Home News స్వీయ వైఫల్యాలతో సంఘ్‌పై నిందలు

స్వీయ వైఫల్యాలతో సంఘ్‌పై నిందలు

0
SHARE

– రామ్ మాధవ్

రెండు వేర్వేరు దేశాలకు చెందిన నేతలు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పేరు చెప్పుకొని వారి అయిష్టతను వ్యక్తం చేసే సమయంలో ఒకే గట్టు మీద నిలబడి కనిపించడం అత్యంత ఆసక్తిదాయకమైన విషయం. ఆ ఇద్దరిలో ఒకరు పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ఏకమైన విపక్షాలు ప్రవేశపెట్టిన అసమ్మతి తీర్మానంతో ఓటమి పాలైన కారణంగా ఆయన ప్రధాన మంత్రి కుర్చీని వదులుకోవాల్సి వచ్చింది. ఆ సందర్భంగా ఆయన దు:ఖాన్ని వ్యక్తపరుస్తూ “సంఘ్ భావజాలం మరియు కశ్మీర్‌లో పరిణామాలు” కారణంగా భారత్‌తో తనకు సత్ సంబంధాలు లేకుండా పోయాయని అన్నారు. గత ఏడాది జులై మాసంలో తాష్కెంట్‌లో మధ్య-దక్షిణాసియా సదస్సు జరిగింది. ఆ సందర్భంగా కూడా ఇదే తరహా వ్యాఖ్యానంతో “రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భావజాలం కారణంగా ఇరు దేశాల మధ్య చర్చలు తిరిగి ప్రారంభం కాలేదు” అని ఖాన్ అన్నారు.

సంఘ్ పట్ల అయిష్టత వ్యక్తపరుస్తున్న రెండవ నేత భారత్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత రాహుల్ గాంధీ. ఆయన ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ “మనం మన సంస్థలను రక్షించుకోవాలి. కానీ అన్ని సంస్థలు సంఘ్ చేతిలో ఉన్నాయి” అని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మరియు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇరువురు నేతలకు వారి పరాజయాల వెనుక విఫలమైన వారి రాజకీయాలు కనిపించకపోవడం అత్యంత యాదృచ్చికం. కానీ నిందను సంఘ్‌పై మోపడం ద్వారా చేతులు కలిపారు. వారికి రాజకీయ భాగ్యాన్ని నిర్ణయించేది రెండు దేశాలకు చెందిన ప్రజాస్వామ్య వ్యవస్థలు అనే విషయాన్ని ఇద్దరు నేతలు తెలుసుకోవాలి.

భారతీయ రాజకీయ వ్యవస్థకు ఒక సమగ్రమైన మరియు ప్రభావవంతమైన అవయవం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్ ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి ముందే 1949లోనే సంఘ్ తనదైన ఒక రాజ్యాంగాన్ని రూపొందించింది. 1975-77 మధ్య కాలంలో రాహుల్ బామ్మ ఇందిరా గాంధీ భారతీయ ప్రజాస్వామ్యాన్ని చూర్ణం చేసి అత్యయిక పరిస్థితి రూపంలో ఒక అత్యంత చీకటి అధ్యాయాన్ని లిఖిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఒకే ఒక సంస్థ ఆమె నియంత్వత్వం నుంచి దేశానికి ఒక కవచం నిర్మించడానికి సంకల్పించుకుంది. ఆ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సంఘ్ మార్గం చూపింది.

“శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఈ భూమిపై ఉద్భవించిన ఏకైక వామపక్షేతర విప్లవ ఉద్యమం. ఈ ఉద్యమంలో రక్తపాతానికి, వర్గపోరాటానికి చోటు లేదు. ఈ సంస్థకు అజ్ఞాతంగా లక్షల మంది పనిచేస్తున్నారు. వారంతా గ్రామాల్లో నాలుగు పురుష విభాగాల ద్వారా సంఘటితమై ఉన్నారు. వీరిలో అత్యధికులు సంఘ్ నియమించిన సాధారణ కార్యకర్తలు. అయినప్పటికీ వీరిలో నవ యువ కార్యకర్తల సంఖ్య నానాటికి పెరిగిపోతున్నది. ఇతర దళాలకు చెందినవారు సైతం చివరకు జనసంఘ్ మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరిపోయారు” అని బ్రిటీష్ వార్తా వారపత్రిక ‘ది ఎకనమిస్ట్’ 1976 సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన వెలువరించిన సంచికలో పేర్కొంది.

