Home News కేరళలో ఎస్‌సిలపై దాడులు, పట్టించుకోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం

కేరళలో ఎస్‌సిలపై దాడులు, పట్టించుకోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం

0
SHARE

కేరళలో 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సిపిఎమ్‌ ఆధ్వర్యంలో ఏర్పడిన లెఫ్ట్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ తన ఎన్నికల వాగ్దానాలలో ఎల్‌డిఎఫ్‌ గెలిస్తే అంతా మంచే జరుగుతుందని చెప్పింది. దాంతో ప్రజలు ఎల్‌డిఎఫ్‌ను గెలిపించారు. కాని ఎల్‌డిఎఫ్‌ తను చేసిన వాగ్దానాన్ని మరిచిపోయింది. పైపెచ్చు రాజకీయ ప్రత్యర్థులను హత్య చేస్తున్నారు. ఒకపక్క న్యాయస్థానాల నుండి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వానికి మందలింపులు వస్తుంటే, మరోపక్క లంచగొండి తనం, ఆశ్రిత పక్షపాతం ఇలా అన్నింటా వామపక్ష ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

అక్కడి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఎస్‌సిలపై జరుగుతున్న దాడులను అరికట్టలేకపోతోంది. అందుకు నిదర్శనం ఈ మధ్యే మధు అనే 27 సంవత్సరాల గిరిజన యువకుని హత్య.

మధు పాలక్కాడ్‌ జిల్లాలోని ఎస్‌.టి.లు నివసిస్తున్న ఆగాలి అనే కుగ్రామానికి చెందినవాడు. ఒక దుకాణం నుండి కొంత బియ్యం దొంగిలించా డనే ఆరోపణతో మధును స్థానికులు క్రూరంగా కొట్టారు. మధు దుకాణంలో బియ్యం దొంగిలించిన మాట అబద్ధమని అక్కడ నివసిస్తున్న మరో స్థానిక సామాజిక కార్యకర్త చెప్పారు.

అసలు జరిగిందేమంటే, ఫిబ్రవరి 22, గురువారం సాయంకాలం 4 గంటలకు మధు తన భుజంపై ఒక సంచితో వెళ్తున్నాడు. మధును గమనించిన దుకాణం యజమాని తన దుకాణం నుండి ఏదో దొంగిలించాడనుకొని మరికొంతమంది వెంటరాగా మధును తరుముతూ వెళ్ళాడు. మధు దగ్గరలో ఉన్న అడవిలోకి పరుగెత్తాడు. అయినా వెంటబడినవారు వదిలిపెట్టలేదు. మధును పట్టుకొని, చేతులు కట్టేసి విచక్షణా రహితంగా, నిర్దయగా గొడ్డును బాదినట్టు బాదారు. ఈ సమూహంలో ఒక వ్యక్తి మధుతో ‘సెల్ఫి’ కూడా దిగాడు. మధుపై దాడి జరుగుతున్న సమయంలోనే కొందరు స్థానిక పోలీసులకు విషయం తెలియజేశారు. పోలీసులు వచ్చి గాయపడ్డ మధును ప్రభుత్వ ట్రైబల్‌ ఆసుపత్రికి తరలించగా దారి మధ్యలోనే మధు ప్రాణాలు కోల్పోయాడు. మధు దొంగిలించిన సంచి విప్పి చూస్తే అందులో అన్నీ పనికిరాని కాగితాలు మాత్రమే ఉన్నాయి!

మధు చనిపోవడానికి కారణం అతడిని కొట్టిన దెబ్బలేనని శవపరీక్ష చేసిన వైద్యులు నివేదిక ఇచ్చారు. సారాంశం ఏమంటే మధు హత్యకు గురయ్యాడు. మధుపై జరిగిన ఈ సామూహిక దాడిలో పాల్గొన్నవారిలో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్లతోపాటు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి ప్రివెన్షన్‌ యాక్ట్‌ కింద కేసు పెట్టారు.

ఎస్‌సిల క్షేమమే మా క్షేమం, వారి అభివృద్ధే మా అభివృద్ధి, వారి పక్షాన నిలబడేది మా పార్టీ మాత్రమే అని ఉపన్యసించే సిపిఎం వారికి (కేరళలో అధికారంలో ఉన్న పార్టీ) మధు హత్య గురించి ఆలోచించటానికి గాని, మధు హత్య వెనక ఉన్న శక్తులను గుర్తించటానికి గాని తీరిక లేకపోయింది. ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌, ఎస్‌సి, ఎస్‌టి మరియు బిసి సంక్షేమ శాఖమంత్రి ఎ.కె.బాలన్‌లు త్రిసూర్‌లో రాష్ట్ర సిపిఎమ్‌ సభల నిర్వహణలో నిమగ్నమై ఉన్నారు.

