Home Uncategorized విదళిత హృదయాల్ని మేల్కొల్పిన జాతీయకవి బోయిభీమన్న

విదళిత హృదయాల్ని మేల్కొల్పిన జాతీయకవి బోయిభీమన్న

0
SHARE

–సామ‌ల కిర‌ణ్‌

వి’దళితుల’ హృదయాల్ని మేలుకొలిపి, వారి ఆత్మగౌరవ పతాకాన్ని నింగిని తాకించిన పద్మభూషణుడు బోయి భీమన్న. ఆధునిక తెలుగు సాహిత్యంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళాప్రపూర్ణుడాయన. పద్యం, గద్యం, గేయం, నాటకం, నాటిక, వచన కవిత వంటి పలుసాహితీ ప్రక్రియల్లో 70కి పైగా రచనలను వెలువరించిన భీమన్న భావం సున్నితం! భాష సుందరం! ఆశయం అద్భుతం!

‘‘బానిసతనమును బాపుమురా/ భారతభూమికి భాగ్యము తేరా!/ 
సకల దేశముల సర్వ మానవుల/ సామ్యము సాధింపుమురా’’   అంటూ తన రచనలతో అణగారిన సమాజాన్ని ప్రేరేపించిన సమరసతా సాహిత్య సిద్ధాంతకర్త బోయి భీమన్న. పేదరికం, అంటరానితనం, అవమానాల స్వానుభవాలతో అక్షరాలే ఆయుధంగా అనుక్షణం ఉద్యమించిన ఈ సాహితీవేత్త, సెప్టెంబరు 19, 1911న జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు ఆయన స్వస్థలం. తండ్రి పుల్లయ్య, తల్లి నాగమ్మ. తండ్రి అయిదుగురు కొడుకులకు పంచపాండవుల పేర్లు పెట్టుకున్న క్రమంలో రెండో కుమారుడే ‘భీమన్న’ అయ్యారు! విద్యాభ్యాసం పూర్తయిన తొలిరోజుల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారాయన. ఆ తర్వాత జనవాణి, జయభేరి, ప్రజామిత్ర, నవజీవన్, ఆంధ్రప్రభ పత్రికల్లో పనిచేశారు. ‘‘వ్యక్తుల వికాసమే జాతి. జాతుల వికాసమే వసుధ. వసుధైక సామ్రాజ్యమే మానవలోక సంపూర్ణ ఫలం’’ అన్నది భీమన్న తాత్విక భూమిక. “కవి ఏ కాలంలో జీవించాడో, ఆ కాలానికి చెందిన సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విషయాలన్నీ అతడి రచనల్లో ప్రతిఫలించాలి’’ అని చెప్పిన బోయి భీమన్న కవిత్వం తెలుగు సంస్కృతికి అద్దంపడుతుంది.

సాహిత్యంలో భీమన్న సృష్టించిన ఒరవడిఁ అద్వితీయం, అజరామరం. ఆయన రచనలన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న విషయం ఒక్కటే-అదే “భారతజాతి ఏకత్వం”.సమాజంలో చెడ్డవాళ్ళే కాదు, అనేకులు మంచివాళ్ళుంటారని తెలియజేయటం భీమన్న సాహిత్యంలోని విశిష్టగుణం. పాలేరు నాటకంలో వనబాల కూడా అగ్రవర్ణానికి చెందిన కుటుంబంలో నుండి వచ్చినప్పటికీ, అలాంటివాళ్ళలోనూ సంకుచిత మూర్ఖ కులతత్వం లేని వాళ్ళు ఉంటారనే విషయాన్ని తెలియజేశారు. హరిజనులుగా సమాజంచే పిలువబడ్డవారి అంతరంగాలలో స్వాభిమానాన్ని నింపి, సమకాలీన సమాజంతో గౌరవానికి అర్హులయ్యేటట్లుగా చేయటం భీమన్న గారి సాహిత్య లక్ష్యం. పాలేరు, కూలిరాజు వంటి నాటకాల లోనూ, ‘జన్మాంతర వైరం,’ ‘అంబేడ్కర్‌ సుప్రభాతం,’ ‘అంబేడ్కరిజం,’ ‘పంచమ స్వరం’ మొదలైన కావ్యాలలోనూ ఈ తపన స్పష్టంగా గోచరిస్తుంది. జన్మాంతర వైరం కావ్యం చివరిలో…

