Home News కామారెడ్డిలో ఏబీవీపీ 39వ రాష్ట్ర మ‌హాస‌భ‌లు

కామారెడ్డిలో ఏబీవీపీ 39వ రాష్ట్ర మ‌హాస‌భ‌లు

0
SHARE

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ స‌ర‌స్వతీ శిశుమందిర్ లో శనివారం అఖిల భార‌త విద్యార్థి ప‌రిష‌త్ (ఏబీవీపీ) 39వ  రాష్ట్ర మహా సభలు రెండు రోజుల పాటు జరిగాయి. ఈ సభలకు ఏబివిపి జాతీయ కార్యదర్శి నిధి త్రిపాఠితో పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. మొదటిరోజు పరిషత్ జెండాను ఆవిష్కరించి, అనంత‌రం తెలంగాణ రాష్ట్రంలో అసువుల బాసిన ఏబీవీపీ అమ‌ర‌వీరుల‌కు నివాళులర్పించారు. అనంతరం ఏబీవీపీ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఏడాది కాలంలో ఏబీవీపీ కార్యక్రమాల నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి నిధి త్రిపాఠి మాట్లాడుతూ ప్రారంభ ఉపన్యాసంలో  బాసర సరస్వతి మాతను తలచుకుని, కామారెడ్డి యువకుల త్యాగాలను గుర్తు చేశారు.  ఏబివిపి స్థాపించి 75సంవ‌త్స‌రాలు పూర్తయిందన్నారు. ఈ 75సంవ‌త్స‌రాల‌లో ఎంతోమంది ఎబివిపి కార్యకర్తలు బలిదానం చేసి జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లారు అని గుర్తు చేశారు. జాతీయ జెండా కోసం వరంగల్ కు చెందిన సామ జగన్ మోహన్ బలిదానాన్ని ఈ సంద‌ర్భంగా ఆమె గుర్తు చేశారు. ప్రతి విద్యార్థి దేశం, సమాజం కోసం కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు. స్వార్థాన్ని విడిచిపెట్టి దేశం కోసం సమాజం కోసం ప్రతి విద్యార్థి పని చేసి దేశభక్తిని చాటుకోవాలని సూచించారు. . జాతీయవాద ఏబీవీపీ విద్యార్థి సంఘం దేశంలో అనేక నిర్మాణాత్మక కార్యక్రమాలు చేస్తోంద‌న్నారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులలో ఎబీవీపీ కార్యకర్తలు చేప‌ట్టిన సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలిచాయ‌న్నారు.

కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మ‌రో అతిథి సీబిఐ మాజీ డైరెక్ట‌ర్ మ‌న్నే నాగేశ్వ‌ర రావు మాట్లాడుతూ సంస్కృతి సంప్ర‌దాయాల ప‌రిర‌క్ష‌ణ‌‌కు కృషి చేయాల‌ని యువ‌త‌కు పిలుపునిచ్చారు. భార‌త‌దేశ‌ ప్రాచీన నాగరికత గొప్పదన్నారు. వేదాలు, ఉపనిషత్తులలోని సారాంశాన్ని ప్రతి విద్యార్థి, దేశ పౌరుడు తెలుసుకోవాలన్నారు. అదే విధంగా ఏబీవీపీ స్వాగ‌త క‌మిటీ అధ్య‌క్షుడు పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ జ‌పాన్ లాంటి చిన్నదేశాలు త‌మ దేశం కోసం ఐక్య‌మ‌త్యంగా ఉంటూ చైనా వంటి  పెద్ద దేశాల‌ ఆధిపత్యధోరణిని ఎదిరించి నిలబడుతున్నాయ‌ని అన్నారు. దేశ మాత సేవ కోసం ఎల్ల‌ప్పుడూ విద్యార్థులు ముందుండాల‌ని కోరారు.  అనంత‌రం ఎబివిపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన  శంక‌ర్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎన్నికైన ప్రవీణ్‌ రెడ్డి లను ఘ‌నంగా స‌న్మానించారు. రెండు రోజుల మ‌హాస‌భ‌ల్లో భాగంగా మొద‌టి రోజు సాయంత్రం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ర్యాలీలో స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల వేష‌ధార‌ణ‌లో చిన్నారులు అల‌రించారు.

రెండో రోజు మ‌హాస‌భ‌లో భాగంగా రాష్ట్రంలో విద్యారంగ, నిరుద్యోగ సమస్యలపై, రాష్ట్ర స్థితి పై తీర్మానాలు ప్రతిపాదించి ఆమోదించడం జరిగింది. అనంత‌రం సామాజిక సేవకుడు ట్యాంక్ బండ్ శివ (హన్మంతు)కు  జనమంచి గౌరి శంకర్ యువ పుర‌స్కారంతో పాటు రూ.25వేల న‌గ‌దు బ‌హుమ‌తి అంద‌జేశారు.
కార్య‌క్ర‌మంలో ఏబీవీపీ జాతీయ స‌హ సంఘ‌ట‌న కార్య‌ద‌ర్శి గుంత ల‌క్ష్మ‌న్‌, ఏవీపీ విభాగ్ ప్ర‌ముఖ్ న‌రేష్‌‌, ప్రాంత సంఘ‌ట‌న కార్య‌ద‌ర్శి నిరంజ‌న్‌, బాల‌కృష్ణ‌, రాష్ట్ర సంఘ‌ట‌న కార్య‌ద‌ర్శి సాయిబాబా, శివ‌కుమార్‌, ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచార‌క్ రాజిరెడ్డి, మొద‌టి రోజు స‌భ‌లో నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్, వివిధ క్షేత్రాల ప్ర‌ముఖులు, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here