ఇంతకీ చెప్పొచ్చేదేమంటే భాజపా పాలిత రాష్ట్రాలలో ఎస్‌సిల మీద ఎక్కడ ఏ చిన్న దాడి జరిగినా దానిని గోరంతలు, కొండంతలు చేసి భాజపా పాలిత రాష్ట్రాలలో ఎస్‌సి, ఎస్‌టి., బిసిలకు రక్షణ లేదంటూ గొంతు చించుకొనే సిపిఎమ్‌ తను అధికారంలో ఉన్న కేరళలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలపై దాడులు జరుగుతుంటే కనీసం తెలుసుకొనే ప్రయత్నం చేయలేకపోతోంది.

హర్యానాలో రైలులో ప్రయాణిస్తున్నపుడు సీటు విషయంలో జరిగిన గొడవలో ‘జునైడ్‌’ అనే వ్యక్తి చనిపోతే కేరళ ముఖ్యమంత్రి హర్యానాలోని జునైడ్‌ ఇంటికి వెళ్ళి అవసరమైన సహాయం అందిస్తాన న్నారు. పైపెచ్చు జునైడ్‌ పశుమాంసం తిన్నందుకు హత్యకు గురయ్యాడని అసత్య ఆరోపణ చేశారు. మరి తమ సొంత రాష్ట్రంలో హత్యకు గురైన ఎస్‌.సి. మధు గురించి ఎందుకు అంతలా పట్టించుకో లేకపోయారు ?

స్థానిక సిపిఎమ్‌ పార్లమెంటు సభ్యుడు ఎమ్‌బి రాజేశ్‌ కూడా తన నియోజకవర్గంలో జరిగిన ఎస్‌సికి చెందిన ‘మధు’ హత్య గురించి తెలుసుకోవడానికి సమయం ఇవ్వలేదు.

కేరళ భాజపా అధ్యక్షుడు కమ్మనం రాజశేఖరన్‌ మధు కుటుంబ సభ్యులను పరామర్శించారు. తరువాత ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అట్టప్పాడి వనవాసుల సంక్షేమానికై ఈ సంవత్సరం 500 కోట్లు కేటాయించిందని, ఇందులో షెడ్యూలు తెగలకు, బలహీన వర్గాల అభివృద్ధికి 147 కోట్ల రూపాయలు కేటాయించిందని, కాని నేటికీ వీరు ఇక్కడ ఉండటానికి ఇల్లు, తాగడానికి మంచినీళ్ళకు నోచుకోలేదని అన్నారు. ‘మధు’ శవానికి అన్ని సౌకర్యాలున్న దగ్గరలోని పాలక్కాడ్‌లో ‘శవపరీక్ష’ జరిపించకుండా త్రిసూర్‌కు పంపి చేయించడంలో కుట్ర ఉందని కుమ్మనం అనుమానం వ్యక్తపరిచారు.

రాష్ట్ర సభలు ముగిసిన తర్వాత మధు హత్య వివరాలు తెలుసుకొని, జరిగిన సంఘటన ‘శోచ నీయం’ అని ప్రకటించి చేతులు దులుపుకున్నారు సదరు సిపిఎం నాయకులు. ఇది వారి ద్వంద్వ ధోరణి.

ఎదురులేని దురాగతాలు

2016లో ఎల్‌డిఎఫ్‌ అధికారంలోకి వచ్చాక ఎస్‌సిలపై ఎన్నో దురాగతాలు జరిగాయి. అవన్నీ సిపిఎమ్‌ వారు చేసినవే.

కేరళలో సిపిఎం వారు ఎంతోమంది ఎస్‌సిలపై హత్యలకు, అరాచకాలకు పాల్పడ్డారు. కొన్ని రోజుల క్రితం గర్భవతి అయిన ఒక సిపిఎమ్‌ మహిళా కార్యకర్తపై సిపిఎమ్‌ ఆఫీస్‌ బేరర్లే దాడి చేశారు. ఆమె గర్భంపై బలమైన దెబ్బతగలడం వల్ల గర్భవిచ్ఛిత్తి జరిగింది. ఆమె ఆసుపత్రి పాలైంది. ఆమె సిపిఎమ్‌ ఆఫీస్‌ బేరర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు సిపిఎమ్‌ కార్యాలయ కార్యదర్శిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోమని ఆమెపై పార్టీ నాయకులు ఒత్తిడి చేశారు.

