Home Telugu Articles అన్నార్తుల వేదన వినేవారెవ్వరు?

అన్నార్తుల వేదన వినేవారెవ్వరు?

0
SHARE

అన్నం పరబ్రహ్మ స్వరూపం’ తత్వాన్ని అనాది కాలంగా అణువణువునా జీర్ణించుకున్న భారతీయ సమాజానికి తెచ్చిపెట్టుకున్న తెగులు పుట్టింది. జీవుల పుట్టుక, శరీర నిర్మాణం, పోషణకు మూలం అన్నం. జీవులన్నీ అన్నగత ప్రాణులే. ‘అన్నాద్భవన్తి భూతాని’ అన్న సత్యం తెలిసిన భారతీయుడు ఉద్దేశ పూర్వకంగా దీనిని విస్మరించడం దురదృష్టకరం. రంతిదేవుడు నడయాడిన నేల మీద నిర్లజ్జగా అన్నాన్ని వృథా చేయడమే ఆడంబరంగా భావించే దుస్థితికి లోనుగావడం అత్యంత శోచనీయం. అన్నపూర్ణ నివాసమైన భారతదేశంలో ఆకలిచావులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహిస్తున్న దుస్థితికి దిగజారిపోయాం. ఇతరుల ఆకలిని తీర్చడానికి తనకున్న ఆహారాన్ని కూడా మనఃస్ఫూర్తిగా అర్పించగలిగే దైవ గుణాన్ని విస్మరించి తన కడుపు నింపుకోవడమే కాకుండా ఇతరుల నోటి దగ్గర కూడు లాక్కోవడం, తన అవసరం తీరిన తరువాత మిగిలిన దానిని చెత్తకుప్పపాలు చేసే దానవత్వాన్ని ఒంటబట్టించుకుంటున్నాం.

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఆహారంలో మూడవవంతు ఆహారం వృథా అవుతున్నది. దాదాపు 47 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే 1.3 బిలియన్ టన్నుల ఆహారం ప్రపంచవ్యాప్తంగా ఏటా వృథా అవుతున్నది. ఇందులో 40 శాతం ఆహార పదార్థాలను అమెరికా వృథా చేస్తూండగా భారత్ ఏడవ స్థానంలో ఉండడం క్షమించరాని అంశం. ప్రభుత్వ అంచనాల ప్రకారం మన దేశంలో ఏటా 67 మిలియన్ టన్నుల ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయి. ఇది ఇంగ్లాండ్ దేశంలో ఉత్పత్తయ్యే ఆహార పదార్థాల కంటే అధికం. మనం పారవేసే ఆహార పదార్థాలతో బిహార్ ప్రాంతాన్ని మొత్తం ఏడాది పాటు పోషించవచ్చు. మన దేశంలో వృథా అవుతున్న ఆహార పదార్థాల విలువ దాదాపు 92వేల కోట్ల రూపాయలని అంచనా. దాదాపు 60 కోట్ల మంది ప్రజలకు ఆహార పదార్థాల సబ్సిడీల రూపంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మొత్తంలో ఇది మూడింట రెండు వంతులుంటుంది.

ఆహారాన్ని వృథా చేయడం నేరమే కాదు పాపం కూడా. ఇలాంటి వృథాతో పేదలు ఆకలితో చనిపోవడానికి పరోక్షంగా కారణమయిన వాళ్ళం అవుతాం. ఆహార పదార్థాల విలువ తెలుసుకోకపోవడం, ‘నా డబ్బులతో కొన్నాను కాబట్టి దీన్ని దుర్వినియోగం హక్కు నాకున్నది’ అన్న అహంకార పూరిత భావన భారతీయులకు కొత్తగా పుట్టిన తెగులు. ఎంతసేపూ మన కడుపు నింపుకోవడమే తప్ప పక్కవారి ఆకలిని పట్టించుకోలేని నిర్దయత్వాన్ని సొంతం చేసుకుంటున్నాం. కారణాలు ఏమైనప్పటికీ మనం వృథా చేస్తున్న ఆహార పదార్థాల వల్ల ప్రపంచంలో ఏదోఒక మూల ఎవరో ఒకరికి అన్యాయం జరుగుతున్నది. 1990-2005 మధ్యన దాదాపు ఆరున్నర కోట్ల మంది భారతీయులు ఆకలితో అలమటించేవారు. తరువాతి కాలంలో ఈ సంఖ్య పెరిగింది. ఆకలి లేదా పౌష్ఠికాహార లోపంతో ప్రతి 5-10 సెకండ్లకు ఒక శిశువు మరణిస్తోంది. 2013లో జరిగిన ఒక సర్వే ప్రకారం దాదాపు 20 కోట్ల మంది భారతీయులు ఆకలి కారణంగా నిద్రపోలేకపోతున్నారు.

