Home News రోహింగ్యా ముస్లింలు స్వదేశమైన మైన్మార్ తరలివెళ్లడానికి రంగం సిద్ధం

రోహింగ్యా ముస్లింలు స్వదేశమైన మైన్మార్ తరలివెళ్లడానికి రంగం సిద్ధం

0
SHARE

బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలు స్వదేశమైన బర్మా-మైన్మార్-కు తరలివెళ్లడానికి రంగం సిద్ధం కావడం ‘సయోధ్య’కు ప్రతీక. ఈ సయోధ్య బంగ్లాదేశ్, బర్మా ప్రభుత్వాల మధ్య కుదిరింది. గత కొన్ని నెలలుగా బర్మాలోని అరకాన్ – రక్షణ -రఖానే- ప్రాంతం నుంచి లక్షలాది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌లోకి వలస రావడానికి కారణం రోహింగ్యాలలోని ‘జిహాదీ’లు దశాబ్దులుగా జరుపుతున్న బీభత్సకాండ. అరకాన్‌లోని ‘రోహింగ్యా’ల కడగండ్లు పశ్చిమ ఆసియా ప్రాంతంలోని ‘పాలస్తీనా ముస్లింల’ కడగండ్లవలె ఉండటం ‘జిహాదీ’ల బీభత్సకాండ ఫలితం! బర్మా అంతటా బౌద్ధులు అధిక సంఖ్యలో ఉన్నారు. అరకాన్‌లో మాత్రం ఇరవయ్యవ శతాబ్ది ఆరంభం నాటికి ఇస్లాం మతస్థులు అధిక సంఖ్య – మెజారిటీ – జన సముదాయమయ్యారు. ఇస్లాం మతస్థులు అల్పసంఖ్యలో ఉన్నచోట వారు అధిక సంఖ్యలోని ఇతర మతస్థులతో కలసిమెలసి జీవిస్తున్నారు. కానీ ఇస్లాం బాహుళ్యమైన ‘అరకాన్’లో మాత్రం జిహాదీలు అల్పసంఖ్యవారైన బౌద్ధులను హిందువులను నిర్మూలించడానికి పూనుకున్నారు. ‘అరకాన్’లో జిహాదీల బీభత్సం మన జమ్మూకశ్మీర్‌లో జిహాదీల బీభత్సం వంటిది. కానీ ప్రతిక్రియలో మాత్రం ఎంతో అంతరముంది. కశ్మీర్ లోయలో జిహాదీల బీభత్సకాండను మన ప్రభుత్వాలు అణచివేయలేకపోయాయి. అందువల్ల లోయ ప్రాంతంలోని అల్పసంఖ్య హిందువులను జిహాదీ బీభత్సకారులు నిర్మూలించారు, చంపారు, తరిమారు. కశ్మీర్ లోయలో 1947 నాటికి ఇరవై ఏడు శాతం ఉండిన హిందువుల సంఖ్య ప్రస్తుతం సున్న శాతం! కానీ అరకాన్ ప్రాంతంలోని అల్పసంఖ్య బౌద్ధులను హిందువులను నిర్మూలించడానికి రోహింగ్యా జిహాదీలు 1947వ సంవత్సరానికి పూర్వం నుండీ కూడ చేస్తున్న యత్నాలను బర్మా ప్రభుత్వం వమ్ము చేసింది, జిహాదీలను కఠినంగా అణచి పారేసింది, ‘జిహాదీలు’ చెలరేగిన ప్రతిసారీ బర్మా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వారిని అణచివేస్తోంది. ఈ అణచివేత చర్యవల్ల తమ ప్రాణాలకు కూడ ముప్పు వాటిల్లగలదన్న భయంతో సామాన్య రోహింగ్యా ప్రజలు బంగ్లాదేశ్‌కు పారిపోయి వస్తున్నారు. కానీ గత పదేళ్లుగా ఈ బంగ్లాదేశ్‌లోని రోహింగ్యాలు పథకం ప్రకారం మన దేశంలోకి చొరబడుతున్నారు. ఫలితంగా మనదేశంలో డెబ్బయి ఐదువేల మందికి పైగా ‘రోహింగ్యా అక్రమ ప్రవేశకులు’ తిష్టవేసి ఉన్నారు. గత జూలై ఆగస్టు నెలల్లో ‘అరకాన్’లో జిహాదీలు అల్పసంఖ్య ప్రజలపై పెద్దఎత్తున దాడులు చేయడం, ప్రభుత్వం మరింత పెద్దఎత్తున గ్రామగ్రామంలో పరిశోధించి టెర్రరిస్టులను నిర్బంధించడం ఏరివేయడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.

