Home News ఎస్సీలలో క్రైస్తవ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్న జీవోపై కేంద్రానికి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు 

ఎస్సీలలో క్రైస్తవ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్న జీవోపై కేంద్రానికి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు 

0
SHARE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై దృష్టి సారించి, పలు పరిశోధనాత్మక నివేదికలు కేంద్రానికి సమర్పిస్తున్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ తాజాగా మరో వివాదాస్పద జీవో, దాని తాలూకు పర్యవసానాలను వివరిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళితే.. 1977 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సోషల్ వెల్ఫేర్ విభాగం జీవో నెంబర్ 341 పేరిట ఎస్సీలకు భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా అందుతున్న వెసులుబాట్లను ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిని వారికి కూడా అందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఎస్సీలకు అందాల్సిన వెసులుబాట్లను ‘శాసనబద్ధమైనవి’గా, ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిన వారికి ఇస్తున్న వెసులుబాట్లను  ‘శాసనేతరమైనవి’గా ఆ జీవోలో అప్పటి ప్రభుత్వం పేర్కొంది.
ఈ జీవో ప్రకారం రాజ్యాంగం అందించే శాసనబద్ధమైన వెసులుబాటులజాబితాలో ఉండే విద్య, ఉపాధి/ఉద్యోగం మరియు ఎన్నికల్లో అవకాశంలో ప్రాధాన్యత.. ఈ మూడు మినహాయించి, ఎస్సీలకు అందే అన్ని రకాల ఇతర వెసులుబాట్లు ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిన వ్యక్తులకు అందుతాయి. దీనిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర సామాజిక న్యాయ మరియు  సాధికార మంత్రిత్వశాఖకు తమ ఫిర్యాదు పంపింది.
1950 భారత రాష్ట్రపతి ఉత్తరువు ప్రకారం ఎస్సీ హోదా కలిగిన వ్యక్తులు ఇస్లాం లేదా క్రైస్తవ మతం స్వీకరిస్తే తమకున్న ఎస్సీ హోదా కోల్పోతారనేది సుస్పష్టం. కాగా క్రైస్తవంలోకి మారి, ఎస్సీ హోదా కోల్పోయిన వారి కోసం ప్రత్యేకంగా ‘శాసనేతర’ రాయితీలు కల్పించడం అనేది పరోక్షంగా మతమార్పిళ్లను ప్రోత్సహించడమేనని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అభిప్రాయపడింది. గత నాలుగు దశాబ్దాల కాలంగా ఈ జీవో ఆధారంగా ఎస్సీ ప్రజలకు దక్కాల్సిన ఉచిత భూమి/ఇళ్ళు, ఉచిత కరెంట్, వడ్డీ లేని రుణాలు వంటి రాయితీలు ఎస్సీ హోదా కోల్పోయిన క్రైస్తవులకు ప్రభుత్వాల ద్వారా చేరుతుండటంపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఆందోళన వ్యక్తం చేసింది.
లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు ప్రకారం.. జీవో నెంబర్ 341 ద్వారా ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిన వ్యక్తి  మూడు రకాల రాయితీలు పొందే అవకాశం కలుగుతోంది. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:
1. ఎస్సీలకు అందాల్సిన (శాసనబద్ధమైనవి మినహా)  రాయితీలు/వెసులుబాట్లు
2. ఎస్సీ క్రైస్తవంలోకి మారితే బీసీ-సి జాబితాలో చేరుతారు కాబట్టి, వెనుకబడిన వర్గాల వారికి ఇచ్చే రాయితీలు
3. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అందించే సబ్సిడీలు
ఇదిలా ఉండగా.. క్రైస్తవంలోకి మారిన ఎస్సీలకు రాయితీలు కల్పించే జీవో నెంబర్ 341 అమలు విషయంలో కూడా ప్రభుత్వాలు పక్కాగా వ్యవహరిస్తున్నాయి. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో జారీ అయిన ఈ జీవో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణాలో కూడా అమలు అవుతోంది. దేశంలో ఈ రెండు రాష్ట్రాల్లో తప్ప మరే రాష్ట్రంలోనూ ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక జీవో అమలులో లేదని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ఫిర్యాదులో స్పష్టం చేసింది.
2019-20 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీల అభ్యున్నతికి సుమారు 15,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, దాదాపు 80 శాతం మంది ఎస్సీలు మతం మారినట్టుగా అంచనా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అసలైన ఎస్సీల అభ్యున్నతి కోసం కేటాయించే ఆర్ధిక వనరులలో సింహభాగం మతం మారిన క్రైస్తవులకు చేరుతోందని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అంచనా వేసింది. ఇది మతమార్పిళ్ల కోసం ప్రభుత్వం ఇస్తున్న నజరానాగా కనిపిస్తోందని తమ ఫిర్యాదులో ఎల్.ఆర్.పి.ఎఫ్. పేర్కొంది.
ఈ విషయంపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ఫిర్యాదు కాపీని రాష్ట్రపతి భవన్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్లకు సమర్పించి, ఈ వివాదాస్పద జీవోపై తగు నాయపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.
Source: TheCommune