Home Telugu Articles డా. అంబేద్కర్ కు పెరియార్ కు పోలికా?

డా. అంబేద్కర్ కు పెరియార్ కు పోలికా?

0
SHARE

                                                                                 – వెంకటేశన్
బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ వీ రామస్వామి పెరియార్ ల ఆలోచనలు, భావాలు ఒక్కటేనని, వారిద్దరూ ఒకేలా పనిచేశారని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం తమిళనాడులోనేకాక దేశం మొత్తంలో జరుగుతోంది. అంబెడ్కర్ ని ఉత్తరాది పెరియార్ అని, పెరియార్ ని దక్షిణాది అంబెడ్కర్ అని ప్రచారం చేస్తున్నారు. తమ ప్రచారాన్ని మరింత వ్యాప్తి చేసేందుకు కళాశాలల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ పెరియార్- అంబేద్కర్ అధ్యయన కేంద్రాలు పెడుతున్నారు.
కానీ డా. అంబేద్కర్ కు ఈ వీ ఆర్ కు అసలు ఎందులోనూ పోలికే లేదు. విద్య, సామాజిక చింతన, జాతీయ సమైక్యత, విదేశాంగ విధానం, ఆర్ధిక విధానాలు మొదలైనవాటిలో ఎక్కడా వారి ఆలోచనలు, భావాలు కలవవు. పండితుడు, మేధావి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక గ్రంధాలు చదివారు. ఆయన వ్రాసిన ఏ పుస్తకం చూసినా అందులో వివిధ రచనల నుంచి ఉటంకింపులు ఉంటాయి. ఈ వీ ఆర్ ఇలాంటి పండితుడు కాదు. పుస్తకాలు కూడా ఎక్కువగా చదివినవారు కాదు. తనకు నచ్చిన, తోచిన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండేవారు. వాటిని కూడా తన అవసరానికి, సమయానుకూలంగా మార్చుకుంటూ ఉండేవారు.
ఈ వీ ఆర్ 40 ఏళ్లపాటు వేశ్యా గృహాల్లో గడిపారు. ఎప్పుడు సమాజం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ అంబేద్కర్ యుక్తవయస్సు వచ్చిన నాటి నుంచి సమాజాన్ని గురించి ఆలోచించేవారు, తమ సముదాయానికి మంచి చేయడానికి ప్రయత్నించేవారు. కాబట్టి అంబేద్కర్, ఈ వీ ఆర్ మధ్య పోలిక పర్వతం, చిట్టెలుక పోలిక మాదిరిగానే ఉంటుంది.

జాతి వివక్ష
ఈ వీ ఆర్ జాతి వివక్షను పూర్తిగా పాటించారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్య, ద్రావిడ సిద్ధాంతాన్ని తమిళనాడు అంతటా బాగా ప్రచారం చేశారు. జాతి పేరున ప్రజలను విడగొట్టడంలో ఆయన ఎంతో శ్రద్ధ చూపించారు. విదేశీయులైన ఆర్యులు ఇక్కడకు వచ్చి స్థానికులైన ద్రావిడులను నాశనం చేశారని ప్రచారం చేశారు. కానీ డా. అంబేద్కర్ మాత్రం ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని పూర్తిగా తిరస్కరించారు. ఆ సిద్ధాంతం పూర్తి అసత్యమని, దానిని బుట్టదాఖలు చేయాలని ఆయన చెప్పారు. అలాగే ఆయన ఎప్పుడు జాతి వివక్షను ప్రోత్సహించలేదు. ఎందుకంటే ఆయన మానవతావాది.

