Home News అన్నం పెట్టని ‘ఆధునిక సోషలిజం’!

అన్నం పెట్టని ‘ఆధునిక సోషలిజం’!

0
SHARE

విప్లవాల పురిటిగడ్డగా భావించే లాటిన్ అమెరికాలోని వెనిజులాలో ఇప్పుడు అరాచకం రాజ్యమేలుతోంది. ఆధునిక సోషలిజం ఏర్పాటు చేస్తామన్న ఆ దేశంలో ఆహారం అందక ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. అక్కడ ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొన్ని నగరాల్లో నీటి సరఫరా సైతం సరిగా లేక ప్రజలు నరకాన్ని చవిచూస్తున్నారు. స్వర్గంతో సమానమైన ‘సోషలిజం’ తీసుకొస్తామన్న పాలకులు అత్యవసర ఔషధాలను సైతం అందించలేక ప్రజలను అవస్థలలోకి నెట్టారు. ప్రజలు, ప్రతిపక్షాలు రోజూ ప్రదర్శనలు, ఆందోళనలు చేయడంతో అంతర్జాతీయ మీడియా వెనిజులాలోని స్థితిగతులపై వార్తాకథనాలను ప్రసారం చేస్తోంది. దీనికంతటికీ పాలకుల విధానాలే కారణమని అక్కడి ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. వీరావేశంతో తమ నేత ఛావెజ్ చేసిన ప్రయోగం ప్రస్తుత కష్టాలకు, కడగండ్లకు కారణమని వాపోతున్నారు. 1991 సంవత్సరంలోనే సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయి సోషలిస్టు వ్యవస్థకు నూకలు చెల్లాయని చెప్పకనే చెప్పినప్పటికీ 1999 సంవత్సరంలో వెనిజులా నాయకుడు హ్యూగో ఛావెజ్ ఆధునిక సోషలిజం ఏర్పాటు చేస్తామని భ్రమలు కల్పించి అధికారంలోకి వచ్చి ‘ప్రయోగం’ చేసాడు. సోషలిస్టు విధానంలో భాగంగా కర్మాగారాలను, వనరులను జాతీయం చేసారు. చమురు నిల్వలు దండిగా వున్న దేశం కావడం, ఆ సమయంలో అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు ఎక్కువగా ఉండడంతో తొలిరోజుల్లో ఛావెజ్ అనుకున్నట్టుగా పాలన సాగించగలిగాడు. పోటీలేని తనం పెరగడం, అన్నీ ఉచితంగా అందడంతో అవసరమైనమేర కొత్త రంగాల విస్తృతి జరగలేదు. చమురు ఆదాయంతో అన్నింటినీ దిగుమతి చేసుకునే విధానం ఇప్పుడు ఆ దేశ ప్రజలకు ఉరితాడుగా మారింది. అయితే- చమురు ధరలు బాగా పడిపోవడంతో మునపటిలా పెద్దమొత్తంలో ఆదాయం లేదు. దిగుమతులు చేసుకునేందుకు విదేశీ నగదు నిల్వలు లేవు. దేశం స్వయం సమృద్ధం కాలేదు. ఫలితంగా దారుణ సంక్షోభం ఆ దేశం తలుపు తట్టింది.

ఈ అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో తన మద్దతుదారులతో ‘రాజ్యాంగ నిర్మాణ సభ’ను ప్రకటించడంతో అగ్గిమీద గుగ్గిలం వేసినట్టయింది. ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాలకు బలమున్నప్పటికీ వారిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో దేశ రాజధాని కారకస్ రణరంగాన్ని తలపిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని అమెరికా కయ్యానికి కాలు దువ్వుతోంది. వెనిజులా ప్రజల్ని ఆదుకునేందుకు అవసరమైతే అమెరికా సైనిక చర్యకు దిగుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది.

