Home News తూటాలకు వెరవని లెఫ్టినెంట్‌ త్రివేణీ సింగ్‌ కర్తవ్యదీక్ష

తూటాలకు వెరవని లెఫ్టినెంట్‌ త్రివేణీ సింగ్‌ కర్తవ్యదీక్ష

0
SHARE

ఒళ్లంతా రక్తం. శరీరం ఎడమ భాగం పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది. మాంసపు ముద్దలు రక్తమోడుతూ వేళాడుతున్నాయి. కాలు పూర్తిగా దెబ్బతినిపోయింది. చాలా భయంకరంగా ఉంది అతని పరిస్థితి. అతను ఎగశ్వాస అతి కష్టం మీద తీసుకుంటున్నాడు. ‘ఇక బ్రతకడం కష్టం’ అన్నది ఇతరులకే కాదు. అతనికీ తెలిసిపోయింది.

పై అధికారి జనరల్‌ ఆఫీస్‌ కమాండింగ్‌ రాజేందర్‌ సింగ్‌ అతని కోసం ఆందోళనగా పరుగెత్తు కుంటూ వచ్చాడు. ఆఖరి క్షణాల్లో అధికారిని చూశాడు ఆ యువకుడు. శరీరం డస్సిపోతున్నా బలమంతా కూడగట్టుకున్నాడు. లేచి నిటారుగా నిలబడ్డాడు. సెల్యూట్‌ చేసి ‘టాస్క్‌ అకాంప్లిష్డ్‌ సర్‌’ (నాకిక్చిన పని పూర్తయింది) అన్నాడు. ఆ మరుక్షణం కుప్పకూలి పోయాడు. ఊపిరి ఆగిపోయింది. ఒళ్లు కొయ్యబారి పోయింది. కళ్లు గాజు గుళికలైపోయాయి. ప్రాణం గాలిలో కలిసిపోయింది.

ప్రాణాలు లెక్కచేయని సాహసం, తూటాలకు వెరవని కర్తవ్యదీక్ష, ధ్యేయమే జీవనంగా బతికే ఉద్యమస్ఫూర్తి ఈ మూడు త్రివేణుల్లా కలిసిపోయాయి. ఈ సంగతి అతని తల్లిదండ్రులకు ముందే తెలుసు నేమో అందుకే అతనికి త్రివేణీ సింగ్‌ అని పేరు పెట్టారు.

లెఫ్టినెంట్‌ త్రివేణీ సింగ్‌. సాహసం, చొరవ, తెగువల త్రివేణీ సంగమం. ఏరికోరి సైన్యంలో చేరాడు. ‘దేశం కోసం బతకాలి, దేశం కోసం చావాలి’ ఈ ఆలోచనే ఆయన్ని సైన్యంలో చేరేలా చేసింది. 2001లో ‘5 జమ్మూ కశ్మీర్‌ లైట్‌ ఇన్‌ఫాంట్రీ’ లో భర్తీ అయ్యాడు. సాహసానికి, తెగింపుకు మారుపేరుగా నిలిచాడు. అన్నింటా ముందుండే వాడు. 2003 జూన్‌ 28న తమ క్యాంపుపై ఉగ్ర వాదులు దాడిచేస్తే ముందు నిలిచి, సైనికులను నడిపించాడు. శత్రువులను మట్టుపెట్టాడు.

అది జనవరి 2, 2004. జమ్మూ రైల్వే స్టేషన్‌పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ప్రయాణికులను విచక్షణా రహితంగా కాల్చేస్తున్నారు. ఫ్లాట్‌ఫారం నెత్తురుతో ఏరులై పారుతోంది.

ఈ వార్త కమాండింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి వచ్చింది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న వారిని రైల్వే స్టేషన్‌కు పంపమని పై అధికారులు త్రివేణీ సింగ్‌కు సూచించారు. కానీ త్రివేణీ సింగ్‌ ‘నేనే ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తాను’ అని అధికారిని అడిగాడు. ఆదేశం వచ్చిన మరుక్షణం క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌ నాయకుడిగా జమ్మూ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు.