దళితులు
దళితులు, ఇతర వెనుకబడిన కులాలవారు ఇస్లాం మతం పుచ్చుకోవాలని పెరియార్ ప్రోత్సహించేవారు. అదే సర్వసమస్యలకు పరిష్కారమని చెప్పేవారు. కేవలం హిందూత్వంపై కోపంతో అలా చెప్పేవారేకాని నిజానికి ఇస్లాం గురించి అధ్యయనం చేసి చెప్పినదేమీ కాదు. మరోపక్క బాబాసాహెబ్ అంబేద్కర్ నిమ్న కులాల వారికి బౌద్ధమే శరణ్యమని చెప్పారు. ఇస్లాం సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని ఇవ్వలేదన్నది ఆయన దృఢమైన అభిప్రాయం. ఇస్లాంతోపాటు ఇతర మతాలను లోతుగా పరిశీలించిన తరువాత ఆయన ఈ అభిప్రాయానికి వచ్చారు. ఇస్లాం మతం పుచ్చుకుంటే కోట్లాది రూపాయలు ఇస్తామని ఆశ చూపినా ఆయన అందుకు అంగీకరించలేదు. ఇస్లాంగాని, క్రైస్తవంగాని పుచ్చుకుంటే జాతీయత మారిపోతుందని ఆయన స్పష్టంగా చెప్పారు. బౌద్ధం మాత్రమే సమానత్వం తీసుకురాగలదని, అందుకే దళితులంతా బౌద్ధం స్వీకరించాలని ఆయన కోరారు. అందరినీ ఇస్లాం స్వీకరించమని ప్రేరేపించిన పెరియార్ చనిపోయేవరకు హిందువుగా మిగిలిపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం తాను ముందు బౌద్ధాన్ని స్వీకరించి, ఆ తరువాత అందరినీ అలా చేయమని అడిగారు.
బలహీన, వెనుకబడిన వర్గాల్లో కూడా రామస్వామి పెరియార్ ఎక్కువతక్కువలు చూసేవారు. ఆయన ఎప్పుడు శూద్రుల గురించి మాత్రమే మాట్లాడేవారు. తమిళనాడు దళితుల కోసం ఆయన ఎప్పుడూ ఉద్యమించలేదు. నిరసన దీక్షలు, ఊరేగింపులు, చెరువుల నుంచి నీళ్ళు తీసుకురావడం, ఆలయ ప్రవేశం వంటి వాటికి ఎప్పుడు పూనుకోలేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మహత్ చెరువు నుంచి నీళ్ళు తీసుకురావడానికి, కాలారాం దేవాలయ ప్రవేశానికి ప్రయత్నించారు.

దళితులు ఇతర హిందువులతో కలవడం
`దేవాలయ ప్రవేశం, పరాయణులలో (పెరియార్) శూద్రులకు స్థానం కల్పించడంతో అస్పృశ్యతా నివారణ జరిగిపోతుందా? పెరియార్ లలో నిమ్నకులస్తుల పరిస్థితే సరిగా లేకపోతే, వీరిని అందులో చేర్చి లాభం ఏమిటి? ఇప్పటివరకు మధ్యకులంగా ఉన్న శూద్రులు అక్కడకి చేరితే నిమ్న కులస్థులైపోతారు. కనుక అలా జరగడానికి వీలులేదు’ అని రామస్వామి అనేవారు. (History of Vaikkam struggle – veeramani)
రామస్వామి ఎప్పుడు దళితులకు వ్యతిరేకంగానే వ్యవహరించారు. ముత్తుకూలతూర్ అల్లర్లు, కిజ్వెన్ మని మారణకాండ తరువాత కూడా ఆయన దళితుల పక్షాన మాట్లాడలేదు. కిజ్వెన్ మని సంఘటనలో 44మంది దళితులను సజీవదహనం చేసినప్పుడు కూడా ఆయన `ప్రస్తుతపు ఆర్ధిక వ్యవస్థ గురించి మాట్లాడకుండా కమ్యూనిస్ట్ లు దేశంలో విప్లవాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పాలనను తొలగించాలనుకుంటున్నారు. దీనివల్ల ఉపయోగం లేదని వారికి చెప్పదలచుకున్నాను. నాగై తాలూకాలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రేరేపించిన అల్లర్ల మూలంగా 42మంది చనిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ తమకు సహకరించిందని ప్రభుత్వం పరోక్షంగా చెప్పింది. ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది.’(విదుధలై 20-1-1969)
రాజకీయ హత్యలను సమర్ధించిన పెరియార్ అవి అధిక వేతనాల కోసం చేస్తే తిరుగుబాటు అవుతుందని చెప్పారు. బాధితులైన దళితులకు మద్దతుగా నిలబడని పెరియార్ అల్లర్లకు కారణమైన వారిని మాత్రం సమర్ధించారు. మరోవైపు డా. అంబేద్కర్ దళితుల హక్కుల కోసం పోరాడారు. అనేక చట్టాలు తెచ్చారు.
షెడ్యూల్ కులాల గురించి పెరియార్ కు ఎలాంటి దురుద్దేశాలు ఉండేవో అనేక సందర్భాల్లో మనకు తెలుస్తుంది. ఒకసారి ఆయన ఇలా అన్నారు -“అంబేద్కర్ కు కాస్త భావోద్రేకం ఎక్కువ. `ప్రజలకు ఏమి చేయాలనుకుంటున్నారు’ అని ఆయన నన్ను అడిగారు. నేను అనేక విషయాలు చెప్పాను. ఆయన కూడా చాలా చెప్పారు. 100మంది తనవారిలో కనీసం 10మందికి విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు కావాలని కోరుకున్నానని అన్నారు. వాళ్ళు (బ్రాహ్మణులు) 10మంది ఎందుకు 15మందికి కల్పిద్దాం అన్నారు. కానీ వాళ్ళకు (బ్రాహ్మణులు)బాగా తెలుసు వీళ్ళకి (నిమ్న కులాలకు) 25 సీట్లు ఇచ్చినా ముగ్గురు, నలుగురు కంటే రారు అని. అలా బ్రాహ్మణులు వ్రాసిన చట్టంపై ఆయన(అంబేద్కర్) సంతకం చేశారు. ఇతరుల గురించి ఆయన పట్టించుకోరు.’’(విదుదలై 11.11.1957)

