Home Telugu Articles దేశ సమగ్రతపై రాజీ లేదు

దేశ సమగ్రతపై రాజీ లేదు

0
SHARE

దేశంలో కాంగ్రెస్‌ వారికి, కమ్యూనిస్టులకు జాతీయవాదం అంటే అవహేళనగా, నిందా సూచకంగా మారింది. అబద్దాలు, వక్రీకరణల ద్వారా వారు యువత మనస్సులను విషపూరితం చేయాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీ, ఎన్డీఏలను ఎవరు విమర్శించినా వారిని మేము దేశ వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నామని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పాటు కుహనా లౌకికవాదులు, మేధావులనుకునేవారు, వామపక్ష ప్రచారార్భాటులు ఒక కూటమిగా తయారై బీజేపీ, దాని మిత్రపక్ష మద్దతుదారులు అసహనపరులని ప్రచారం చేస్తున్నారు. నిజానికి వారే తమ సంకుచితాభిప్రాయాలను ఫాసిస్టు పద్ధతిలో ఇతరులపై రుద్దుతూ తమకు లేని సహనాన్ని ఇతరులు పాటించాలని ప్రయత్నిస్తున్నారు.

సమాజంలో నాగరిక పద్ధతిలో చర్చించేందుకు, అసమ్మతి వ్యక్తం చేసేందుకు ఎవరూ వ్యతిరేకం కాదు. కాని దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రపూరిత ప్రయత్నాలను మాత్రం తప్పక తిప్పికొట్టాల్సిందే. దేశ సమగ్రత, సార్వభౌమికతపై ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదు. ఈ విషయంలో పదాలు తడుముకోడవం కానీ, రాజీపడ్డ ధోరణిలో మాట్లాడడం కానీ జరిగే ప్రసక్తి లేదు.

ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలు చేసిన అన్ని ప్రయత్నాలూ వమ్మయ్యాయి. ఇటీవల మహారాష్ట్ర, ఒడిషాలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో కూడా తీవ్ర పరాజయం చెందాయి. యువకుల మనసులను కలుషితం చేసేందుకు, యూనివర్సిటీల్లో వాతావరణాన్ని విషపూరితం చేసేందుకు, సామాజిక ఉద్రిక్తతలను లేవనెత్తేందుకు వారు నిస్పృహతో ప్రయత్నించినప్పటికీ ప్రజలు తిప్పికొట్టారు. భావ వ్యక్తీకరణ హక్కు పేరుతో వారు రకరకాల దుష్ప్రచారాలకు ఒడిగట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏనాడూ భావ వ్యక్తీకరణ హక్కుకు విఘాతం కల్పించలేదు. నిషేధాలు విధించలేదు. అలా చేసిన చరిత్ర కాంగ్రెస్‌దే. 1975లో అత్యయిక పాలన విధించి ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కును హరించి ప్రపంచం దృష్టిలో నియంతలుగా ముద్రవేసుకున్నది కాంగ్రెస్ పార్టీ నేతలే.

ఇంతకుముందు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వారి మిత్రపక్షాలు కులం, మతం, ప్రాంతాన్ని ఉపయోగించి సమాజాన్ని చీల్చారు. ఇప్పుడు తాజాగా భావ వ్యక్తీకరణ పేరుతో సమాజంలో చిచ్చు రేపుతున్నారు. గోబెల్స్‌ స్థాయిలో వారి దుష్ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రధానమంత్రిని గాడిదతో పోల్చేంత హీన స్థాయికి వారు దిగజారారు. ఇలా నోటికి వచ్చినట్లు దూషించడం వారికి కొత్త కాదు. గతంలో వారు ప్రధానిని మృత్యుబేహారి, రక్తపిపాసి, మానసిక రోగి అని తిట్లకు లంకించుకున్నారు. ఇది దిగజారిన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.

కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వారి మిత్రపక్షాలు ఇంత తీవ్రంగా ఆందోళన చెందడానికి కారణాలు లేకపోలేదు. అనేక రాష్ట్రాల్లో పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు పరాజయం చెందడంతో అసలు వారి ఉనికికే ముప్పు ఏర్పడడం ఈ భయాందోళనకు కారణం. రోజురోజుకూ పెరుగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠను వారు ముఖాముఖి ఎన్నికల బరిలో ఎదుర్కోలేక యూనివర్సిటీలను తమ ప్రచారానికి లక్ష్యాలుగా ఉపయోగించుకుంటున్నారు. మోదీని పెద్ద ఎత్తున సమర్థిస్తున్న యువత మనసులను మార్చేందుకు వారు విఫల యత్నాలు చేస్తున్నారు.