ఆహార పదార్థాల దుర్వినియోగం వల్ల సాటి మానవులతోపాటు ప్రకృతికి కూడా మనం తీరని ద్రోహం చేస్తున్నాం. మనం వదిలేసిన ఆహార పదార్థాలు కుళ్లిపోయి దాదాపు 3.3 బిలియన్ మెట్రిక్ టన్నుల రసాయనిక విషవాయువులను విడుదల చేస్తున్నాయి. పర్యావరణానికి ఇది తీరని విఘాతం కలిగిస్తున్నది. పారవేసిన వరి అన్నం ‘మిథేన్’ వాయువును విడుదల చేసి పర్యావరణానికి పెను సవాలుగా మారుతున్నది. ఈ వృథా అన్నది కేవలం ఆహార పదార్థాలకు మాత్రమే పరిమితం అనుకోకూడదు. అందుబాటులో ఉన్న నీటిలో దాదాపు 25 శాతాన్ని వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నాం. వృథా చేస్తున్న ఆహార పదార్థాల నిష్పత్తిలో జల వనరులను కూడా దుర్వినియోగం చేస్తున్నట్టే. అధిక భూమిని వ్యవసాయ యోగ్యం చేయడానికి అడవులను నరికేస్తున్నాం. చెట్లు లేకపోవడంతో, అడవులు తగ్గిపోవడంతో పర్యావరణంపై విపరీత ప్రభావం కనపడుతున్నది. భూఅంతర్గత నీటిమట్టం పడిపోవడంతో ఎండలు మండిపోతున్నాయి. భారత్లో వ్యవసాయం కోసం దాదాపు 30 కోట్ల బ్యారన్ల చమురును వినియోగిస్తున్నాం. వృథా చేస్తున్న ప్రతి మెతుకు వెనుక ఎంతోకొంత మేరకు సహజ వనరులను కూడా వృథా చేస్తున్నాం. దేశంలో ఉత్పత్తయ్యే ఆహార పదార్థాలలో 40 శాతం వృథా అవుతున్నది. అదే నిష్పత్తిలో జల వనరులు, అడవులు, సహజ వనరులను వృథా చేస్తున్నాం. కిలో గోధుమలు లేదా కిలో బియ్యాన్ని వృథా చేస్తున్నామంటే 1,500 నుంచి 2,500 లీటర్ల నీటిని వృథా చేస్తున్నట్టే. ‘ప్రపంచ ఆకలి సూచీ’ (ద్యిఇ్ఘ హఖశళూ నిశజూళన) లో 88 ధేశాలను పరిగణనలోకి తీసుకోగా, మనం 63వ స్థానంలో ఉన్నాం. ఆహార పదార్థాల వృథా వల్ల ఆర్థిక, సామాజిక సమస్యలు ఉత్పన్నత అవుతున్నాయి. ఆకలి తీర్చుకోవడానికి ఒక వర్గం హింసాత్మక మార్గాలను అవలంబిస్తూ నేరాల సంఖ్యను పెంచుతున్నారు. ఆహార పదార్థాల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతున్నది.

