Home Uncategorized నిజాం నిరంకుశత్వాన్ని నిలదీసిన దాశరథి

నిజాం నిరంకుశత్వాన్ని నిలదీసిన దాశరథి

0
SHARE

–కందకుర్తి ఆనంద్

ప్రొద్దున 8గంట‌లైంది. నిజామాబాద్ జైలులో జైలర్ రౌండ్లకి వచ్చాడు. అన్ని జైలుగదులు చూస్తున్నాడు. రాజకీయ ఖైదిలందరూ ఆయననే గమనిస్తున్నారు. ఒక గదిలో గోడపైన ఏదో బొగ్గుతో రాత కనిపించింది. దగ్గరికెళ్ళి చూశాడు.

“ఓ నిజాము పిశాచమా కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్న డేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు. నా తెలంగాగా కోటి రత‌నాల వీణ…”

జైలర్ కోపంతో పిచ్చివాడయ్యాడు. ఎవ‌రు రాశారు అని గట్టిగా అరిచాడు. “నేను రాశాను ” అని పట్టికోట ఆళ్వారు స్వామి అన్నాడు. జైలర్ మరింత కోపంతో నిన్న నువ్వు ఈ అర్రలో ప‌డుకోలేదు.. నువ్వెలా రాస్తావు అని అడిగాడు. “నేనె రాశాను” అని మళ్ళీ జవాబు వచ్చింది. కోపంతో “మీ అంతు చూస్తాను” అంటు వెళ్ళి పోయాడు. ఆ కవిత గోడలపైన రాసింది “దాశరథి కృష్ణమాచార్యులు” అనే విష‌యం జైల‌ర్ కు, వట్టికోట ఆళ్వారు  స్వామికి తెలుసు.

కళాప్రపూర్ణ అభ్యుదయవాద కవిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయిన దాశరథి 1925 జూలై 22న మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ (నం) చిన్న గూడూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి దాశరథి వెంకటాచార్య మంచి పురాణ పండితుడు. సంస్కృతం, తెలుగు, తమిళ భాషల్లో నిష్ణాతుడు. ఖమ్మంలో మెట్రిక్ పరీక్ష కోసం చదువుతున్నప్పుడే మహాత్మా గాంధీ, కందుకూరి వీరేశలింగం లతో ప్రభావితుడై “నిజాం రాజ్యం ధ్వంసమై ప్రజాస్వామ్యం రావాలి” అని కలలు కన్నాడు. మెట్రిక్ పాస్ అవగానే ఆంధ్ర మహాసభ కార్యకర్తగా నిజాం వ్యతిరేక పోరాటంలో చేరి అనేక గ్రామాలు తిరిగి ప్రజలను చైతన్యపరచాడు.

నిజాం వ్యతిరేక పోరాటంలో దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్యులు త‌న క‌విత‌ల‌తో ఎంతో మందిని ప్ర‌భావితం చేశాడు. నిజాంకు వ్య‌తిరేకంగా క‌విత‌లు రాసినందుకు గాను ఆయనను అరెస్ట్ చేసి వరంగల్ జైలులో ఉంచారు. తర్వాత కొద్దిరోజులకు దాశరథిని స్థానచలనం చేసి నిజామాబాద్ జైలుకి తరలించారు. నిజామాబాద్ జైలులో ఉన్న‌ప్పుడు పళ్ళు తోముకునే బోగ్గుతో జైలు గొడలపై ఎన్నో కవితలు రాశాడు. ఆ కవితలు రహస్యంగా బయటికి వచ్చి జనాలను స్వతంత్ర్యోద్యమంలోకి ఉసిగొల్పేవి. అక్కడి నుండి విడుదల అయిన తర్వాత విజయవాడకు వెళ్ళాడు. ఆ త‌ర్వాత నిజాంకు వ్య‌తిరేకంగా మ‌రింత తీవ్ర స్థాయిలో కవిత్వాన్ని రాశాడు. నాడు ‘తెలుగుదేశం’ అనే పత్రిక వచ్చేది. అందులో ఎన్నో వ్యాసాలు రాసాడు దాశరథి.

1948లో హైదరాబాద్ రాజ్యం భారత యునియన్ లో విలీనమయింది. అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో ‘హైదరాబాద్’ స్టేషన్లో కొన్నాళ్ళు, మద్రాస్‌లో కొన్నాళ్ళు, విభిన్న పదవుల్లో పనిచేసి 1971లో ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. నాటి ఎందరో ప్రముఖులని కలుపుకుని “ఆంధ్ర సారస్వత పరిషత్ ” ను స్థాపించాడు. అది నేటికి తెలుగు భాషకు సేవ చేస్తూనే ఉంది.
ఈ కాలంలోనే ఆయన తెలంగాణ రచయితల సంఘం ప్రారంభించి ఎన్నో సాహిత్య కార్యకలాపాలు నిర్వహించారు. 1971 నుండి 1984 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆస్థాన కవిగా పనిచేశారు.

జైలులో ఉన్నప్పుడు రాసిన కవితల్ని కలిపి 1947 లో ‘అగ్నిధార’ ఖండ కావ్యoగా రాశారు. నాటి తెలంగాణా యువకుల స్వాతంత్యకాంక్ష అగ్నిధారలో కనిపిస్తోంది. నిజాం పాలనలో కడుపులు కాలిన కష్టజీవుల ఆకలి బాధల్ని 1950 లో ‘రుద్రవీణ’లో చిత్రించాడు. 1947 నుండి జీవిత చరమాంకం వరకు ఎంతో సాహిత్యాన్ని సృజించాడు. మహాంధ్రోదయం , ‘పునర్నవం’, ‘మహాబోధి’, ‘గాలిబ్ గీతాలు’, ‘దాశరథీ శతకం’, ‘కవితా పుష్పకం’, ‘తిమిరంతో సమరం’ ‘ఆలోచనాలోచనాలు, నవమి’ ‘మార్పు నాతీర్పు, ధ్వజమెత్తిన ప్రజ”, నేత్రపర్వం లాంటి కవితా సంపుటాలు వెలువరించాడు.

ఆయన అనేక సినిమాలకు సుమారు రెండు వేల వరకు పాటలు రాసాడు. 1962లో ‘ఇద్దరు మిత్రులు’ తో ప్రారంభమైన ఆయన సినీ గీతాల ప్రస్థానం 1987 దాకా కొనసాగింది. ఆయన ఎన్నో వందల అజరామర గీతాలు రాసి ప్రేక్షకుల హృదయాల లో సుస్థిరంగా నిలిచారు. ‘తిమిరంతో సమరం’ పుస్తకానికి ఆయనకు 1974  కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ0 ఆయనకు కళా ప్రపూర్ణ బిరుదును ఇచ్చింది. ఆయన 1987 న‌వంబ‌ర్ 5న హైదరాబాద్‌లో కన్ను మూసారు.

– ఇతిహాస సంకలన సమితి, ఇందూరు జిల్లా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here