Home Telugu Articles పర్యావరణ పరిరక్షణలో మహనీయుల కృషి 

పర్యావరణ పరిరక్షణలో మహనీయుల కృషి 

0
SHARE

5 జూన్ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొందరు మహనీయుల వివరాలు తెలుసుకుందాం

గౌర్ దేవి

1974లో అప్పటి ఉత్తరప్రదేశ్ పర్వత ప్రాంతంలో అనగా నేటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషి మఠ్ లో మొదటిసారి చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. ఆధునిక భారతదేశ ప్రథమ పర్యావరణవాది అయిన గౌర్ దేవి అటవీ అధికారులు ఆ ప్రాంతంలో చెట్లు నరకడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, దాన్ని ఎదుర్కోవడానికి వందలాది మంది మహిళలను చెట్లను ఆలింగనం చేసుకుని(చిప్కో – చిపక్ నా అంటే అంటుకోవడం, ఆలింగనం చేసుకోవడం) కాపాడవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ విధంగా వారు అక్కడి పర్యావరణాన్ని కాపాడుకో గలిగారు.

సుందర్ లాల్ బహుగుణ

గౌర్ దేవితో పాటు ఆమె తర్వాత చిప్కో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత సుందర్ లాల్ బహుగుణ కు దక్కుతుంది. ఆయన తమ జీవితాన్ని ఈ ఉద్యమం కోసం అర్పించారు. నీరు, నేల, పర్యావరణం రక్షించే విధంగా స్థానిక ప్రజలను సమాయత్తం చేశారు. వీరు భూకంప ప్రభావిత ప్రాంతమైన  తెహ్రీ..గఢ్ వాల్  ప్రాంతంలో చెట్ల నరికివేతను అడ్డుకునేందుకు చిప్కో ఉద్యమం నిర్వహించారు. తెహ్రీ ఆనకట్ట నిర్మాణంలో స్థానిక ప్రజలకు, పర్యావరణానికి తీవ్రమైన హాని జరుగుతుందని ఉద్యమం చేపట్టి ఆ నిర్మాణాన్ని ఆపారు.  పర్యావరణ పరిరక్షణ కోసం 20 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. హిమాలయ పర్వతాల చుట్టూ ఉన్న  రాష్ట్రాల పర్యావరణ హక్కుల కోసం పాటు పడ్డారు.

ఎంసీ మెహతా

మెహతా సుప్రసిద్ధ పర్యావరణ న్యాయవాదిగా పేరూపొందారు. పర్యావరణ పరిరక్షణ కోసం అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సుప్రీంకోర్టులో వేసి, వాదించారు. ఆగ్రా తాజ్ మహల్ రక్షణ, గంగానదిని శుభ్రపరచడం, నదీ తీరాల వెంబడి నిర్మాణాలు అరికట్టడం, తొలగించడం, వ్యవసాయంలో రసాయనాల వాడకంపై నియంత్రణ, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటిలో పర్యావరణ పరిరక్షణపై పాఠ్య ప్రణాళిక రూపొందించి, బోధించడం వంటివాటిపై ఆయన సుదీర్ఘకాలంగా సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేశారు.

ఖేజ్ డాలీ ప్రజల బలిదానం

జోధ్ పూర్ కోట నిర్మాణం కోసం సున్నం ఉడికించడానికి పెద్ద ఎత్తున కలప అవసరం వచ్చింది. అప్పటి రాజు అజిత్ సింగ్ తన సైనికులకు కలప కోసం ఖేజ్ డాలీ గ్రామం వెళ్లి ఖేజ్డీ చెట్లను నరికి తీసుకురావాలని ఆదేశించారు. రాజాజ్ఞ తో సైనికులు చెట్లు నరకడానికి ఆ గ్రామానికి వెళ్లారో ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ఎడారి ప్రాంతంలో తమ జీవితాలను కాపాడే కల్పవృక్షంలాంటి చెట్లను నరకడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ వాళ్ళు ఆ సైనికులను ఎదురించలేకపోయారు. ఇలాంటి విషమ పరిస్థితిలో ఖేజ్ డాలీ గ్రామానికి చెందిన రామో బిష్ణోయి భార్య ఇమారతి దేవి ముందుకు వచ్చి ఒక చెట్టుని గట్టిగా ఆలింగనం చేసుకుంది. సైన్యాధిపతి ఆగ్రహించి చెట్లను నరకమని సైనికులకు ఆదేశిస్తే వాళ్ళు చెట్టుతోపాటు ఆమెను కూడా ఖండించారు. ఆమె ఇద్దరు కూతుళ్లు కూడా తల్లిని అనుసరించారు. వారి తెగువ, బలిదానాన్ని చూసి చాలా మంది పురుషులు, మహిళలు, చివరికి పిల్లలు కూడా చెట్లను పట్టుకుని నిలబడ్డారు. చివరికి ఈ విషయం మహారాజుకు తెలిసింది. సైనికులు వారందరి తలలు నరికి రాజు ముందు పెట్టారు. వాటిలో సుమారు అరవై తొమ్మిది తలలు మహిళలవే. ఈ హృదయవిదారకమైన సంఘటనతో చలించిపోయిన మహారాజు స్వయంగా గ్రామానికి వచ్చి క్షమాభిక్ష వేడుకొని ఇక ముందు ఆ ప్రాంతంలో ఏ ఒక్క చెట్టూ నరకడానికి వీలులేదని,  ఒకవేళ నరికితే తీవ్రమైన శిక్ష విధిస్తామని ఆజ్ఞాపించారు. ఇప్పటికీ ఆ గ్రామంలో ఈ పద్దతి  అమలులో ఉంది. సుమారు 271 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన పర్యావరణ పరిరక్షణలో అనేకమందికి ప్రేరణగా నిలిచింది, ఇప్పటికీ నిలుస్తోంది.

చండీ ప్రసాద్ భట్

చిప్కో ఉద్యమంతో ముడిపడ్డ కార్యకర్త. అటవీ సంరక్షణ కోసం గౌర్ దేవి ప్రారంభించిన ఉద్యమంలో భాగస్వాములై వందలాది గ్రామాలను సంఘటితపరచి, జాగృత పరచి అడవులు నరికివేతను అడ్డుకున్నారు.

 

 

 

Source:
– పర్యావరణీయ ప్రేమీ హిందూ దృష్టి (4,5 పేజీలు) రచయిత. డా.భజరంగలాలగుప్తా, సురుచిప్రకాశన్, ఐదవ ముద్రణ.. డిసెంబర్ 2015.

– వృక్షారోపన్ ఏవం పర్యావరణ సంకలన సంపాదన్ (6-9పేజీలు), ద్వితీయ ముద్రణ.. జనవరి 2019

– Centre for Social Studies, Bhopal, MadhyaPradesh

This article was first published in 2019