ఢిల్లీలోని రాంజాస్ కాలేజీలో ఇటీవల జరిగిన ఘటనలో ఉమర్ ఖాలిద్ ను ఆహ్వానించడంపై ఏబీవీపీ విద్యార్థులు నిరసన తెలిపారు. ఉమర్ ఖాలిద్ ఎవరో కాదు, ప్రజాస్వామ్యానికి మందిరం అనదగ్గ పార్లమెంట్‌పై దాడికి కుట్ర చేసిన అఫ్జల్ గురు అనే ఉగ్రవాదిని అమరుడుగా కీర్తిస్తూ గత ఏడాది జనవరిలో జేఎన్‌యూ క్యాంపస్‌లో కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యక్తుల్లో ఒకరు. అప్పుడే జెఎన్‌యూ క్యాంపస్‌లో ‘‘భారత్‌ను ముక్కలు ముక్కలు చేస్తాం’’ ‘‘కాశ్మీర్‌కు స్వాతంత్ర్యం కల్పించాలి’’ అని కొన్ని దేశ వ్యతిరేక శక్తులు నినాదాలు చేశాయి.

కాంగ్రెస్, కమ్యూనిస్టులు అంతటితో ఊరుకోలేదు. జెఎన్‌యూలో మాదిరే ఇతర యూనివర్సిటీల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు చేతులు కలిపారు. బీజేపీ అసహనాన్ని ప్రేరేపిస్తున్నదనీ, భావ వ్యక్తీకరణ స్వేచ్చను అణిచివేస్తున్నదనీ హాస్యాస్పదంగా ఆరోపణలు చేశారు. వివేకవంతులైన భారతీయ పౌరులెవరైనా ఈ ఆరోపణలను విశ్వసిస్తారా?

కొంతమంది మా రాజకీయ ప్రత్యర్థులు ప్రస్తుత వాతావరణాన్ని ఎమర్జెన్సీ పరిస్థితులతో పోలుస్తూ బూటకపు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎమర్జెన్సీలో మొత్తం ప్రతిపక్ష నేతలను కటకటాల వెనక్కి నెట్టేశారు. ప్రాథమిక హక్కులను హరించారు. మీడియా గొంతు నొక్కారు.

సెన్సార్‌షిప్‌ను విధించారు. తమకు నచ్చిన న్యాయమూర్తులను నియమించుకున్నారు. ప్రభుత్వానికి విధేయంగా ఉండే న్యాయవ్యవస్థ కావాలని వాదించారు. చివరకు రాజ్యాంగాన్ని కూడా సవరించారు. కేవలం ఒక వ్యక్తి పదవిని కాపాడేందుకు అన్ని ఘాతుకాలు జరిగాయి. ఇవాళ ఉన్న పరిస్థితిని అలాంటి భయంకరమైన పరిస్థితితో పోలిస్తే వివేచన గల వారెవరైనా అంగీకరిస్తారా?

కొన్ని దేశ వ్యతిరేక శక్తులు కాశ్మీర్‌కు స్వాతంత్ర్యం ఇవ్వాలని కూడా ప్రతిపాదిస్తున్నారు. కాశ్మీర్ భారత దేశంలో అంతర్భాగం. దేశంలో ఏ పౌరుడూ ఇలాంటి విచ్ఛిన్నకర ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తి లేదు. పి. చిదంబరం వంటి కాంగ్రెస్ పార్టీ నేతలు వేర్పాటువాద శక్తులను సమర్థిస్తున్నారు. కాశ్మీర్‌ను మనం దాదాపు కోల్పోయామని చిదంబరం ప్రకటించారు. కేంద్రం క్రూరంగా అణచివేతకు పాల్పడుతున్నదని ఆయన అభివర్ణించారు. అంటే ఉగ్రవాదులనూ, రాళ్లు రువ్వేవారినీ బుజ్జగించి తాయిలాలు పంచిపెట్టాలనా ఆయన ఉద్దేశం? ఒకవైపు దేశ సమగ్రతనూ, సమైక్యతనూ కాపాడేందుకు ఎంతో ధైర్యంగా తోడ్పడుతున్న వందలాది సైనికులు ప్రాణాలు బలి ఇస్తే, మరో వైపు వారి ప్రాణాలను బలిగొన్న వారిని అక్కున చేర్చుకోవాలని ఆయన భావిస్తున్నారా? ఒక విషపూరిత విచ్ఛిన్నకరమైన ఎజెండాతోనే చిదంబరం ఇలా మాట్లాడుతున్నట్లు అనుకోవాల్సి ఉంటుంది. లేకపోతే గతంలో హోంమంత్రిత్వ శాఖను నిర్వహించిన ఒక వ్యక్తి ఇలా మాట్లాడగలరా? చిదంబరం ప్రకటన ఉగ్రవాదులకూ, పాకిస్థాన్ నాయకులకూ వీనుల విందుగా వినిపించి ఉంటుంది. సీమాంతర ఉగ్రవాదానికి సహాయం, నిధులు, ప్రేరేపణ అందిస్తున్న పాకిస్థాన్‌కు చిదంబరం మాటలు హర్షం కలిగించి ఉంటాయి.

