Home News దైవ– భావ– జాలం

దైవ– భావ– జాలం

0
SHARE

లౌకికవాదం లౌకికవాదం అంటూ దాదాపు 30 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ను చెడగొట్టిన కమ్యూనిస్టులు, ఇప్పుడు ఆ పార్టీ తన కళ్లముందే బాగుపడడం జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఏచూరి వారు… కాంగ్రెస్‌ లౌకిక వాదాన్ని మరిచిపోతోందని గగ్గోలు పెడుతున్నారు. ‘కలిసుందాం రా’ అన్న కమ్యూనిస్టుల మాట, ఇప్పుడు కాంగ్రెస్‌కు… ‘కాలిపోదాం రా’ అన్న ప్రేమోన్మాది పిలుపులా వినిపిస్తోంది. దాంతో రాహుల్‌ ‘సత్రం భోజనం– మఠం నిద్ర’ అన్నట్టుగా కాలికి బలపం కట్టుకుని ఆలయాలు తిరుగుతూ రాజకీయ మోక్ష మార్గాన్ని వెతుక్కుంటున్నాడు.

శుభమా అని బోడక్కకు దండం పెడితే నా లెక్క నువ్వుండు బిడ్డా అంటూ తలమీద చెయ్యేసి నిమిరి మరీ అప్యాయంగా ఆశీర్వదించిందట! ముసిల్ది తొంబైయేళ్లు బతకాలన్నదా? లేక తనకూ మొగడు లేకుండా కావాలన్నదా? మనసుకు పట్టక ముటముటలాడిందట కొత్త పెళ్లి కూతురు. కనుమరుగవుతున్న కమ్యూనిస్టుల ధోరణి కూడా ఈ మోటు సామెతలాగే ఉంది. పాపం రాహుల్‌గాంధీ! కుక్కమూతి పిందెలా మారిన కాంగ్రెస్‌కు, చివరాఖరి నెహ్రూ కుటుంబ వారసుడు… పార్టీ రాలిపోకుండా నిలబెట్టడానికి గుళ్లూ గోపురాలు తిరుగుతుంటే, లాజిక్కుల లెఫ్టిస్టులు తగుదునమ్మా అని లాపాయింట్లు లాగుతున్నారు. అంత గొప్ప కాంగ్రెస్‌కు అధ్యక్షుడవుతున్న యువకుడు.. తనకు తాను జందెం వేసుకునే బ్రాహ్మణుడనని అనడం ఏమిటి? ముమ్ముమ్ముత్తాత మోతీలాల్‌ నెహ్రూ ఎప్పుడైనా తన కులం గురించి చెప్పుకున్నాడా? లౌకిక కుటుంబానికి చెందిన వారసుడు… గుళ్లూ గోపురాలు తిరగడం ఏమిటి? సోనియాగాంధీ ఎప్పుడైనా ఇలా చేసిందా? అనేక మతాల రక్తం ప్రవహించే ఆధునిక నాయకుడు తాను శివభక్తుడినని ప్రకటించుకోవడం ఏమిటి? ముత్తాత సోషలిస్టు జవహర్‌లాల్‌ నెహ్రూ ఆత్మ ఏమనుకుంటుందో పట్టించుకోడా? అన్నవి వామపక్షీయుల ఆమాంబాపతు అభ్యంతరాలు!

కారల్‌మార్క్స్‌ గురించి తప్ప, కాలకంఠుడి గురించి భక్తిశ్రద్ధలతో శోధించలేదు కనుక ‘వామా’చారులకు దైవతత్వం అంతగా అంతుబట్టలేదు. ఆమూలాగ్రం అర్థం కాలేదు. కష్టాల్లోనే మనిషికి దేవుడు గుర్తుకొస్తాడు. ఇంకా చెప్పాలంటే… తనను మరిచిపోయిన వారికి, ఆ విషయం జ్ఞాపకం చేసేందుకే దేవుడు కష్టాలు కలిగిస్తాడన్నది ధర్మసూక్ష్మం. దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌, రాహుల్‌ శకం నాటికి పట్టుమని నాలుగంటే నాలుగే రాష్ట్రాలకు పరిమితమై, మోదీ బాధతో అష్టకష్టాలు అనుభవిస్తున్నది. నానాటికీ తీసికట్టు నాగం భొట్టు అన్నట్టే తప్ప పార్టీ ముందుకెళ్లే పరిస్థితే లేదు. ఇందుకు కారణం ఆ దేవదేవుడే! ఆ విషయాన్ని రాహుల్‌ సరిగ్గా గుర్తించాడు. ఇంకా చెప్పాలంటే ‘ఇంట్లో నిత్యం శివపూజలు’ చేస్తాడు కనుక ఆ భోళా శంకరుడు, దైవ ప్రేరితంగా రాహుల్‌కు జ్ఞానోదయం కలిగించాడు. అందువల్లే రాహుల్‌ గుజరాత్‌ ఎన్నికల్లో మోదీకి దీటుగా అనేక దేవాలయాలను దర్శించాడు. దేవుడు కమ్యూనిస్టుల్లా కాదు కదా! నమ్ముకున్న వారికి ఎన్నడూ ద్రోహం చేయడు! అందుకే తనను బాగా నమ్మిన మోదీని గెలిపించి, బాల భక్తుడైన రాహుల్‌ను గెలిపించినంత పని చేశాడు. కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్‌కు కొత్త ఊపిర్లూదాడు. గుజరాత్‌లో రాహుల్‌ 27 గుళ్లను సందర్శిస్తే, ఆ ప్రాంతాల్లోని 18 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గెలిచింది. దేవుడి మహిమకు ఇంతకుమించిన నిదర్శనం ఏం కావాలి?! కనుకే రాహుల్‌ రేపటి కర్ణాటక ఎన్నికల కోసం అప్పుడే మఠాలు, గుళ్లు తిరగడం మొదలుపెట్టారు. దేవదేవుడి దయ వల్ల అక్కడ గెలిచినా గెలవొచ్చు!