మారుతున్న మన ఆలోచనా విధానాలు, జీవన పద్ధతులు, పాశ్చాత్య ధోరణుల అనుకరణ కారణంగా మనం మన సంస్కృతికి దూరం అవుతూ లేనిపోని భేషజాలకు పోయి అన్నాన్ని పారవేస్తున్నాం. 2050 నాటికి భారత జనాభా 170 కోట్లు అవుతుందని అంచనా. పెరిగే జనాభా అవసరాల కోసం ఆహార పదార్థాలను అధికంగా ఉత్పత్తిచేస్తే సరిపోదు. ఆహార పదార్థాల వృథాను ఆపకుంటే- ఇదే నిష్పత్తిలో సహజ వనరులు కనుమరుగవుతాయి.

పొంచి ఉన్న ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి, సమస్య పరిష్కారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనల్ని కార్యోన్ముఖులను చేసే పని మొదలుపెట్టారు. నెలకొకసారి మోదీ ప్రజలతో ప్రత్యక్ష సంపర్కలో భాగంగా జరిపే ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో ఆహార పదార్థాలను వృథా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తినగలిగినంత తినమని, అవసరానికి మించి ఆహార పదార్థాలను కంచంలో వేసుకుని వృథా చేయవద్దని మోదీ కోరారు. ‘‘కంచంలో వేసుకున్న వాటిలో సగం కూడా తినలేకపోతున్నారు. మిగిలిన పదార్థాలను వదిలేసి వెడుతున్నారు. మనం వదిలిపెట్టే ఎంగిలి పదార్థాల వల్ల ఎంత నష్టం చేస్తున్నామో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వృథాను అరికట్టడం ద్వారా ఎంతమంది కడుపులు నింపవచ్చో ఎప్పడైనా ఆలోచించారా? మన కుటుంబాల్లో అమ్మ పిల్లలకు అన్నం పెడుతూ ఎంత తినగలవో అంతే తినమని చెబుతుంది. అన్నాన్ని వృథా కాకుండా చూడడంతోపాటు సంస్కారాలను నేర్పడంలో ఎంతోకొంత ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఆహార పదార్థాలను వృథా చేయడం సమాజం పట్ల, పేద ప్రజల పట్ల మనం చేస్తున్న అన్యాయం. వృథాను అరికడితే కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఈ అంశం పట్ల అందరిలోనూ జాగరూకత పెరగాలి. ఇప్పటికే కొంతమంది స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. మొబైల్ యాప్ల సాయంతో మిగిలిపోయిన ఆహార పదార్థాలను అన్నార్తులకు పంచిపెడుతున్నారు. ఇలాంటి వారి జీవితాలు ఇతరులకు ఆదర్శం కావాలి. ఎంత తినగలమో అంతే స్వీకరించాలి. మార్పుకు ఇదొక్కటే మార్గం. అన్నీ వేసుకోకుండా ప్లేటు కూడా కొంచెం ఖాళీగా ఉంచు, కడుపుకూడా కొంచెం ఖాళీ ఉంచు- అనే ఆరోగ్య రహస్యాన్ని గ్రహించండి..’’ అని మోదీ జాతిజనులకు విజ్ఞప్తి చేశారు.

ఆహార పదార్థాల వృథాను నిరోధించడానికి ప్రస్తుత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. పంటలను నిల్వ చేయడానికి పెద్దఎత్తున శీతల గిడ్డంగుల నిర్మాణం చేపడుతున్నది. కూరగాయలు వంటివి కుళ్లిపోకుండా వీలైనంత తొందరగా మార్కెట్ యార్డులకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. పది లక్షల టన్నుల ఉల్లిపాయలు పొలం నుంచి మార్కెట్ యార్డుకు చేరేలోగానే చాలావరకూ పాడవుతున్నాయి. 20 లక్షల టన్నుల టమాటాలు దారిలోనే కుళ్లిపోతున్నాయి. 50 లక్షల కోడిగుడ్లు సరఫరా సమయంలోనే పగిలిపోతున్నాయి. ఇటువంటి వృథాను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఆహారోత్పత్తులు ఇలా వృథా కావడంతో ధరలు పెరిగి, వినియోగదారుడిపై భారం పడుతున్నది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది.

