Home News దేశంలో 4 లక్షల వరకు షెల్ కంపెనీలు ఉన్నట్లు అనుమానాలు, మూసివేయించే దిశగా అడుగులు

దేశంలో 4 లక్షల వరకు షెల్ కంపెనీలు ఉన్నట్లు అనుమానాలు, మూసివేయించే దిశగా అడుగులు

0
SHARE
  • వెతికినకొద్దీ వెలుగుచూస్తున్న షెల్ కంపెనీలు
  • ఇప్పటికే 2.25 లక్షలకుపైగా సంస్థల గుర్తింపు రద్దు
  • మరో 4 లక్షల వరకు ఉన్నట్లు అనుమానాలు
  • రెండేండ్లుగా వీటి టర్నోవర్ జీరోనే
  • కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టి
  • మూసివేయించే దిశగా అడుగులు

దేశంలో వెతికినకొద్దీ వెలుగుచూస్తున్నాయి షెల్ కంపెనీలు. కుక్కగొడుగుల్లా విస్తరించిన వీటిని కూకటి వేళ్లతో పీకేయాలని చూస్తున్నది కేంద్రం. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా లక్షలాది సంస్థలు మూతబడనున్నాయని సమాచారం. గడిచిన రెండేండ్లుగా ఈ సంస్థల టర్నోవర్ ఏమీలేదు మరి. దీంతో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ).. కంపెనీల చట్టంలోని సెక్షన్ 248 నిబంధనలను సదరు సంస్థలపై ప్రయోగించాలని యోచిస్తున్నది. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రముఖ జాతీయ దినపత్రికతో అన్నట్లు తెలుస్తున్నది. రెండేండ్లుగా ఎలాంటి వ్యాపారం చేయని ఈ సంస్థలు ఎన్నుంటాయన్నది ఇప్పటికిప్పుడు స్పష్టంగా తెలియరాకున్నా.. కనీసం మూడు-నాలుగు లక్షలైతే ఉంటాయని ఆ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం గతేడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 17 లక్షలకుపైగా సంస్థలు నమోదై ఉన్నాయి. వీటిలో 11.4 లక్షల సంస్థలు మనుగడలో ఉన్నట్లు తెలుస్తున్నది. మిగతా వాటి గురించి ఆరా తీస్తుండగా, రిజిస్టర్లను పూర్తిగా పరిశీలించి కనీసం రెండేండ్ల నుంచి జీరో టర్నోవర్‌ను చూపిస్తున్న సంస్థలను గుర్తించాలని అధికారులకు రిజిస్ట్రార్స్ ఆఫ్ కంపెనీస్ ఆదేశాలు జారీచేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎంసీఏ కార్యదర్శి, రెవిన్యూ కార్యదర్శిల సంయుక్త నాయకత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటవగా, షెల్ కంపెనీలకు వ్యతిరేకంగా చేసిన సిఫార్సులపై ఇటీవల ఎంసీఏ సమీక్ష జరిపింది.

అనంతరం సెక్షన్ 248 నిబంధనల కింద చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చింది. నల్లధనం వెలికితీత, నకిలీ నోట్ల నిర్మూలనే లక్ష్యంగా 2016, నవంబర్ 8వ తేదీ రాత్రి పాత పెద్ద నోట్ల (రూ.500, 1,000)ను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలనాత్మక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏర్పాటు చేసినదే ఈ టాస్క్ ఫోర్స్. ఇప్పటిదాకా 16,000 సంస్థలను ఇది షెల్ కంపెనీలుగా వర్గీకరించగా, మరో 80,000 సంస్థలను అనుమానిత జాబితాలో ఉంచింది. ఇంకో 17,000 కంపెనీల్లో షెల్ కంపెనీల డైరెక్టర్లే ఉన్నట్లు గుర్తించింది.

ఐటీ, ఎంసీఏల చేతికి వివరాలు

నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ ట్రేడింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న సంస్థలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొరఢా ఝుళిపిస్తున్నది. ఇందులో భాగంగానే 14,720 సంస్థల వివరాలను ఐటీ శాఖ, ఎంసీఏలతో పంచుకుంటున్నది. ఈ మేరకు ఎంసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బీఎస్‌ఈ స్టాక్ ఆప్షన్స్ సెగ్మెంట్‌లో 2014, ఏప్రిల్ 1 నుంచి 2015, సెప్టెంబర్ 30 మధ్య 21,600లకుపైగా సంస్థల్లో ట్రేడింగ్ జరుగగా, 14,720 సంస్థల్లో అక్రమాలు జరిగినట్లు సెబీ దర్యాప్తులో తేలింది. అక్రమాలకు పాల్పడ్డాయన్న ఆరోపణలకు సంబంధించిన ఓ కేసులో 59 సంస్థలపై సెబీ విచారణ జరుపడంతోనే ఈ 14,720 సంస్థల అవకతవకలు బయటపడ్డాయి. దీంతో దర్యాప్తు చేపట్టగా, వేలాది సంస్థల అక్రమ బాగోతం వెలుగుచూసింది. తదుపరి విచారణలో భాగంగా వీటి ఆదాయం, లాభాల వివరాలను ఇప్పుడు ఐటీ, ఎంసీఏలకు సెబీ అందిస్తున్నది.

నిజానిజాలు బయటికొస్తాయ్: పీపీ చౌదరి

షెల్ కంపెనీల వెనుక ఎలాంటివారున్నా ఉపేక్షించేది లేదని కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి.. అక్రమ దారుల్లో నడుస్తున్న కార్పొరేట్లను హెచ్చరించారు. ఈ ఉత్తుత్తి సంస్థల పరిశీలనలో రాజకీయ పార్టీలు, బడా బాబులు, కార్పొరేట్ల గురించి ఏదో విలువైన సమాచారం లభించే వీలు లేకపోలేదనడం గమనార్హం. కంపెనీల నిర్వహణలో ప్రభుత్వం పారదర్శకతను కోరుకుంటున్నదన్న ఆయన వ్యాపార కార్యకలాపాలకు దూరంగా ఉన్న సుమారు 2.25 లక్షల కంపెనీలకు నోటీసులను పంపించామని తెలిపారు. ఇప్పటికే చాలా కాలం నుంచి ఎలాంటి చట్టపరమైన రిటర్నులు దాఖలు చేయని దాదాపు 2.26 లక్షల సంస్థల పేర్లను అధికారిక రికార్డుల నుంచి ఎంసీఏ తొలగించిన విషయం తెలిసిందే.

పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత వీటిలోని 1.68 లక్షల సంస్థల బ్యాంక్ ఖాతాల్లో నగదు డిపాజిట్లు జరిగినట్లు పేర్కొన్నది. ముఖ్యంగా 73 వేల సంస్థల్లో రూ.24,000 కోట్లు డిపాజిట్ అయ్యాయి. పెద్ద మొత్తంలో డిపాజిట్ అయిన ఖాతాలకు సంబంధించిన 58 వేల సంస్థల వివరాలను వివిధ బ్యాంకుల నుంచి అధికారులు సేకరిస్తున్నారు. ఇక 68 సంస్థలపై దర్యాప్తు జరుగుతుండగా, 19 సంస్థల వ్యవహారాన్ని తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయానికి (ఎస్‌ఎఫ్‌ఐవో) అప్పగించారు. కాగా, నోటీసులపై వచ్చే స్పందన ఆధారంగా త్వరలోనే సంస్థల డీరిజిస్ట్రేషన్లపై ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

(నమస్తే తెలంగాణ సౌజన్యం తో)