Home Telugu Articles బంగ్లాలో అరాచకం హిందువులపై ఆగని దాడులు

బంగ్లాలో అరాచకం హిందువులపై ఆగని దాడులు

0
SHARE

బంగ్లాదేశ్‌లో హిందువుల ఆలయాలు, ఆస్తిపాస్తుల మీద వరస వెంబడి దాడులు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. హిందూ సంఖ్యాధిక్యత కలిగిన భారత్‌ మద్దతుతోనే నాలుగున్నర దశాబ్దాల క్రితం పశ్చిమ పాకిస్థాన్‌ చెర వదిలించుకొని, బంగ్లా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. త్వరలో 45వ విమోచన దినోత్సవాన్ని అది జరుపుకొనబోతోంది. ఆనాటి బంగ్లా విమోచన పోరాటంలో రెండు వేలమందికి పైగా భారతీయ సైనికులు, సైనికాధికారులు ప్రాణత్యాగం చేశారు. బంగ్లా ప్రధానమంత్రి షేక్‌ హసీనా అల్లాటప్పా నాయకురాలేమీ కాదు. బంగ్లా విమోచన పోరాట సారథి షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ కుమార్తె. మతఛాందస శక్తులతో ఆమె అలుపులేని పోరాటం సాగిస్తున్నారనడంలో సందేహం లేదు. విపక్షాలను కట్టడి చేయడానికే ఆమె ఈ పోరాటాన్ని ఉపయోగించుకొంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అది వేరే విషయం. ఏకైక ప్రత్యామ్నాయంగా ఉన్న తమను వేధించడానికే షేక్‌ హసీనా ఈ పంథా ఎంచుకున్నారని బంగ్లాదేశ్‌ జాతీయవాద పార్టీ (బీఎన్‌పీ) ధ్వజమెత్తుతోంది. తమ అడ్డు తొలగించుకోవడమే హసీనా నాయకత్వంలోని పాలక అవామీ లీగ్‌ ఏకైక లక్ష్యంగా మారిందని, అందుకోసమే అది రకరకాల ఎత్తుగడలు వేస్తోందని బీఎన్‌పీ విమర్శిస్తోంది. భారత్‌ను వ్యతిరేకిస్తున్నందువల్లే ఖలీదా జియా మీద అవామీలీగ్‌ బురద జల్లుతోందంటూ అది ప్రచారం చేస్తోంది.

బంగ్లాదేశ్‌ విమోచన తరవాత కొన్ని రోజులు పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ, క్రమంగా భారత వ్యతిరేకత ప్రబలింది. విమోచన తాలూకు ప్రతిఫలాలను భారత్‌ ఆశిస్తోందన్న భావన ఆ దేశంలో ఏర్పడటమే అందుకు కారణం. బంగ్లా విమోచన పోరాటంలో ముక్తి వాహినికి వెన్నుదన్నుగా నిలిచినందుకు లెఫ్టినెంట్‌ జనరల్‌ జగ్జీత్‌సింగ్‌ అరోరా నాయకత్వంలోని భారత సైనిక దళాలకు షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ ఆనాడు కృతజ్ఞతలు తెలిపారు. లౌకికవాదం బంగ్లాదేశ్‌ నరనరాన జీర్ణించుకొని పోయిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని విడనాడే ప్రసక్తే లేదని ఆయన అప్పట్లో భరోసా ఇచ్చారు.

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, ముజిబ్‌ అప్పట్లో ఇచ్చిన హామీ గాలికెగిరి పోయినట్లు కనిపిస్తోంది. జనరల్‌ హెచ్‌.ఎం.ఎర్షాద్‌ సైనిక పాలన సాగించిన కాలంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జమాతే ఇస్లామియా, ఇస్లామిక్‌ తరహా పరిపాలన వ్యవస్థను దేశంలో పాదుకొల్పేందుకు ఉద్యమిస్తోంది. ప్రపంచంలోని ఇస్లామిక్‌ దేశాలతో సంబంధాలను దృఢతరం చేసుకోవాలంటోంది. తొలుత బంగ్లాదేశీయులు అందుకు సుముఖంగా లేరు. షేక్‌ హసీనా ప్రాచుర్యానికి గండిపడిన దరిమిలా ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. భారత వ్యతిరేకతే కాదు, ఇస్లామిక్‌ వాదం సైతం ­పందుకుంటోంది. ఏ విధంగానైనా సరే అధికారాన్ని సుస్థిర పరచుకోవడమొక్కటే లక్ష్యంగా షేక్‌ హసీనా పావులు కదుపుతున్నారన్న ఆరోపణను తేలిగ్గా కొట్టిపారేయలేం. అలాగని, ఎన్నికల రాజకీయాల్లో ఆమెను దీటుగా ఎదుర్కొనే పరిస్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయా అంటే, అదీ లేదు.

