Home News అంగర త్రివిక్రమ్ జీ కి పూజ్య సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ గారి శ్రద్ధాంజలి

అంగర త్రివిక్రమ్ జీ కి పూజ్య సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ గారి శ్రద్ధాంజలి

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జ్యేష్ట ప్రచారక్ శ్రీ. అంగర త్రివిక్రమ రావు జీ నిన్న (20.8.2017) హైదారాబాద్ లో స్వర్గస్తులయ్యారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. ప్రాంత సంపర్క ప్రముఖ్ గా చాలాకాలం బాధ్యతలు నిర్వర్తించిన త్రివిక్రమ్ జీ కొంతకాలం విశ్వహిందూ పరిషత్ కార్యదర్శిగా కూడా ఉన్నారు.

కేశవానిలయం, భాగ్యనగర్ లో జరిగిన శ్రద్దాంజలి కార్యక్రమంలో పూజ్య సర్ సంఘచాలక్ డా. మోహన్ జీ భగవత్ మాట్లాడారు.

త్రివిక్రమ్ జీ ఒక తపస్వి

“నేను చాలా కాలంగా నాగపూర్ లో ఉండడం వల్ల అఖిల భారతీయ కార్యకర్తను కావడానికంటే ముందే దేశం మొత్తం లోని అనేకమంది కార్యకర్తలను కలిసే అదృష్టం నాకు కలిగింది. నాగపూర్ లో తృతీయ వర్ష శిక్షవర్గ కోసం శ్రీ. త్రివిక్రమ్ జీ వస్తుండేవారు. అలాగే పర్యటనలో భాగంగా నేను భాగ్యనగర్ వచ్చినప్పుడు కలుస్తుండేవారం.

ఇన్నేళ్లుగా ఆయన్ని చూసిన నాకు ఆయన ఎప్పుడు ఆందోళనగా కనిపించలేదు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవారు. ఏదైనా విషయాన్ని గురించైనా కచ్చితంగా చెప్పేవారు. కానీ స్వరం మృదువుగానే ఉండేది, మాటలు సున్నితంగానే ఉండేవి.

ఎవరు ప్రశాంతంగా, ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటారో వారి మనస్సు స్వచ్చంగా ఉంటుందని మన శాస్త్రాలు చెపుతున్నాయి. ఈ లక్షణాన్ని `ఆర్జవం’ అంటారు.

సంఘ ప్రచారక్ గా ఆయన తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేశారు. ఎంతో సంవేదనశీలతతో పనిచేశారు. ప్రతి ప్రచారక్ కు ఈ సంవేదన శీలత ఉంటుంది. కానీ దీర్ఘకాలం ప్రచారక్ గా కొనసాగడం కష్టం. మనసు, బుద్ధికి సంబంధించి అనేక క్లిష్టమైన, కష్టమైన సందర్భాలు ఎదురవుతుంటాయి. వివేకం లేకుండా కేవలం సంవేదనే ఉంటే సంతులనాన్ని కోల్పోతాం. అలాగని సంవేదన లేకపోతే ప్రచారక్ కాలేము. త్రివిక్రమ్ జీ ఇన్నేళ్లు సమాజం పట్ల సంవేదన తో పాటు వివేకాన్ని కూడా నిలబెట్టుకోగలిగారు.

రెండు ప్రాంతాలకు (తెలంగాణ, ఆంధ్ర) చెందిన అనేక మంది స్వయం సేవక్ లు వారి అంతిమ యాత్రలో పాల్గొనడానికి వచ్చారు. ఇది స్వయంసేవకులపై వారు చూపిన ప్రభావాన్ని మనకు తెలుపుతుంది. ఒక తపస్వి వెళ్లిపోయారు. కానీ త్రివిక్రమ్ జీ ఏ సంఘ కార్యాన్ని జీవితాంతం నిర్వర్తించారో దానిని మనం కొనసాగించాలి.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తరపున మనలో ఒకరైన త్రివిక్రమ్ జీ కి శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాను.”

దక్షిణ మధ్య క్షేత్ర సంఘచాలక్ శ్రీ. వి. నాగరాజు జీ, దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ. ఎ. శ్యాం కుమార్ జీ, అఖిల భారతీయ సహ గోసేవా ప్రముఖ్ శ్రీ. అజిత్ మహాపాత్ర జీ, తెలంగాణా ప్రాంత సంఘచాలక్ శ్రీ. ప్యాటా వేంకటేశ్వర రావు జీ, ఆంధ్ర ప్రాంత సంఘచాలక్ శ్రీ. సుందర మూర్తి జీ, కేంద్ర మంత్రి శ్రీ. బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే శ్రీ. కిషన్ రెడ్డి కూడా త్రివిక్రమ్ జీ కి శ్రద్దాంజలి ఘటించారు.