేయడానికి ఎంతో దూరాలు వెళ్ళాల్సిరావడం.
 • ముడిసరుకు ధరలు పెరుగుదల- కాటన్/నూలు, సిల్క్, జనప ధరలు పెరగడం; ఎరువులు పురుగు మందులు, రసాయనాల ధరలు పెరగడం వల్ల కాటన్ ధరలు విపరీతంగా పెరిగాయి.
 • చేనేత రంగంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు లేకపోవడం; ఎన్నో ప్రాంతాల్లో పరిశ్రమ కనీసావసరాలైన స్థలం, నీళ్ళు, విద్యుత్తు కూడా అందుబాటులో ఉండవు.
 • ఇది నూతన యుగం, రంగులు డిజైన్లు క్షణక్షణం మారుతుంటాయి. కొత్త డిజైన్ల కొరత పరిశ్రమను దెబ్బతీస్తోంది. ఇది చేనేత కళాకారులు చేయలేక కాదు, డబ్బు పెట్టేవాళ్ళు `రిస్క్’ లేకుండా వ్యాపారం చేయాలనుకోవడం కారణం.
 • మార్కెట్ల వ్యవస్థ సదుపాయాలు లేకపోవడం
 • చేనేత పరిశ్రమ ఉత్పత్తులకు `పేటెంట్’ లేకపోవడం వల్ల రక్షణ లేదు, అన్ని సంప్రదాయ డిజైన్లు అనుకరించి నకళ్ళు చేస్తున్నారు.
 • చేనేత సహకార సంస్థలు రాజకీయ జోక్యం వల్ల, అవినీతి వల్ల నష్టాల పాలయాయి.
 • కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలలో సరైన నిధుల కేటాయింపులు లేకపోవడం
 • బట్టల మిల్లులు, ఫాక్టరీలు, పవర్లూముల నుంచి చేనేత పరిశ్రమ ఆన్యాయమైన పోటీ ఎదుర్కుంటోంది, చేనేత డిజైన్లు నకలు/ కాపీ చేసి, పవర్లూమ్లులు అవే చేనేత అని చెప్పుకుని చెలామణి అయిపోతున్నాయి. పైగా ఫ్యాక్టరీలకి, పవర్లూములకి ప్రభుత్వ సబ్సిడీలు కూడా దొరుకుతాయి!
 • చేనేత కార్మికులకి కనీస వేతనాలు, ఉపాధి అవకాశాలు అందుబాటులో లేవు.

చేనేత అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు
జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (National Handloom Development Corporation – NHDC)
అన్ని చేనేత కేంద్రాలు, సంస్థలు, సహకార సంస్థల అభివృద్ధికి ఈ సంస్థ కృషి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ చేనేత సహకార సంస్థలు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల ద్వారా చేనేత కేంద్రాలకు సహాయం లభిస్తోంది. చేనేత కార్మికులకి ఆరోగ్య బీమా పధకాలు కూడా కల్పిస్తుంది.

దీనదయాళ్ చేనేత ప్రోత్సాహన్ యోజన
ఇది ఒక విస్తృత కార్యక్రమం. చేనేత ఉత్పత్తుల అభివృద్ధి, రుణ సదుపాయం, చేనేత కళాకారుల శిక్షణ, సామగ్రి పరికరాల సదుపాయం, మార్కెటింగ్ వ్యవస్థ, పెట్టుబడులు, ప్రచారం, రవాణా సదుపాయo మొదలైనవన్నీ కల్పించే విస్తృత ప్రయోజనాలు కలిగిన కార్యక్రమం ఇది.

జాతీయ వస్త్ర డిజైన్ కేంద్రం (National Center for Textile Design- NCTD):
ఢిల్లీ ప్రగతి మైదాన్లో 2001 `చేనేత పెవిలియన్’ స్థాపించబడింది, సంప్రదాయ మరియు నూతన డిజైన్ల రూపకల్పన దీని ప్రధాన ఉద్దేశం. అలాగే గ్రామీణ చేనేత కళాకారులకి ఈ సంస్థ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు మార్గం కల్పిస్తుంది.

చేనేత ఎగుమతి అభివృద్ధి సంస్థ ( Handloom Export Promotion Council):
చేనేత ఎగుమతులు వృద్ధి చేసేందుకు స్థాపించిన ఈ కంపెనీ ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది. దేశదేశాల మార్కెటింగ్ మరియు వ్యాపార సమాచారం; భారతీయ ఉత్పత్తుల గురించి ప్రచారం; కొనుగోలుదార్లతో సమావేశాలు ఏర్పాటు చేయడం; చేనేత ఎగుమతిదార్లకు సలహాలు, సేవలు అందించడం; అంతర్జాతీయ వాణిజ్య సంస్థలతో సంప్రదింపులు, ఒప్పందాలు చేయడం; వాణిజ్య ఎగుమతులలో వచ్చే ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవడం; మార్కెట్లకు అనుగుణంగా చేనేత కళాకారులు ఉత్పత్తులు తయారు చేయడంలో, అధునాతన ఉత్పత్తులు డిజైన్ల తయారీలో మొదలైన విషయాలలో ఎగుమతి సంస్థలకు, చేనేత కార్మికులకు సందర్భానుసారం సలహాలు ఇచ్చి తోడ్పాటును అందిస్తోంది.

అయితే ఏ ప్రభుత్వ సంస్థలు ఎంత చేసినా ఇంత పెద్ద చేనేత కుటీర పారిశ్రామిక రంగం, సరియైన స్థాయిలో ప్రజల చేయూత, తోడ్పాటు, కొనుగోళ్ళు లేకపోతే సుస్థిరంగా నిలబడలేదు. ప్రతి భారతీయుడు, తాము కొనే వస్త్రాలలో, దుప్పట్లు, తువాళ్ళు, కర్టెన్లు, గలీబులు మొదలైన ప్రతిరోజు వాడే వస్తువుల్లో, కనీసం 15-20% చేనేత తయారీలు వాడగలిగితే, మన ప్రాచీన సాంస్కృతిక సంపద, వారసత్వం నిరంతరం జీవించగలుగుతుంది, చేనేత మీద ఆధారపడ్డ లక్షలాది కుటుంబాలు మనుగడ సాగించగలుగుతాయి.

This article was first published in 2021