అధికారం చేపట్టాలనే ఆసక్తి తనకు లేదని రాహుల్ అంటారు. ఆయన మాటలకు ‘అందని ద్రాక్ష పుల్లన’ అనే నానుడి గుర్తుకువస్తున్నది. ఆయనకు కానీ ఆయన పార్టీకి కానీ భవిష్యత్తులో తిరిగి అధికారాన్ని చేపట్టే అవకాశం ఎంతమాత్రమూ లేదు. వరుసగా వస్తున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి అంతకంతకూ క్షీణించిపోతున్నది. భారతీయ ప్రజాస్వామ్యం పరిపక్వతకు ఇది నిదర్శనం. వంశపారంపర్యం, వారసత్వ రాజకీయాల తిరస్కరణకు సంకేతం. “అధికార కేంద్రం” నుంచి తాను పుట్టుకొచ్చానని పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్ గర్వంగా చెప్పుకున్నారు. అత్యంత కఠినమైన రాజకీయ దశలో ఉన్న దక్షిణాసియా దేశాలకు భారతీయ ప్రజాస్వామ్యం ఆశను, విశ్వాసాన్ని కలిగించే ఒక కిరణంగా రూపుదిద్దుకుంటున్నది.

నేడు భారత్‌ పొరుగు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంకలో ప్రజాస్వామ్య వ్యవస్థపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్‌లో ఏకమైన విపక్షాల అవిశ్వాస తీర్మానంతో పరాజయం పాలైన ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతులైనారు. శ్రీలంకలో రాజపక్సే కుటుంబం నేతృత్వంలోని ప్రభుత్వతం దేశవ్యాప్తంగా ఆందోళనలను ఎదుర్కొంటున్నది.

2018 సంవత్సరంలో ఇమ్రాన్ ఖాన్, 2019లో గొటబాయ రాజపక్సే అత్యంత ప్రజాదరణతో అధికారంలోకి వచ్చారు. ఇద్దరూ కూడా వారి వారి దేశాల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నెలకొల్పారు. ఇద్దరికీ వారి సైన్యం నుంచి సంపూర్ణమైన మద్దతు లభించింది. నేడు ఇమ్రాన్ ఖాన్ అధికారాన్ని కోల్పోగా, రాజపక్సే నాయకత్వం గంభీరమైన ప్రజాస్వామ్య సవాళ్ళను ఎదుర్కొంటున్నది.

అయితే రెండు దేశాల మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది. 1948లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శ్రీలంకలో సుదీర్ఘకాలం పాటు ప్రజాస్వామ్యం వర్థిల్లుతోంది. అదే 1947లో పాకిస్తాన్‌లో నిర్మితమైన ప్రజాస్వామ్య ప్రక్రియ మూలాలు ఎన్నడూ బలపడలేదు. ఈ ప్రాంతంలోని దేశాల్లో ప్రజాస్వామ్యానికి ప్రేరణగా నిలిచిన ఏకైక దేశం భారత్. స్వాతంత్ర్యం సాధించిన నాటి నుంచి ప్రజాస్వామ్యానికి అత్యున్నతమైన నిదర్శనంగా భారత్ నిలిచింది. చుట్టుముట్టిన రాజకీయ సంక్షోభాల మధ్య కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక, పాకిస్తాన్‌ దేశాల దృష్టిలో భారతీయ ప్రజాస్వామ్యం ఒక ఆశాజ్యోతిగా అవతరించింది. ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు నేడు భారతీయ ప్రజాస్వామ్యపు విశిష్టతలను కీర్తిస్తున్నాయి. వాటిని సమర్థించడానికి నిరీక్షిస్తున్నాయి.