తాను ముందుండి సైనికులను నడిపించాడు. క్షణాల్లో ఉగ్రవాదులున్న చోటును గుర్తించాడు. ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసురుతున్నారు. కానీ త్రివేణీ సింగ్‌ ప్రాణాలు లెక్కచేయకుండా ముందుకురికి ఒక గ్రెనేడ్‌ విసిరాడు. ఒక ముష్కరుడు ఖతం. మరో ముష్కరుడు త్రివేణీ సింగ్‌ లక్ష్యంగా గ్రెనేడ్‌ విసిరాడు. అది ఆయన ఎడమ భాగంపై పేలింది. త్రివేణీ సింగ్‌ ఒళ్లంతా ఛిన్నాభిన్నం అయింది.

కానీ శరీరంతో సంబంధం లేకుండా మనసు అనేది ఒకటుంటుంది. మనసు పైన బుద్ధి ఉంటుంది. బుద్ధిపైన ఆత్మ ఉంటుంది. దానికి చావుండదు. గాయాలుండవు. అది బాంబుతో తెగిపోదు. తూటాతో ఆగిపోదు. త్రివేణీ సింగ్‌ మనసు ‘ముందుకు ఉరుకు’ అంది. బుద్ధి పరకీయుడిని పట్టిపల్లార్చమంది. ఆత్మ ఎక్కడా లేని బలాన్నిచ్చింది. ఆయన ఇంకో గ్రెనేడ్‌ను తీసుకుని శత్రువుపైకి విసిరాడు.

ఆ మరుక్షణం వాడు మాంసం ముద్ద అయిపోయాడు. మూడో ఉగ్రవాదినీ మట్టుపెట్టాడు త్రివేణీ సింగ్‌. వాడికి ఆరంటే ఆరంగుళాల దూరంలో త్రివేణీ సింగ్‌ రక్తం మడుగులో పడిపోయాడు.

ఒళ్లంతా రక్తం. శరీరం ఎడమ భాగం పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది. మాంసం ముద్దలు రక్తమోడుతూ వేలాడుతున్నాయి. కాలు పూర్తిగా దెబ్బతినిపోయింది. చాలా భయంకరంగా ఉంది అతని పరిస్థితి. అతను ఎగశ్వాస అతి కష్టం మీద తీసుకుంటు న్నాడు. ఇక బతకడం కష్టం అన్నది ఇతరులకే కాదు. అతనికీ తెలిసిపోయింది.

కానీ అతని దెబ్బకు ఉగ్రమూకలు హత మయ్యాయి. ప్రయాణికులు, సిబ్బంది బతికిపోయారు. ఉగ్రదాడి ఊపిరి ఆగింది. ఉధతోద్యమ స్ఫూర్తి ఊపిరి పీల్చుకుంది.

‘త్రివేణీ సింగ్‌ లాంటి వీర యువకుడిని చూడలేదు’ అన్నాడు జిఒసి రాజేందర్‌ సింగ్‌. తన బిడ్డలాంటి ఆ వీరుడిని చూసి ఆయనలోని తండ్రి కళ్లు చెమర్చాయి. ‘మై సన్‌’ అనుకున్నాడు.

తండ్రి మేజర్‌ సింగ్‌ మాజీ సైనికుడు. డిసెంబర్‌ 31, 2003 రాత్రి కొడుకు చేసిన అల్లరి, హడావిడి ఆయనకు గుర్తుకొచ్చింది. జనవరి 1న సెలవు తరువాత డ్యూటీలో చేరాడు త్రివేణీ సింగ్‌. రెండో తేదీన శత్రు వ్యూహాన్ని ఛేదించి, సూర్యమండలాన్ని ఛేదించి, అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ‘బాబూ నీకు సైనికుడు కోరుకునే జీవనం దొరికింది. సైనికుడు కోరుకునే మరణం దొరికింది’ అనుకున్నాడాయన.

లెఫ్టినెంట్‌ త్రివేణీ సింగ్‌ నిలువెత్తు ఆదర్శంగా, హిమాలయమెత్తు ప్రేరణగా నిలిచిపోయాడు. దేశం ఆ పాతికేళ్ల యువ వీరుడికి అశోకచక్ర ఇచ్చి తనను తాను సన్మానించుకుంది.

– ప్రభాత్‌

(జాగృతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here