క్షుదార్తుల ఆకలి తీర్చడం మన ప్రథమ కర్తవ్యం. దేశంలో, ప్రపంచంలో ఆకలి చావులు లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదీ. పట్టణ ప్రాంతాల్లో మనం కొంటున్న ఆహార పదార్థాలలో దాదాపు 20 శాతం వృథా అవుతున్నట్లు ఒక అంచనా. ఆకలి సమస్య తీర్చడానికి రెండు మార్గాలు. అధిక ఉత్పత్తి ఒకటైతే, వినియోగంలోకి వచ్చిన ఆహార పదార్థాలను వృథా చేయకుండా చూడడం రెండవది. ఆహార పదార్థాల పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఇతోధికంగా సహాయం చేయాల్సిన బాధ్యత మనందరిదీ. ముందుగా మన కంచంలో, మన కుటుంబంలో వృథాను అరికట్టాలి. ఏం తినాలి? ఎంత తినాలి? అన్న అవగాహన మనందరికీ ఉంటుంది. కావాల్సిన పదార్థాలు కావల్సినంత వడ్డించుకుని కడుపునిండా తినడం ఎంత అవసరమో మన కంచంలో వడ్డించుకున్న పదార్థాలు వృథా కాకుండా చూడడం కూడ అంతే అవసరం.

అవసరం లేని కూరగాయలు, పండ్లు ఇతర ఆహార పదార్థాలు కొనకుండా ఉంటే మిగిలినవారికి ఉపయోగపడతాయి. ఎంత కావాలో అంతే వండుకోవడం ఉత్తమం. మిగిలిపోయిన పదార్థాలను ఫ్రిజ్లో ఉంచుకుని తరువాతి రోజుల్లో తినడం కంటే ఎప్పటికప్పుడు వండుకు తినడం ఆరోగ్యానికి శ్రేష్ఠం, ఆర్థికంగానూ ఉత్తమం. పెళ్ళిళ్ళు, పేరంటాలు, విందులు వినోదాల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను చెత్తకుప్పలో పారవేయకుండా రెండు క్షణాల ఓపిక చేసుకుని దగ్గర్లో ఉన్న స్వచ్ఛంద సంస్థకు ఫోన్ చేస్తే అవసరమైన వారికి అవి అందుతాయి. ఈ పనిచేస్తే ఆత్మసంతృప్తి కూడా మిగులుతుంది.

మానవుని ప్రాథమిక అవసరాలలో ఆహారం ముఖ్యమైనది. దీనిని గౌరవించడం, భక్త్భివన ప్రదర్శించడం భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. ‘అన్నశుద్ధి సత్యశుద్ధిని, సత్యశుద్ధి చిత్తశుద్ధినీ కలిగిస్తుందన్న’ది భారతీయుల విశ్వాసం. ‘అన్నం న నింద్యాత్’- అన్నాన్ని నిందించరాదు. అన్నాన్ని వృథా చేయరాదు. అన్నం, అన్నదాత, అన్నాన్ని తినేవారు పరబ్రహ్మ స్వరూపులే. పరమేశ్వరుడిని అన్నం రూపంలో ఆరాధిస్తాం. ‘అన్నానాం సతయే నమః’ అని ప్రార్థిస్తారు. ‘జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి’- మనం తినే అన్నం వల్ల జ్ఞానం కలగాలి. లౌకిక సుఖాల పట్ల పశువుల వలె వెంపర్లాట లేకుండా ఉండాలి. అటువంటి వైరాగ్యభావన కలిగిన అన్నాన్ని ప్రసాదించమని- అన్నపూర్ణమ్మను వేడుకుంటాం. అటువంటి అన్నాన్ని వృథా చేసే అధికారం మనకు లేదు. అన్నాన్ని కాపాడాలి. మనతోపాటు పది మందికీ అన్నం పెట్టాలి. ఇదొక మహత్తర సహజ కార్యం. వృథాను నిరోధిద్దాం. పేదల క్షుద్బాధను తీరుద్దాం.

-కామర్సు బాలసుబ్రహ్మణ్యం

(ఆంధ్రభూమి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here