రాంజాస్ సంఘటనకే వస్తే, క్యాంపస్ పరిస్థితిని కొందరు బయటివ్యక్తులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుని కల్లోలం సృష్టించాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతుంది. గుర్ మెహర్ కౌర్ అనే విద్యార్థినికి వచ్చిన బెదిరింపులనైనా, మరో ఏబీవీపీ బాలికపై జరిగిన అత్యాచారాన్నైనా నేను తీవ్రంగా ఖండించడానికి వెనుకాడడం లేదు. ఈ సంఘటనలపై లోతుగా, క్షుణ్ణంగా విచారణ జరగాలి. దుశ్చర్యలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి. అదే సమయలో స్వార్థపూరిత శక్తుల, భారత వ్యతిరేక శక్తుల విచ్ఛిన్నకర ఎజెండాను సమర్థించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. ‘‘పాకిస్థాన్‌ మా తండ్రిని చంపలేదు, యుద్ధం చంపింది’’ అన్న ప్లకార్డుతో తన చిత్రాన్ని గుల్ మెహర్ పోస్ట్ చేసినప్పుడు ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వేసిన చురకను సరైన దృక్పథంతో అర్థం చేసుకోవాల్సి ఉంది. పాకిస్థాన్‌ తమపై దాడులు చేసినప్పుడు మన సైనికులు తిరుగుదాడి చేయకుండా మౌనంగా ఉండాలని భావించాలనా అర్థం? భారతదేశంపై దాడి చేసిన శక్తులపై ప్రాణాలు ఎదురొడ్డి మరీ పోరాడి భారత దేశ సమగ్రతను కాపాడిన గుల్ మెహర్ తండ్రిని చంపింది పాకిస్థానీయులు కారా? అలాంటి శక్తులకు కాంగ్రెస్ వారూ, కమ్యూనిస్టులు మద్దతు పలుకుతున్నారు. ఇది అర్థం చేసుకోలేనంత క్లిష్టమైన వాస్తవమా?

వాస్తవమేమంటే, ఈ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు ఎవరైనా సరే వారు దేశ వ్యతిరేకులే. ఈ విషయంలో ఎలాంటి కప్పదాట్లకు, శషభిషలకు అవకాశం లేదు. ఏ దేశానికైనా దాని సమైక్యతకూ, సమగ్రతకూ మించింది లేదు. కొన్ని శక్తులు, అవి పార్టీలైనా సరే, భావ వ్యక్తీకరణ పేరుతో దేశ విచ్ఛిన్నాన్ని సమర్థిస్తే ఆమోదయోగ్యం కానే కాదు. భారత రాజ్యాంగంలోని 19(2) అధికరణ క్రింద భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంతిమం కాదు. దానిపై కూడా సహేతుకమైన బంధాలు ఉంటాయి. సార్వభౌమికత, సమగ్రత మొదలైనవి ఇలాంటి బంధాలు.

జాతీయవాదులను అవహేళన చేయడం ద్వారా తాము జాతీయవాదులపై విరుచుకుపడతామనీ, ఉగ్రవాదులపై సాఫీగా వ్యవహరిస్తామనీ కాంగ్రెస్ వారూ, కమ్యూనిస్టులు మరోసారి రుజువు చేశారు. మఖ్బూల్ భట్, అఫ్జల్ గురు, బుర్హన్ వని వంటి వేర్పాటువాదులను ఆకాశానికెత్తడాన్ని దేశ భక్తిగల ఏ భారతీయుడూ అంగీకరించలేడు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వామపక్ష తీవ్రవాదులు చేతులు కలపడం విద్రోహ కూటమితో సమానమని నా సహచరుడు అరుణ్ జైట్లీ అభివర్ణించడం పూర్తిగా సమయోచితంగా ఉన్నది. భావ వ్యక్తీకరణ ముసుగుతో మన మాతృభూమిని విచ్ఛిన్నకరం చేయడాన్ని మేమెంత మాత్రం అంగీకరించే ప్రసక్తి లేదు. ఈ విషయంలో అస్పష్టతకు ఏ మాత్రం తావు లేదు.

– ముప్పవరపు వెంకయ్యనాయుడు

కేంద్ర సమాచార ప్రసార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)