వెనిజులాలో ఇప్పుడు ప్రభుత్వ పాలన లేదు, సాయుధ ముఠాలు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని కారకస్‌లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. తుపాకీ సంస్కృతి పెచ్చుమీరింది. దోపిడీలు, కిడ్నాప్‌లు, లూఠీలు నిత్యకృత్యమయ్యాయి. పిల్లలకు సరైన ఆహారం, ఔషధాలు అందివ్వలేక తల్లులు కన్నీరు మున్నీరవుతున్నారు, శోకిస్తున్నారు. ఉదయం లేవగానే జనం ప్రభుత్వం ఇచ్చే సరకుల కోసం ‘క్యూ’లో నిల్చుంటున్నారు. గంటల తరబడి నిలుచున్నా సరకులు లభించడం లేదని ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. చాలాచోట్ల సూపర్‌మార్కె ట్లు ఖాళీగా కనిపిస్తున్నా యి. ఎక్కడైనా సరకులు కనిపిస్తే జనం దోచుకెళుతున్నారు. కొందరు అధిక ధరలకు అమ్ముతున్నారు.

దీన్ని సహించలేక ప్ర జలు రోడ్డెక్కితే ప్రభుత్వ బలగాలు కాల్పులు జరుపుతున్నాయి, లాఠీచార్జి చేస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి సంఘటనల్లో ఎంతోమంది మరణించారని వార్తా సంస్థలు ప్రకటించాయి. ఆకలికి తాళలేక కొందరు పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు, పావురాళ్లను చంపి తింటున్నారని అక్కడి ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు. ఇది వెనిజులా దీనస్థితికి అద్దం పడుతోంది. దీనికంతటికీ అధికార పార్టీ ముందుచూపు లేనితనమే కారణమని, పాలనపై పట్టు లేకపోవడమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం చమురు రంగంపైనే ఆధారపడి ప్రణాళికలు వేయడం కొంప ముంచిందని విశే్లషకులంటున్నారు. చమురు ధరలు పడిపోవడంతో వెనిజులా వెన్ను విరిగింది. దాంతో హ్యూగో ఛావెజ్ సుందర ‘సోషలిస్టు స్వప్నం’ కుప్పకూలింది. ఛావెజ్ వారసుడిగా అధికార పగ్గాలు చేపట్టిన ప్రస్తుత అధ్యక్షుడు మదురో మెడకు సమస్యలు చుట్టుకున్నాయి. దాంతో అతను ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రతిపక్షాల దాడిని, అంతర్జాతీయ ఒత్తిడిని ఏమాత్రం తట్టుకోలేక పోతున్నాడు. ఎప్పుడు ఏం జరుగనున్నదో ఎవరికీ అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి.

కేవలం 18 సంవత్సరాల వ్యవధిలో వెనిజులా ప్రజలు ఘోరమైన పరిస్థితిలోకి నెట్టబడ్డారు. ‘బంగారు బాతు’ను గొంతుకోసి చంపేశారని అక్కడి ప్రజలు వాపోతున్నారు. మందులు లేక కనీసం ‘టాయ్‌లెట్ పేపర్’ దొరక్క రాజధాని ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఈ పరిస్థితులను తట్టుకోలేక చాలామంది యువకులు వలసబాట పట్టారు. పొరుగు దేశాలకు పయనమవుతున్నారు. ఆహా ర ధాన్యాల కొరతను కొం దరు ఆసరా చేసుకుని బ్లాక్ మార్కెట్‌కు అమ్ముతూ సొ మ్ము చేసుకుంటున్నారు. అలా అమ్మేవారు అటు పాలకులకు, ఇటు సాయుధ ము ఠాలకు కొంత శాతం సొమ్ము సమర్పించుకుంటూ మిగతాది తమ జేబుల్లో వేసుకొంటున్నారు. ఈ విధానం విశృంఖలంగా సాగుతోంది. సోషలిస్టు సమాజం పేర ఇప్పుడు వెనిజులాలో అరాచకం, అ మానవీయత రాజ్యం ఏలుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా సంచులనిండా స్థానిక కరెన్సీ ‘బొలబొ’ కట్టలు పట్టుకెళ్లినా సరకులు లభించడం లేదని పౌరులు వాపోతున్నారు.