పాకిస్తాన్ లో దళితులు
దేశవిభజన సమయంలో పాకిస్థాన్ లో దళితులు తీవ్రమైన హింసకు, అణచివేతకు గురయ్యారు. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణాన్ని ఏమాత్రం పట్టించుకోని పెరియార్ పాకిస్థాన్ కు, ముస్లింలకు మద్దతు తెలిపారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం పాకిస్థాన్ లో దళితులను రక్షించేందుకు మహర్ రెజిమెంట్ ను పంపారు. దళితులు ఎట్టిపరిస్థితిలోను ఇస్లాం మతంలోకి మారవద్దని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే వివిధ సంస్థానాలు భారత రాజ్యంలో విలీనం చేసే ప్రక్రియకు కూడా ఆయన సహకరించారు. భారతరాజ్యంలో తన సంస్థానాన్ని విలీనం చేయడానికి ఇష్టపడని హైదరాబాద్ నిజాంకు ఎలాంటి మద్దతు ఇవ్వవద్దని నిమ్నకులాలను కోరుతూ అంబేద్కర్ బహిరంగ ప్రకటన విడుదల చేశారు.

భారత స్వాతంత్ర్యం
దేశం స్వతంత్రం కావడం పెరియార్ కు ఇష్టం లేదు. ఆయన మార్గదర్శనంలో సేలంలో 27.8.1944న జరిగిన సమావేశాల్లో ద్రవిడార్ లీగ్ ఒక తీర్మానం ఆమోదించింది. ఆ తీర్మానంలో ఇలా పేర్కొన్నారు – “చెన్నై ప్రావిన్స్ ను ప్రత్యేక రాజ్యం (దేశం)గా ప్రకటించి దానిని కేంద్ర ప్రభుత్వం అజమాయిషిలో కాకుండా నేరుగా బ్రిటిష్ కార్యదర్శి పాలనలో ఉంచాలని, దానికి ద్రవిడనాడు అనే పేరు కూడా పెట్టాలన్నది ప్రధాన విధాన నిర్ణయమని ద్రవిడార్ లీగ్ తీర్మానంలో పేర్కొంటున్నది.’’
ఇంతేకాదు స్వాతంత్ర్యదినాన్ని శోకదినంగా పాటించాలని పెరియార్ ప్రకటించారు కూడా. ద్రవిడ ప్రాంతాన్ని తెల్లవాళ్ళే పరిపాలించాలని ఆయన కోరుకున్నారు. డా. అంబేద్కర్ ఇలా జాతీయ స్వాతంత్ర్యోద్యమాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. తెల్లవారిపాలనను ఎప్పుడు సమర్ధించలేదు. లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో, ఆ తరువాత కూడా ఆయన భారత స్వాతంత్ర్యం గురించి గట్టిగా వాదించారు. తాను ఇతర కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువ దేశభక్తుడనని ఒక సందర్భంలో ఆయన ప్రకటించారు కూడా.