”లే దస్పృశ్యత, లేదు లేమి, కులముల్‌ లేవు, ఆర్షలోకమ్ము తత్‌
భేదక్లేశము లెల్లతీరి, ధ్వజమెత్తెన్‌ లోక శ్రేయస్సుకై
వేదోక్తమ్మిది సర్వజాతి సమతావిష్కార తత్త్వమ్ము బ్రా
హ్మీదేవత్వము నొంది సాగుడొకటై, మేధావులై ఎల్లరున్‌” అనే సందేశాన్ని అందించారు.

అంబేడ్కర్‌ అడుగుజాడల్లో!

అంబేడ్కర్‌ రాసిన ‘ఎనిహిలేషన్‌ ఆఫ్‌ ది క్యాస్ట్‌’ గ్రంథాన్ని ‘కుల నిర్మూలన’గా తెలుగులోకి భీమన్న అనువదించారు. అంతే త్రికరణశుద్ధితో అంబేడ్కర్‌ సిద్ధాంతవాదాన్ని అనుసరించి, ప్రచారం చేశారు. అంబేద్కర్, భీమన్న ఇరువురు చదువుకోవటంవల్లనే సమాజానికి ఆదర్శం కాగలిగారు. యాదృచ్చికంగా ఇద్దరూ కులాంతర వివాహమే చేసుకున్నారు. తాము చెప్పిన వాటిని జీవితాంతం ఆచరించి చూపి మహానుభావులయ్యారు. సామాజిక అసమానతలు, కుల, మత, లింగ, వర్గ వివక్షతలు, దళితుల అణచివేత… వీటిన్నింటినీ ఇతివృత్తాలుగా మలచి తన నాటకాల్లో దృశ్యమానం చేశారు భీమన్న. ‘పాలేరు, కూలిరాజు, అసూయ, ప్రగతి, పడిపోతున్న గోడలు, రాగవాసిష్ఠం, ఆదికవి వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు, బాలయోగి, చిత్రకళా ప్రదర్శనం, చండాలిక (రవీంద్రుడి చండాలిక అనువాదం)’ తదితర నాటకాలను రాశారాయన. వీటిలో ‘పాలేరు’ నాటకం అప్పట్లో గొప్ప సంచలనాన్ని రేపింది. ఇందులోని కథానాయకుడు వెంకన్న. ఓ కామందు దగ్గర వెట్టి చేస్తూ, నానా బాధలు పడుతుంటాడు. ఆ తర్వాత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని బాగా చదువుకుంటాడు. చివరికి ఉన్నతోద్యోగాన్ని సాధించి, వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలకు అడ్డుకట్ట వేస్తాడు. ప్రజాస్వామ్యబద్ధంగా దళితులు తమ హక్కులు సాధించుకోవాలనే అంబేడ్కర్‌ ఆశయాన్ని ఈ నాటకం ద్వారా ప్రచారం చేశారు భీమన్న. ఆనాటి దళిత యువకులకు ఈ నాటకం గొప్ప ఉత్ప్రేరకమైంది. వాళ్లని చదువులబాట పట్టించింది. ఈ నాటక ప్రదర్శన కోసమే తెలుగునాట అనేక సమాజాలు ప్రారంభమయ్యాయి. ఆ నాటక సమాజాలు ఊరూరా ‘పాలేరు’ను ప్రదర్శించేవి!