కన్నూరు జిల్లా తలస్సెరికి దగ్గరలో ఉన్న కుట్టిమక్కూల్‌ గ్రామంలో ఉంటున్న అఖిల (30), అంజన (25) అనే ఇద్దరూ ఎస్‌.సి. యువతులే. స్థానికంగా ఉన్న సిపిఎమ్‌ పార్టీ కార్యాలయంపై దాడిచేసి ఆస్తినష్టం చేశారని ఆరోపిస్తూ ఈ ఇద్దరు మహిళల్ని అరెస్టు చేశారు. నిజానికి హాస్యాస్పదమైన విషయమేమంటే కన్నూరు జిల్లా సిపిఎమ్‌కి బలమైన కోట. అక్కడ 1978 సంవత్సరం నుండి వరుసగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలు సిపిఎమ్‌ వారి చేతుల్లో హత్యలకు గురవుతున్నారు. అలాంటి జిల్లాలో ఇద్దరు మహిళలు సిపిఎమ్‌ కార్యాలయంపై దాడి చేశారంటే నమ్మశక్యం కాదు. ఎవరేమనుకుంటే ఏమిటన్నట్లు సిపిఎమ్‌ వారు ఈ ఇద్దరు మహిళలతోపాటు అఖిల కూతురును కూడా జైలుపాలు చేశారు. అంజన బెయిల్‌పై బయటకు వచ్చినపుడు ఒక టివి చర్చ కార్యక్రమంలో సిపిఎమ్‌ సభ్యుడు ఆమెను అవమానకరంగా మాట్లాడారన్న కారణంగా అంజన ఆత్మహత్యకు ప్రయత్నించింది.

సుమారుగా ఆ కాలంలోనే త్రిప్పుని త్రువలోని ఆర్‌ఎల్‌వి ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో చదువుతున్న ఒక ఎస్‌.సి.విద్యార్థినికి ఒక ఎస్‌ఎఫ్‌ఐకి చెందిన విద్యార్థికి మధ్య సంబంధాలున్నాయనే పోస్టర్లు ఆమె హాస్టల్‌లో గోడలకు అంటించారు. దీనిపై స్పందించిన బిజెపి కార్యకర్తలు నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ నగరంలో ఉద్యమం చేశారు. అయినా పోలీసులు తప్పు చేసినవారిని అరెస్టు చేయలేదు.

కొన్ని నెలల క్రితం సిపిఎమ్‌ హంతకులు తిరువనంతపురం ఆర్‌.ఎస్‌.ఎస్‌. శాఖ కార్యవాహ రాజేష్‌ను దారుణంగా హత్య చేశారు. రాజేశ్‌ ఎస్‌సికి చెందినవాడు. మరో ఎస్‌సి కార్యకర్త విష్ణు గత సంవత్సరం సిపిఎమ్‌ గూండాల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.

బాధితులైన ఎస్‌సి అమ్మాయిలు

నట్టకం ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న మరో ఇద్దరు ఎస్‌సి అమ్మాయిలపై ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు దాడిచేశారు. ఈ అమ్మాయిలను వైద్య సహాయం కోసం కొట్టాయంలోని ఆసుపత్రిలో చేర్చారు.

నవంబరు 2017లో అక్కడికి దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాలలో మరో సంఘటన జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐ వారు కళాశాల ఆవరణలో ఓ గుడిసె నిర్మించి దానికి ‘పులయాక్కుటిల్‌’ అని పేరు పెట్టారు. ‘పులయా’ ఒక ఎస్‌సి కులం. ఆ కులాన్ని అవమానించడానికి ఎస్‌ఎఫ్‌ఐ చేసిన పని ఇది.

ఎమ్‌.జి. విశ్వవిద్యాలయంలో

ఎమ్‌.జి. విశ్వవిద్యాలయంలో పరిశోధన విద్యావేత్త దీపా యం.మోహన్‌ను ఆమె ఆచార్యుడు ఆమెను కులం పేరుతో దూషించాడు. ఆ ఆచార్యునిపై చర్య తీసుకోమని కోర్టులో ఆమె పిటిషన్‌ వేసింది. ఆచార్యుడు సిపిఎమ్‌కు చెందినవాడవటంతో పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈమె ఎస్‌.పి. కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడంతో పిటిషన్‌ కొట్టివేశామని న్యాయమూర్తి చెప్పాడు.

