Home Telugu Articles స్వాతంత్ర్యోద్యమంలో భగవద్గీత

స్వాతంత్ర్యోద్యమంలో భగవద్గీత

0
SHARE

బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సాగిన సఫల ఉద్యమం కారణంగా కోట్ల మంది హిందువులు స్వతంత్రులయ్యారు. ఆ తరువాతి పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ ఈ ఉద్యమంలో పాల్గొన్నవార‌దరూ గౌరవార్హులు.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత జరిగిన అతి పెద్ద పరిణామం సామ్రాజ్యవాద తిరోగమనం. అందులో భారత్ ముఖ్య పాత్ర పోషించింది. ప్రపంచంలో దాదాపు 1/5 వంతు ప్రజలు రాత్రికి రాత్రి స్వతంత్రులవ్వడం ద్వారా ఒక సందేశాన్నిచ్చింది. ఆ ఉత్సాహం ఆసియా, ఆఫ్రికాలలో చాలా మంచి ఫలితాలు ఇచ్చింది. ఇది ఎంతో మంది సమరయోధుల కృషికి ఫలితం.

అంతటి ఉజ్వల ఉద్యమాన్ని నడిపిన ఎందరో మందికి భగవద్గీత ఆదర్శం. ఎందరో వీరులు భగవద్గీతను చేతినందుకొని ఉరికంబాలనెక్కారు. 1905 లో స్వదేశీ ఉద్యమం 50 వేల మంది కలకత్తా వీధుల్లో భగవద్గీత చేతిలో పట్టుకొని వెళ్ళి విదేశీ వస్తువులు దహనం చేయడంతో ప్రారంభమయింది.

భగవద్గీతను ఆదర్శంగా తీసుకొని ఉద్యమాన్ని నడిపిన కొందరు మహాపురుషులు…

లోకమాన్య బాలగంగాధర తిలక్(1856-1920)


సంపూర్ణ స్వరాజ్యం కోసం గర్జించిన వాడు. భగవద్గీత గురించి ఆయన “ప్రపంచం లో పోరాట పటిమ కలవారందరికీ గీత అత్యంత స్ఫూర్తివంతంగా, ఉత్సాహజనకంగా ఉండడానికి కారణం అత్యంత కఠిన పరిస్థితులలో ఎటువంటి బలహీనతలకు లోనవకుండా దృఢంగా నిలబడమనే దాని సందేశం” అన్నారు. అలాగే “భారత్ లోని ప్రతి ప్రజ, పిల్లవాళ్ళు పెద్దలు అందరూ గీత సందేశాన్ని అర్ధం చేసుకోవాలన్నది నా ప్రగాఢ విశ్వాసం” అన్నారు. ఆయన భగవద్గీత మీద రాసిన “గీత రహస్య” అనే పుస్తకం ఈ నాటికీ స్ఫూర్తివంతం. ఇందులో రెండు భాగలున్నాయి. మొదటి భాగంలో గీత కు భాష్యం తాత్విక అర్ధ వివరణ ఉండగా గీతకు అనువాదం రెండవ భాగంలో ఉంటుంది. ఇది గీతను ప్రపంచంలోని మిగిలిన తత్వ గ్రంధాలతో చేసిన తులనాత్మక పరిశీలన. గీత “కర్మ యోగ శాస్త్ర”మని తిలక్ అన్నారు.