‘చెరపకురా చెడేవు’ అని సామెత! ‘చెరపకు.. రా చెడుదాం’ అన్నది ఎర్ర సామెత! మనం బాగుపడడంలో ఒక సంతృప్తి ఉంటుంది. ఎదుటివాడిని చెడగొట్టడంలో ఎక్కువ సంతృప్తి ఉంటుంది. తాను నష్టపోతే వచ్చే బాధకన్నా, ఎదుటివాడూ తనలా అయితే కలిగే ఆనందం ఎక్కువ! రాజకీయాల్లో రెండో రకం వాళ్లే ఎక్కువ! లౌకికవాదం లౌకికవాదం అంటూ దాదాపు 30 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ను చెడగొట్టిన కమ్యూనిస్టులు, ఇప్పుడు ఆ పార్టీ తన కళ్లముందే బాగుపడడం జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఏచూరి వారు… కాంగ్రెస్‌ లౌకిక వాదాన్ని మరిచిపోతోందని గగ్గోలు పెడుతున్నారు. అయితే ‘కలిసుందాం రా’ అన్న కమ్యూనిస్టుల మాట, ఇప్పుడు కాంగ్రెస్‌కు… ‘కాలిపోదాం రా’.. అన్న ప్రేమోన్మాది పిలుపులా వినిపిస్తోంది. దాంతో రాహుల్‌ ‘సత్రం భోజనం– మఠం నిద్ర’ అన్నట్టుగా కాలికి బలపం కట్టుకుని ఆలయాలు తిరుగుతూ రాజకీయ మోక్ష మార్గాన్ని వెతుక్కుంటున్నాడు. ముస్లిం ఓట్లు అనే కాంగ్రెస్‌ పుట్టలో మోదీ వేలు పెడితే, హిందూ ఓట్లు అనే బీజేపీ బుట్టలో తానెందుకు చేయి పెట్టకూడదని దేవుని సాక్షిగా ప్రయతిస్తున్నాడు. ఇది పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తున్నట్టే కనిపిస్తోంది కదా!

గుడ్డెద్దు గుంపులో ఉండొద్దు అనుకుంటదట. అంతా తానే మేయొచ్చని! మొండెద్దు మందలో ఉండాలనుకుంటదట. ఊపుకునేందుకు తోకుండదు కనుక, ఈగలు దోమలు మిగతా పశువుల మీద కూడా వాలి తనకు బాధ తగ్గుతుందని! లెఫ్ట్‌ పార్టీలు రెండో రకం. పనికిరాని విదేశీ సిద్ధాంతాలు అమలు చేయడానికి తన బలం చాలదు కనుక, మంది బలం కావాలి. ఇత్తేసి పొత్తుగూడాలంటే బకరాలు ఉండాలిగా మరి! కాంగ్రెస్‌కేమో అసలు సంగతి తెలిసిపాయె! అందుకే లెఫ్టిస్టులు తెలంగాణలో 31లతో, దేశంలో అనేక పార్టీలతో విస్తృత ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసి మతతత్వ బీజేపీని ఎదిరిస్తారట! అంతమంది లేకపోతే మోదీని పడగొట్టేందుకు తొడగొట్టే వీలే లేదట మరి! కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా పేపర్లలో కాలాలకు కాలాలు నింపే పేరుగొప్ప కమ్యూనిస్టుల బలం అదీ!