ఈ సంఘర్షణ ఫలితంగా రెండు నెలలలోనే అరకాన్ ప్రాంతం నుంచి బంగ్లాదేశ్‌లోకి దాదాపు నాలుగు లక్షల రోహింగ్యాలు చొరబడిపోయారు. గతంలో వలసవచ్చిన వారితో కలసి బంగ్లాదేశ్‌లో ఆరు లక్షలకు పైగా ‘రోహింగ్యా’లు తిష్టవేసి ఉన్నారు. వీరందరూ మళ్లీ ‘అరకాన్’లోని స్వగ్రామాలకు, స్వస్థలాలకు వెళ్లడానికి గురువారం కుదిరిన ఒప్పందం దోహదం చేయగలదు. బంగ్లాదేశ్‌లోని రోహింగ్యాల పునర్ స్వస్థల గమనం వల్ల మన దేశంలోని రోహింగ్యాలు కూడ బర్మాకు తిరిగి వెళ్లాలన్న మన ప్రభుత్వ విధానానికి మరింత బలం చేకూరింది. బంగ్లాదేశ్‌లో రోహింగ్యాలు తిష్ఠ వేయడం వల్ల ఆర్థికపరమైన జనాభాపరమైన సమస్యలు మాత్రమే ఉత్పన్నమయ్యాయి. కానీ మనదేశంలోని రోహింగ్యాలవల్ల మనకు వీటితోపాటు ‘భద్రత’ సమస్యలు ఎదురౌతున్నాయి. మనదేశంలోని రోహింగ్యాలు శరణార్థులై రాలేదు. ‘శరణార్థులు’ సమీపంలోని బంగ్లాదేశ్‌లోనికి చొచ్చుకొని రావడం తార్కికం! ‘రఖినే’ ప్రాంతం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జిల్లాను ఆనుకొని ఉంది… అందుకని!! కానీ మన దేశంలోకి – బంగ్లాదేశ్ నుంచి- రోహింగ్యాలు చొరబడడం వెనుక జిహాదీ ఉగ్రవాదుల కుట్ర నిహితమై ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స విభాగమైన ‘ఐఎస్‌ఐ’ పథకం నక్కి ఉంది. మనదేశంలో నివసిస్తున్న ‘రోహింగ్యా’లను మన దేశానికి వ్యతిరేకంగా బీభత్సం సాగించడానికి ‘ఐఎస్‌ఐ’ ఉసిగొల్పుతోంది! ‘ఐఎస్‌ఐ’ సహకారంతోనే ‘ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం’ – ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా – ఐసిస్- మనదేశంలోకి చొరబడింది. ‘ఐసిస్’ రోహింగ్యాలను ‘జిహాదీ బీభత్సకారులు’గా మార్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు ఇటీవల సాక్ష్యాధారాలు బయటపడ్డాయి. గతంలో బుద్ధగయలో వరుస పేలుళ్లు జరిపింది ‘రోహింగ్యా’ జిహాదీ ముష్కురులేనన్నది ఇప్పుడు ధ్రువపడిన వాస్తవం! అందువల్ల మన ఆంతరంగిక భద్రత దృష్ట్యా మన దేశంలోని వేలాది రోహింగ్యాలను బర్మాకు తరలించడం అనివార్యం! రోహింగ్యాల స్వదేశ గమనం విషయంలో బంగ్లాదేశ్‌కు బర్మాకు మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. ఇదే రీతిలో మన ప్రభుత్వం కూడ బర్మా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొనడానికి తక్షణం నడుం బిగించాలి!!

