Home Hyderabad Mukti Sangram తలణి జాగీర్‌పై దాడి (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-7)

తలణి జాగీర్‌పై దాడి (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-7)

0
SHARE

ఉమ్రీ సరిహద్దులో ఉన్న తలణి జాగీర్‌పై మొదట దాడి చేయాలని నిశ్చయించుకున్నారు. 1948 జనవరి 23న బహుశా ఈ దాడి జరిగింది. హదగావ్‌కు పడమర ఉన్న ఈ జాగీర్‌లో ఆ రోజుల్లో ‘లెవీ’ వసూలు చేయడానికి నిజాం సాయుధ పోలీసులను పంపించాడు. ఆ వెన్నెల రాత్రి తలణిలో ఒక భవనం పై అంతస్థులో ఈ సాయుధ పోలీసులు విశ్రమించారు. బయట జాగీర్‌కు చెందిన హరిజనులు మంట కాచుకుంటూ కాపలా కాస్తున్నారు. అకస్మాత్తుగా కొద్దిదూరంలో చప్పుడైంది. ఒక హరిజన కాపలాదారుడటువైపు వెళ్ళాడు. అతని మెడలు వంచి పిస్టల్ కణతలపై గురిచూపి బంధించింది యువకబృందం. అరిస్తే యమలోకం పంపిస్తామని బెదిరించారు.

అతని నుంచి సమాచారం సేకరించారు. అంచనాను మించి సాయుధ పోలీసులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిసింది. అయినా ధైర్యంగా చాకచక్యంగా ఎదుర్కోవడం తప్ప మరోమార్గం కనిపించలేదు. ప్రాణాలకు తెగించి యువకులు సిద్ధమైనారు. నిలుచున్న చోటినుండి యువకులు ఏకధాటిగా కాల్పులు జరిపారు. వచ్చే ముందు దాదాపు రెండు ఫర్లాంగులు మోకాళ్ళపై పాకుతూ వచ్చిన శ్రమను మరచి సాహసాన్ని ప్రదర్శించారు. మొత్తం యువకులు ఆరుగురు మాత్రమే. అయినా ఏకధాటిగా అనుకోకుండా సాగిన కాల్పులకు పోలీసులు తట్టుకోలేకపోయారు. పైగా పై అంతస్తు మీద టిన్నురేకుల కప్పు, కాల్పులకు ఆ రేకులు ప్రతిధ్వనించి అల్లకల్లోలాన్ని సృష్టించాయి.

చాలా మంది పోలీసులు కాల్పులకు గురై చనిపోయారు. ఎదరు కాల్పులు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఆరుగురు యువకులూ కాల్పులు సాగిస్తూనే వెనక్కు వెళ్ళిపోయారు. ఒక్కరికి కూడా చిన్న గాయం తగలలేదు. మరుసటి రోజు ఈ దాడివార్త విని జిల్లా కలెక్టర్ శహబుద్దీన్, డి.ఎస్.పి.రషీద్ తన బలగంతో సహా వచ్చి సంఘటన జరిగిన స్థలాన్ని పరీక్షించారు. వేల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి కాల్పులు జరిపారని, తాము ఎదురుకాల్పులు జరిపితే శవాలను తీసుకొని పారిపోయారని అక్కడి పోలీసులు రిపోర్టు ఇచ్చారు. కాని అసలు ఆరుగురు సాయుధ యువకులు మాత్రమే ఈ అల్లకల్లోలాన్ని సృష్టించారని హరిజన కాపలాదార్లు చెప్పారు.

ఈ వాస్తవాన్ని విని తమ పోలీసులను చివాట్లు పెట్టారు. దేశభక్తితో సాహసంగా ముందుకు వచ్చి విజయవంతంగా ఈ దాడిని జరిపిన ఆరుగురు యువకుల పేర్లు  శ్రీయుతులు బన్సీలాల్ (హద్‌గావ్), సాహెబ్‌లాల్ దేశ్‌ముఖ్ (బారడ్), నాగనాథ్‌పరంజపే, కేశవరామ్ శహానే, ఆబాసాహెబ్ లహాణ్‌కర్, శంకరలాల్ శర్మ. తలణి జాగీర్‌పై జరిగిన దాడి ఆశించిన ఫలితాన్నిచ్చింది. ఉమ్రీలో పోలీసు బలగం కొంత జాగీరువైపు వెళ్ళిపోయింది. సరిహద్దు ప్రాంతాలలో గస్తీ తిరుగుతున్న అశ్విక దళాన్ని జాగీర్‌కు దగ్గరగా పంపించారు. ఇక ఉమ్రీలో పోలీసు అధికారి జాగీర్ సంఘటనను ఉదాహరణగా చూపి ఉమ్రీపై దాడి జరిగే అవకాశం లేదని చెప్పాడు.