పెరియార్ ఎప్పుడూ దేశ ఐక్యతను ప్రశ్నిస్తూనే ఉండేవారు. దేశాన్ని విభజించి ప్రత్యేక ద్రవిడస్థాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసేవారు. అందుకు అనేక ఉద్యమాలు కూడా నిర్వహించారు. ఈయన మాదిరిగానే జిన్నా కూడా ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని కోరాడు. ఇలాగే దళితుల కోసం ప్రత్యేక దళితస్థాన్ ఏర్పాటును కోరాలని కొందరు మేధావులు, బ్రిటిష్ ప్రభుత్వం చెప్పినా డా. అంబేద్కర్ మాత్రం ఎప్పుడు దళితస్థాన్ ను కోరుకోలేదు. ఈ ఆలోచనను ఆయన ఆదిలోనే తిరస్కరించారు.

హిందీ, సంస్కృత భాషలు
పెరియార్ ఎప్పుడు హిందీ, సంస్కృత భాషలను తీవ్రంగా వ్యతిరేకించేవారు. హిందీ, సంస్కృత వ్యతిరేక సభలు, సమావేశాలు నిర్వహించారు. దేశ ఐక్యతకు భంగకరమైన భాషాదురభిమానం, భాషావిద్వేషాలను రెచ్చగొట్టారు. కానీ అంబేద్కర్ ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. హిందీ వల్ల దేశ ఐక్యత పెంపొందుతుందని చెప్పారు. సంస్కృతాన్ని జాతీయ అధికారిక భాషగా ప్రకటించాలని పార్లమెంట్ లో కోరారు. ఆయన ఎప్పుడూ భాషాదురభిమానాన్ని ప్రోత్సహించలేదు.

కమ్యూనిజం
కమ్యూనిజం పట్ల పెరియార్ కు ఎంతో అభిమానం ఉండేది. రష్యా పర్యటన నుండి తిరిగివచ్చిన పెరియార్ `సమిష్టి సంపద’ గురించి తమిళనాడులో బాగా ప్రచారం చేశారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా డా. అంబేద్కర్ తమ జీవితాంతం కమ్యూనిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతం హింసపై ఆధారపడిందని, తను ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీతో కనీసం పొత్తు పెట్టుకునేందుకు కూడా ఆయన అంగీకరించలేదు. దళితులు కమ్యూనిజానికి బదులు బౌద్ధాన్ని ప్రత్యామ్నాయంగా స్వీకరించాలని చెప్పేవారు. విదేశాంగ విధానంలో భాగంగానైనా చైనా, రష్యాలతో భారత్ సంబంధాలు ఏర్పరచుకోరాదన్నది ఆయన దృఢమైన అభిప్రాయం. ఆయన ఊహించినట్లుగానే 1962లో చైనా మనపై దాడి చేసింది.

మతం
మానవులకు మతమనేది అసలు అవసరమేలేదని పెరియార్ అభిప్రాయం. మతం మనిషిని పక్కదారి పట్టించి, పిచ్చివాడిని చేస్తుందని ఆయన చెప్పారు. డా. అంబేద్కర్ మాత్రం మనిషికి మతం అవసరమన్నారు. తనకు సద్గుణాలు ఏవైనా అబ్బితే అది మతం మూలంగానేనని అన్నారు. `మతం మత్తుమందు’ అనే సిద్ధాంతాన్ని అంబేద్కర్ పూర్తిగా వ్యతిరేకించారు. మనిషికి మతం ఎంత ముఖ్యమో ఆయన వివరించారు.