బంకిమ్ చంద్ర ఛటర్జీ(1858-1930)

ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనక పోయినప్పటికీ ,తన రచనల తో కొన్ని వేల మందిని ఉద్యమం వైపు నడిపిన వాడు. ఆయన రచనలలోని దేశభక్తి , రాష్ట్ర భావన , ఆరాధనా భావన ఈ దేశాన్ని కదిలించింది. ప్రత్యేకంగా బెంగాల్ లో ఒక ఉద్యమ కెరటాన్ని లేవనెత్తింది. తన ఆనందమఠం అనే పుస్తకంలో రాసిన “వందేమతర” గేయం ఒక ఉద్యమ ప్రభను వెలిగించింది. 18 వ శతాబ్దంలో మొగలాయిల పాలనను వ్యతిరేకిస్తూ సన్యాసులు చేసే ఉద్యమం లాగా నడిచే కథ తో ఉన్న ఆనందమఠాన్ని ఆరోజునున్న పరిస్థితులకు అన్వయించుకొని దేశం ఉవ్వెత్తున ఎగిసింది. “వందేమాతరం” ఉద్యమ నినాదమయ్యింది. ఆ బంకిం చంద్ర భగవద్గీత నుండి స్ఫూర్తి పొంది దానికి భాష్యం వ్రాయడం ప్రారంభం చేశాడు. అది ఆయన జీవిత కాలంలో మూడు వంతులే పూర్తయినా, కృష్ణుడి జీవితం మీద ఆయన రాసిన “కృష్ణ చరిత్ర” ఈ నాటికీ స్ఫూర్తివంతమైన రచనలలో ఒకటిగా నిలుస్తుంది.

మహాత్మా గాంధీ (1869-1948)

ఇది మనకు పరిచయమక్కరలేని పేరు. స్వాతంత్రోద్యమానికి పర్యాయవాచకంగా చెప్పదగినది. ఆయన తన జీవిత పోరాటానికి గీత నుండి స్ఫూర్తి పొంది “నేను భగవద్గీత తో పొందే ఓదార్పు , ఉపశమనం క్రైస్తవ మతంలోని సెరమన్ మౌంట్ లోని దాని కన్నా ఎంతో గొప్పది”అన్నారు, అలాగే “నిరుత్సాహం నన్ను కమ్మేసినప్పుడు నేను గీత వైపు చూస్తాను. అందులోని శ్లోకాలు ఇన్ని ఇబ్బందుల మధ్యలో కూడా నన్ను వెంటనే ఉత్తేజితం చేస్తాయి. నా జీవితం మొత్తం ఐహిక ఇబ్బందులే, కానీ అవేవీ నన్ను దీర్ఘకాలం బాధించలేక పోవడానికి కారణం భగవద్గీత నేను దానికి ఋణపడి ఉన్నాను ” అన్నారు.

శ్రీ అరవింద ఘోష్(1872-1950)


విప్లవ వీరుడిగా జీవితాన్ని ప్రారంభించి యోగిగా, దార్శనికుడిగా దేశానికి మార్గదర్శనం చేసిన వారు. బలహీన నాయకత్వమే మన దేశానికి ఈ గతి పట్టించిందని తెలుసుకొని, గీతను ఆదర్శంగా తీసుకోవాలని నొక్కి చెప్పిన వారు. దేశానికి స్వాతంత్ర్యం తో పాటు భౌతికత్వం నుండి దివ్యత్వం వైపు సమస్త మానవాళిని గీత మాత్రమే నడపగలదని తెలుసుకొని భగవద్గీతపై వ్యాసాలు రాశారు. “ దూకుడు లేదా ఉత్సాహవంతమైన వ్యవహారం పాపమని కొందరు అనుకుంటారు. ప్రపంచం నుండి విడాకులు తీసుకోవడం ఆధ్యాత్మికత అని, అత్యున్నత ధార్మిక విలువలు ప్రపంచానికి దూరంగా ఉంటాయని చాలాసార్లు మనం తప్పుగా ఆలోచిస్తూంటాము. కృష్ణుడు అర్జునుడితో “యుద్ధం చేయి శత్రువులను వధించ”మని అనేక సార్లు చెప్పాడు “ నన్ను మనసులో ఉంచుకో , యుద్ధం చేయి “ అన్నాడు “ అన్ని పనులు పక్కన పెట్టు, నాకు విడిచిపెట్టు, సంపూర్ణ ఆధ్యాత్మిక నిష్టతో భవబంధ తృష్ణను త్యజించి పోరాడు. నీ ఆత్మను దర్శించు” అన్నాడని మరల మనకు గుర్తుచేసిన వారు యోగి అరవిందులు.