‘‘కమ్యూనిస్టులకు దేశభక్తి నేర్పుతారా? అని సురసురలాడుతున్న సురవరం, మార్క్సిజం సైన్స్‌ అంటూ మళ్లీ పాతపాటే పాడుతున్నారు. ఇండియన్‌ సోషల్‌ సైన్సెస్‌ ఏనాడో మారిపోయిన సంగతిని గుర్తించడం లేదు! విప్లవ ప్రజాతంత్ర వామపక్ష ప్రజాస్వామిక శక్తుల వీరోచిత ఐక్యత గురించి పిడికిలి బిగించి ప్రవచిస్తారు. కానీ సీపీఐ సీపీఎంలో కలవదు! వందలాది లెఫ్ట్‌ ముఠాల్లో ఒకదాని పొడ మరొకదానికి గిట్టదు. రెండు వేల ఏళ్ల నాటి మను– స్మృతి నుంచి సమాజం ఏనాడో బయటకొచ్చినా లెఫ్టిస్టులు ఇంకా అక్కడే ఉన్నారు. ‘అగ్రకుల బ్రాహ్మణీయ మనువాద మతవాద శక్తులు’ అని గంపగుత్త విమర్శతో సరిపెట్టే ఈ మేధావులు… ఇప్పుడు సమాజంలో అగ్రకులాలేవో, దళితుల మీద దాడులు చేస్తున్నది ఏ కులాల వారో, వారిమీద తమ పోరాట పంథా ఏమిటో తేల్చి చెప్పలేరు. మహానుభావుడు అంబేడ్కర్‌ విగ్రహాలు పెట్టి, ఇదే దళితులకు చేసే అతి పెద్ద సేవ అని నమ్మించే హిపోక్రటిక్‌ పార్టీల్లాగ, కమ్యూనిస్టులది మంకుపట్టు సిద్ధాంతాల, పడికట్టు పదాల, చారిత్రక తప్పిదాల సింబాలిక్‌ పోరాటమే! జాతీయ వాది అంబేడ్కర్‌ తన జీవితాంతం కమ్యూనిస్టుల్ని వ్యతిరేకించగా, ఇప్పుడు అంబేడ్కర్‌ వాదుల తరఫున కమ్యూనిస్టులు పోరాడతారట! విదేశీ సిద్ధాంతాలతో 40 ఏళ్లుగా దేశీ మార్గాన్ని డీవియేట్‌ అవుతూ, వక్రభాష్యాలతో సమాజాన్ని డీవియేట్‌ చేస్తూ వస్తున్న కమ్యూనిస్టులకు.. ఇప్పుడు ఉత్తర కొరియా ‘వామపక్ష ప్రజాతంత్ర విప్లవ ప్రజాస్వామిక నియంత’ కిమ్‌ రూపంలో సరికొత్త స్ఫూర్తిదాత దొరికాడు. కేరళలో పోస్టర్లు వేసుకుని ఊరేగిస్తున్నారు. హతవిధీ… హ్యాట్సాఫ్‌!! కిమ్‌ భజన కాదు కామ్రేడ్స్‌.. భరతమాత భజన చేయండి. కాదంటే కనీసం రాహుల్‌లా… ఈ దేశపు దేవుళ్లనైనా నమ్ముకోండి! కేరళ మంత్రి కె సురేంద్రన్‌లాగానో, నారాయణలాగానో… భార్య పేరు చెప్పో, భక్తి పేరు చెప్పో గుళ్లకు వెళ్లి మనస్ఫూర్తిగా ఒక దణ్నం పెట్టుకోండి చాలు! గెలిచిపోతారు! మీరు మన గుళ్లను మరిచినందుకే, జనం మిమ్మల్ని మరిచిపోయారు!

చివరాఖరు: కేరళలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు, ఎర్నాకుళం జిల్లా పెరుంబవూర్‌లో జిషా అనే దళిత విద్యార్థినిని అత్యాచారం చేసి చంపేశారు. యథాప్రకారం వామపక్షీయులు ‘అగ్రకుల బ్రాహ్మణీయ హిందూ మనువాద’ దురహంకారాన్ని చీల్చి చెండాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను, కేంద్రంలో మోదీనీ దునుమాడారు. ఎన్నికలైపోయాయి. లెఫ్ట్‌ ఫ్రంట్‌ గద్దెనెక్కింది. కేసు కూడా తేలిపోయింది. ఇంతకూ, ఆ నేరం చేసిందెవరంటే… బంగ్లాదేశ్‌ మూలాలతో, అస్సాంలో స్థిరపడ్డ, కేరళ వలస వచ్చిన, అమిర్‌ ఉల్‌ ఇస్లాం అనే కార్మికుడు! అద్గదీ సంగతి!! చాలా.. ఇంకా చెప్పాలా?!

కృ.తి.

kruthi1972@gmail.com

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here