Home News వ్యాక్సినేషన్ స‌మ‌యంలో రక్తదాన కొరత నివారించడానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌ ఆధ్వ‌ర్యంలో రక్తదాన శిబిరాలు

వ్యాక్సినేషన్ స‌మ‌యంలో రక్తదాన కొరత నివారించడానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌ ఆధ్వ‌ర్యంలో రక్తదాన శిబిరాలు

0
SHARE

వ్యాక్సినేష‌న్ స‌మ‌యంలో ర‌క్త‌దాన కొర‌త నివారించ‌డానికి ఆర్‌.ఎస్‌.ఎస్ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని ప‌లు చోట్ల ర‌క్త‌దాన శిబిరాల‌ను ఏర్పాటు చేశారు. కేశవ స్మృతి సంవర్ధన సమితి, రక్తదాన్ సేవా ట్రస్ట్, తెలంగాణ వారి సౌజన్యంతో రక్తదాన్ సేవా బర్కత్ పుర భాగ్ ఆధ్వ‌ర్యంలో నారాయణగూడ, అంబర్ పేట, మధురానగర్ లలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాలను రక్తదాన్ సేవా, తెలంగాణ ప్రాంత కోఆర్డినేటర్ రామేశ్వర్ , బర్కత్ పుర భాగ్ రక్తదాన్ ప్రముఖ్ నవీన్ పర్యవేక్షించారు.

నారాయణగూడ లో
హిమాయ‌త్ న‌గ‌ర్‌లోని కేశవ్ మెమోరియల్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన ర‌క్త‌దాన శిబిరంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM) నారాయణగూడ వారు రక్తాన్ని సేకరించడం జరిగింది. చిక్కడపల్లి నారాయణగూడ నగరాల నుంచి రక్త దాతలు పాల్గొన్నారు. ఈ శిబిరంలో 47 మంది ర‌క్త‌దానం చేయ‌గా 39 యూనిట్లు సేకరించడం జరిగింది.

ఈ శిబిరాన్ని ఆర్‌.ఎస్‌.ఎస్ తెలంగాణ ప్రాంత ప్ర‌చార‌క్ శ్రీ దేవేందర్ జి సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు భాగ్యనగర్ విభాగ్ ప్రచారక్, శ్రీ ప్రభుకుమార్ జి, నారాయణగూడ నగర్ కార్యవాహ చక్రపాణి, చిక్కడపల్లి నగర కార్యవాహ శ్రీ రామారావు జి , రెండు నగరాల నగర కార్యకారణి సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నారాయణగూడ నగర రక్తదాన్ ప్రముఖ్ రవిశంకర్, చిక్కడపల్లి నగర రక్తదాన్ ప్రముఖ్ శ్రీరామ్ పర్యవేక్షించారు.

మధురానగర్ లో
మధురానగర్ రక్తదాన శిబిరం శ్రీనివాస కమ్యూనిటీ హాల్ లో జరిగింది. ఈ శిబిరంలో నీలోఫర్ ఆసుపత్రి వారు 36 మంది దాతలు పాల్గొనగా 32 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.

అంబర్ పేట లో
అంబర్ పేట రక్తదాన శిబిరం శాంతినికేతన్ హైస్కూల్ లో జరిగింది. ఈ శిబిరంలో నీలోఫర్ ఆసుపత్రి రెండవ యూనిట్ వారు 25 మంది దాతలు పాల్గొనగా 22 యూనిట్ల ర‌క్తాన్ని సేక‌రించారు.

ఇంత తక్కువ సమయంలో రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించి నందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నారాయణగూడ వారు, నీలోఫర్ ఆస్పత్రి వైద్యబృందం రక్తదానం సేవ ట్రస్ట్, RSS ను అభినందించారు.


క‌రిన‌గ‌ర్‌ లో

క‌రిన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలోని కేశ‌వ ఈ.ఎన్‌.టీ ఆస్ప‌త్రిలో శ‌నివారం ర‌క్త‌దాన శిబిరాన్ని నిర్వ‌హించారు. ఈ శిబిరానికి క‌రీంన‌గ‌ర్ సీపీ శ్రీ వి బి క‌మ‌లాస‌న్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భార‌త‌దేశంలో ఎటువంటి స‌మ‌స్య వ‌చ్చిన దేశ ప్ర‌జ‌లంతా ఏక‌మ‌వుతార‌ని, ప్ర‌స్తుతం కోవిడ్ వంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా దేశ ప్ర‌జ‌లంతా ఏక‌మై క‌రోనా పై పోరాటం చేస్తున్నార‌ని అన్నారు. అంద‌రం క‌లిసి క‌ట్టుగా పోరాడితేనే క‌రోనాను నివారించ‌గ‌ల‌మ‌ని ఆయ‌న అన్నారు. ఇటువంటి విపత్క‌ర ప‌రిస్థితుల‌లో కూడా సేవా కార్య‌క్ర‌మాల‌ను, ర‌క్త‌దాన శిబిరాల‌ను నిర్వ‌హిస్తున్న సేవాభార‌తిని ఆయ‌న అభినందించారు. ఈ శిబిరంలో 50మంది ర‌క్త‌దానం చేశారు.