Home News బినామీ ఆస్తుల సమాచారం అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం బహుమతి

బినామీ ఆస్తుల సమాచారం అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం బహుమతి

0
SHARE
Representative image

బినామీ ఆస్తులకు సంబంధించిన కీలక సమాచారం అందజేసే వారికి కోటి రూపాయల వరకు బహుమతి ఇస్తామని కేంద్ర ఆదాయం పన్ను శాఖ ప్రకటించింది. ఇందుకోసం ఆదాయం పన్ను శాఖ చట్టాలను సవరిస్తోంది. బినామీల గుట్టురట్టు చేయడంలో ప్రజాప్రాతినిథ్యం పెంచాలన్నదే లక్ష్యమని కేంద్ర ఆదాయం పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో మాదిరిగానే సమాచారాన్ని అందించేవారి పేర్లు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

విదేశీయులూ ఈ కొత్త పథకాన్ని ఉపయోగించుకునేలా అవకాశం కల్పిస్తున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. చాలామంది నల్లధనాన్ని బినామీల రూపంలోదాచి, ఇతరుల పేరిట ఆస్తులు కొనుగోలు చేసి, వాటిపై వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తూ ఆదాయం పన్నులు చెల్లించకుండా ఎగవేస్తున్నారని అధికారులు తెలిపారు.

బినామీ ఆస్తులను అదుపు చేసేందుకే చట్టాన్ని మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో కేంద్రం బినామీ ఆస్తుల చట్టం 1988ను 2016లో సవరించింది. బినామీ ఆస్తులను గుర్తించటంతోపాటు పన్ను ఎగవేతను నివారించేందుకు ‘బినామీ కార్యకలాపాల సమాచార బహుమతి పథకం-2018’ పేరుతో ఇప్పుడు కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రజలు, సమాచారం అందజేసే వారు బినామీ ఆస్తులకు సంబంధించిన సమాచారంతోపాటు బినామీ ఆస్తుల ద్వారా వస్తున్న సంపాదనకు సంబంధించిన వివరాలనూ అందజేయాల్సి ఉంటుంది. బినామీ ఆస్తులు, వాటి ద్వారా వస్తున్న ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని ఆదాయం పన్ను శాఖ సంయుక్త కమిషనర్ లేదా అదనపు కమిషనర్‌కు గుప్తంగా అందజేస్తే ఒక కోటి రూపాయల వరకూ బహుమతిగా అందజేస్తామని ఆదాయం పన్ను శాఖ తెలిపింది.

సమాచారం అందజేసే వారికి బినామీ ఆస్తులను వేలం వేయటం ద్వారా వచ్చే డబ్బు నుంచి బహుమతి ఇస్తామని ప్రకటించారు. బినామీ ఆస్తులకు సంబంధించిన మొత్తం విలువ ఆధారంగా బహుమతి మొత్తాన్ని నిర్ణయిస్తామని ఆదాయం పన్ను శాఖ అధికారులు తెలిపారు.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)