భారత్ స్ఫూర్తిగా నేపాల్, భూటాన్ లాంటి పొరుగు దేశాలు ప్రజాస్వామ్య బాట పట్టాయి. 1959లో కొద్దికాలం ప్రజాస్వామ్యాన్ని చవిచూసిన నేపాల్ 1990 సంవత్సరంలో రాచరికాన్ని తోసిరాజని ప్రజాస్వామ్య వ్యవస్థను తనదిగా చేసుకుంది. భూటాన్‌లో 2008లో సాక్షాత్తూ రాజు ప్రజాస్వామ్య స్థాపనకు ముందడుగు వేశారు. 1968 నాటి ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ప్రజాస్వామ్య పాలక వ్యవస్థను నిర్మించడానికి మాల్దీవులు అత్యంత ప్రయాసపడింది. సైన్యాధిపతులు అడుగడుగునా అడ్డు పడుతున్న కారణంగా ఆది నుంచి ప్రజాస్వామ్యాన్ని స్థాపించడంలో బంగ్లాదేశ్ కఠినమైన సంఘర్షణలకు గురైంది. చివరకు 1990 దశకం తర్వాత అక్కడ ఒక స్వయంవ్యవస్థితమైన ప్రజాస్వామ్యం ప్రతిష్టమైంది.

దక్షిణాసియా దేశాల్లో ప్రజాస్వామ్య ప్రతిష్ఠాపన ఎంత పటిష్టంగా ఉంటే ఆయా దేశాలకు అంత మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలోని కొన్ని దేశాలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న చైనా ఒక విభిన్నమైన రాజకీయ ప్రణాళికతో పని చేస్తున్నది. ఈ ప్రాంతంలో చైనా ఎంత ఉదారంగా సహాయం చేస్తున్నప్పటికీ దాని వెనుక రాజకీయ ఉద్దేశ్యం పూర్తిగా స్వార్థపూరితమైనది మరియు హానికరమైనది.

దురదృష్టవశాత్తు, పాశ్చాత్య వ్యాఖ్యాతలు ఈ ప్రాంతంలో విజయవంతమైన ప్రజాస్వామ్య నిదర్శనాలను ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించారు, ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకమైన కథనాలను వండి వడ్డించడం ద్వారా ఈ ప్రాంతంలోని దేశాలపై అలవిమాలిన ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో అమెరికా విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యంపై జరిగిన ఒక సదస్సుకు దీనికి తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఈ సదస్సుకు మన పొరుగుదేశాలైన నేపాల్, మాల్దీవులకు ఆహ్వానం అందింది. కానీ భూటాన్, శ్రీలంక దేశాలను విస్మరించారు. ఆశ్చర్యకరంగా ఇప్పటికీ ప్రజాస్వామ్యం దిశగా తప్పటడుగులు వేస్తున్న పాకిస్తాన్‌కు శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే అర్హత లభించింది. పాకిస్తాన్ కంటే మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్థను సంతరించుకున్న బంగ్లాదేశ్‌ను సదస్సుకు ఆహ్వానించలేదు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ మాధ్యమం ద్వారా ఈ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. చైనా అత్యంత స్పష్టంగా, నిర్ద్వంద్వంగా శిఖరాగ్ర సదస్సును వ్యతిరేకించింది. అక్కడితో ఆగకుండా ”అమెరికాలో ప్రజాసామ్యం పరిస్థితి” పేరిట ఒక నివేదికను విడుదల చేయడం ద్వారా సదస్సును నీరుగార్చడానికి ప్రయత్నించింది.

భారత్ సూత్రప్రాయంగా ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. అయినప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్దదైన, సమర్థమంతమైన మరియు విజయవంతమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ తన పొరుగు దేశాలకు అత్యున్నతమైన తార్కాణంగా నిలిచింది. పొరుగు దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్ళకు ఒక పరిష్కార మార్గంగా అవతరించింది. ఆయా దేశాలు దాని పొరుగు దేశాలు తమతో ఏమి చేయగలదో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ప్రస్తుత సవాళ్లకు పరిష్కారాలను చూపగలదు. ఆధిపత్యవాద మరియు నిరంకుశ పాలన బారి నుంచి ఆయా దేశాలు తప్పించుకోవాలంటే భారత్ వేసి ప్రజాస్వామ్య మార్గాన్ని అవి అనుసరించాల్సి ఉంటుంది.

(వ్యాసకర్త రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ మరియు అంతర్జాతీయ రాజకీయాలపై ప్రముఖ వ్యాఖ్యాత)