Home News ఆంధ్రప్రదేశ్‌లో హైందవ ధర్మంపై అడుగడుగునా దాడులు

ఆంధ్రప్రదేశ్‌లో హైందవ ధర్మంపై అడుగడుగునా దాడులు

0
SHARE

– డాక్టర్ వినుష రెడ్డి

ఆంధప్రదేశ్‌లో గత కొద్ది సంవత్సరాలుగా హైందవ ధర్మానికి ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా వరుస అవమానాలు సంభవిస్తున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా నెల్లూరులో శోభాయాత్రను ఆటంకపరిచే ప్రయత్నం ఈ అవమానాల పరంపరలో తాజా ఘటనగా నిలిచింది. పోలీసులు, సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొందిన అనంతరం ఏప్రిల్ 24న నెల్లూరులో హిందూ భక్తులు, హిందూ సంఘాలు శోభాయాత్రను చేపట్టారు. శోభాయాత్ర చేపట్టే సమయం, మార్గం వివరాలను సైతం అధికారులకు నిర్వాహకులు ముందుగానే అందించారు. నెల్లూరులో ప్రధాన వీధి అయిన తాలూకా రోడ్డులో శాంతియుతంగా కొనసాగుతున్న శోభాయాత్రలో 15,000 మందికి పైగా హిందువులు పాల్గొన్నారు.

భక్తులతో కూడిన శోభాయాత్ర ఒక మసీదు ముందు నుంచి సాగుతుండగా అకస్మాత్తుగా మసీదులో ఒక బృందం భయానకంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఆ బృందంలో వారు ఇస్లామిస్టు నినాదాలు చేయసాగారు. హిందువులను బెదిరించసాగారు. హిందూ భక్తులకు వారి చేతి మధ్యవేలును ప్రదర్శించడం ద్వారా అసభ్యకరమైన సంజ్ఞలు చేయసాగారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం హనుమాన్ విగ్రహంపైకి ఒక గాజు సీసా వచ్చి పడింది. మసీదు నుంచి వెలుపలకు రావడం ద్వారా శోభాయాత్రను ఆటంకపరచడానికి ఆ మూక ప్రయత్నించింది. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని మసీదులోని అల్లరి మూకను వెలుపలకు రాకుండా ఆపారు. ఆ తర్వాత ఇస్లామ్ మత పెద్దల హెచ్చరికలతో కూడిన కొన్ని ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. శోభాయాత్రలో పాల్గొన్న శుభమస్తు, కందుకూరు షాపింగ్ మాల్స్ నిర్వాహకుల నుంచి ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయరాదని ముస్లిములను హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ వ్యతిరేక కార్యకలాపాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. హిందువులను అవమానిస్తూ ఇటీవల అనేక సంఘటనలు జరిగాయి.

ఏప్రిల్ 16న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హిందూ భక్తులు కర్నూలు జిల్లా, ఆలూరులో శోభాయాత్ర నిర్వహించారు. మసీదు ముందుగా శోభాయాత్ర సాగుతుండగా ముస్లిములతో కూడిన ఒక మూక ఇస్లామ్ నినాదాలు చేసింది. హిందూ భక్తులపై దాడి చేసింది. మూకలో ఉన్మాదులు జరిపిన రాళ్ళ దాడిలో దాదాపు 10 మంది హిందూ భక్తులు గాయపడ్డారు. శోభాయాత్రను పోలీసులు నిలిపివేశారు. BJP, VHP నేతలతో పాటుగా 42 మంది హిందువులు, 48 ముస్లిములపై కేసులు నమోదయ్యాయి.

జనవరి 26న గుంటూరులో జిన్నా టవర్‌పైన జాతీయ పతాకాన్ని ఎగురువేయడానికి ప్రయత్నించిన హిందూ యువ వాహిని కార్యకర్తలను మత సామరస్యం దెబ్బతింటుందనే సాకు చూపి పోలీసులు అరెస్టు చేశారు.

జనవరి ఎనిమిదవ తేదీన కర్నూలు జిల్లాలోని ఆత్మకూరులో మత కల్లోలాలు చెలరేగాయి. ఒక పాఠశాలకు పక్కన హిందువులు అధికంగా నివసిస్తున్న ప్రాంతంలో మసీదు అక్రమ నిర్మాణంపై అభ్యంతరం తెలిపిన స్థానిక హిందువులను ముస్లిం మూక అక్కడి నుంచి తరిమివేసింది. వెంటనే కొందరు BJP నేతలతో కలిసి స్థానిక హిందువులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొద్ది గంటల్లోనే కోపోద్రిక్తులైన వేలాదిగా ముస్లిములు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. తెల్లవారుజాము మూడు గంటల వరకు అల్లకల్లోలం సృష్టించారు. హతమారుస్తామని పోలీసులను బెదిరించారు. ఇస్లామ్ నినాదాలు చేశారు. రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాలు, BJP నేత వాహనాలను తగులబెట్టారు. హిందువులపై జరిగిన ఈ హింసలో ఒక పోలీస్ కానిస్టేబుల్ పాలుపంచుకున్నాడు.

ఆశ్చర్యకరంగా, ప్రాణ భీతితో పోలీస్ స్టేషన్‌లో తలదాచుకున్న హిందువులు, BJP నేతలపై హత్యాయత్నం అభియోగాలను రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసింది. అనంతరం ఈ అల్లర్లలో ఉగ్రవాద సంస్థ SDPI ప్రమేయం ఉందని, సదరు ఉగ్రవాద సంస్థ శిక్షణా శిబిరాలను నిర్వహించిందని కర్నూలు SP వెల్లడించారు.