దామోదర్ పంత్ చాపెకర్ (1898 లో ఊరి తీయబడ్డారు)


1890 లలో మహారాష్ట్ర ప్రదేశంలో ప్లేగు వ్యాధి ప్రబలి వేలమంది మృత్యువాత పడ్డారు. సహాయ కార్యక్రమాలు చేపట్టకపోగా బ్రిటిష్ ప్రభుత్వం తన వ్యవసాయ చట్టాలతో మరిన్ని సమస్యలు సృష్టించింది. విక్టోరియా మహారాణి 50 సంవత్సరాల పాలన ఉత్సవాల పేరిట అట్టహాసంగా వేడుకలు పూనాలో జరిగాయి. ఇది ప్రజలలో ఆగ్రహ జ్వాలలు రగిలించింది, ఈ సమయంలో ఆ పరిస్థితులకు రాండ్ అనే బ్రిటిష్ ఆఫీసర్ మరణం మరింత దోహదకారి అయ్యింది. మహమ్మారి సమయంలో బ్రిటిష్ సైనికుల అమానవీయ చేష్టలను చూస్తూ ఊరుకోలేక దామోదర్ పంత్ చాపెకర్ ఆగ్రహంతో రాండ్, అలాగే అయిరెస్ట్ అనే ఇంకో అధికారిని కాల్చి చంపారు. మిత్ర ద్రోహం మూలంగా తరువాత పట్టుబడ్డారు. ఏప్రిల్ 18 1898 న భగవద్గీత చేతిలో పట్టుకుని ఉరికంబాన్నెక్కారు.

మదన్ లాల్ ధీంగ్రా(1887-1909)


కర్జన్ వైలీ ను 1909 లో లండన్ లో హతమార్చాడు. 17 ఆగస్ట్ 1909 న భగవద్గీత చేతిలో ఉంచుకుని ఉరికంబాన్నెక్కారు. ధీంగ్రా ను తన స్ఫూర్తి అని భగత్ సింగ్ పేర్కొన్నాడు.

ఖుదీరామ్ బోస్(1889-1906)


బెంగాల్ కు చెందిన విప్లవకారుడు. హైందవ ధర్మ నిష్ఠ, జ్ఞానం కలవాడు. వైభవ పరంపర కలిగిన దేశం పరాయి సంకెళ్లలో మ్రగ్గడం చూడలేక బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేశాడు. 17 ఏళ్ల వయసులో ఉరి తీయబడ్డాడు. “వందేమాతరం” అని నినదిస్తూ భగవద్గీతను చేతిలో పట్టుకుని అమరుడయ్యాడు.

హేమూ కాలాని(1923-1943)


సింధ్ ప్రాంతానికి చెందిన సమరయోధుడు. విదేశీ వస్తు బహిష్కరణ, ఇతర ఉద్యమాలు, విప్లవ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నాడు. విప్లవకారులకు అందజేసేందుకు బ్రిటిష్ ఆయధాలను దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. ఉరి కంబం ఎక్కేముందు తన తల్లితో “ఆత్మ మాత్రమే శాశ్వతం” అని బోధించిన గీతా సారాన్ని చెప్పి ఓదార్చాడు. అటువంటి భీతావాహ, భయానక పరిస్థితులలో గీత అందించే స్ఫూర్తి మనకు ఇక్కడ దర్శనమిస్తుంది. తాను మళ్ళీ పుట్టి దేశాన్ని పరాయి పాలన నుండి విడిపించాలని కోరుకుంటున్నానని చెప్పి భగవద్గీత చేతిలో పట్టుకుని ఏప్రిల్ 18 1898 న ఉరి కంబాన్నెక్కాడు.

అనువాదం: ఖండవల్లి ఆదిత్య భరద్వాజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here