భీమన్న నాటకాల్లో ప్రత్యేకమైంది ‘రాగవాసిష్ఠం’. ‘భారతీయులందరూ ఆర్యులే’ అన్న సిద్ధాంతాన్ని దీని ద్వారా ప్రతిపాదించారు భీమన్న. ఆర్య, అనార్య భేదభావాలు స్థలకాలాలను బట్టి ఏర్పడ్డాయన్నది ఆయన అభిప్రాయం. పౌరాణిక ఇతివృత్తాన్ని తీసుకుని సమాజంలో వేళ్లూనుకున్న కులసమస్యను కూలంకషంగా చర్చించి, జాతీయవాదాన్ని నిరూపించే నాటకంగా రాగవాసిష్ఠాన్ని అభివర్ణించవచ్చంటారు నార్ల వెంకటేశ్వరరావు. ఈ నాటకాన్ని రాయడానికి భీమన్న వేదాలు, మనుస్మృతి, అమరకోశం, రామాయణం, మహాభారతాలను అధ్యయనం చేశారు. ‘రాగవాసిష్ఠం’లో అరుంధతి, వసిష్ఠుడు, ప్రాచీనుడు, సంధ్య పాత్రలు ప్రధానమైనవి. అట్టడుగు వర్గాల వారిని అభిశంసిస్తూనే, అవసరాలకు వాళ్లని ఎలా వాడుకుంటారో తెలియజెప్పే పాత్ర కులగిరి. ప్రాచీన ధర్మానికి ప్రాపుగా నిలిచే ప్రాచీనుడు, మానవీయతకు ప్రాతినిధ్యాన్ని వహించే వసిష్ఠుడు.. వీళ్లిద్దరి మధ్య చోటుచేసుకునే సైద్ధాంతిక సంఘర్షణను ఈ నాటకంలో చిత్రీకరించారు భీమన్న. అరుంధతి అస్పృశ్య స్త్రీ. వశిష్ఠుడు ఆర్య జాతీయుడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అరుంధతి కులం గురించి తెలిసి, వసిష్ఠుడు ఆమెకు దూరమవుతాడు. ఆక్రోశంతో అరుంధతి చేసిన తపస్సుకు లోకం అల్లకల్లోలమవుతుంది. ఈశ్వరుడు వచ్చి ప్రాచీనుడి వ్యతిరేకతను పోగొట్టి అరుంధతి, వసిష్ఠుల వివాహాన్ని జరిపిస్తాడు. వాళ్లకు శక్తిమహర్షి జన్మిస్తాడు. శక్తి మహర్షికీ, మాతంగ కన్యకూ పుట్టినవాడు పరాశరుడు. పరాశరుడికీ, సత్యవతికీ జన్మించినవాడు వ్యాసుడు. ఇదీ పరంపర. ‘‘పెరుగుదలలో పరిసరాల ప్రాచుర్యం మినహాయిస్తే, మానవజాతి అంతా ఒక్కటే కదా!’’ అని ఈశ్వరుడి పాత్రతో పలికిస్తారు భీమన్న. ఇలా ఆయన రాసిన నాటకాలన్నీ సామాజిక సమస్యలను చర్చకు పెట్టినవే.

సమరసతా మార్గమే శరణ్యం
సంస్కరణ, జాతీయవాద దృష్టి కలగలిసిన అద్భుత సమరసతా కవితామూర్తి డా|| భీమన్న.
అట్లే సమాజంలో సంఘర్షణలకు కారణమైన కుల, మత, వర్గ విభేదాలను అధిగమించాలంటే, అందరూ విద్యావంతులు కావాలంటారు భీమన్న. “సామాజిక సమరసత, సాహితీ సమర్చన రెండు కళ్ళుగా జీవించారు బోయి భీమన్న” అంటారు ప్రముఖ సాహితీవేత్త ఆశావాది ప్రకాశరావు. కులంలేని జాతి కోసం భీమన్న కలలు గన్నాడు. కవి భావాలు సత్యగుణ ప్రధానం అయితే స్వచ్ఛ సమాజ స్థాపన జరుగుతుందని ఆయన విశ్వసించాడు. డిసెంబరు 16, 2005న తుదిశ్వాస విడిచిన తన రచనల్లో కులమతాల కంటే మానవతకు ప్రాధాన్యాన్నిచ్చారు. భీమన్న చూపిన సమరసతా మార్గంలో పయనిద్దాం…. సమైక్య, సమరస భారతాన్ని నిర్మిద్దాం. సమరసత ఓ ఆచరణాత్మక అంశం. ఇది హృదయానికి సంబంధించిన భావావేశం. వ్యక్తి వ్యష్టి నుండి సమిష్టి…. పరమేష్ఠి వైపు కొనసాగే ఓ హృదయపరివర్తన సమరసత. హృదయ విశాలత అలవడితే సమరసత సాధ్యం. ఆ దిశలో అడుగులు వేద్దాం… విశ్వ మానవతకు పెద్దపీట వేద్దాం. విశ్వ కళ్యాణాన్ని సాధిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here