2021 సంవత్సరం జూన్ 20న ప్రొద్దుటూరు, కడపలో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా టిప్పు సుల్తాన్ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి పాలక YSRCP ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి కొందరు ముస్లిం నేతలతో కలిసి భూమి పూజ చేశారు. ప్రజలు, BJP నేతల నుంచి వ్యతిరేకత రావడంతో రాజ్యాంగవిరుద్ధమైన ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.

2020 సంవత్సరం డిసెంబర్ 29న రామతీర్థంలో400 సంవత్సరాల నాటి శ్రీ రామచంద్రస్వామి విగ్రహం తలను దుండగులు నరికివేశారు.

2020 సంవత్సరం జులై ఆరవ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేదిలో శతాబ్ద కాలం నాటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానానికి చెందిన రథం తగులబడిపోయింది.

2020 సంవత్సరం ఫిబ్రవరి 14న నెల్లూరు జిల్లాలోని కొండ బిట్రగుంటలో 850 సంవత్సరాల నాటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన రథం తగులబడిపోయింది.


హిందు మతం పట్ల ప్రభుత్వ వ్యతిరేకత

శ్రీ హనుమ విగ్రహం అపవిత్రం కావడంపై ఒక మంత్రి మాట్లాడుతూ “తాను గాయపడినట్టు హనుమాన్ ఏమైనా చెప్పారా? అది రాతితో చేసిన విగ్రహం కాదు కనుక మరొకటి తయారు చేయవచ్చు” అని వ్యాఖ్యానించారు.

క్రైస్తవులకు చెందిన స్మశానవాటిక గోడ స్వల్పంగా దెబ్బతిన్నప్పుడు రాష్ట్ర హోమ్ మంత్రి చేతులు జోడించి మన్నించాలని క్రైస్తవులను అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్‌లో మైనార్టీలు ప్రయోజనాలను పరిరక్షిస్తామని తెలిపారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హోమ్ మంత్రి హామీ ఇచ్చారు. రామతీర్థం విగ్రహాల ధ్వంసం ఘటన నిందితులను పట్టుకోలేదు కానీ ఘటనపై పారదర్శకమైన విచారణ జరపాలని డిమాండ్ చేసిన BJP నేతలతో పాటుగా 20 మంది హిందూ భక్తులపై కేసులు నమోదు చేశారు.

రాష్ట్రంలో దేవస్థానాల విధ్వంసానికి సంబంధించి 500 కు పైగా కేసులు నమోదయ్యాయి. కానీ ఒక్క కేసును కూడా సరిగ్గా పరిష్కరించలేదు. పరిష్కారానికి నోచుకున్న అత్యధిక కేసుల్లో నిందితుడు ఒక మతి భ్రమించిన వ్యక్తి.

పాస్టర్లకు, ఇమామ్‌లకు ప్రజల సొమ్ము

*పన్నుదారుల చెల్లింపులతో పాస్టర్లు, ఇమామ్‌లకు జీతాలు

* పంచాయతీరాజ్ శాఖ ద్వారా చర్చీలకు భవనాల నిర్మాణం

* ఇమామ్‌లకు భూములు కేటాయింపు

* హజ్ మరియు జెరూసలెమ్ యాత్రలకు చెల్లింపులు

* దేవస్థానాలకు చెందిన భవనాల్లో కోవిడ్ చికిత్సా కేంద్రాలు మరియు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు

హిందూఫోబియాకు నిదర్శనం

హిందువులు, దేవస్థానాలపై దాడులకు పాల్పడే వారిని పట్టుకొని కఠినంగా శిక్షించడం ద్వారా దాడులను అరికట్టాలని ఎవరైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన పక్షంలో అలాంటి వారిపై మతపరమైన ఫాసిస్టు అనే ముద్రను పాలక YSRCP ప్రభుత్వం వేస్తున్నది. అలాంటి దాడులను రాష్ట్ర ప్రభుత్వం ఖండించదు. హిందూ వ్యతిరేక కార్యకలాపాలను ఖండించేవారిని ఏ మాత్రమూ ఉపేక్షించదు. అన్ని మతాలను సమానంగా చూడాలని లౌకికవాదం నిర్వచిస్తున్నది. కానీ లౌకికవాదాన్ని పునర్ నిర్వచించిన AP ప్రభుత్వం హిందువుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నది. హిందూ విశ్వాసం అవమానానికి గురైనప్పుడు, దాడి జరిగినప్పుడు మౌనం వహిస్తున్నది. పాలక YSRCP ప్రభుత్వం అలాంటి హిందూ వ్యతిరేక వైఖరిని కలిగి ఉండటంతో ఇస్లామ్ మూకలు రెచ్చిపోతున్నాయి. వరుస దాడులకు పాల్పడుతున్నాయి. అన్ని మతాలను సమానంగా చూడాలనే రాజ్యాంగ సూత్రాలకు ఇది పూర్తిగా విరుద్ధం. అలాంటి సంఘ వ్యతిరేక శక్తులు మత సమరసతను దెబ్బ తీస్తాయి. దేశ పురోగతికి ఆటంకాలు సృష్టిస్తాయి.

“సర్వ ధర్మ సమ భావ – అన్ని మతాలు సమానం”

ఆర్గనైజర్ సౌజన్యంతో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here