బంగ్లాదేశ్‌లో ఇటీవలి కాలంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడిన మాట నిజం. సంక్షేమ కార్యక్రమాలు కుంటినడక నడుస్తున్నాయి. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, కిందిస్థాయి దాకా ఆర్థిక ప్రయోజనాలు చేకూరడంలేదు. న్యాయ వ్యవస్థా స్వతంత్రంగా పనిచేయలేకపోతోంది. భారతదేశంలో న్యాయమూర్తులను ఎంపిక చేయడానికి కొలీజియం వ్యవస్థ ఉంది. బంగ్లాదేశ్‌లో అలా కాదు. ప్రభుత్వమే నేరుగా న్యాయమూర్తులను నియమిస్తోంది. దాంతో పలువురు న్యాయమూర్తులు చాలావరకు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాల్సి వస్తోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లోని హిందూ న్యాయమూర్తులు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కోవలసి వస్తోంది.

బంగ్లాదేశ్‌ మొత్తం జనాభా దాదాపు 16 కోట్లు. అందులో హిందువులు 1.7 కోట్ల వరకు ఉన్నారు. దేశ జనాభాలో వారు సుమారు 11 శాతం వరకు ఉంటారు. కానీ, జనాభాకు అనుగుణమైన అవకాశాలు వారికి ఏ రంగంలోనూ దక్కడం లేదు. పైగా వారి అణచివేత పెరుగుతోంది. అభద్రతాభావం కారణంగా బంగ్లా నుంచి భారత్‌కు శరణార్థులుగా చేరే హిందువుల సంఖ్య క్రమేపీ ఎక్కువవుతోంది. ఇస్లామ్‌లోకి మారాల్సిందిగా బంగ్లాలోని హిందువుల మీద ఒత్తిడి వస్తోంది. వారి ఇళ్లూ, ఆస్తిపాస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఆలయాలను కూలగొడుతున్నారు, తగులబెడుతున్నారు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. గత్యంతరం లేక చాలామంది హిందువులు మతం మారాల్సి వస్తోంది. అందుకు సిద్ధపడని లక్షలాది మంది హిందువులు తాజాగా భారత్‌లోకి వలస వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. హిందువుల మీద దాడులకు, దుశ్చర్యలకు పాల్పడవద్దని భారత్‌లోని ముస్లిం నాయకులు బంగ్లాదేశ్‌లోని ముస్లిములకు సలహా ఇస్తే బావుంటుంది. భారత్‌కు, బంగ్లాదేశ్‌కు మధ్య ఏర్పడుతున్న అగాధాన్ని దాని ద్వారా కొంతైనా పూడ్చేందుకు వీలవుతుంది. బంగ్లా ఇప్పటికైనా కొత్త నీతి నియమాలు ఏర్పరచుకోవాలి. పూర్తిస్థాయి లౌకిక ప్రజాస్వామ్య దేశంగా మారేందుకు ప్రయత్నించాలి. లేకపోతే, జమాతే ఇస్లామియా లాంటి సంస్థలు విజృంభించి ఆ దేశాన్ని మత ఛాందస రాజ్యంగా మార్చేస్తాయి. మతపరమైన అల్పసంఖ్యాక వర్గాల పట్ల ఎలాంటి విచక్షణ చూపబోమని బంగ్లా జాతిపిత షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ అప్పట్లో మాట ఇచ్చారు. దానికి బంగ్లా నాయకత్వం కట్టుబడాలి. ఈ విషయంలో షేక్‌ హసీనా తన తండ్రి అడుగు జాడల్లో నడవాలి. ఆమె విఫలమైతే బంగ్లాదేశ్‌ మరింత సంక్షోభంలోకి కూరుకుపోతుంది. అప్పుడు అది మరో విషాద అధ్యాయంగా మిగిలిపోతుంది.

– ఎస్‌.దీపాంకర్‌

(ఈనాడు సౌజన్యం తో )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here