అక్కడే తమకు వ్యతిరేకంగా విద్యార్థులను సమీకరిస్తున్నాడనే నెపంతో ఎమ్‌.ఫిల్‌ చదువుతున్న ఎస్‌సి విద్యార్థి వివేక్‌ కుమరన్‌పై సిపిఎమ్‌ వారు భౌతిక దాడి చేశారు. కొచ్చిలోని ప్రభుత్వ మహారాజ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌సి వ్యక్తి. ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ఆ ఎస్‌సి ప్రిన్సిపాల్‌ కుర్చీని బయటకు తెచ్చి అగ్నికి ఆహుతి చేశారు. ఎబివిపితో పాటు మరెన్నో సంస్థలు ఎస్‌.ఎఫ్‌.ఐ. చర్యలను ఖండించగా అపుడు సిపిఎమ్‌, ఎస్‌ఎఫ్‌ఐ ‘జరిగిన సంఘటన శోచనీయం’ అని మాత్రం అన్నారు.

గత సంవత్సరం జిష్ణుప్రణయ్‌ ఉదంతంలో సిపిఎమ్‌కు ఎస్‌సిల పట్ల ఉన్న కపట ప్రేమను బహిర్గతమైంది. జిష్ణు తల్లిదండ్రులు సిపిఎమ్‌ పార్టీ కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడ్డ కార్యకర్తలు. జిష్ణు కూడా ముఖ్యమంత్రి పిన్‌రాయి చిత్రపటాన్ని తన పూజా గదిలో పెట్టుకుని, రోజూ పూజ చేస్తాడు. ఒకరోజు ఉదయం హాస్టల్‌ గదిలో అతను మృతుడై ఉన్నాడు. హాస్టల్‌ అధికారులు అతడు ఆత్మహత్య చేసుకున్నారని ప్రకటించారు. కాని ఎబివిపి, ఇతర సంస్థల ఒత్తిడితో అది సిపిఎమ్‌ వారు చేసిన హత్యగా వెలుగుచూసింది. ముఖ్యమంత్రి పిన్రాయి మాట వరుసకయినా జిష్ణు తల్లిదండ్రులను కలిసి ఓదార్చ లేదు. జిష్ణుతల్లి పోలీస్‌ డిజిని కలుసుకోవ డానికి వెళ్తే పోలీసులు ఆమెను రోడ్డుదాక ఈడ్చుకొచ్చి పడేశారు.

డిసెంబర్‌ 2016లో పాలక్కడ్‌లోని చిత్తురులోని బిజెపి ఎస్‌సి కార్యకర్త ఉన్నన్‌ ఇంటిపై సిపిఎమ్‌ కార్యకర్తలు దాడి చేశారు. ఇంటి తలుపులకు తాళాలు వేసి ఇంటికి నిప్పంటించారు. ఆ మంటలలో కన్నన్‌ భార్య విమల, సోదరుడు రాధాకృష్ణన్‌ మలమల మాడి చనిపోయారు.

‘అంతా బాగానే ఉంది’ అనే ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ హయాంలో కొల్లంలోని కుందారాలో పోలీసు కస్టడిలో కుంజుమన్‌ అనే ఎస్‌సి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. డిసెంబరు 2017లో 30 సంవత్సరాల నుండి అదే ఇంటిలో నివసిస్తున్న ఎస్‌సి కుటుంబాన్ని తమ పార్టీ కార్యాలయం కోసం సిపిఎమ్‌ వాళ్ళు రోడ్డున పడేశారు. ఇదేనా ‘బాగుండటం’ అంటే..?

రాష్ట్రంలో పోలీసుల చేతులలో ఎస్‌సి ప్రజలు ఆరాచకాలకు గురౌతున్నారు. ముఖ్యమంత్రి పిన్రాయి చేతిలోనే హోంమంత్రిత్వశాఖ ఉంది.

ఏతావాతా తేలేదేమంటే సిపిఎమ్‌కు ఎస్‌.సి, ఎస్‌టి.,వెనుకబడిన తరగతులు, మహిళలపై ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేవు.

–  టి.సతీశన్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here