తనపై అధికారులకు హామీ ఇస్తూ వివరాన్ని రాశాడు. తర్వాత ఉమ్రీలో మార్కెట్టుకు సరుకు రావటం, బ్యాంక్‌లో డబ్బు పోగుకావడం జరుగుతోంది. పోలీసులు తమపై సంపాదనలో పడి ఉన్నారు. మొట్ట మొదట్లోనే ఉమ్రీ బ్యాంక్‌పై తమ దాడి జరిగిఉంటే యాభై అయిదు లక్షల రూపాయలు చేతికి వచ్చే అవకాశం ఉండేది. కాని దాడి జరుగుతుందనే వదంతి విని కొందరు ఖాతాదారులు డబ్బు వాపసు తీసుకున్నారట. బ్యాంక్‌లో ఉన్న మొత్తం విలువ గూర్చి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుండేది.

ఉమ్రీ బ్యాంక్‌పై దాడి

రెండు వారాలు గడిచిపోయాయి. ఉమర్‌ఖేడ్ నుండి మళ్ళీ ఈ యువక బృందం 1948 జనవరి 30న దాడి చేయాలని నిర్ణయించుకొని 28న  ఉమర్‌ఖేడ్ నుండి ప్రయాణం మొదలుపెట్టింది. ఒక ఎద్దు బండిలో కూరగాయలు, గడ్డీ ఉంచి వాటి క్రింద ఆయుధాలను దాచారు. ప్రయాణం కొనసాగింది. ఆగినచోటల్లా ఆయా గ్రామ ప్రజలు వీరికి తినటానికి రొట్టెలు వగైరా సరఫరా చేసేవాళ్ళు. జనవరి 30 ఉదయాన బండితోసహా ఈ బృందం ఉమ్రీకి 5 మైళ్ళు దూరంలో ఉన్న కామన్‌గావ్ చేరింది. అక్కడ పథకం ప్రకారం ఆ బృందం మూడు జట్లుగా విడిపోయింది. మొదటి జట్టులో ఆయుధాల బండితో సహా దిగంబరరావు, శంకరలాల్ ఉన్నారు.

మామూలుగా గడ్డి, కూరగాయల బండిగా ఆ ఆయుధాల బండి ఉమ్రీ బ్యాంకుకు ఎదురుగా 3.30 గంటలకు చేరింది. పక్కన ధన్‌జీ దుకాణం ఉంది. బండిలోపల గడ్డిలో దిగంబరరావు, శంకర్‌లాల్ శవాల్లాగా పడుకొని ఉన్నారు. రెండో జట్టు సరిగ్గా సాయంత్రం 5.30 గంటలకు పోలీసు స్టేషన్‌పై దాడి చేసింది. పోలీసులు తాగడానికి వెళ్ళారేమో ఒక్క సిపాయి మినహా మరెవ్వరూ లేరు. నాగనాథ్ పరంజపే నాయకత్వాన దాడిచేసిన ఈ జట్టు ఆ ఒక్క పోలీసు స్టేషన్‌లో కట్టి పడేసింది. చేతికందిన ఆ ఆయుధాలను తీసుకొని ఆ జట్టు బ్యాంక్‌వైపు వెళ్ళింది.

ఉమ్రీ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న కొండలపై నుండి మెల్లగా వచ్చి చేరింది. ఈ జట్టులో జగదీష్, మోహన్‌శర్మ, బాబారావు కుంటాకర్ మొదలగు వారున్నారు. (జగదీష్ నిజాంపై బాంబువేసిన శ్రీ నారాయణబాబు జట్టులో కూడా పనిచేశాడు. ఆనాడు నిజాం బాంబు కేసులో పట్టుబడకుండా తప్పించుకొని వచ్చి ఈ జట్టులో పాల్గొంటున్నాడు.) ఈ జట్టు యువకులు రాగానే రైల్వే స్టేషన్ మాస్టర్ని బంధించి రికార్డులను తగులబెట్టారు.  రెండువైపులా ఉన్న టెలిగ్రాఫిక్ వైర్లను కత్తిరించారు. స్టేషన్‌లో ప్రయాణీకులు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు.

(విజయక్రాంతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here