Home News అఖిల భారతీయ ప్రతినిధి సభ 2021 – బెంగళూరు: తీర్మానం-2

అఖిల భారతీయ ప్రతినిధి సభ 2021 – బెంగళూరు: తీర్మానం-2

0
SHARE
అఖిల భారతీయ ప్రతినిధి సభ 2021 – బెంగళూరు
(యుగాబ్ది 5122, 19-20 మార్చి, 2021)
తీర్మానం-2 

కోవిడ్ 19 మహమ్మారికి వ్యతిరేకంగా ఒకటిగా నిలచిన భారత్

ప్రపంచ వ్యాప్తమైన కోవిడ్19 సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో భారతీయ సమాజం చూపిన అద్భుతమైన సామూహిక, సమీకృత ప్రతిస్పందనను గుర్తించడమేకాక, దానిని నమోదు చేయాలని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ ప్రతినిధిసభ భావిస్తోంది. మహమ్మారి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సమాజంలోని అన్నివర్గాలవారూ నిర్వర్తించిన పాత్రను హృదయపూర్వకంగా అభినందిస్తున్నది.

 మహమ్మారి క్రమంగా వ్యాపించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిపాలనా యంత్రాంగం కార్యరంగంలోకి దిగాయి. వ్యాధి లక్షణాలు, దాని నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సాధారణ ప్రజలకు అవగాహన కలిగించడానికి దేశ వ్యాప్తంగా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం జరిగింది. ఇందులో ప్రసార మాధ్యమాలు కూడా సకరాత్మకంగా వ్యవహరించడంవల్ల పెద్ద జనజాగరణ కార్యం జరిగింది. దేశ ప్రజానీకం మొత్తం ఒక్కటిగా నిలబడి నిబంధనలను తెలుసుకుని, సక్రమంగా పాటించడంతో ఎదురవుతుందనుకున్న పెను ప్రమాదం, నష్టం తప్పింది. తమ ప్రాణాలను సైతం పణంగాపెట్టి సవాళ్లను స్వీకరిస్తూ డాక్టర్ లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించి, రోగులకు వైద్యం అందించారు. పారిశుధ్య కార్మికులు కూడా విలువైన సేవలనందించారు. ఇటువంటి సంక్షోభకాలంలో కూడా దైనందిన కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోకుండా భద్రతా దళాలు, ప్రభుత్వ సంస్థలు, నిత్యావసర సేవలు, ఆర్ధిక సంస్థలు, వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగంలోని సంస్థలు క్రియాశీలంగా పనిచేశాయి.  వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో చేపట్టిన `శ్రామిక్ రైళ్లు’, `వందేభారత్ మిషన్’, ప్రస్తుతపు టీకా పంపిణీ వంటి కార్యక్రమాలన్నీ ఎంతో ప్రశంసించదగినవి.

 ఈ మహమ్మారితో పోరాటంలో నిస్వార్ధసేవలందిస్తూ అనేకమంది కరోనా యోధులు తమ ప్రాణాలను సైతం అర్పించారు. అటువంటి వారి ధైర్యాన్ని, త్యాగనిరతిని ప్రతినిధిసభ అత్యంత కృతజ్ఞతాపూర్వకంగా గుర్తుచేసుకుంటున్నది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారినపడి లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబాలకు హృదయపూర్వక ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నది.

 హఠాత్ పరిణామాలతో ఎంతో ఇబ్బందులకు, బాధలకు గురైన లక్షలాదిమందిని ఆడుకునేందుకు ఆహారాన్ని, వైద్య సహాయాన్ని, రవాణా సదుపాయాన్ని, ఆర్ధిక సహాయాన్ని అందించడానికి భారతీయ సమాజం మొత్తం ముందుకు వచ్చిన వైనం, చూపిన సంవేదన అద్భుతమైనవి. అవసరం ఉన్నవారిని ఆదుకోవడం కోసం సాధారణ ప్రజానీకం, వివిధ స్వచ్ఛంద సంస్థలు స్పందించి బాధితుల ఇళ్ళకి వెళ్ళి సేవలు అందించాయి. ఇటువంటి నిస్వార్ధ, సంవేదనశీలమైన సేవలను అందించిన వ్యక్తులు, సంస్థలన్నిటిని అఖిల భారతీయ ప్రతినిధిసభ ఎంతగానో అభినందిస్తున్నది.

 కోవిడ్ వ్యాప్తి మూలంగా, దానిని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ వలన వలస కార్మికులు, శ్రామికులవంటివారు ఎందరో, ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్నారు. అయినా మన సమాజం ఈ కష్టాలను, ఇబ్బందులను, అనిశ్చితిని ప్రశంసనీయమైన పట్టుదలతో, ధైర్యంతో ఎదుర్కొన్నది.

 సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, నగరాల నుండి పెద్ద ఎత్తున వలసల మూలంగా గ్రామాల్లో చాలా విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని భావించినా పరిస్థితులు మాత్రం ఏ దశలోనూ చేయిదాటిపోలేదు. నిజానికి నగరాల నుండి తిరిగి వస్తున్న వారికి స్థానికులు అందించిన సహకారం, మద్దతు ప్రశంసనీయమైనవి.

 ఈ విపత్కర కాలంలో కూడా వ్యవసాయ ఉత్పత్తి సాధారణ స్థితిలోకంటే ఎక్కువగా ఉంది. పారిశ్రామిక రంగంతోపాటు మొత్తం ఆర్ధిక స్థితి ఆశాజనకంగానే ఉంది. ఈ కఠిన పరిస్థితులను కూడా ఒక అవకాశంగా మలుచుకుని వెంటిలేటర్ లు, పీపీఇ కిట్ ల తయారీ, కరోన పరీక్షలలో కొత్త సాంకేతిక పద్ధతులు, అత్యంత త్వరితంగా చవకైన, ప్రభావవంతమైన స్వదేశీటీకా తయారీవంటివి సాధించాము. కష్టనష్టాలను ఎదుర్కొని నిలవడంలో సమాజపు అంతర్నిహితమైన స్థైర్యం, సహిష్ణుత మరొకసారి ఆవిష్కృతమైనాయి.

 ఈ ప్రపంచవ్యాప్త సంక్షోభ సమయంలో కూడా `వసుధైవకుటుంబకం అనే భావనకు కట్టుబడిన భారత్ అనేక దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలతోపాటు అత్యవసర వస్తువులను పంపిణీ చేసింది. ఆ తరువాత `టీకా మైత్రి కార్యక్రమం క్రింద అనేక దేశాలకు వాక్సిన్ అందిస్తున్నది. సమయానికనుగుణంగా భారత్ అందించిన అంతర్జాతీయ సహకారాన్ని, భారతదేశ భూమికను ప్రపంచంలోని వివిధ దేశాల అధినేతలు ప్రశంసిస్తున్నారు.

 ఈ మహమ్మారి మూలంగా మన సంపూర్ణ వైశ్విక దృష్టికి ఉన్న శక్తిని, ప్రాచీన, వికేంద్రీకృత గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ గొప్పదనాన్ని మరొకసారి తెలుసుకోగలిగాము. సంప్రదాయ విలువలపై ఆధారపడిన నిత్యజీవితపు అలవాట్లు, ఆచారాలు, కుటుంబాలతో ఎక్కువ సమయం గడపడం, మితాహారం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి, సంప్రదాయ ఆహారపు అలవాట్లు, పరంపరాగత ఔషధసేవనం రోగనిరోధకశక్తిని పెంచింది.  యోగా, ధ్యాన ప్రక్రియల సకరాత్మక ప్రయోజనం మొదలైనవి ఈ కాలంలో మనకు ఎంతో మేలు చేకూర్చాయి. భారత్ లో కనిపించే ఈ సమీకృత దైనందిన జీవన విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నిపుణులు చూసి ఆమోదించి, ప్రశంసించారు.

 మహమ్మారి మూలంగా కలిగిన దుష్ఫలితాలు, పరిణామాల నుంచి అదే పట్టుదల, సామర్ధ్యంతో బయటపడి భారతీయ సమాజం శీఘ్రగతిన సాధారణ జీవనస్థితికి చేరుకుంటుందని అఖిల భారతీయ ప్రతినిధిసభ విశ్వసిస్తున్నది. అయితే కరోనా సంక్షోభం పూర్తిగా సమసిపోలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కనుక మహమ్మారి వ్యాప్తి చెందకుండా అవసరమైన మార్గదర్శక నిబంధనలు, జాగ్రత్తలను తూచ తప్పకుండా పాటిస్తూనే ఉండాలి. ఈ సంక్షోభ కాలంలో నేర్చుకున్న పాఠాలను మన వ్యక్తిగత, సామాజిక జీవనంలో నింపుకుని ఆరోగ్యవంతమైన కుటుంబ వ్యవస్థను, సంయమనంతో కూడిన వనరుల వినియోగాన్ని, పర్యావరణ సంరక్షణ వంటివి సాధించాలని, `స్వదేశీ భావనను మనమన జీవితాలలో అలవరచుకోవాలని అఖిల భారతీయప్రతినిధి సభ యావత్ సమాజానికి పిలుపునిస్తున్నది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here