Home News కోవిడ్‌-19: దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌ స్వ‌యంసేవ‌కుల స‌హాయ‌క చ‌ర్య‌లు

కోవిడ్‌-19: దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌ స్వ‌యంసేవ‌కుల స‌హాయ‌క చ‌ర్య‌లు

0
SHARE

కరోనా మొదటి ద‌శ స‌మ‌యంలో రాష్ట్రీయ స్వ‌యంసేవక్ సం‌ఘ్ (ఆర్‌.ఎస్‌.ఎస్‌) స్వ‌యంసేవ‌‌కులు ఎన్నో స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్నారు. ప్ర‌స్తుతం రెండో ద‌శ‌లో కూడా ఆర్‌.ఎస్‌.ఎస్ స్వయంసేవకులు క‌రోనా బాధితుల‌కు, బాధిత కుటుంబాలకు, పేదలకు సేవాభార‌తి, అనేక ఇతర సంస్థల‌ ద్వారా సహాయం అందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ సంక్షోభ కాలంలో స్వయంసేవకులు వారి ప‌రిస‌ర ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా అనేక రకాల సేవా కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు.

క‌రోనా రెండో ద‌శ‌లో దేశ‌వ్యాప్తంగా ఆర్.‌ఎస్.‌ఎస్ స్వ‌యసేవ‌కులు చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాల గురించి ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల‌ భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్‌ అంబేకర్ జీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో స్వయంసేవకులు కోవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. క‌రోనా ల‌క్ష‌ణాలున్న వారి కోసం ఐసోలేష‌న్ కేంద్రాలు, కరోనా సొకిన వారి కోసం కోవిడ్ సంర‌క్ష‌ణ కేంద్రాల ఏర్పాటు, అలాగే ప్రభుత్వ నిర్వహణలో ఉన్న‌ కోవిడ్ కేర్ సెంటర్లు, ఆసుపత్రులకు సహాయం అందించడం, వైద్య స‌ల‌హాలు-సూచ‌న‌ల కోసం హెల్ప్‌లైన్ సెంట‌ర్ల ఏర్పాటు, ఆన్‌లైన్ వైద్య సలహా, రక్తదానం, ప్లాస్మా దానం, ఆయుర్వేద కాడా, మందుల పంపిణీ, కౌన్సెలింగ్, ఆక్సిజన్ సరఫరా, అంబులెన్స్ సేవ, ఆహారం, రేష‌న్ స‌రుకులు పంపిణీ, మాస్కుల పంపిణీ, టీకా ప్రచారానికి సహాయం, వివిధ అవగాహన కార్యక్రమాలు, కోవిడ్‌తో మ‌ర‌ణించిన వారి అంత్యక్రియలకు సహాయం, మృత దేహాల‌ను శ్మ‌‌శాన వాటిక‌కు త‌ర‌లించ‌డానికి వాహ‌నాల ఏర్పాటు చేయ‌డం వంటి స‌హాయ‌క చ‌ర్య‌లో స్వ‌యం సేవ‌కులు నిమ‌గ్న‌మ‌య్యార‌ని పేర్కొన్నారు.


” దేశవ్యాప్తంగా 3800 ప్రదేశాలలో ఆర్‌.ఎస్‌.ఎస్ స్వ‌యం సేవ‌కులు హెల్ప్‌లైన్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. 22 వేలకు పైగా స్వ‌యంసేవ‌కులు టీకా శిబిరాలను నిర్వహించడంలో సహాయం అందిస్తున్నారు. 7500 కి పైగా ప్రదేశాలలో టీకా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆర్‌.ఎస్‌.ఎస్, సేవా భార‌తి ఆధ్వ‌ర్యంలో దేశవ్యాప్తంగా 287 ప్రదేశాలలో ఐసోలేషన్ కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి, అందులో సుమారు 9800 పడకలు ఉన్నాయి. వీటితో పాటు 118 నగరాల్లో కూడా కోవిడ్ కేర్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. 7476 పడకలు ఉండ‌గా అందు‌లో 2285 పడకలు ఆక్సిజన్ సదుపాయంతో ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 5100 మందికి పైగా స్వయం సేవకులు  పనిచేస్తున్నారు. ఇవి కాకుండా ప్రభుత్వాలు నిర్వ‌హిస్తున్న‌ కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా స్వయంసేవకులు త‌మ వంతు స‌హ‌యాన్ని  అందిస్తున్నారు. దేశంలోని 762 నగరాల్లో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న 819 కోవిడ్ కేర్ సెంటర్లలో 6000 మందికి పైగా స్వ‌యం సేవ‌కులు త‌మ స‌హ‌కారాన్ని అందిస్తున్నారు. 1256 ప్రదేశాలలో రక్తదాన శిబిరాలను నిర్వహించి 44 వేల యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. దేశ‌వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మెడికల్ హెల్ప్‌లైన్ల ద్వారా 1.5 లక్షలకు పైగా ప్రజలు వైద్య స‌ల‌హాలు పొందారు.  ఈ కేంద్రాల్లో 4445 మంది వైద్యులు త‌మ సేవ‌ల‌ను అందించారు”. అని సునీల్‌ అంబేక‌ర్ జీ పేర్కొన్నారు.


కరోనా ప్రస్తుత సంక్షోభం తీవ్రమైనది. అయితే సమాజం, ప్రభుత్వాలు, పరిపాలన యంత్రాంగం, కరోనా యోధులు ఈ సవాలును ఎదుర్కోవటానికి చాలా తీవ్ర స్థాయిలో శ్ర‌మిస్తున్నారు.  సానుకూలత, సామూహిక బలం ద్వారా మాత్రమే మ‌నం ఈ సంక్షోభాన్ని అధిగమించగలుగుతాము. సమాజంలోని వివిధ సంస్థలు అనేక కొత్త కార్యక్రమాలను తీసుకొని సమన్వయం చేయడం ప్రారంభించాయి. ఇందులో వేలాది మంది ప్రజలు గొప్ప సేవా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. ఇలా అంద‌రం క‌లిసి పోరాడితే క‌రోనాపై విజ‌యం సాధిస్తామ‌ని సునీల్ అంబేక‌ర్ జీ  పేర్కొన్నా‌రు.

Source : VSK BHARATH