Home Ayodhya నూతన రామమందిర నిర్మాణ రూపకర్త ఈయనే!

నూతన రామమందిర నిర్మాణ రూపకర్త ఈయనే!

0
SHARE

అయోధ్య రామమందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి శ్రీ చంద్రకాంత్ సోంపురా. 78 ఏళ్ల శ్రీ చంద్రకాంత్ సోంపురా రామమందిర నిర్మాణానికి వాస్తు, నిర్మాణ రూపకల్పన ప్లాన్ అందిస్తున్నారు.

వీరి వంశంలో 15వ తరానికి చెందిన వాస్తుశిల్పి ఇతను. దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం దేవాలయ నిర్మాణ ప్రాజెక్టులపై  వీరి కుటుంబం పనిచేస్తుంది.

వీరి కుటుంబంలో ప్రముఖంగా చెప్పుదగ్గ మరో వ్యక్తి వీరి తాతగారు శ్రీ పీఓ సోంపురా. వారు 1949లో గుజరాత్ రాష్ట్రంలోని ప్రపంచ ప్రసిద్ధ సోమనాథ్ ఆలయ నిర్మాణం, వాస్తు విషయంలో ప్రణాళిక అందించారు.

అహ్మదాబాద్ నగరానికి చెందిన వీరి కుటుంబం ఇప్పటి వరకు దేశ, దేశాల్లో 200పైగా ఆలయాల వాస్తు, నిర్మాణ ప్లాన్ అంశాల్లో తమ సేవలందించింది. వీటిలో ముఖ్య దేవాలయాలు గాంధీనగర్ లోని అక్షరధామ్ ప్రాంగణం, కోల్ కతాలో బిర్లా మందిర్, ముంబైలోని స్వామి నారాయణ మందిర్ మొదలైనవి.

బిర్లా మందిర్ దేవాలయ వాస్తు, శిల్పకళకు ముగ్దులైన నాటి విశ్వహిందూ పరిషద్ అధ్యక్షులు స్వర్గీయ శ్రీ అశోక్ సింఘాల్ గారు, కోల్ కతాలో ఉన్న బిర్లా కుటుంబాన్ని కలిసి, ఆ ఆలయ నిర్మాణానికి వాస్తు, ఇతర ప్లాన్ అందించిన వ్యక్తి గురించి వాకబు చేశారు. అప్పుడే చంద్రకాంత్ సోంపురా గురించి తెలుసుకుని, అయోధ్య రామమందిరానికి కూడా ప్లాన్ రూపొందించి ఇవ్వాల్సిందిగా కోరారు.

అప్పటికింకా అయోధ్య రామమందిరం అంశంలో కోర్టు తీర్పు రాలేదు. అత్యంత వివాదంగా మారిన రామజన్మభూమి ప్రాంతంలో పనిచేయడం ఎంత కఠినమైన విషయమో చంద్రకాంత్ సోంపురా ఇప్పటికీ నెమరువేసుకుంటారు.

ఓ రామభక్తుడి వేషంలో ప్రతి రోజూ అయోధ్య రామమజన్మభూమి ప్రాంతంలో చుట్టూ తిరుగుతూ, చుట్టుప్రక్కల ఉన్న స్థలాన్ని అత్యంత పకడ్బందీ ప్రణాళికతో కొలతలు తీసుకున్నారు.

రామాయణంలో వర్ణించిన అయోధ్య కాలం నాటి ఆకృతిలోనే నేడు నిర్మించబోయే రామమందిరం ఉండాలనేది చంద్రకాంత్ సోంపురా ఆకాంక్ష.

ప్రస్తుతం కోవిడ్ కారణంగా మందిర నిర్మాణ ఏర్పాట్ల పరిశీలనకు కాస్త దూరం అయినప్పటికీ, పరిస్థితి కాస్త సద్దుమణిగాక ప్రత్యక్షంగా వెళ్లి అక్కడి ఏర్పాట్లు పర్యవేక్షిస్తానని అంటారు సోంపురా.