1999లో అధికారంలోకి వచ్చాక ఛావెజ్ మార్క్సిజంపై మోజుతో, సోషలిస్టు సమాజ స్వప్నం మత్తులో అప్పటివరకున్న వ్యాపారాలనన్నింటినీ జాతీయ చేసాడు. అనేక కంపెనీలను జాతీయ చేయడంతో అవి పోటీలో లేకుండా పోయాయి. ఇప్పుడు ప్రపంచమంతటా ఉన్న స్వేచ్ఛా విపణితో సత్సంబంధాలు కొరవడ్డాయి. సరకులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం దగ్గర విదేశీ నిల్వలు లేవు. అప్పుల కుప్పలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఛావెజ్‌ను అభిమానించి, ప్రశంసించి, గొప్ప నాయకుడన్నవారే ఇప్పుడు విమర్శలకు, శాపనార్థాలకు దిగారు. ఛావెజ్ క్యాన్సర్ వ్యాధితో మరణించే ముందు తన రాజకీయ వారసునిగా నికొలస్ యెడూరోను ప్రకటించారు. ఆయనొక బస్సు డ్రైవర్. సోషలిస్టు వ్యవస్థలో రాజకీయ విశ్వాసానికి ప్రాధాన్యత ఇస్తారు తప్ప నైపుణ్యాలకు కాదు. ఛావెజ్ రాజకీయ వారసత్వాన్ని కొత్త అధ్యక్షుడు కొనసాగిస్తాడని గట్టిగా ప్రచారం చేసారు. కాని కొత్త అధ్యక్షుడికి పరిస్థితులు అనుకూలంగా లేవు. చమురు ధరలు క్రమంగా పడిపోవడం, ప్రత్యామ్నాయ ఆదాయం లేకపోవడం, గుదిబండగా ‘సోషలిస్టు మార్గం’ మారడంతో దేశం అప్పుల్లో కూరుకుపోవడంతో ఆయన అచేతనంగా మారాడు. ఈ సమయంలోనే ప్రతిపక్షాలు తమ స్వరాన్ని పెంచి ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తూ స్వేచ్ఛా మార్కెట్ కోసం పట్టుబడుతున్నాయి. అధ్యక్షుడు తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లాటిన్ అమెరికాలోని ఇతర దేశాల మాదిరి ప్రజాస్వామ్య విధానం కొనసాగాలని సోషలిస్టు వ్యవస్థ పేర నియంతృత్వం, దాష్టీకం సహించమని నినదిస్తున్నాయి. నిరసనకారులను ప్రభుత్వం కటకటాల పాల్జేస్తోంది. ఆర్థిక, సామాజిక రాజకీయ అసంతృప్తి గరిష్ట స్థాయికి చేరుకుంది. సైనికుల సాయంతో అధ్యక్షుడు నెట్టుకొస్తున్నాడు.

‘ఇదంతా అమెరికా నిఘా వ్యవస్థ సిఐఎ కుట్ర’ అని యథాప్రకారం తమ అసమర్థతను పాలకులు కప్పిపుచ్చుకుంటున్నారు. క్యూబాగాని ఇతర దేశాలుగాని స్నేహ హస్తం అందించడానికి ముందుకు రావడం లేదు. గతంలో మాదిరి ‘సోషలిస్టు బ్లాక్’ సుసంపన్నంగా లేదు. అసలు ఆ ‘బ్లాక్’ లేకుండానే పోయింది. ఛావెజ్ వీరావేశంతో విప్లవవీరుడన్న పేరు కోసం మార్క్స్ సిద్ధాంతం ఒట్టిపోయిందని ప్రచారం చేసి, తన దేశాన్ని ఊబిలోకి దింపేశాడు. ప్రపంచీకరణ ఫలితాలు అన్ని దేశాలు అందుకుంటున్న తరుణంలో అమెరికాపై ద్వేషంతో ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆయుధ బలంతో, అశాస్ర్తియ పద్ధతిలో ముందుచూపు లేనితనంతో వెనిజులా ప్రజలను ఆయన వారసులు మలమల మాడుస్తున్నారు. చైనా, రష్యా దేశాలు భేషజాలకు పోకుండా సిద్ధాంత పరివర్తనకు పూనుకుని , కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళుతున్న వేళ- వెనిజులా మాత్రం 21వ శతాబ్దపు సోషలిజం పేరిట గొప్పలకు పోగా, అక్కడి ప్రజలు అరాచకాన్ని చవిచూసే రోజులొచ్చాయి. నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఆధునిక సోషలిజమంటే- ‘అన్నమో రామచంద్రా..’ అని అలమటించడమేనా?

-వుప్పల నరసింహం సెల్: 99857 81799

(ఆంధ్రభూమి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here