అరకాన్ ప్రాంతంలో విచ్ఛిన్నకారులు విజృంభించడానికి అఖండ భారత్ విభజన నేపథ్యం! అఖండభారత్‌లో భాగంగా ఉండిన బర్మాను బ్రిటన్ సామ్రాజ్యవాదులు 1937 ఏప్రిల్ ఒకటవ తేదీన విడగొట్టారు. ప్రత్యేక బ్రిటన్ ‘వలస’ దేశంగా బర్మా ఏర్పడింది. 1948 జనవరి నాలుగవ తేదీన బ్రిటన్ పెత్తనం నుంచి విముక్తమై స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అప్పటికే ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్న భారత ప్రాంతాలు పాకిస్తాన్‌గా ఏర్పడినాయి. అందువల్ల ‘మతప్రాతిపదికగా ప్రత్యేక జాతి…’ అన్న కృత్రిమ సిద్ధాంతం బర్మాలో కూడ ప్రచారమైంది. ఇస్లాం మతస్థులు – రోహింగ్యాలు అధిక సంఖ్యలో ఉన్న అరకాన్ – రఖినే – ప్రాంతాన్ని బౌద్ధ బాహుళ్యం కల ‘బర్మా’ నుంచి విడగొట్టి స్వతంత్ర దేశంగా, ‘ఇస్లామీ మత రాజ్యం’గా ఏర్పాటు చేయాలన్న జిహాదీ విషవాంఛ మొలకెత్తడానికి ఈ కృత్రిమ సిద్ధాంతం కారణం!

క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్దిలో అరేబియా ప్రాంతాల నుంచి – ఓడల వర్తకం- ద్వారా వచ్చి అరకాన్‌లో స్థిరపడిన ఇస్లాం మతస్థులు క్రమంగా సంఖ్యను పెంచుకొన్నారు. పదిహేడవ పద్దెనిమిదవ శతాబ్దిలో బెంగాల్ నుంచి వలస వెళ్లిన ఇస్లాం మతస్థులు కూడ భారీ సంఖ్యలో అరకాన్‌లో స్థిరపడ్డారు. ‘రొహాంగ్’లు క్రమంగా రోహింగ్యాలుగా మారి ‘అరకాన్’ను ‘రోహింగ్’ ప్రాంతంగా, ‘రఖినే’ ప్రాంతంగా పిలిచారు!! 1942లో ‘రోహింగ్యా’ జిహాదీలు ఇరవై వేల మంది స్థానిక ‘అరకానీ’ బౌద్ధులను హిందువులను చిత్రవధ చేశారు. సమాంతరంగా స్థానికులు ఐదువేల రోహింగ్యాలను హతమార్చారు. 1947లో ఏర్పడిన ‘ముజాహిద్’ పార్టీ ‘అరకాన్’కు మొదట స్వతంత్ర ప్రతిపత్తిని కోరింది. ఆ తరువాత జిహాదీలు చెలరేగి ‘స్వాంత్య్రాన్ని’ సాధించడానికి బీభత్సకాండ మొదలుపెట్టారు! గత ఏడాది మరోకొత్త ‘జిహాదీ’ ముఠా ఏర్పడిన తరువాత బౌద్ధులపై హిందువులపై దాడులు తీవ్రమయ్యాయి. కానీ ఈ వ్యూహం బెడిసికొట్టింది… ‘జిహాదీ’ల పాపానికి సామాన్య ‘రోహింగ్యా’లు ‘శిక్ష’ అనుభవించవలసి వస్తోంది!! ఇప్పటికైన రోహింగ్యా ముస్లింలు ‘జిహాదీ’లను దూరంగా ఉంచగలగాలి.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)