Home News కమ్యూనిజం : తియ్యటి విషం

కమ్యూనిజం : తియ్యటి విషం

0
SHARE

లౌకికత్వం ముసుగులో కమ్యూనిస్టు పార్టీ ఆడే ఆటలో పావులుగా మిగిలేది మాత్రం దళిత, ఆదివాసి గిరిజనులే. రోహిత్ వేముల, సోనీ సోరి ఉదంతాలు ఇందుకు ఉదాహరణ. నిజంగా వారికి దళిత గిరిజనుల మీద ప్రేమే ఉంటే పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో దళిత గిరిజనులను అక్కడి ముష్కర మూకలు ఊచకోత కోసి, సజీవ దహనం చేస్తుంటే ఎందుకు స్పందించలేదు? మాల్దా ఘటనలో ధన, మాన ప్రాణాలను కోల్పోయింది దళిత గిరిజనులే. ఇదీగాక ఆ పార్టీ అధికారంలోవున్న కేరళలో కమ్యూనిస్టు పార్టీ హత్యాకాండకు అంతేలేదు. వారి హత్యాకాండలో బలౌతున్నది ఎక్కువశాతం బడుగు బలహీన వర్గాలవారే.

కేరళలో ఎన్నో హత్యలు అధికార కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో జరుగుతున్నా, కేవలం ఆకలి తీర్చుకోవడానికి పిడికెడు బియ్యం దొంగిలించాడనే నెపంతో ఆ పార్టీ కార్యకర్తలు మధు అనే గిరిజనుడిని మట్టుబెట్టిన సంఘటన సాటి గిరిజనుడిగా నా మనసును కలచివేస్తున్నది. మానవ హక్కుల గురించి గొంతుచించుకునే కమ్యూనిస్టులు ఈ తరహా సంఘటనలపై కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటు.

గత మే నెలలో బెంగాల్‌లో జరిగిన పంచాయితి ఎన్నికలలో భాజపాకు ఓటేసినందుకు బెంగాల్‌లోని బాగ్‌డుబి అనే గ్రామంలో కవితాదాస్‌ అనే మహిళను చెప్పులదండ వేసి ఊరంతా ఊరేగించి బహిరంగంగా గుంజీలు తీయించారు. సమాజం ఇది తెలిసి నివ్వెరపోయింది. కానీ అక్కడి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలుగానీ, నాయకులుగానీ ఈ సంఘటనను కళ్ళుండీ చూడలేకపోయారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఓటేసుకోవచ్చు అనే ప్రజాస్వామిక హక్కుకు, ఒక మహిళ ఆత్మగౌరవానికి తూట్లుపడుతుంటే ఈ నేతలు ఎక్కడికి పోయారో?

మే 29న పురూలియాలో త్రిలోచన్‌ మహతో అనే బీజేపీకి చెందిన ఇరవై ఏళ్ళ కార్యకర్త హత్య గావించబడ్డాడు. అతన్ని చంపిన దుండగులు శవాన్ని చెట్టుకు వేలాడదీసి అతని చొక్కాపై ‘‘18 ఏళ్ళ వయసు నుంచే నువ్వు బీజేపీ కోసం పనిచేయడం మాకు నచ్చలేదు. నీకు ఓటుహక్కు వచ్చిన మరుక్షణమే నిన్ను చంపాలనుకున్నాం. కానీ కుదరలేదు. ఇవాళ నీవు మా చేతిలో శవంగా మారావు’’ అని రాసివున్న నోట్‌ పోలీసులకు లభించింది. ఈ సంఘటనను మరిచిపోకముందే మొన్న జూన్‌ 1వ తేదిన అదే జిల్లాలో అత్యంత దారుణంగా జరిగిన దులాల్‌ కుమార్‌ హత్య పురూలియా ప్రాంతవాసులను భయాందోళనలకు గురిచేసింది. కమ్యూనిస్టులు, తృణమూల్‌ కార్యకర్తల రాక్షస క్రీడకిది తాజా ఉదాహరణ.

పంచాయతి ఎన్నికల సందర్భంగా బీజేపీ దళిత కార్యకర్తలు త్రిలోచన్‌, దులాల్‌ కుమార్‌లు హత్యగావించబడగా, అక్కడి తృణమూల్‌, కమ్యూనిస్టు పార్టీల హింసకు 30 మంది సాధారణ పౌరులు మృత్యువాతపడడం బాధాకరం. 30 ఏళ్ళపాటు బెంగాల్‌ను పాలించిన కమ్యూనిస్టులు అక్కడ తమ పట్టును కోల్పోతున్న సందర్భంలో బీజేపీ ఎదుగుదలను సహించలేక బద్ధ వ్యతిరేకి అయిన తృణమూల్‌ పార్టీ హత్యారాజకీయాలకు సహకారమందించడం గమనించదగ్గ విషయం.

ఎక్కడో అక్లాక్‌ అనే వ్యక్తి చనిపోయినప్పుడు నానా యాగీ చేసినవాళ్లే తమ పాలనలోని కేరళలో గిరిజన మధుని చెట్లకు కట్టేసి పాశవికంగా చంపడం దేనికి సంకేతం? గిరిజన దళిత బహుజనుల హక్కులకోసం పోరాడే స్వయం ప్రకటిత మేధావులు, సెక్యులరిజం అని గొంతుచించుకునే కుహనావాదులు ఈ సందర్భంలో ఏమయ్యారు? దేశంలో అసహనం పెరిగిపోతున్నదంటూ చొక్కాలు చించుకున్న అవార్డు వాపసీ గ్యాంగ్‌ ఎక్కడికి పోయింది? విశ్వవిద్యాలయాల్లో నిమ్నవర్గాలవారిపై వివక్ష ఉన్నదని, దాన్ని వ్యతిరేకిస్తూ పాటలు పాడిన ఆజాదీ ముఠా ఏమైపోయింది? ఆకలినుండి విముక్తి కావాలన్న అఫ్జల్‌గురు శిష్యులేరి? దేశంలో ఏమూలైనా ఒక నక్సలైటో తీవ్రవాదో చనిపోతే మానవహక్కులపేరిట నానా రభస సృష్టించే కమ్యూనిస్టు మేధావులు ఇప్పుడేమయ్యారు? ఉగ్రవాదుల చేతిలో దంతేవాడలో 78మంది సిఆర్‌పిఎఫ్‌ జవానులు చనిపోతే వారి భావజాలపు విద్యార్థి సంఘాలు సంబరాలు జరుపుకోవడాన్ని, దేశ భద్రతలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు కనీసం నివాళులు అర్పించకపోవడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి?

అభ్యుదయం గురించి మాట్లాడేవారే ఇతర భావజాలపు వ్యక్తులను చంపుతుంటే ఇన్నాళ్ళు వీరి మాటలు నమ్మి మోసపోయిన ఇంకెంతమంది హతమయ్యారో? ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగే దాడుల మీద తమ ఎరుపురంగు చొక్కాలను చించుకునే ఈ కామ్రేడ్స్, ఈ దేశంలోనే జీవిస్తూ భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్న చైనాపట్ల ప్రేమను కురిపించే ఈ కమ్యూనిస్టులు తమ ప్రత్యర్థులను అతికిరాతకంగా చంపడాన్ని ప్రతిఘటించకుంటే మరింతమంది అమాయకులు బలి అయ్యే ప్రమాదముంది.

– సోలంకి శ్రీనివాస్‌
రిసెర్చ్‌ స్కాలర్‌, ఉస్మానియా యూనివర్సిటీ

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here