ఒకే దేశం
భారత్ ఒకే దేశం కాదని అది అనేక జాతుల సమ్మేళనమని పెరియార్ భావించారు. భారత్ ఎప్పుడు ఒక దేశంగా లేదంటూ ఆయన చెప్పేవారు. కానీ అంబేద్కర్ మాత్రం భారత్ ఆధ్యాత్మిక సంస్కృతి ఆధారంగా వేల సంవత్సరాలుగా ఒకే దేశంగా విలసిల్లిందని వ్రాసారు.
అంబేద్కర్ ఇలా అన్నారు – “భారతీయుల మోసం, కుట్ర మూలంగానే భారత్ అనేకసార్లు స్వాతంత్ర్యం కోల్పోయిందన్న విషయం నన్ను ఆందోళనకు గురిచేస్తూ ఉంటుంది. మహమ్మద్ ఖాసిం దాడి చేసినప్పుడు సింద్ ప్రాంతపు రాజుకు చెందిన సేనానులు శత్రువుతో కుమ్మక్కు కావడం వల్ల ఆ రాజు ఓడిపోయాడు. అలాగే పృధ్వీరాజుపై ద్వేషంతో జయచంద్రుడు ఆహ్వానిస్తే మహమ్మద్ ఘోరీ భారత్ పై దండెత్తాడు. ఇక ఛత్రపతి శివాజీ మొగలాయిలతో పోరాడుతున్నప్పుడు మిగిలిన మరాఠా రాజులు, రాజపుత్ర రాజులు ఆ మొగలాయిలకు మద్దతుగా నిలిచారు.
బ్రిటిష్ వారితో సిఖ్ రాజులు పోరాడినప్పుడు వారి ప్రధాన సేనాధిపతి యుద్ధానికి దూరంగా ఉండిపోయాడు. తన రాజ్యాన్ని, ప్రజలను రక్షించుకునేందుకు ప్రయత్నించలేదు. 1857లో దేశమంతా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే సిఖ్ లు మాత్రం ఆ పోరాటంలో పాల్గొనలేదు. ఈ చరిత్ర పునరావృతమవుతుందా….?
అన్నిటికంటే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే కులాలు, మతాల పేరున ప్రజలను చీల్చే, పరస్పరం భిన్నమైన సిద్ధాంతాలు, విధానాలు కలిగిన అనేక పార్టీలు పుట్టుకువస్తున్నాయి. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ లాభానికి ప్రాధాన్యతనిచ్చే పార్టీలపట్ల దేశ ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలి. అజాగ్రత్తగా ఉంటే మరొకసారి స్వాతంత్ర్యం కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. అదే జరిగితే తిరిగి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవడం దాదాపు అసాధ్యం. ఆఖరి రక్తపు బొట్టు వరకు స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలి.’’
అంబేద్కర్ ఈ మాటలు 25 నవంబర్, 1949 రాజ్యాంగంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. ఆ విధంగా ఆయన భారత జాతీయవాదానికి పిలుపునిచ్చారు. ఈ దేశం మరోసారి పరాయిపాలనలోకి, బానిసత్వంలోకి వెళ్లకూడదనే ప్రఖర జాతీయభావనతో ఆయన ఆ మాటలన్నారని మనం అర్ధం చేసుకోవాలి.
ఇలా ఏ విషయం, రంగం తీసుకున్నా రామస్వామి పెరియార్, డా. అంబేద్కర్ ల అభిప్రాయాలూ, ఆలోచనల్లో ఎక్కడా పోలిక కనిపించదు. దళితులను తమవైపు ఆకర్షించడం కోసం కొందరు అంబేద్కర్, పెరియార్లను పోల్చి, ఇద్దరూ ఒకే విషయాలు చెప్పారని ప్రచారం చేయాలని చూస్తారు. కానీ ఇది అంబేద్కర్ కు ఘోరమైన అన్యాయం చేయడమే అవుతుంది.
———————–
(రచయిత బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు, తమిళనాడు ఎస్ సి మోర్చా మాజీ అధ్యక్షులు. `హిందుత్వ అంబేద్కర్’ పుస్తకం రచించారు.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here